జైశ్రీరామ్.
ఆర్యులారా! బంధ కవి శ్రీ హరి వీయస్సెన్మూర్తి విరచిత లింగ బంధ సీసమాలికలో శివ ప్రార్థన అత్యద్భుతము.
తప్పక మీరు మెచ్చే రచన. చూడగలరు.
లింగ బంధ సీసమాలిక
(శ్రీ పూసపాటి కృష్ణ సూర్య కుమార్ గారి రచనను చదువుట వలన కలిగిన స్పూర్తితో చేసిన అభ్యాసము. వారికి ధన్యవాదములు)
లింగ బంధ శివ ప్రార్థన
సీసమాలిక
శంకర! స్మరహర! సన్నుతుల్ దేవర! భవదావసంహార! వందనంబు
పరమాత్మ! దుర్వారపాపబంధుర మైన విశ్వమున్ రక్షించు శాశ్వత! హర!
అలనాడు సాగర మందు కన్పించగా రయమున విషమును త్రాగి రక్ష
చేసినాడవు గాదె! చిద్రూప! భూతేశ! నావార లెవరయ్య నీవు దప్ప
మాటి మాటికి నన్ను మన్నించవే యంచు రమణీయ గుణధామ! శ్రమను నీకు
కల్గ జేయుచునుంటి కైలాసగిరివాస! సంసారమను ఘోర సాగరమున
మునిగియుండుటచేత ననురక్తితో జూచి సేవకుండను గాన జేరదీసి
యాగ్రహించక గావు మయ్య నీవని యందు నేర మెంచక సత్య నిష్ఠ జూపి
చంద్రశేఖర! మారసంహార! యీశ్వరా! సర్వార్థ సుఖదాత! శర్వ! రుద్ర!
పార్వతీ వల్లభా! భాగ్యకారక! భర్గ! ప్రమథాధిపతి! రమ్ము ప్రణతులయ్య!
మునిజనసురవంద్య! ఘనమోదకారక! యురగహారము లంది వరదుడ వయి
ధరణిని సతతంబు స్థిరసుఖంబులు గూర్చి పరిరక్షణము చేయు భవహర! శివ!
తేటగీతి
దేవ! నినుగొల్తు నిరతంబు నిష్ఠతోడ
కలుషసంహర! సత్యంబు పలుకుచుంటి
సంపదలు గోర సజ్జన సంగమంబు
కలుగు గతి జూపి సరసంపు పలుకు లిడుము.
స్వస్తి.
హరి వీయస్సెన్మూర్తి.
చూచారు కదా.
ఈ బంధకవి కలమున మరిన్ని బంధకవితలు వెలసి పాఠకాళికి అచ్చెరువు కలిగించేటంతటి మహాద్భుతముగా రాణించునని మనసారా ఆశించుచు, కవికి అభినందనలు తెలియఁ జేయుచున్నాను.
జైహింద్.
2 comments:
లింగ బంధ సీసమాలిక "ర" బీజాక్షరముతో శివ ప్రార్థన అత్యద్భుతము.బంధ కవి శ్రీ మూర్తి గారికి, మీకూ అభినందన వందనములు.
నమస్కారములు
కవి వరులు శ్రీ హరి వీయస్సెన్ మూర్తి గారికి శుభాభి నందనలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.