గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, నవంబర్ 2017, బుధవారం

శ్రీ హ.వేం.స.నా.మూర్తి కవి కృత ద్వివిధ కందద్వయ గీత గర్భ చంపక మాల

జైశ్రీరామ్
ఆర్యులారా!
శ్రీ హ.వేం.స.నా.మూర్తి కవి కృత ద్వివిధ కందద్వయ గీత గర్భ చంపక మాల తిలకించండి.
(శ్రీయుతులు చింతా రామకృష్ణారావుగారు మరియు శ్రీమతి సుప్రభగారల రచనా స్ఫూర్తితో చేసిన అభ్యాసము. వారుభయులకు ధన్యవాదములు.)

ద్వివిధ కందద్వయ గీత గర్భ చంపక మాల
కవి వరదాయకా! గిరిని కాపుర ముండెడు క్షేమ దాత! బ్రో
వవ పురహా! హరా! విమల భాసుర సద్యశ! విన్నవింతు చూ
పవ కరుణన్ భవా! నిను శుభాకర! నిత్యము నేను గొల్తు కా
వవ ధరణిన్ సదా శివ! కృపాపర! యెల్లెడ సేవలందవా

దీనిలోని మొదటి కందము.
వరదాయకా! గిరిని కా
పుర ముండెడు క్షేమ దాత! బ్రోవవ పురహా!
కరుణన్ భవా! నిను శుభా
కర! నిత్యము నేను గొల్తు గావవ ధరణిన్.

దీనిలోని రెండవ కందము.
పురహా! హరా! విమల భా
సుర సద్యశ! విన్నవింతు చూపవ కరుణన్
ధరణిన్ సదా శివ! కృపా 
పర! యెల్లెడ సేవలందవా కవి వరదా!

దీనిలోని తేటగీతి.
గిరిని కాపుర ముండెడు క్షేమ దాత
విమల భాసుర సద్యశ! విన్నవింతు
నిను శుభాకర! నిత్యము నేను గొల్తు
శివ కృపాపర! యెల్లెడ సేవలంద.
(హ.వేం.స.నా.మూర్తి).
ఈ పద్యమును తిలకించిన శ్రీ మంకెన సన్నయ్యపాత్రుఁడు గారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విధానం
చూడండి.

ఆవె. 
చింతరామకృష్ణ శ్రీయుతస్ఫూర్తితో 
రమ్యమైనరీతీరచనజేయు
పావులూరిసుఫ్రభామణీ!రమణీయ
మణివి,చంపకమ్ముమధువురుచికి,
తేటగీతితోడ తెలుగింటికోయిలై
ద్వివిదకందగర్భమవతరింప!
అద్వితీయమైన అజరామరంబైన
కవితపాడినావు!ఘనకీర్తిగొన్నావు!
శారదాంబ!కృపవిచారమతివి!
వేంకటాఖ్యమూర్తి, వేడ్కగారచియించు
హరివి,సత్యనారాయయణా! హాయి!హాయి! 
తమకుశుభముగలుగు! ధన్యులార!
ఆర్యా! మూర్తిగారూ!. మీ ప్రయత్నాన్ని నేను మనసారా అభినందిస్తున్నాను.
సన్నయ్యపాత్రుఁడు గారూ! మీకు కూడా నా అభినందనలండి.
జైహింద్.
Print this post

2 comments:

Unknown చెప్పారు...

గురుదేవులకు, కవివరులు మూర్తి గారికి సన్నయ్య పాత్రుడు గారికి ధన్యవాదాలు..

మంచి పద్యములను పంచు కవివరని,
కవివరదుడు గాచ కరుణ తోడ
గాంచ వచ్చు నేటి గర్భ చంపకమాల
వంటి ముదము నిచ్చు పద్యములను.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సరస్వతీ పుత్రులకు ప్రణామములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.