గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, నవంబర్ 2018, బుధవారం

ఆంధ్రనామశేషము - 3

జైశ్రీరామ్.
ఆంధ్రనామశేషము - 3 - అడిదము సూరకవి
క. తడవు వడి కా రనంగా
నడరుం గాలంబు శిథిలమయ్యె ననుట యౌ
విడె వీడె నూడె విచ్చెను
సడలె నురలె వదలె బ్రిదిలె జాఱె ననంగన్           (36)

టీ. తడవు, వడి, కారు - ఈ మూడును కాలమునకు పేర్లు. విడె, వీడె, ఊడె,  విచ్చె, సడలె, ఉరలె, ఉరలె, వదలె, ప్రిదిలె, జాఱె - ఈ తొమ్మిదియు శిథిలమయ్యె ననుటకు పేర్లు.

క. మది డెంద ముల్ల మొద యన
హృదయంబున కాఖ్యలయ్యె నీఱం బనఁగాఁ
బొదరి ల్లనఁగ నికుంజము
(సదయాంతఃకరణ తరుణ చంద్రాభరణా)             (37)

టీ. మది (ప్ర. మతి) డెందము, ఉల్లము, ఎద - ఈ నాలుగును హృదయమునకు పేర్లు. ఈఱము, పొదరిల్లు (పొద+ఇల్లు) - ఈ రెండును నికుంజమునకు పేర్లు.

క. తెగ దినుసు తోయ మనఁగను
నెగడుఁ బ్రాకారంబునకును నెఱి నామములై
మెగ మనఁగ మెక మనంగను
మృగమునకు నభిఖ్యలయ్యె (మేరుశరాసా)             (38)

టీ. తెగ, దినుసు, తోయము - ఈ మూడును ప్రకారమునకు నామములు. మెగము, మెకము (ఈ రెండును మృగ శబ్ధభవములు) - ఈ రెండును మృగమునకు పేర్లు.

క. ఎడ దవ్వు కేళ వనంగా
నడరున్ దూరంబునకు సమాఖ్యలు నలి నాఁ
బొడి నుగ్గు తురుము నూరు మన
బెడఁగడరుం జూర్ణమునకుఁ బేళ్ళై (శర్వా)         (39)

టీ. ఎడ, దవ్వు, కెఖవు - ఈ మూడును దూరమునకు పేర్లు. నలి, పొడి, నుగ్గు, తురుము, నుఱుము - ఈ అయిదును చూర్ణమునకు పేర్లు.

క. ప్రేరేచెను బురికొలిపెను
దారిచె ననఁ జోదనకును దగు నాఖ్యలు పెం
పారును జంబుద్వీపము
నేరెడుదీవి తొలుదీవనెడు నామములన్                  (40)

టీ. ప్రేరేచెను, పురికొలిపెను, తారిచెను - ఈ మూడును ప్రేరణ చేసెననుటకు పేర్లు. నేరెడుదీవి = నేరేడుచెట్టుగల ద్వీపము, తొలుదీవి = మొదటి ద్వీపము - ఈ రెండును జంబూద్వీపమునకు పేర్లు.

క. తొలఁగెం బాసె ననంగా
నలరున్ విముఖతకుఁ బ్రాప్తమయ్యె ననుటపే
ళ్ళలమె నొదవె దక్కొనియెను
నెలకొనియెన్ జెందె ననఁగ నెక్కొనియె ననన్             (41)

టీ. తొలగెను, పాసెను - ఈ రెండును దూరముగా పోవుటకు పేర్లు. అలమె, ఒదవె, దక్కుకొనియె, నెలకొనియె చెందె నెక్కొనియె -  ఈ ఆరును లభించె ననుటకు పేర్లు.

క. వెనుకఁ దరువాతఁ బిమ్మట
ననఁగా నంతట ననంగ నంత ననంగాఁ
దనరుం బశ్చాదర్థము
(కనకాచలచాప చంద్రఖండకలాపా)                    (42)

టీ. వెనుకన్, తరువాతన్, పిమ్మటన్, అంతటన్, అంతన్ - ఈ అయిదును అనంతర మనుటకు పేర్లు.

క. పల్లఱపులు రజ్జు లనం
బ్రల్లదము లనంగ వ్యర్థభాషణములకున్
బేళ్లై వర్తిల్లు నోలిగ
(నుల్లోకజయాభిసరణ యురగాభరణా)                      (43)

టీ. పల్లఱపులు, రజ్జులు, ప్రల్లదములు - ఈ మూడును పనికిమాలిన మాటలకు పేర్లు.

క. కైసేఁ తలంకరించుట
బేసి యనన్ విషమమునకుఁ బేరై వెలయున్
సేసలు దీవనఁబ్రా లన
భాసిలు మంత్రాక్షతలకుఁ బర్యాయములై                (44)

టీ. కైసేత (కై+చేత) అనగా అలంకరించుట, బేసి = సరికాని సంఖ్య. సేసలు, దీవనబ్రాలు - ఈ రెండును మంత్రాక్షత లకు నామములు.

క. కో రనఁ బా లన సంశం
బేఱన వాఁక యన నదికి నెసఁగును బేళ్లై
నీరాజనంబు పేళ్ళగు
నారతి నివ్వాళి యనఁగ (నంగజదమన)                (45)

టీ. కోరు, పాలు - ఈ రెండును భాగమునకు నామములు. ఏఱు, వాక - ఈ రెండును నదికి నామములు. ఆరతి (ప్ర. హారతి), నివ్వాళి - ఈ రెండును నీరాజనమునకు నామములు.

ఆ. మొఱబవోయె ననఁగ మొద్దువోయె ననంగఁ
గుంఠమయ్యె ననుటకుం ఫనర్చు
శాతమునకు నాఖ్యలై తనరారును
జుఱుకు వాఁడి తెగువ కఱ కనంగ                   (46)

టీ. మొఱవవోయె (మొఱవ+పోయె) మొద్దువోయె (మొద్దు+పోయె) - ఈ రెండును పదును లేనివయ్యె ననుటకు పేర్లు. చుఱుకు, వాడి, తెగువ, కఱకు - ఈ నాలుగును పదునుకు పేర్లు.

సీ. యామికులకు నాఖ్యలై ప్రవర్తిలుచుండు, నారెకు లనఁగఁ దలారు లనఁగఁ
గళ్లెంబు  వాగె నాఁగను ఖలీనంబు పే, ళ్ళలరు దంతంబుపేరౌ డనంగఁ
దఱపి నా ముదురు నాఁ దరుణేతరం బంట, యిం చనఁ జెఱ కన నిక్షు వలరు
నష్టం బొనర్చె నంటకు నాహ్వయము లయ్యె, బోకార్చె ననఁగ గోల్పుచ్చె ననఁగఁ

తే. గుదె యనఁగ దు డ్డనంగను గదకుఁ బేళ్లు
ఇవ మనఁగ మం చనంగను హిమముపేళ్లు
కాన యన నడవి యనంగఁ గాననంబు
షడ్ఢకుఁడు తోడియల్లుఁడు జగిలెఁ డనఁగ           (47)

టీ. ఆరెకులు, తలారులు - ఈ రెండును తలవర్లకు పేర్లు. కళ్లెము వాగె - ఈ రెండును ఖలీనమునకు పేర్లు. ఔడు (రూ. అవుడు) అనగా దంతము నకు పేరు. తఱపి, ముదురు - ఈ రెండును లేతది కానిదానికి నామములు. ఇంచు, (ప్ర. ఇక్షువు) చెఱకు = ఈ రెండును ఇక్షువునకు నామములు. పోకార్చె, కోల్పుచ్చె (రూ. కోలుపుచ్చె) - ఈ రెండును నష్టము చేసెననుటకు పేర్లు. గుదె, దుడ్డు - ఈ రెండును గదకు పేర్లు, ఇవము (ప్ర. హిమము) మంచు - ఈ రెండును హిమమునకు పేర్లు. కాన (ప్ర. కాననము) అడవి (ప్ర. అటవి) - ఈ రెండును అరణ్యమునకు పేర్లు. తోడియల్లుడు, జగిలెడు - ఈ రెండును షడ్ఢకునికి పేర్లు.

క. తేనియ యన జు న్నన నభి
ధానంబులు మధువునకును దనరుం బేళ్లై
పానకము చెఱకుపా లనఁ
గా నిక్షురసంబునకును (గంఠేకాలా)                       (48)

టీ. తేనియ, జున్ను - ఈ రెండును మధువునకు పేర్లు. పానకము, చెఱకుపాలు - ఈ రెండును చెఱకురసమునకు నామములు.

క. ఉడిగెను జాలించెను నా
నడరు విరామం బొనర్చె ననుటకుఁ బేళ్లై
తొడరుం బశ్చాద్భాగము
పెడ యనఁగ వెనుక యనఁగఁ బిఱుఁదు యనంగన్         (49)

టీ. ఉడిగెను, చాలించెను - ఈ రెండును విరమించెననుటకు పేర్లు. పెడ, వెనుక, పుఱుఁదు - ఈ మూడును పశ్చాద్భాగమునకు పేర్లు.

క. విడుమర యన విడిదల యనఁ
గడముట్టుట యనఁగ శాంతిగనుటకుఁ బేళ్లౌ
నెడ వంక చక్కి చో టన
నడరు స్థలంబునకు నాఖ్య లై (శితికంఠా)                (50)

టీ. విడుమర, విడుదల, కడముట్టుట - ఈ మూడును శాంతిగనుటకు పేర్లు. ఎడ, వంక చక్కి, చోటు - ఈ నాలుగును స్థలమునకు పేర్లు.

క. చనుఁ గ్రుద్ధుఁ డయ్యె ననుటకుఁ
గినిసెఁ గనలె నలిగెఁ గోపగించె ననంగాఁ
దనరున్ మర్మములకుఁ బే
ళ్లనువు లనఁగ నెఱఁకు లనఁగ నాయము లనఁగన్         (51)

టీ. కినిసె, కనలె, అలిగె, కోపగించె - ఈ నాలుగును క్రుద్ధుడయ్యె ననుటకు పేర్లు. అనువులు, నెఱకులు, ఆయములు -  ఈ మూడును మర్మములకు నామములు.

ఆ. పరఁగుఁ బేళ్లు కార్యకరునకుఁ బార్పత్తె
కాఁ డనంగ మణివకాఁడనంగఁ
దేజరిల్లుచుండు దేవేరి దొరసాని
రాణి యనెడుపేళ్ల రాజపత్ని                             (52)

టీ. పార్పత్తెకాడు, మణివకాడు - ఈ రెండును కార్యకరునకు పేర్లు. దేవేరి, దొరసాని, రాణి - ఈ మూడును రాజపత్ని నామములు.

క. మ్రింగె నన గ్రుక్కగొనియ న
నంగన్ దగుఁ గబళనం బొనర్చె ననుటకున్
బ్రుంగె మునింగె ననంగ (న
నంగహరా) మగ్నమయ్యె ననుటకుఁ బేళ్లౌ                  (53)

టీ. మ్రింగె, గ్రుక్కగొనియె - ఈ రెండును కబళనము చేసెననుటకు పేర్లు. బ్రుంగె, మునింగె - ఈ రెండును మగ్నమయ్యె ననుటకు పేర్లు.

సీ. ఆఖ్యలై తనరు ధనాగారమునకు ను, గ్రాణం బనంగ బొక్కస మనంగ
నాస్థానమండపాహ్వయము లై తనరు హ, జారం బనంగ మోసల యనంగ
దయకు నీరెం డభిధానంబు లయ్యెను, గనికర మనఁగ నక్కటిక మనఁగ
బాల్యస్థునకుఁ బేళ్లు బరిఢ విల్లును బిన్న, వాఁ డన గొండికవాఁ డనంగ

తే. సంధ్య కాఖ్యలు మునిమాపు సంజ యనఁగఁ
జూద మన నెత్త మనఁగ దురోదరంబు
జడి యనఁగ వాన యనఁగ వర్షంబుపేళ్లు
నొలి యుంకువ యన శుల్క మొప్పు (నభవ)                      (54)

టీ. ఉగ్రాణము, బొక్కసము - ఈ రెండును ధనముంచెడి గృహమునకు పేర్లు. హజారము (రూ. హాజారము), మోసల - ఈ రెండును ఆస్థానమండపమునకు పేర్లు. కనికరము, అక్కటికము - ఈ రెండును దయకు పేర్లు. పిన్నవాడు, కొండికవాడు - ఈ రెండును బాల్యస్థునకు పేర్లు. మునిమాపు, సంజ - ఈ రెండును సంధ్యాకాలమునకు పేర్లు. జూదము (ప్ర. ద్యూతము) నెత్తము - ఈ రెండును ద్యూతమునకు పేర్లు. జడి, వాన - ఈ రెండును వర్షమునకు పేర్లు. ఓలి, ఉంకువ - ఈ రెండును శుల్కమునకు పేర్లు.

సీ. పయ్యెద యనఁగను పైఁట యనంగ సం, వ్యానంబునకు నాఖ్యలై తనర్చు
నొక్కపెట్ట ననంగ నువ్వెత్తుగ ననంగ, యుగపత్పదంబున కొప్పుఁ బేళ్లు
కవఱ లనం బాచిక లనంగ నక్షముల్, బన్న మొచ్చె మనంగఁ బరిభవంబు
వ్యాపార మగు చెయ్ద మనఁ జెయ్ది యనఁగను, గన్ననఁ గీలనఁ గపటచేష్ట

తే. కందుకము బంతి చెం డనఁగను దనర్చు
నఱపఱలు చిద్రుప లన ఖండాహ్వయముల
కాఁచుపడియంబు లనఁగను గైరవళ్ల
నంగ ఖాదిరఘుటిక (లనంగదమన)                    (55)

టీ. పయ్యెద, పైట - ఈ రెండును ఉత్తరీయమునకు పేర్లు. ఒక్కపెట్ట, ఉవ్వెత్తుగ -ఈ రెండును ఒకసారిగ ననుటకు పేర్లు. కవఱలు, పాచికలు -ఈ రెండును అక్షములకు పేర్లు. బన్నము (ప్ర. భంగము) ఒచ్చెము - ఈ రెండును తిరస్కారమునకు పేర్లు. చెయ్దము, చెయ్ది - ఈ రెండును వ్యాపారమునకు పేర్లు. కన్ను, కీలు - ఈ రెండును కపటచేష్టకు పేర్లు. బంతి, చెండు - ఈ రెండును కందుకమునకు పేర్లు. అఱవఱలు, చిద్రుపలు - ఈ రెండును ఖండములకు పేర్లు. కాచువడియములు, కైరవళ్లు - ఈ రెండును ఖాదిరఘటికలకు పేర్లు.

సీ. మాగాని రాజ్యంబు మణివ ముద్యోగంబు, చిట్టలు చిత్రముల్ చిలుకు శరము
ఎత్తికోలు ప్రయత్న మీలువు మానంబు, బారి యనంగ నుపద్రవంబు
విన్నను వనఁగఁ బ్రావీణ్యం బెలర్చును, దార్కాణ మనఁగ నిదర్శనంబు
నిట్టపంట యనంగ నిష్కారణం బంట, బాననం బనఁగ మహాసనంబు

తే. నామ మేకాంతమునకు మంతన మనంగ
నంతిపుర మన శుద్ధాంత మలరుచుండు
నుదిరి యనఁ దప్తకాంచన మెప్పుచుండుఁ
దిరువుట యభిలాషించుట (దేవదేవ)                   (56)

టీ. మాగాని=దేశము, మణివము=ఉద్యోగము, చిట్ట = ఆశ్చర్యము, చిలుకు = బాణము, ఎత్తికోలు = ప్రయత్నము, ఈలువు= అభిమానము, బారి, ఉపద్రవము, విన్ననువు = ప్రావిణ్యము లేక నేర్పు, తార్కాణము = నిదర్శనము, నిట్టపంట = నిష్కారణము, బానసము = వంటయిల్లు, మంతనము = ఏకాంతము, అంతిపురము = అంతఃపురము, ఉదిరి = అపరంజి, తిరివుట = కోరుట.
( సశేషమ్ )
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఈ నిఘంటువు అందుబాటులో ఉందో లేదో తెలియదు కానీ నాబోటి వారికి ఇంతగా అందిస్తున్న సోదరులు శ్రీ చింతా వారికి కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.