గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, నవంబర్ 2018, శనివారం

ఆంధ్ర నామ సంగ్రహము - 10 (చివరిభాగం)

జైశ్రీరామ్.
ఆంధ్ర నామ సంగ్రహము - 10 (చివరిభాగం)
నానార్థవర్గు

క. కలు పనఁ బే రగు దధికిం
గలు పన సస్యంబులోని గాదము పేరౌ
వెలుగండ్రు కంపకోటను
వెలుఁ గందురు ప్రభను జనులు (విశ్వాధిపతీ)              (1)

టీ. కలుపు = పెరుఁగు, పైరులోని కసవు. 2. వెలుగు = కంచె, వెలుఁగు = వెలుతురు

క. మావు లనం దగు హయములు
మావు లనం బరఁగు నామ్రమహిజంబు లీలం
దావు లన స్థల మొప్పును
దావులనన్ వాసనలకుఁ దగు బేరు (శివా)                   (2)

టీ. మావులు = గుఱ్ఱములు, మామిడిచెట్లు. 2. తావులు = చోటులు, వాసనలు. (పై రెండుపదములకు బహువచనమందే యీ యర్థభేదంబు చెప్ప వీలగును. వీనికి ఏకవచనమున వేర్వేరంతములు గలవు. గుఱ్ఱము = మావు, మామిడిచెట్టి = మావి).

క. ఇమ్మహిలోపలఁ వేరగుఁ
గొమ్మ యనన్ వృక్షశాఖకును భామినికిం
దమ్ము లనం బే రగుఁ బ
ద్మమ్ముల కనుజన్ములకును (దరుణేందుధరా)                (3)

టీ. 1. కొమ్మ = చెట్టుయొక్క కొమ్మ, ఆడుది. 2. తమ్ములు = తామరలు, అనుజులు. ( ఏకవచనమున నర్థద్వయము రాదు. తామరకు తమ్మి, అనుజునికి తమ్ముడు అని రూపభేదము)

క. ఇమ్ములఁ బే రగుఁ దాటం
కమ్ములకున్ లేఖలకును గమ్మ లనన్ నా
మమ్ము దగుం గంఠాభర
ణమ్మునకును లతకుఁ దీఁగె నా (గౌరీశా)                (4)

టీ. 1. కమ్మ = చెవికమ్మ, ఉత్తరము (జాబు). 2. తీగె = మెడనూలు, లత

క. చెల్లును బేళ్లై ధరలోఁ
దా ళ్లన సూత్రంబులకును దాళంబులకుం
గోళ్లనఁ గుక్కుటములకును
బేళ్లగు ఖత్వాంగములకుఁ బేళ్లగు (నభవా)             (5)

టీ. తాళ్లు = పగ్గములు, తాటిచెట్టు (ఏకవచనములో రాదు పగ్గము = తాడు, తాడిచెట్టు = తాడి) 2. కోళ్లు = కుక్కుటములు, మంచపుకోళ్లు ( ఏకవచనములో రాదు. కుక్కుటము కోడి, మంచపుకోడు = కోడు)

క. చామయన సస్యమునకును
భామినికిని నాఖ్య యగుచుఁ బరఁగు ధరిత్రిన్
నామము లగుచును వెలయును
బాము లనన్ జన్మములకు భంగమ్ములకున్                  (6)

టీ. 1. చామ = ధాన్యవిషేషము, ఆడుది, 2. బాము = పుట్టుక, తిరస్కారము.

తే. దంట యనఁగ నభ్క్య యై దనరుచుండు
జగతిలోపలఁ బ్రౌఢకు యుగళమునకుఁ
బఱ పనంగ నభిఖ్య యౌఁ బానుపునకు
విస్త్రుతమునకు (శైలనివేశ యీశ)                   (7)

టీ. దంట = ప్రౌఢాంగన, జంట. 2. పఱపు = పానుపు, వ్యాపించుట.

క. తొలి యనఁగా నగు నామం
బులు పూర్వంబునకు సుషిరమునకును ధరలో
చెలి యనఁగ బహిర్ధవళం
బులకును నామంబు (శేషభుజగవిభూషా)              (8)

టీ. తొలి = మునుపు, బెజ్జము. 2. వెలి = బయలు, తెల్లన.

క. నెమ్మి యనన్ వంజులవృ
క్షమ్మునకున్ బర్హికిని సుఖస్థితికిని నా
మమ్ముగఁ దగు (నతిధీర య
హమ్మతిజనదూర పన్నగాధిపహారా)                   (9)

టీ. నెమ్మి = వంజులవృక్షము, నెమిలి సౌఖ్యము కలిగియుండుట

క. పోలం బే రగుచుండును
బా లనఁగా క్షీరమునకు భాగంబునకుం
గా లనఁ బేరగు నాలవ
పాలికిఁ బాదంబునకును (బాలేందుధరా)              (10)

టీ. పాలు = క్షీరము, భాగము. 2. కాలు = పాదము, నాలవ భాగము.

క. మే లన శుభంబు పేరగు
మే లన నుపరికిని గూరిమికినిం బేరౌఁ
మే లన మెచ్చునఁ బల్కిన
యాలాపంబునకు నాఖ్య యగు (జగదీశా)             (11)

టీ. మేలు = శుభము, పైభాగము, ప్రేమ, మంచిగా చెప్పిన మాట

క. ధారుణిఁ బేరు వహించును
బూరుగు నా నూఁదువాద్యమును శాల్మలియుం
బే రన నభిదానం బగు
హారమునకు నామమునకు (నంబరకేశా)             (12)

టీ. బూరుగు = వాద్యవిశేషము, బూరుగు చెట్టు. 2. పేరు = ఒక నామము, దండ.

క. క ప్పన నీలిమపే రగుఁ
గ ప్పనఁగా నింటిమీఁదికసవుకుఁ బేరౌఁ
గొ ప్పనఁ దగుఁ జాపాగ్రము
నొ ప్పగు ధమిల్లమును గృహోపరియు (శివా)         (13)

టీ. 1. కప్పు = నలుపు, ఇంటిమీదవేయు పూరి. 2. కొప్పు = వింటికొన, స్త్రీలకొప్పు, ఇంటియొక్క నడికొప్పు.

క. ఒకభూరుహమునకును ధమ
నికిఁ బేరగుఁ గ్రోవి యనఁగ నెఱి నట్టుల వే
ఱొకభూజమునకు నధరము
నకుఁ బేరగు మోవి యనిన (నగరాట్చాపా)           (14)

టీ. 1. క్రోవి = గోరింట చెట్టు, గొట్టము. 2. మోవి = ఒక చెట్టు, పెదవి

క. చవు లనఁగ నభిధానము
లవు షడ్రుచులకును ముత్తియపుటెత్తులకున్
భువిలోపల నామము లగు
గవులన గుహలకునుఁ బూతిగంధంబులకున్             (15)

టీ. చవులు = ఆఱురుచులు, ముత్యాలసరము. 2. గవులు = గుహలు, దుర్వాసన, కంపు.

తే. ఆఖ్య యై యొప్పు ధరణిలో నపరదివస
మునకు ఛత్రంబునకు నెల్లి యనెడినుడువు
జక్కి యను పేరు పరఁగును సంధవంబు
నకు ఘరట్టంబునకును (గందర్పదమన)             (16)

టీ. ఎల్లి = రేపు అనుట, గొడుగు. 2. జక్కి = గుఱ్ఱము, తిరుగలి

తే. ఆడె ననుమాట నటియించె ననుటకును వ
చించె ననుటకు మఱియు నిందించె ననుట
కాఖ్య యగుచును శోభిల్లు నాలు నాఁగ
గోవులకు భార్యకును బేరగు (న్మహేశ)                (17)

టీ. 1. ఆడెను = నాత్యము చేసెను, పలికెను, నిందించెను. 2. ఆలు = (బహువచనము) గోవులు, (ఏకవచనము) భార్య (దీనికి బహువచనము -- ఆండ్రు)

సీ. రజతపునఃపదార్థములకు నభిధాన, మగు వెండియన బంతి యనఁగఁ గందు
కమునకు శ్రేణికి నమరు నాహ్వయముగా, దండ యనం బుష్పదామమునకు
నంతికంబునకుఁ బేరగు దొరయన నాఖ్య, యగు సదృశమునకు నవనిపతికి
నస్త్రసంఖ్యకు నహమ్మనుటకు నాహ్వయం, బగు నే ననఁగ సరి యనఁగ సదృశ

తే. మునకు సమసంఖ్యకును నామముగ నెసంగు
గొంతనఁగ నాహ్వయంబగుఁ గుక్కుటాస
నంబునకుఁ గంఠంబునకును నల్ల యనిన
రక్తనీలాఖ్య యై యొప్పు (రాజమకుట)                   (18)

టీ. 1. వెండి = రజతము, మరల. 2. బంతి = చెండు, వరుస. 3. దండ = పూలదండ, సమీపము. 4. దొర = సమానము, రాజు. 5. ఏను = అయిదు, నేను. 6. సరి = సమానము, సమసంఖ్య, 7. గొంతు = కుక్కుటాసనము, మెడ. 8. నల్ల = నెత్తురు, నలుపు.

సీ. తీరంబునకు ధరిత్రీధరంబునకు స, మాఖ్య యై యొప్పు గట్టనఁగ (నీశ)
కేతువునకుఁ గాంతికిని సమాహ్వయ మగు, డా లనంగను (మేరుశైలచాప)
శౌర్యధుర్యునకు లాంఛనమునకును నామ, మగు బిరు దనఁగఁ (బన్నగవిభూష)
గూబ నా నాఖ్య యౌ ఘూకంబునకుఁ గర్ణ, మూలంబునకు (నవిముక్తనిలయ)

తే. యంతికంబునకును సమూహంబునకును
నామమై యొప్పుఁ జేరువ నాఁగ (నభవ)
సమభిధాన మై యొప్పుఁ బిశాచమునకుఁ
బవనమునకును గాలి యన్పలుకు (రుద్ర)                    (19)

టీ. 1. గట్టు = తీరము, పర్వతము. 2. డాలు = టెక్కెము, కాంతి. 3. బిరుదు = శౌర్యము, గుఱుతు. 4. గూబ = గుడ్లగూబ, చెవి మొదలు. 5. చేరువ = దగ్గఱ, గుంపు. 6. గాలి = దయ్యము, వాయువు.

క. ఇలలోపల నామం బగుఁ
బలుకులు నా శకలములకు భాషణములకున్
నెల యన నభిదానం బగు
జలజారికి మాసమునకు (శైలనిశాంతా)                   (20)

టీ. 1. పలుకు = మాట, తునుక. 2. నెల = చంద్రుడు, మాసము.

సి. అంతర్హితుం డయ్యె ననుటకు నాగతుం, డయ్యె ననుటకు సమాఖ్య యగుచు
నలరు వెచ్చేసె ననుట (యంబరకేశ), నెఱి సమాహ్వయ మగుఁ గఱచె ననఁగ
నభ్యాస మొనరించె ననుటకు దంతపీ, డ యొనర్చె ననుటకు (నయుగనయన)
వెలయు దప్తక్షీరములకు నభిజ్ఞకు, నాఖ్యయై యానవాలనుట (యీశ)

తే. పఱచె ననఁగ సమాఖ్యయౌ బాధచేసెఁ
బ్రచలితుం డయ్యె ననుటకుఁ (బాండురంగ)
పరఁగ మోహించె ననుటకుఁ బరిమళించె
ననుట కొప్పును వలచెనా (నళికనేత్ర)                        (21)

టీ. 1. విచ్చేసెను (రూ. వేంచేసెను) = వచ్చెను, కనదకపోయెను. 2. కఱచెను = నేర్చుకొనెను, కొఱికెను. 3. ఆనవాలు = కాగినపాలు, గుఱుతు. 4. పఱచెను = ఇడుములబెట్టెను, ప్రయాణమయ్యెను. 5. వలచెను = కోరెను, పరిమళించెను.

సీ. ఆనె నంట సమాఖ్యయౌను వహించెఁ బా, నము చేసె ననుటకు (నగనివేశ)
చషకంబునకును దంష్ట్రకు నాఖ్య యౌఁ గోర, యనఁగ (శశాంకకళావసంత)
మొక్కలీఁ డనఁగ గొమ్ములు లేని కరికి ము, ష్కరునకుఁ బేరగు (గరళకంఠ)
మరకతచ్ఛవికి నంబరమున కగుఁ బేరు, పచ్చడం బనిన (నంబాకళత్ర)

తే. క్షితిని దురగీపతికి వృత్తశిలకు నామ
ధేయ మై యొప్పు గుండు నాఁ (ద్రిపురహరణ)
నామ మౌ నొక్కసస్యంబునకును లోప
మునకుఁ గొఱ్ఱ యనంగ (నంబుదనిభాంగ)                  (22)

టీ. 1. ఆనెను = మోదెను, త్రాగెను. 2. కోర = గిన్నె, పెద్దపన్ను. 3. మొక్కలీడు = కొమ్ములు లేని ఏనుగు, మూర్ఖుడు. 4. పచ్చడము = పచ్చల కాంతి, పైవేసికొను వస్త్రము. 5. గుండు = మగగుఱ్ఱము, గుండ్రని బండ. 6. కొఱ్ఱ = ధాన్య విశేషము, కొఱత.

సీ. తాల్చు నాఖ్యను వధూధమిల్లభారంబు, గోణంబు మూల నాఁ (గుధరచాప)
గొఱ యనునాఖ్యచేఁ గొఱలు లోపంబు మ, నోజ్ఞవస్తువు (దక్షయజ్ఞమథన)
నెఱి హేయపడియె నన్వేషించె నను రెంటి, కాఖ్య యౌ రోసె నా (నసితకంఠ)
నరసె నాఁ బేరగు నార్తి వారించె వి, మర్శించె ననుటకు (మదనదమన)

తే. చరణమునకు నధఃప్రదేశంబునకు స
మాఖ్యయై యొప్పు నడుగు నా (నళికనేత్ర)
మహిని బే రగువుండుఁ బ్రమాణికంబు
నకును భాషకు బాస నా (నగనివేశ)                     (23)

టీ. 1. మూల = స్త్రీకొప్పు, విదిక్కు. 2. కొఱ = కొఱ్ఱలను ధాన్యము, మనోజ్ఞవస్తువు, 3. రోసెను = వెగటొందెను, వెదకెను. 4. అరసెను = బాధనివారించెను, విచారించెను. 5. అడుగు = పాదమును, క్రింది భాగము. 6. బాస = ఒట్టు, భాష.

సీ. నాగవాస మన ఘంటాప్రతీకమునకు, వేశ్యల కగుఁ బేరు (విశ్వనాథ)
నామమౌ నండంబునకు నంధునకును, గ్రుడ్డనంగను (రౌప్యకుధరనిలయ)
చర్మవాద్యమున కుష్ణమునకుఁ బే రగు, నుడు కనియెడునాఖ్య (యుడుపమకుట)
యభిధాన మగు మేడి యన హలాంగమునకు, దుంబరమునకును (ధూతకలుష)

తే. కల్లనఁగ శిల సురయు నౌ (గరళకంఠ)
పరఁగు నాఖ్యయు లాంగలపద్ధతికిని
శ్రేణికి జా లనంగ (భాసితసితాంగ)
(వారిధినిషంగ కాశీనివాసలింగ)                     (24)

టీ. 1. నాగవాసము = గంట లోని చీల, వేశ్యలు, 2. గ్రుడ్డు = కన్నులు తెలియనివాడు, అండము. 3. ఉడుకు = ఒకవాద్యము, వేడిమి. 4. మేడి = నాగేటి వెనుకటి పట్టుకొయ్య, (మేడి) = అత్తిచెట్టు.  5. కల్లు = ఱాయి, మద్యము. 6. చాలు = వరుస, నాగేటిచాలు.

తే. జననికిని మాతృజననికి జనకజనని
కాఖ్య యగు నవ్వ యనఁగ (నార్యాసహాయ)
భగినికిని జనకునకు నాహ్వయము దనరు
నప్ప యనఁగను (జంద్రరేఖావతంస)                 (25)

టీ. 1. అవ్వ = తల్లి, తల్లితల్లి, తంద్రితల్లి. 2. అప్ప = అక్క, తండ్రి.

క. పో తనఁగఁ బరఁగు మహిషము
భూతలమునఁ బురుషమృగము బురుషఖగంబుం
దా తన ధాతృ పితామహ
మాతామహులకును నగు సమాఖ్య (మహేశా)                (26)

టీ. పోతు = దున్నపోతు, పురుషమృగము, మగపక్షి. 2. తాత = బ్రహ్మ, తండ్రితండ్రి, తల్లితండ్రి.

క. పుడమిని వేరు వహించును
వడిగలవాఁ డనఁగ శౌర్యవంతుఁడు జవియున్
నడుమన నవలగ్నముఁ జె
న్నడరఁగ మధ్తస్థలంబు నగు (నగధన్వీ)        (27)

టీ. 1. వడిగలవాడు = శౌర్యవంతుడు, వేదగు గలవాడు. 2. నడుము = మధ్యము, మధ్య ప్రదేశము.

క. ఎద యనఁగఁ బరఁగు భీతికి
హృదయమునకు వక్షమునకు నిల జో డనఁగా
నది దనరు నామ మగుచును
సదృశమునకు వర్మమునకు (జంద్రార్ధధరా)           (28)

టీ. 1. ఎద = భయము, హృదయము. 2. జోడు = సమానము, కవచము.

క. నానార్థవర్గు విది స
న్మానముతో దీనిఁ జదివినను వ్రాసిన నా
మానవుల కబ్బు నెప్పుడు
నానార్థంబులును విశ్వనాథునికరుణన్                (29)

టీ. ఈ నానార్థవర్గును చదివినవారికి, వ్రాసినవారికి సకలసంపదలును కలుగును.

గద్యము. ఇది శ్రీమదేకామ్రమంత్రిపుత్త్రకౌండిన్యగోత్రపవిత్ర సదారాధిత మహేశ్వర పైడిపాటి లక్ష్మణకవి ప్రణీతంబైన యాంధ్రనామసంగ్రహం బను నిఘంటువునందు

సర్వంబు నేకాశ్వాసము సమాప్తము.
_________________________________________________________________

ఆంధ్ర నామ సంగ్రహము చివరిమాట.

ఈ ఆంధ్ర నామ సంగ్రహమునకు అనుబంధముగా అడిదము సూరకవి "ఆంధ్రనామ శేషము" అను మరోక గ్రంధము రచించెను. ఇందు ఆంధ్రనామ సంగ్రహమున చోటు చేసుకోని మరికొన్ని పదములను ఈ కవి 78 పద్యాలలో గ్రందస్థం చేసినారు.

ఆ. ఆంధ్రనామ సంగ్రహమునందు జెప్పని
కొన్ని తెలుఁగు మఱుఁగు లన్ని గూర్చి
యాంధ్రనామశేష మనుపేరఁ జెప్పెద
దీనిఁ జిత్తగింపు దేవదేవ

ఈ గ్రంధముల తరువాత మనకు లభిస్తున్న తెలుగు నిఘంటువు కస్తూరి రంగకవి రచించిన " ఆంధ్రనామ నిఘంటువు". దీనినే సాంబ నిఘంటువుగా కూడా పిలుస్తారు. ఈ నిఘంటువు కూడా ఆంధ్రనామ సంగ్రహము వలెనే దేవవర్గు (22 పద్యములు), మానవవర్గు 53 పద్యములు), స్థావరవర్గు 16 పద్యములు), తిర్యగ్వర్గు (15 పద్యములి) నానార్థవర్గు (12 పద్యములు) అను వర్గములుగా విభజించి వ్రాసినారు.

ఈగ్రంధముతరువాత తూము రామదాసకవి "ఆంధ్రపదనిధానము" అనే ఉద్గ్రంధాన్ని ఇదే వర్గీకరణతో రచించారు. ఇది 1565 పద్యములు గల బృహత్గ్రంధము. ఇందు నామలింగానుశాసనము మొదలుగా బహుజనపల్లి సీతారామాచార్యుల శబ్ధరత్నాకరము వరకు అనేక ఆంధ్రపదములేకాక అప్పటికాలమునాటి వ్యావహారిక భాష నందలి పదములను కూడా చేర్చి రచింపబడినది.
ప్రతి తెలుగు భాషాభిమాని తమ వద్ద ఉంచుకొనవలసిన గ్రంధాలలో ఇవి కొన్ని.
స్వస్తి.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
తెలుగు నిఘంటువులను మించి మాకందించి నందులకు కృతజ్ఞతలు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.