గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, అక్టోబర్ 2022, సోమవారం

సత్త్వాత్సఞ్జాయతే జ్ఞానం - ...14 - 17...//.....ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా - , , .14 - 18,,,//...చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

జైశ్రీరామ్

 || 14-17 ||

శ్లో.  సత్త్వాత్సఞ్జాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ|

ప్రమాదమోహౌ తమసో భవతోజ్ఞానమేవ చ.

తే.గీ.  సద్వివేక సుజ్ఞానము సత్వమిచ్చు

ఘన దురాశ, లోభము, రజోగుణమొసంగు,

తమమె యజ్ఞానమున్ బ్రమాదములనిడును,

నీవు గ్రహియింపుమర్జునా నేరైపుమీర.

భావము.

సత్త్వగుణమువలన వివేకముతో కూడిన ఙ్ఞానము కలుగుచున్నది. 

రజోగుణమువలన తరగని ఆశయను లోభము జనించుచున్నది.

తమోగుణముచే అఙ్ఞాన ప్రమాదములు కలుగుచున్నవి.

 || 14-18 ||

శ్లో.  ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా మధ్యే తిష్ఠన్తి రాజసాః|

జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛన్తి తామసాః.

తే.గీ.  సత్వమూర్థ్వలోకములిచ్చు సన్నుతముగ,

రాజసంబున భూమిపై ప్రజననమగు,

నీచజననంబు తమముననేలభించు

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము.

సత్వగుణమందున్నవారు స్వర్గాది ఊర్ధ్వలోకములను పొందుచున్నారు. 

రజోగుణము కలవారు మధ్యమమగు మనుష్యలోకమును పొందుచున్నారు. 

నీచగుణవృత్తులు గల తమోగుణము కలవారు అధోలోకమును అనగా 

మనుష్యులలో హీనులుగాగానీ పశుపక్ష్యాదులుగగానీ జన్మించుచున్నారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.