గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, నవంబర్ 2018, శుక్రవారం

ఆంధ్రనామ సంగ్రహము - 9

జైశ్రీరామ్.
ఆంధ్రనామ సంగ్రహము - 9
తే. జగిలె యనఁగ నరుఁగు నాఁగ జగతి నాఁగఁ
దిన్నె యన వేదికాఖ్యలై యెన్నఁ దనరు
మి ఱ్ఱనంగను మెరక నా మిట్ట యనఁగ
నున్నతక్షితి కాఖ్యలై యొప్పు (నభవ)                  (23)

టీ. జగిలె (రూ. జగ్గిలె) అరుగు, జగతి, తిన్నె - ఈ నాలుగు తిన్నెకు పేర్లు. మిఱ్ఱు, మెరక, మిట్ట - ఈ మూడు ను ఎత్తైన చోటికి పేర్లు.

తే. తనరు నిశ్రేణి తాప నిచ్చెన యనంగఁ
దెప్ప తేపనునాఖ్యల నొప్పుఁ బ్లవము
పరఁగు నో డనఁ గల మనఁ దరణి ధరణిఁ
(దరణిశీతాశుశిఖనేత్ర ధవళగాత్ర)                   (24)

టీ. తాప, నిచ్చెన - ఈ రెండును నిచ్చెనకు పేర్లు. తెప్ప, తేప - ఈ రెండును ప్లవమునకు పేర్లు. ఓడ, కమలము - ఈ రెండును నావకు పేర్లు.

తే. కార్ముకం బొప్పు విల్లు సింగాణి యనఁగఁ
దూణ మొప్పు బత్తళిక నాదొన యనంగఁ
దరకసం బనఁ బొది యనఁ దనరు శరము
కోల ములి కమ్ము తూఁపు నా (శూలపాణి)                 (25)

టీ. విల్లి, సింగాణి - ఈ రెండును ధనస్సునకు పేర్లు. వత్తళిక, దొన తరకసము, పొది - ఈ నాలుగును అమ్ములపొది పేర్లు. కోల, ములికి, అమ్ము, తూపు - ఈ నాలుగును శరము పేర్లు.

తే. తనరుఁ బేళ్లు తనుత్రాణమునకుఁ గత్త
ళంబు జోడు జిరా దుప్పటంబు బొంద
ళం బనఁగ నాఖ్యలగు శతాంగంబునకును
దేరు నా నరదము నాఁగ (మేరుచాప)                  (26)

టీ. కత్తళంబు, జోడు, జిరా, దుప్పటంబు, బొందళంబు - ఈ అయిదును కవచమునకు పేర్లు. తేరు, అరదము (ప్ర. రథము) - ఈ రెండును రధమునకు పేర్లు.

క. కన్నా కన్నను దలక
ట్టన్నను మఱి మేలుబంతి యన్నను ధరలో
నిన్నియు శ్రేష్ఠము పేళ్ళై
యెన్నంబడు రాజసభల (నిభదైత్యహరా)              (27)

టీ. కన్నాకు, తలకట్టు, మేలుబంతి - ఈ మూడును ఉత్తముని పేర్లు.

క. సొ మ్మనఁ చొడ బనఁగా రవ
ణ మ్మన నగుఁ బేళ్లు భూషణమ్ములకును హా
తమ్ములకు నగును నభిధా
నమ్ములు పేరు లన సరులు నా (శితికంఠా)              (28)

టీ. సొమ్ము, తొడవు, రవణము - ఈ మూడును భూషణమునకు పేర్లు. పేరు, సరి - ఈ రెండును హారమునకు పేర్లు.

తే. సరము లెత్తులు దండలు సరు లనంగ
నామధేయంబులగుఁ బుష్పదామములకు
వాసనకు నాఖ్యలై యొప్పు వలపు కంపు
తావి కమ్మన యనఁగ (గాత్యాయనీశ)              (29)

టి. సరములు, ఎతూలు, దండలు, సరులు, - ఈ నాలుగును పువ్వులదండలకు పేర్లు. వలపు, కంపు తావి, కమ్మన - ఈ నాలుగును వాసనకు పేర్లు.

క. ఒడమె యన సొమ్మనంగా
విడిముడి యన రొక్క మనఁగ విత్తంబునకుం
బుడమిని నామములగు నివి
(యుడు రాజకళావతంస యురగాభరణా)                   (30)

టీ. ఒడమె, సొమ్ము, విడిముడి, రొక్కము (రుక్మ శబ్ధభవము), - ఈ నాలుగును ధనమునకు పేర్లు.

తే. మచ్చు లన మిద్దె లనఁగను మాడుగు లన
దారునిర్మిత గేహముల్ దనరుచుండుఁ
బరఁగు సౌధంబు మేడ యుప్పరిగ యనఁగఁ
(నాగకేయూర మౌనిమానసవిహార)                       (31)

టీ. మచ్చులు, మిద్దెలు, మాడుగులు (రూ. మాడువులు) - ఈ మూడును కొయ్యతో కట్టబడిన యిండ్లకు పేర్లు. ఉప్పరిగ, మేడ - ఈ రెండును రాచనగళ్లకు పేర్లు.

తే. పెట్టి యన మందసం బనఁ బెట్టె యనఁగఁ
బెట్టియ యనంగఁ బేటికాభిఖ్య లమరు
మ్రో డనంగను మోటు నా మొ ద్దనంగ
వెలయు స్థాణుసమాఖ్యలు (విశ్వనాథ)                (32)

టీ. పెట్టి, మందసంబు, పెట్టె, పెట్టియ - ఈ నాలుగును పేటిక పేర్లు. మ్రోడు, మోటు, మొద్దు - ఈ మూడును స్థాణువు పేర్లు.

ఆ. విస్తృతాఖ్య లొప్పు విప్పు తనర్పు నా
వెడఁద విరివి పఱపు వెడలు పనఁగ
దీర్ఘమునకు నామధేయంబులై యొప్పు
నిడుద చాఁపు నిడివి నిడు పనంగ                    (33)

టీ. విప్పు, తనర్పు, వెడద, విరివి, పఱపు, వెడలుపు _ ఈ ఆరును వెడల్పు పేర్లు. నిడుద, చాపు, నిడివి, నిడుపు - ఈ నాలుగును నిడివికి పేర్లు.

ఆ. ఈడు దినుసు సాటి యెన దొర సరి జోడు
సవతు మాద్రి యుద్ది జత తరంబు
పురుడు నాఁగ సదెఋశమునకివి యాఖ్యలౌ
(వివిధగుణసనాథ విశ్వనాథ)                     (34)

టీ. ఈడు, దినుసు, సాటి, ఎన, దొర, సరి, జోడు, సవతు, మాద్రి (రూ. మాదిరి), ఉద్ది, జత, తరంబు, పురుడు - ఈ పదమూడును సమానమునకు పేర్లు.

తే. పసిఁడి బంగరు బంగారు పైడి పొన్ను
జాళువా పుత్తడి యనంగ స్వర్ణ మమరుఁ
దప్తకాంచన మమరు గుందన మనంగ
డాని యపరంజి నా (గజదానవారి)                     (35)

టీ. పసిడి, బంగరు, బంగారు, పైడి, పొన్ను (రూ హొన్ను), జాళువా, పుత్తడి - ఈ ఏడును బంగారమునకు పేర్లు. కుందనము, కడాని, అపరంజి - ఈ మూడును పుటము దీరిన బంగారమునకు పేర్లు.

ఆ. చిదుర తునుక తునియ చిదురుప వ్రక్క పా
లనఁగ ఖందమునకు నాక్య లమరుఁ
బ్రోగు గుప్ప వామి ప్రోవు దిట్ట యనంగ
రాశి కాఖ్య లగు (ధరాశతాంగ)                   (36)

టీ. చిదుర, తునుక, తునియ, చిదురుప, వ్రక్క, పాలు - ఈ ఆరును ఖండమునకు పేర్లు. ప్రోగు, కుప్ప, వామి, ప్రోవు, తిట్ట - ఈ అయిదును రాసికి పేర్లు.

క. ఈ స్థావరవర్గుం గడు
నాస్థన్ వినఁ జదువ వ్రాయ నవనీస్థలిలో
నాస్థాణునికృప నఖిలశు
భస్థితులును జనుల కొదవు భాసురలీలన్           (37)

స్థావరువర్గు సమాప్తము
_________________________________________________________________________________

తిర్యగ్వర్గు

సీ. వెడఁదమోము మెకంబు జడలమెకం బేనుఁ, గులగొంగ మెకములకొలముసామి
తెల్లడాలుమొకంబు తెఱనోటిమెకము సిం, గంబు నాబొబ్బమెకం బనంగఁ
బరఁగును మృగరాజు పసిదిండి పులి మెకం, బులతిండిపోతు చాఱలమెకంబు
మువ్వన్నెమెక మన నివ్వసుంధరయందు, వ్యాఘ్రంబునకు సమాఖ్యలు చెలంగుఁ

ఆ. బుట్టకూడుదిండిపోతన వెనుకచూ
పులమెకంబు నాఁగ నెలువనంగ
నెలుఁగు నాఁగ మోరతెలుపుమెకంబు నా
భల్లూకంబు దనరు (ఫాలనేత్ర)                    (1)

టీ. వెడదమోముమెకము = విశాలముఖముగల మృగము, జడలమెకము = జటలుగల మృగము, ఏనుగులగొంగ = గజములకు విరోధి, మెకములకొలముసామి = మృగముల వంశమునకు రాజు, తెల్లడాలుమెకము = శ్వేతకాంతి కలది, తెఱనోటిమెకము = తెఱచియుండెడు నోఱు గలది, సింగము, బొబ్బమెకము = బొబ్బలు వేసెడు మృగము, - ఈ ఎనిమిదియు సింహమునకు పేర్లు. పసిదిండి = (పసుల + తిండి) పశువులను భక్షించునది, చాఱలమెకము = చాఱలుగల మృగము, మువ్వన్నెమెకము = మూడువన్నెలు గల మృగము, - ఈ అయిదును వ్యాఘ్రమునకు పేర్లు. పుట్టకూడుతిండిపోతు = పుట్టకూడు తినునది, వెనుకచూపులమెకము = వెనుక దృష్టి గలది, ఎలువు, ఎలుగు, మోరతెలుపుమెకము = ముఖమందు తెలుపుగల మృగము = ఈ నాలుగును భల్లూకమునకు పేర్లు.

క. పలుగొమ్ములమెక మనఁగా
నిల నెక్కుడుమెక మనంగ నేనుఁ గనంగా
బలువంజమెకము నాఁ జే
గలమెక మన గౌ రనంగఁ గరియొప్పు (శివా)              (2)

టీ. పలుగొమ్ములమెకము = దంతములే కొమ్ములుగా గల మృగము, ఎక్కుడుమెకము = ఎక్కుటకు యోగ్యమైఅన మృగము, ఏనుగు, బలువంజమెకము = (బలువు + అంజ + మెకము) (రూ బలుహజ్జమెకము) = బలువైన పాదములుగల మృగములు, చేగలమెకము = కస్తము (తొండము) గల మృగము, గౌరు - ఈ ఆరు గజమునకు పేర్లు.

తే. వాజికి నాఖ్యలగుఁ దేజి వారువంబు
మావు, గుఱ్ఱంబు తట్టువ వావురంబు
కత్తలాని బాబా జక్కి తత్తడి యన
(విగతభవపాశ కాశీనివేశ యీశా)                     (3)

టీ. తేజి, వారువము, మావు, గుఱ్ఱము, తట్టువ, వావురము, కత్తలాని, బాబా, జక్కి, తత్తడి _ పదకొండును గుఱ్ఱమునకు పేర్లు.

క. తగ రేడిక పొట్టేలన
నగు మేషసమాఖ్య లెనిమిదడుగులమెక మే
నుఁగుగొంగసూఁ డనంగా
జగతిన్ శరభాఖ్య లొప్పుఁ (జంద్రార్ధధరా)        (4)

టీ. తగరు, ఏడిక, పొట్టేలు - ఈ మూడును మేకకు పేర్లు. ఎనిమిదడుగులమెకము = ఎనిమిది కాళ్ళు గల మృగము, ఏనుగుగొంగసూడు = సింహమునకు విరోధి - ఈ రెండును శరభ మృగమునకు పేర్లు.

క. సంగతి నుష్ట్రాఖ్యలు నొ
ప్పెం గడు నొంటె లన లొట్టిపిట్ట లనన్ సా
రంగాఖ్య లలరు నిఱ్ఱు ల
నంగా జింక లన లేళ్లు నా (సర్వజ్ఞా)                (5)

టీ. ఒంటె, లొట్టిపిట్ట _ ఈ రెండును ఉష్ట్రమునకు పేర్లు. ఇఱ్ఱి, జింక, లేడి - ఈ మూడును జింకలకు పేర్లు.

క. నులిగొమ్ములమెక మిఱ్ఱన
నిల మృగమున కొప్పుఁ బేళ్లు మృగలేడి యనన్
వెలయును రెంటికి దగు నా
ఖ్యలు జింకయనంగ నీశ (యంబరకేశా)              (6)

టీ. నులిగొమ్ములమెకము = మెలికెలు తిరిగియుండు కొమ్ములుగల మృగము, ఇఱ్ఱి - ఈ రెండును మగజింక పేర్లు. లేడి అనునడి ఆడుజింకకు పేరు. జింక అనునది ఆడు, మగదుప్పులు రెండింటికి పేర్లు.

తే. పసులు తొడుకులు పసరముల్ పసి యనంగఁ
బశువులకును సమాఖ్యలై పరఁగు నాల
పోతు బసవఁ గిబ్బ యాబోతనంగ
వృషభమున కాఖ్యలై యొప్పు (వృషభవాహ)           (7)

టీ. పసులు, తొడుకులు, పసరము (రూ. పసలము) పసి - ఈ నాలుగును పశువులకు పేర్లు. ఆలపోతు = పశువులకు పతి, బసవడు, గిబ్బ, ఆబోతు (ఆవు + పోతు) - ఈ నాలుగును వృషభమునకు పేర్లు.

సీ. త్ఱ్ఱుపట్టు లనంగ దొడ్లనఁగా నివి, గోష్ఠదేశమునకుఁ గొఱలు (నీశ)
కదుపులు మొదవులు పదువులు మందలు, నా ధేణుగణ మొప్పు (నగనివేశ)
యలరు నాఖయలు లేఁగలన దూదలనఁ గ్రేపిఉ, లన వత్సములకును (ధనదమిత్ర)
యా వనఁగా గిడ్డియనఁ దొడు కన మొద, వన ధేనునామముల్ దనరు (నభవ)

తే. యక్షమునకు సమాఖ్యలై యొప్పుచుండు
గిత్త యె ద్దనఁ గోడె నాఁ (గృతివాస)
యా లనఁగ ధేనువుల కాఖ్యయలరుచుండు
(శైలజానాథ ప్రమథసంచయసనాథ)              (8)

టీ. తొఱ్ఱుపట్టులు, దొడ్లు - ఈ రెండును కొట్టమునకు పేర్లు. కదుపులు, మొదవులు, మందలు - ఈ నాలుగును ఆవులగుంపునకు పేర్లు. లేగ, దూడ, క్రేపు - ఈ మూడును దూడలకు పేర్లు. ఆవు, గిడ్డి, తొడుకు, మొదవు - ఈ నాలుగును గోవుల పేర్లు. గిత్త, ఎద్దు, కోడె - ఈ మూడును ఎద్దునకు పేర్లు. ఆలు (ఆవు + లు), అనగా ధేనువులు.

తే. అలరుఁ గుందేలు చెవులపో తనఁగ శశక
మొప్పుఁ బొడలమెకంబు నా దుప్పి యనఁగఁ
గాఱుకొమ్ములమెక మనంగను ధరిత్రి
రామనామమృగంబు (ధరాశతాంగ)                    (9)

టీ. కుందేలు, చెవులపోతు - ఈ రెండును కుందేటికి పేర్లు. పొడలమెకము = మచ్చలు గల మృగము, దుప్పి, కాఱుకొమ్ములమెకము = సాంద్ర శృంగములుగల మృగము - ఈ మూడును దుప్పికి పేర్లు.

తే. దుంత యెనుబోతు జమునెక్కిరింత దున్న
యనఁగ మహిషమునకు సమాహ్వయము లమరుఁ
బరఁగు నెనుపెంట్లు గేదెలు బఱ్ఱె లెనుము
లనఁగ మహిషీసమాఖ్యలు (ధనదమిత్ర)         (10)

టీ. దుంత, ఎనుబోతు, జమునెక్కిరింత = యముని వాహనము, దున్న - ఈ నాలుగును మహిషంబునకు పేర్లు. ఎనుపెంట్లు (ఎనుము + పెంటి), గేదె, బఱ్ఱె, ఎనుము - ఈ నాలుగును మహిషీనామములు.

తే. పక్కి పులుఁగు పిట్ట యనంగఁ బక్షి యొప్పు
గఱులు ఱెక్కలు చట్టుపలెఱక లనఁగఁ
బక్షముల కివి పేళ్ళగుఁ బర్ణములకు
నాఖ్యలగు లావు లన నీఁక లనఁగ (నీశ)              (11)

టీ. పక్కి (ప్రకృతి. పక్షి), పులుగు, పిట్ట - ఈ మూడును పక్షికి పేర్లు. గఱులు, ఱెక్కలు, చట్టుపలు, ఎఱకలు - ఈ నాలుగును ఱెక్కలకు నామములు. లావు, ఈక - ఈ రెండును ఈకలకు నామములు.

సీ. తొలకరికలుగుపుల్గులు నల్వతేజీలు, పాలు నీరును నేరుపఱుచుపులుఁగు
లంచలు తెలిపిట్టలన నొప్పు హంసలు, క్రౌంచముల్ దనరారు గొంచ లనఁగఁ
గొక్కెరా లనఁగను గొక్కు లనఁగఁ, గొక్కెర లనఁగను గొంగ లనఁగఁ
బరఁగు నభిఖ్యలు బకవిహంగములకు, నట్టువపులుఁగు నాజుట్టుపులుఁగు

తే. నాఁగ నెమ్మన నెమలి నా నమ్మి యనఁగఁ
గేకికి సమాఖ్యలగుఁ జంచరీకములకు
నాఖ్యలు జమిలిముక్కాలి యనఁగ దేఁటి
యనఁగఁ దుమ్మెద నా (నీశ! యభ్రకేశ)                 (12)

టీ. తొలకరికల్గుపుల్గులు = వర్షాకాలమున పారిపోవు పక్షులు, నల్వతేజీలు = బ్రహ్మకు వాహనములు, పాలు నీరును నేరుపఱుచు పులుఁగులు = క్షీరోదకములను వేరుపఱచు నట్టి పక్షులు, అంచలు (ప్ర. హంసలు), తెలిపిట్టలు = తెల్లని పక్షులు, - ఈ అయిదును హంసలకు నామములు. కొంచలు అనగా క్రౌంచపక్షులు. కొక్కరా, కొక్కు, కొక్కెర, కొంగ - ఈ నాలుగును బకమునకు పేర్లు. నట్టువపులుగు = నాట్యముచేయు పక్షి, జుట్టుపులుగు = సిగగల పక్షి, నెమ్మి, నెమిలి, నమ్మి - ఈ అయిదును కేకికి నామములు. జమిలిముక్కాలి = ఆఱుకాళ్లు కలది, తేటి, తుమ్మెద - ఈ మూడును భ్రమరమునకు పేర్లు.

తే. పరఁగు నొడ్డీలు కూకీలు పల్లటీలు
పావురాలును బకదార్లు పావురములు
నాఁగఁ గలరవ పక్షిబృందములపేళ్ళు
(పంకజాతాక్షసన్మిత్ర ఫాలనేత్ర)                (13)

టీ. ఒడ్డీలు, కూకీలు, పల్లటీలి, పావురాలు, బకదార్లు, పావురములు - ఈ ఆరును పావురమునకు పేర్లు.

తే. పుడమిలోపలఁ జదువులపులుఁ గనంగఁ
జిగురువిల్కానితేజి నాఁ దొగరుముక్కు
పులుఁ గనఁగ బచ్చఱెక్కలపులుఁ గనంగఁ
జిలుక యన నొప్పుఁ గీరంబు (శ్రీమహేశ)             (14)

టీ. చదువులపులుగు = మాటాడు పక్షి, చిరువిలుకానితేజి = మన్మధుని వాహనము, తొగరుముక్కుపులుగు = ఎఱ్ఱని ముక్కు గల పక్షి, పచ్చఱెక్కలపులుగు = పచ్చని ఱెక్కలుగల పక్షి, చిలుక - ఈ అయిదును చిలుకకు పేర్లు.

తే. బట్టికాఁ డన గొరవంకపిట్ట యనఁగఁ
బరఁగు శారిక యేట్రింత పసులపోలి
గాడు కూఁకటిమూఁగ నాగను జెలంగు
నిల భరద్వాజమృగంబు (నీలకంఠ)                     (15)

టీ. బట్టికాడు(పా. బట్టుకాడు) గొరవంకపిట్ట - ఈ రెండును గోరువంకకు పేర్లు. ఏత్రింత, పసులపోలిగాడు, కూకటిమూగ - ఈ మూడును భరద్వాజ పక్షికి పేర్లు.

తే. జాలె దేగనఁ గురుజు నా సాళ్వ మనఁగఁ
గణుజు నాఁగను జలకట్టె యనఁగ వేస
డం బనఁగ గిడ్డు నా నోరణం బనంగ
శ్యేనభేదంబు లగు (మహాసేనజనక)                   (16)

టీ. జాలె, డేగ, కురుజు, సాళ్వము, కణుజు, జలకట్టె, వేసడము, గిడ్డు, ఓరణము - ఈ తొమ్మిదియు శ్యేనవిశేషణములకు పేర్లు.

తే. కోటఁ డనఁగను గూబ నా ఘూక మమరుఁ
జిఱుతగూబ యనంగ బసిండికంటి
యనఁగ సకినాలపులుఁ గన నలరుచుండుఁ
బృథివిఁ గనకాక్షి యనుపక్షి (శ్రీమహేశ)           (17)

టీ. కోటడు, గూబ - ఈ రెండును గుడ్లగూబకు పేర్లు. చిఱుతగూబ = చిన్నగూబ, పసిడికంటి = బంగారమువంటి నేత్రములు గలది, సకినాలపులుగు = శకునముల పక్షి - ఈ మూడును బంగారుకంటి పిట్టకు పేర్లు.

తే. పాము సప్పంబు నిడుపఁడు పడగదారి
గాలిమేఁతరి విసదారి కానరాని
కాళ్ళయది చిల్వవీనుల కంటి పుట్ట
పట్టెప ట్టనఁ జను నహి పేళ్ళు భర్గ                (18)

టీ. పాము, సప్పము (ప్ర. సర్పము) నిడుపడు = దీర్గముగా నుండునది, పడగదారి = పడగను ధరించినది, గాలిమేతరి = వాయు భక్షణ సేయునది, విసదారి = విషము ధరించినది, కానరానికాళ్లయది = అగపడని పాదములు గలది, చిల్వ 9రూ. చిలువ), వీనులకంటి = చెవులే కన్నులుగా కలది, పుట్ట పెట్టె పట్టు = వాల్మీకమును బెట్టియును నివాసముగా గలది - ఈ పదియును సర్పమునకు నామములు.

క. ఇల నెంచ రుధిరమున కా
ఖ్యలు నల్ల యనంగ నెత్తు రనఁగ ధరిత్రిం
బొల యీరు వెఱచి నంజుడు
పొల సస నివి పరఁగు మాంసమునకు (మహేశా)         (19)

టీ. నల్ల, నెత్తురు - ఈ రెండును రక్తమునకు పేర్లు. పొల ఈరువు, ఎఱచి, నంజుడు, పొలసు - ఈ అయిదును మాంసమునకు పేర్లు.

క. భర్గుడు కాశీనిలయుఁడు
దుర్గాపతి యొసఁగు ముదముతో నీతిర్య
గ్వర్గు లిఖించినఁ జదివిన
దౌర్గత్యము లనఁచి సంపదలు నిత్యంబున్                 (20)

టీ. ఈ తిర్యగ్వర్గు వ్రాసినను, చదివినను కాశీవిశ్వేశుని దయవలన దారిద్ర్యములు తొలగి సంపదలు కలుగును.

తిర్యగ్వర్గు సమాప్తము
( సశేషమ్ )
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఇంతటి విజ్ఞాన గనిని మాముందుంచు తున్న గురువులకు శత వందనములు . దీవించి అక్క
మీకు మీ కుటుంబ సభ్యు లందరికీ దీపవళి శుభాకాంక్షలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.