గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, నవంబర్ 2018, ఆదివారం

ఆంధ్రనామసంగ్రహము - 4

జైశ్రీరామ్.
ఆంధ్రనామసంగ్రహము - 4
మానవవర్గు

తే. పాఱుఁ డనగఁ బుడమివేల్పు బాఁపఁ డనఁగ
జన్నిగట్టన విప్రుండు జగతిఁ బరఁగు
నొడయఁ డేలిక యెకిమీడు పుడమిఱేఁడు
ఱేఁడు గొర సామి యన నొప్పు నృపతి పేర్లు            (1)

టీ. పాఱుఁడు, పుడమివేల్పు= భూదేవుఁడు, బాపడు, జన్నిగట్టు = యజ్ఞోపవీతమును ధరించువాడు - ఈ నాల్గును బ్రాహ్మణుని పేర్లు. ఓడయుఁడు, ఏలిక, ఎకిమీడు, పుడమిఱేఁడు = భూపాలుఁడు, ఱేఁడు, సామి, దొర - ఈ ఏడు ను క్షత్రీయునికి పేర్లు

సీ. కోమట్లు మూఁడవ కోలమువాండ్రన బేరు, లన వైశ్యనామము ల్దనరుఁ గాఁపు
వాండ్రు నా నాలవవాండ్రు, నా బలిజెవాం, డ్రనఁ జను శూద్రసమాహ్వయములు
వడుగు నా గోఁచిబాపఁడు నాఁగ బ్రహ్మచా, రికి బేళ్లు నడచు ధరిత్రియందు
నాలుబిడ్డలు గల యతఁ డిలుఱేఁడు గేస్తన నొప్పుఁ బేళ్లు గృహాధిపతికి

ఆ. నడవిమనికిపట్టు జడదారి యన వన
వాసి యొప్పునిల్లువాసి తిరుగు
బోడ తపసి కావి పుట్టగోఁచులసామి
యన యతీంద్రుఁ డలరు (నలికనేత్ర)             (2)

టీ. కోమట్లు, మూఁడవకొలమువారు, బేరులు - ఈమూడును వైశ్యునికి పేర్లు. కాఁవాండ్రు, నాలవవాండ్రు, బలిజెవాండ్రు - ఈ మూడును శూద్రునికి పేర్లు, వడుగు, గోఁబాపఁడు - ఈ రెండును బ్రహ్మచారికి పేర్లు, ఆలుబిడ్దలుగల యతండు = పెండ్లాము పిల్లలు గలవాడు, ఇలుఱేఁడు= ఇంటియజమానుడు, గేస్తు - ఈ మూడును గృహస్థుని పేర్లు. అడవిమనికిపట్టు = అరణ్యమునందు ఉండువాడు, జడదారి = జడలను ధరించినవాడు, - ఈ రెండును వానప్రస్థునికి పేర్లు, ఇల్లువాసి తిరుగు = ఇంటిని విడిచిపెట్టి తిరుగువాడు, బోడ, తపసి, కావిపుట్టగోచులసామి = కావిరంగుగల పుట్తగోచులను బెట్టుకొనువాడు - ఈ నాల్గును సన్న్యాసికి పేర్లు

సీ. అమ్మ నాఁ దల్లి నా నవ్వ నాఁ గన్నది, యన మాతృకాఖ్యలౌ (నభ్రకేశ)
అబ్బ నాయన యయ్య యనఁ దండ్రి యన నప్ప, యన జనకాఖ్యలౌ (నగనివేశ)
తోడఁబుట్టనఁగ సైదోడు తోఁబుట్టన, సోదరాహ్వయము లౌ (నాదిదేవ)
భర్తృసహోదరు భార్యకుఁ దోడికో, దలన నేరా లన నలరు (నభవ)

తే. చెలియ లనఁజెల్లె లనఁగను వెలయుచుండు
నాహ్వయములు కనిష్ఠికన్యకు (గిరీశ)
జేష్ఠకన్యకు నాఖ్యలై క్షితిని వెలయు
నప్ప యన నక్క యనఁగఁ (జంద్రార్ధమకుట)         (3)

టీ. అమ్మ, తల్లి అవ్వ, కన్నది _ ఈ నాల్గును మాతకు పేర్లు, అబ్బ, నాయన, అయ్య తండ్రి, అప్ప ఈ ఐదును తండ్రికి పేర్లు, తోడఁబుట్టు (పా. తోడబుట్టగు), తోడఁబుట్టువు, సైదోడు, తోఁబుట్టు (పా. టోబుట్టువు), తోబుట్టువు - ఈ మూడును సోదరునుకి పేర్లు, తోడికోడలు = తనతో సమానురాలగు కోడలు, ఏరాలు = అన్యుని భార్య (ఎరవు+ఆలు) - ఈ రెండును తోడికోడలికి పేర్లు, చెలియలు, చెల్లెలు అను ఈ రెండు చిన్న ఆడుతోబుట్టువునకు పేర్లు, అప్ప, అక్క - ఈరెండును పెద్ద ఆడుతోబుట్టువునకు పేర్లు

సీ. ముగ్ధకుఁ బేళ్ళగు ముగుద యనన్ ముద్ద, రాలు నా గోల నా బేల యనఁగ
గట్టివాయి యనంగ గయ్యాళి యన ఱాఁగ, యన ధూర్తసతికి నాహ్వయము లమరు
నైదువ నాఁగము నాఁ ముత్తైదువ నా నయి, దువరాలు నా బుణ్యయువతి వెలయు
మృతచిరంటికి నాఖ్య లెనఁగుఁ బేరంటాలు, నాఁగను జిక్కిని నా ధరిత్రి

తే. గేస్తురా లనునాఖ్యచే గృహిణి వెలయు
నాలు పెండ్లాము రాణి యిల్లా లనంగ
భార్య దనరును దొత్తన బానిసె యన
వరవుడన దాసికాహ్యలౌ (గరళకంఠ)         (4)

టీ. ముగుద, ముద్దరాలు, గోల బేల - ఈ నాలుగును పదునారు సంవత్సరములు వయసు గల గల పడుచునకు పేర్లు, గట్టివాయి = పెద్దగొంతు కలది, గయ్యాళి, ఱాగ - ఈ మూడును ధూర్తస్త్రీకి పేర్లు, ఐదువ, ముత్తైదువ, అయిదువరాలు (మంగళసూత్రము, పసుపు, కుంకుమము, గాజులు, చెవ్వాకు అను ఐదు వస్తువులు గలది), - ఈ మూడును సుమంగళియగు స్త్రీకి పేర్లు, పేరంటాలు, జక్కిని - ఈ రెండును మృతినొందిన ముత్తైదువరాలికి పేర్లు, గేస్తురాలు, ఆలు, పెండ్లాము, రాణి ఇల్లాలు, - ఈ అయిదును భార్యకు పేర్లు, తొత్తు, బానిసె, వరపుడు - ఈ మూడును దాసికి పేర్లు.

సీ. కన్నియ కన్నె వాఁ గన్యకుఁ బే ళ్ళొప్పు, జవరాలు కొమరాలు జవ్వని యనఁ
దనరు యువతి ప్రోడ యన గట్టివయసుది, యనఁ బ్రౌడ దాల్చునీ యాహ్వయములు
ముసలి మిండలకోర ముప్పదియాఱేండ్లు, చనినది యనుపేళ్ల నెనయు లోల
ముసలిది ముదుసలి ముదియ పెద్దన నివి, యాఖ్యలై తనరు వేధ్థాంగనకును

ఆ. చెడిప ఱంకులాడి చెడ్డతొయ్యలి వెలి
చవులుగనిన దనఁగ జార దనరు
నిలను విటులదూత యెడకాఁడు కుంటెన
కాఁ డనంగఁ దనరుఁ (గరళకంఠ)         (5)

టీ. కన్నియ, కన్నె - ఈ రెండు ను పెండ్లికాని పడుచు పేర్లు. జవరాలు, కొమరాలు, జవ్వని - ఈ మూడును యౌవ్వనయువతికి పేర్లు. ప్రోడ, గట్టివయసుది = దిటవైన వయసు గలది - ఈ రెండును ముప్పది యేండ్ల వయసు గలదాని పేర్లు, ముసలి, మిండలకోర, ముప్పదియాఱేండ్లు చనినది - ఈ మూడును లోలస్త్రీకి పేర్లు. ముసలిది, ముదుసలి, ముదియ, పెద్ద  - ఈ  నాలుగును వృద్ధాంగనకు పేర్లు. చెడిప, ఱంకులాడి, చెడ్డతొయ్యలి = చెడు గుణము గల యాడుది, వెలిచ్వులుగనినది= పరపురుషుల వలన పొందు మరిగినది - ఈ అయిదును వ్యభిచారిణికి పేర్లు. ఎడకాఁడు, కుంటెనకాఁడు = స్త్రీ పురుషులను చేర్చునట్టివాడు - ఈరెండును విటునిదూత పేర్లు.

తే. వేల్పుబానిసె వెలయాలు వేడ్కకత్తె
లంజె బోగముచాన వెల్లాటకత్తె
పడపుఁజెలి యాటచేడియ గడనకత్తె
నాఁగ నివి వేశ్య కాఖ్యలౌ (నగనివేశ)       (6)

టీ. వేల్పుబానిసె = దేవతల పనికత్తె, వెలయాలు = రొక్కమునకు వచ్చెడి భార్య, (వెల+ఆలు=వెలయాలు), వేడ్కకత్తె, లంజె, బోగముచాన = అనుభవించుటకైన స్త్రీ, వెల్లాటకత్తె (పెల్లాట్ల కత్తె) = ఎక్కువ నాత్యము చేయునది, పదపుఁజెలి = స్రవ్య సంపాదనము చేసెడి స్త్రీ (పడపు + చెలి), ఆటచేడియ = ఆటాడునట్టి ఆడుది, గడనకత్తె = సంపాదన చేయు స్త్రీ - ఈ ఆరును బోగముదాని పేర్లు.

ఆ. వెచ్చకాఁడు బొజఁగు వేడుకకాఁడు మిం
డండు ననుపుకాఁడు మిండగీఁడు
లంజెకాఁడు నాధరం జనుఁ బల్ల వ
నామధేయములు (పినాకహస్త)                (7)

టీ. వెచ్చకాఁడు = ద్రవ్యవ్యయము చేయువాడు, బిజగు, వేడుకకాఁడు = సొగసు కలవాడు, మిండడు, ననుపుకాఁడు= మెత్తదనము గలవాడు, మిండగీఁడు, లంజకాఁడు = లంజె కలవాడు - ఈ ఏడును విటుని పేర్లు

ఆ. కోడెకాఁ డనంగ గోవాళ్లు నాఁగను
యువజనాఖ్య లొప్పుచుండు రెండు
నాగవాస మనఁగ నామ మౌ వేశ్యాజ
నంబుమేలమునకు (నంబికేశ)                (8)

టీ. కోడెకాఁడు = యౌవ్వనవంతుడు, గోవాళ్లు = యౌవ్వనము గలవాడు (గోవ+వారలు = గోవాళ్లు) - ఈ రెండును ప్రాయముగలవానుకి పేర్లు, నాగవాసము ఇది వేశ్యజన కూటమునకు పేరు.

సీ. నెలఁతుక క్రాల్గంటి పొలఁతుక ముద్దియ, వ్చాలుఁగంటి మగువ పడఁతి మడఁతి
చెలి మచ్చకంటి యుగ్మలి యింతి తొయ్యలి, నవలా కలువకంటి నాతి గోతి
పూఁబోఁడి చిగురాకు బోఁడి పైదలి మించు, బోఁడి ముద్దుల గుమ్మ పొలఁతికొమ్మ
ప్రోయా లువిద తీఁగబోఁడి చేడియ యించు, బోఁడి యన్ను వెలంది బోటీ జోటి

తే. చాన తెఱవ వెలందుక చామ లేమ
చెలువ యెలనాగ చిలకలకొలికి కలికి
తలిరుఁబోఁడి యలరుఁబోఁడి నెలఁత పొల్తి
గరిత యతివ నా స్త్రీ సమాఖ్యలు (మహేశ)               (9)

టీ. నెలఁతుక, క్రాల్గంటి = ప్రకాశించెడి కన్నులు గలది, పొలంతుక, ముద్దియ, వాలుఁగంటి= వెడల్పు నేత్రములు గలది, మగువ, పడఁతి, మాడఁతి, చెలి, మచ్చెకంటి = మీననేత్ర, ఉగ్మలి, ఇంతి, తొయ్యలి, నవలా, కలువకంటి = కలువలను పోలు కన్నులు గలది, నాతి, గోతి, పూఁబోఁడి = పువ్వువంటి శరీరము గలది, చిగురాకుబోఁడి = చిగురువంటి మేను గలది, పైదలి, మించుబోఁడి = మెఱపు వలె వెలిగెడు స్వరూపము గలది, ముద్దులగుమ్మ = ముద్దుల మూట గట్టునది, పొలఁతి, కొమ్మ, ప్రోయలు, ఉవిద, తీఁగెబోఁడి = తీగెవంటి శరీరము గలది, చేడియ, ఇంచుబోఁడి = చెఱకువలె ప్రియమైన శరీరము గలది, అన్ను, వెలది, బోటి, జోటి, చాన తెఱవ, వెలందుక, చామ, లేమ, చెలువ, ఎలనాగ, చిలుకలకొలికి = చిలుక ముక్కు వంటి కన్నుల కొనలు కలది, కలికి, తలిరుబోడి = చిగురువలె మెత్తని దేహము గలది, అలరుబోడి = పువ్వువంటి మెత్తని దేహము గలది, నెలత, పొల్తి, గరిత, అతివ - ఈ 48 యును స్త్రీకి పేర్లు.

తే. చెలిమి నేస్తంబు పొందు నా స్నేహ మలరు
నెచ్చెలి యనుంగు సంగాతి నేస్తకాఁడు
సంగడీఁ డనఁ జెలికాఁడనంగఁ దనరు
స్నేహితునకు సమాఖ్యలు (శ్రీమహేశ)              (10)

టీ. చెలిమి నేస్తము, పొందు - ఈ మూడును స్నేహమునకు పేర్లు. నెచ్చెలి, అనుంగు, సంగాతి, నేస్తకాఁడు, సంగడీఁడు, చెలికాఁడు - ఈ ఆరును స్నేహితునకు పేర్లు.

సీ దొంగ తెక్కలికాఁడు దొరకోలుసన్నాసి, ముచ్చెత్తుబరికాఁడు ముడియవిడుపు
తెరవాటుకాఁడు కత్తెరదొంగ చేవాఁడి, కాఁడు వల్లడికాఁడు కన్నగాఁడు
మునిముచ్చు గడిదొంగ యనఁ దస్కరాఖ్యలౌఁ, జెండిపోతు గరాసు మొండికట్టె
టకటొంకు టాటోటు టక్కులాడు పిసాళి, టక్కరి ముడికాఁడు ఠవళికాఁడు

తే. కల్లరియు గొంటు కైలాటకాఁడు చెడుగు
బేరజము కుచ్చితుఁడు దోసకారి చెనఁటి
పాలసుఁడు నాలిబూతంబు పలువ తులువ
కూళ గడు సన వర్తిల్లు గుజనుపేళ్లు        (11)

టీ. దొంగ, తెక్కలికాఁడు= బందిపోటు వేయువాడు, దొరకోలు సన్నాసి= వేషముదాల్చి యితరులను నమ్మించి సొమ్మూపహరించుకొని పోవువాడు, ముచ్చు, ఎత్తుబరికాడు, ముడియవిడుపు = ముడివిచ్చి యెత్తుకొని పోవువాడు, తెరువాటుకాడు = దారి యడ్డగించి కొట్టి తీసుకొని పోవువాడు, కత్తెరదొంగ = కత్తిరించి దొంగిలించువాడు, చేవడికాడు = చేతిపనితనము గలవాడు, వల్లడికాడు = కొల్ల పెట్టువాడు, కన్నగాడు = కన్నము వేసి దొంగిలించు వాడు, మునిముచ్చు = మునివలె మౌనముతో ఏమీ తెలియనట్లుండెడివాడు, గడిదొంగ = ఆంతర్యము నెరింగినవాడు - ఈ పదమూడును దొంగకు పేర్లు, చెండిపోతు = మూఢబుద్ధి కలవాడు, గరాసు, మొండికట్టె, టకటొంకు, టాటోటు, టక్కులాడు = కల్లలాడువాడు, పిసాళి, టక్కరి, ముడికాడు, ఠవళికాడు = మోసము కలవాడు, కల్లరి = బొంకులాడు వాడు, గొంటు, కైలాటకాడు = మాయోపాయముల నెరిగినవాడు, చెడుగు, బేరజము, కుచ్చితుడు, దోసకారి = పాపములు చేయువాడు, చెనటి, పాలసుడు, నాలిభూతము, పలువ, తులువ, కూళ, గడుసు - ఈ ఇరువదినాలుగు కుత్సితునకు పేర్లు.

ఆ. పాప బుడుత చిఱుత పట్టి సిసువు కందు
కూన నిసువు బిడ్డ కుఱ్ఱ బొట్టె
యనఁగ శిశుసమాఖ్య లగుఁ గొమరుండు నాఁ
గొడుకు నాఁ కుమారకుండు వెలయు                  (12)

టీ. పాప, బుడుత, చిఱుత, పట్టి, సిసువు (శిశు శబ్ధభవము) కందు, కూన, నిసువు, బిడ్డ, కుఱ్ఱ బొట్టె - ఈ పదకొండు శిశువునకు పేర్లు. కొమరుడు, కొడుకు - ఈ రెండును పుత్రునిపేర్లు
( సశేషమ్ )
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.