టీక- (రా) జరాగమంబునను = ముసలితనము వచ్చుటచే (దినమంతయు వెల్గి వృద్ధుఁ డగుటచే); భార్గవి = లక్ష్మీదేవి యొక్క; గేహ = ఇంటికి (పద్మమునకు); హితుండు = మిత్రుఁడు (సూర్యుఁడు); పద్యాసుతు = లక్ష్మీదేవి కుమారుని (మన్మథుని); భీముఁడు = శివుఁడు; అతండు = ఆ శివుఁడు (లక్ష్మీదేవి యింటికి హితుఁడు గనుకను, లక్ష్మీదేవి కుమారుని శివుఁడు చంపెఁ గావున, శివునిపై సూర్యున కసూయ గలదనియు, సాయంకాలమున శివుఁడు నాట్యము చేయును గనుక చూడలేక క్రుంకెనని భావము); (భా) జరాసుతు = జరాసంధుని; లలి = ఉత్సాహము.
రామాయణము-
సీ. మించి చంద్రుం డాక్ర(మించె ధరణిపాళి;
నంచితరాజసూ)నాస్త్ర మంద
పవనులు గొనిరి దంపతులచే నపజ(య
ము; మఱి కువలయహితముగ ధర్మ)
మూర్తులగు సురలు ముదమున సుధఁ గ్రోలఁ
గాఁ బండువెన్నెలల్ గాచె; సంత
సపు ధ్వనులు చకోర(సంతతి ధృతి సల్పె;
సద్రుచి హరి శిశు)జనతతిముఖ
గీ. సకలనరచిత్తతా(పాలు జదిపెఁ; జక్ర
పాటవము న)డఁచెన్; వంతపాలయి వన
జాళి గన్నుల మూసెఁ; దేంట్లందు చిక్కె;
సంద్ర ముప్పొంగెఁ; గఱఁగెను జంద్రశిలలు. (౬౦)
భారతము-
ఆ. మించె ధరణిపాళి, నంచిత రాజసూ
యము మఱి కువలయహితముగ ధర్మ
సంతతి ధృతిసల్పె; సద్రుచి హరి శిశు
పాలుఁ జదిపెఁ జక్రపాటవమున. (౬౦)
టీక- (రా) ధరణి = భూమి; పాళి = ప్రదేశము; (భా) ధరణిప = రాజుల; ఆళి = గుంపు; సూనాస్త్ర = మన్మథుఁడు; కువలయ = (రా) కలువలకు, (భా) ప్రపంచమునకు; ధర్మ = (భా) యముని; సంతతి = (రా) గుంపు, (భా) సంతానము; హరి = (రా) చంద్రుఁడు, (భా) కృష్ణుఁడు; చక్ర = (రా) చక్రవాకముల, (భా) సుదర్శనచక్రముయొక్క; పవన = వాయువు; కన్నులమూసె = ముడిచెను; తేంట్లు = తుమ్మెదలు.
రామాయణము-
సీ. మంథరబోధ రామవనవాసము పదు
నాలుగేండ్లు భరతపాలనమును
ధవు వేడి తాటకా(ధర్మరాజు సిరి బ
దపడి హరించెఁ జూ)తసుమమూర్తి
తరుణి కైక విభుదత్తద్వివరముల మో
(దమున; రహి సుయోధనమహితకృతి)
ప్రభుమంత్రి సిద్ధంబు (పాయని ధృతితోడఁ
జేయించెఁ గృష్ణాంశు) శిష్టు రాము
గీ. శ్రీకి; రప్పించి, వానిచే సీతమగని
సర్వముం జెప్పెఁ గైక; కౌసల్య గోడు
గనె విని స్వసుత రాజ్యాధి(కహరణమును;
మాన్పె ఘనుఁడగు హరి) వంశమండనుండు. (౬౧)
భారతము-
ఆ. ధర్మరాజు సిరిఁ బదపడి హరించె జూ
దమున రహి సుయోధనమహితకృతి
పాయని ధృతితోడఁ జేయించెఁ గృష్ణాంశు
కహరణమును; మాన్పె ఘనుఁడగు హరి. (౬౧)
టీక- తాటకాధర్మరాజు = తాటకకు యముఁడయిన రాముఁడు; సుయోధన = (రా) మంచియోధుఁడు, (భా) దుర్యోధనుఁడు; (భా) కృష్ణా = ద్రౌపదియొక్క, అంశుక = వస్త్రముల, హరణము = అపహరణము; (రా) కృష్ణ = నల్లని, అంశు = కాంతిగలవాని; హరి = (రా) సూర్యుఁడు, (భా) కృష్ణుఁడు; చూతసుమమూర్తి = మామిడిపుష్పమువంటి మెత్తని శరీరము కలది; మండనుఁడు = అలంకరించువాఁడు.
రామాయణము-
సీ. క్ష్మాసుతాపతికి లక్ష్మణుఁడు శాత్రవ(భీముఁ
డలుకతోడ బలికెఁ బెలుచఁ గపట)
భావఁ గైక, గురు భవద్విభూతి(హరణు
నధము దుశ్శాసను నడచి, నల్ల)
పాఱించి నిన్ జేతుఁ బ్రభుని, నిడెద (నాన;
నని భీకరముగఁ జేయంగ సన్న)
మునుఁ గాని మొన వచ్చి పోర, నాజి (నుదుటు
మీఱి చేయు సుయోధనోరుహతిని)
గీ. సల్పుదు ననుచు దుర్నిరీక్ష్యకుటిలభ్రు
కుటి యగుచుఁ గన్నులను మిడుంగురులు రాలఁ
బల్కె; వాని రాముఁడు శాంతపఱచి యొప్పె
క్ష్మాజ సౌమిత్రి వనికి రాఁగఁ దన వెంట. (౬౨)
భారతము-
గీ. భీముఁ డలుకతోడఁ బలికె బెలుచఁ గపట
హరణు నధము దుశ్శాసను నడచి నల్ల
నాన నని భీకరముగఁ; జేయంగ, సన్న
నుదుటుమీఱి చేయు సుయోధనోరుహతిని. (౬౨)
టీక- భీముఁడు = (రా) భయంకరుఁడు; (రా) పెలుచన్, కపట = కపటమైన, (భా) పెలుచఁగ, పట = వస్త్రముల; గురున్ = (రా) తండ్రిని; దుశ్శాసను = (రా) దుష్టమగు శాసనము గలవానిని (రాము నడవికి బొమ్మనెను కనుక); ఆన = (రా) ఒట్టు, (భా) త్రాగుటకు; అనిన్ = (రా) యుద్ధమును, (భా) యుద్ధమందు, సన్న = (భా) సంజ్ఞ; సన్నమును గాని = (రా) తక్కువ కానటువంటి; (భా) సుయోధన = దుర్యోధనుని, ఊరు = తొడల, హతిని = కొట్టుటను, చేయంగ = చేయుటకు; (రా) సుయోధన = మంచి యోధుల, ఉరు = గొప్ప, హతిని = కొట్టుటను, చేయంగన్ = చేయుటకు; దుర్నిరీక్ష్య = చూచుటకు భయంకరమైన; కుటిల = వంకరయగు; భ్రుకుటి = కనుబొమలు కలవాఁడు (కోపముచే); మిడుంగురులు = అగ్నికణములు.
రామాయణము-
సీ. ప్రజ వినె భరతుండు నిజజననీ (కృష్ణ
మృగనేత్రకతన సిరినెలసె మఱి)
రాముండు రిపు(ధర్మరాజు గోల్పడె వసుం
ధరను; నెత్తఁ)గ గోడు దశరథుండుఁ
బొగిలెనని; యనె నప్డు ముని వేష(మునను
వనిని నేఁడులు పదియు నల రెండు)
నీ రహర్పతివంశనీరధిరాకేందు
నుండ దైవము సేసె నొక్కొ! యొకది
ఆ. వసమును నగు (నొక్క వర్ష మజ్ఞాతులై
యుండ నియతి)తోడ నుర్విపుత్రి
రామలక్ష్మణులని ప్రభునిఁ గైకను భక్త
వరదుఁ దూఱుపాఱఁబట్టె నంత. (౬౩)
భారతము-
గీ. కృష్ణమృగనేత్రకతన సిరినెలసె; మఱి
ధర్మరాజు గోల్పడె వసుంధరను నెత్త
మునను; వనిని నేఁడులు పదియు నల రెండు
నొక్కవర్ష మజ్ఞాతులై యుండ నియతి. (౬౩)
టీక- (రా) కృష్ణమృగనేత్ర = కృష్ణమృగమువంటి కన్నులు గలది, (భా) కృష్ణ = ద్రౌపది, మృగనేత్ర = లేడివంటి కన్నులు గలది; ధర్మరాజు = (రా) యముఁడు; ఎత్తఁగ = (రా) చెలరేగఁగా, (భా) నెత్తమునను = జూదమందు; ఎలసె = పొందె; పదియు, రెండు, ఈరు = రెండు అనగా పదునాలుగు; అహర్పతి = సూర్యుఁడు; ప్రభుని = దశరథుని; వర్షము = సంవత్సరము
రామాయణము-
చ. ప్రణుతచరిత్రులున్ (ఘనులు భవ్యగుణాఢ్యులు కమ్రపాండు)వా
రణసితకీర్తితే(జులును రమ్యచరిత్రులు శుభ్రరామ)ల
క్ష్మణు లవనీరుహన్ (బెరసి కానకు నేగిరి భీతిలేక;) స
ద్గుణచరితాత్ములౌ (బుధులు కుందయినన్ విడఁబోరు పాడి)నిన్. (౬౪)
భారతము-
గీ. ఘనులు భవ్యగుణాఢ్యులు కమ్రపాండు
జులును రమ్యచరిత్రులు శుభ్రరామ
బెరసి కానకు నేగిరి భీతిలేక;
బుధులు కుందయినన్ విడఁబోరు పాడి. (౬౪)
టీక- పాండువారణ = తెల్లని యేనుఁగువంటి (ఐరావతమువంటి); పాండుజులు = పాండురాజ కుమారులు; రామ = (భా) స్త్రీ (ద్రౌపది); కమ్ర = ఇంపైన; శుభ్ర = ప్రకాశించు.
రామాయణము-
సీ. గుహుని నమస్కృతుల్ కొని, దాటి గంగాన
దిని, భరద్వాజు మన్ననల నంది
చిత్రకూటంబునఁ జెలువొప్ప వారుండఁ
బుత్రమోహంబునఁ బొగిలి దశర
థుఁడు సేరె దివి; భరతుఁడు గుంది, తానన్న
కడ కేగి, రమ్మని యడిగె; నతఁడు
రానన్నఁ బాదుకల్ బ్రభుపీఠి నిలిపి తా
మనెను నందిగ్రామమున; నిచటను
గీ. (శరభకరిభల్లుకాళి గజరిపుకిటుల
వ్యాఘ్రతతుల క్ష్మాపతనయు లంత రహినిఁ
గనుచుఁ జనిరి వే తిరులై మృగయుతవనికి
నధికమోదముతో) దండకాటవికిని. (౬౫)
భారతము-
కం. శరభకరిభల్లుకాళి గ
జరిపుకిటుల వ్యాఘ్రతతుల క్ష్మాపతనయులం
త రహినిఁ గనుచుఁ జనిరి వే
తిరులై మృగయుతవనికి నధికమోదముతో. (౬౫)
టీక- గజరిపు = సింహము; కిటి = పంది.
రామాయణము-
సీ. రాముఁడు సంగ్రామ(భీముఁ డచటఁ జంపె
బిరుదుని దనుజుఁ గి)ల్బిషు విరాధు
లక్ష్మణుఁ బ్రీతి (గలసి; మునులునుఁ గర
(మ్మీరు సాధులు జడదారు లెచ్చు)
నఘులఁ ద్రుంచెదరంచు (నలరుచుఁ గన నా ఘ
నుల గొన; బాశుప)క్షి లలి నెక్కు
మురహరాంశుఁడగు రామునిఁ జుట్టిరి మఱి చూ
తమని మించి; విజయుఁడు మహితశివు)
గీ. తరపుఁ గోపలక్షణుఁడగు తమ్ముతోడ
రాముఁ డచ్చోటు వాసి, గారామున శర
భంగుని సుతీక్ష్ణు నంతఁ గుంభజునిఁ గనెఁ; బ్రి
యమున వారి హితోపదేశము సలిపిరి. (౬౬)
భారతము-
ఆ. భీముఁ డచటఁ జంపె బిరుదుని దనుజుఁ గి
మ్మీరు సాధులు జడదారు లెచ్చు
నలరుచుఁ గన నాఘనులఁ; గొనఁ బాశుప
త మని మించి విజయుఁడు మహితశివు. (౬౬)
టీక- భీముఁడు = (రా) భయంకరుఁడు; (రా) కరమ్ము, ఈరు = ఇద్దఱు సాధులు, (భా) కిమ్మీరుఁ డనెడు రాక్షసుని; గొనబున్ = అందమును; ఆశుపక్షిన్ = వేగమగు పక్షిని (గరుత్మంతుని); విజయుఁడు = (రా) జయశీలుఁడు, (భా) అర్జునుఁడు; (భా) అనిన్ = యుద్ధమందు, మించి, పాశుపతమును, కొనన్ = తీసికొనఁగా; బిరుదు = శూరుఁడు; కిల్బిషు = పాపి; తరపు = సమానపు.
రామాయణము-
ఉ. ఆవలఁ దమ్ముతో (నరవరాగ్రణి జిష్ణుఁడు నవ్యహారి) క్ష్మా
జావిభుఁ డుగ్మలిం (గొనుచు జానుగఁ జేరెను గూర్మి నాత్మ) గో
దావరిఁ; గట్టి సద్(గృహముఁ దత్సుకృతుల్ గడు ప్రీతిమించఁ)గం
బావనకీర్తితో (మని రపారముదంబు నమర్త్యు లొందఁ)గన్. (౬౭)
భారతము-
గీ. నరవరాగ్రణి జిష్ణుఁడు నవ్యహారి
గొనుచు జానుగఁ జేరెను గూర్మి నాత్మ
గృహముఁ; దత్సుకృతుల్ గడు ప్రీతి మించ
మని రపారముదంబు నమర్త్యు లొంద. (౬౭)
టీక- నరవరాగ్రణి = (రా) రాముఁడు, (భా) అర్జునుఁడు; జిష్ణుఁడు = (రా) జయశీలుఁడు, (భా) దేవేంద్రుఁడు; కూర్మి నాత్మన్ = (రా) మనస్సునందు సంతోషముతో, (భా) ఆత్మగృహము = తన నెలవును (స్వర్గమును); హరి = మనోజ్ఞుఁడు; ఉగ్మలి = స్త్రీ (సీత).
రామాయణము-
చం. మనమున హారియై (తివిరి, మంజులరూపముఁ దీర్చి, నూర్వ)నూ
ననయపరాఘరా(శి రతినాథనిపీడితచిత్త జాణ) శూ
ర్పణఖయుఁ దాటకా(విజయు పైఁ బడె; నాతఁడు వెళ్లు వేడఁ) ద
మ్ముని ననెఁ దమ్ముఁడున్ (వలదు పొమ్మని పల్కెను భామ నంత)టన్. (౬౮)
భారతము-
గీ. తివిరి, మంజులరూపముఁ దీర్చి, నూర్వ
శి రతినాథనిపీడితచిత్త జాణ
విజయుపైఁ బడె; నాతఁడు వెళ్లు వేడ
వలదు పొమ్మని పల్కెను భామ నంత. (౬౮)
టీక- (రా) సు = శ్రేష్ఠమగు; ఉరు = అతి; అనూన = అధికమగు; నయ = నీతికి; పర = ఇతరమగు; అఘ = పాపముయొక్క; రాశి = గుంపయినది (అనగా నీతిబాహ్యురాలగు పాపిష్ఠి); (భా) సు, ఊర్వశి; తాటకావిజయుఁడు = (రా) రాముఁడు; శూర్ప + నఖ - శూర్పణఖ యగును గనుక నణ లకు ప్రాసము చెల్లినది.
రామాయణము-
సీ. కలకల నగె క్ష్మాజ; (కామినియునుఁ దీవ్ర
తామసంబునఁ బోయె) ధరణిపుత్రిఁ
దినఁ బోవ నగ్రజాజ్ఞనుఁ గోసె సౌమిత్రి
(భవ్యజిష్ణుసుకృతి పౌరుషంబు)
వఱల ముక్కు సెవుల; (వదల దూఱు చడలఁ
జద లది యజ్ఞాత) చరితులైన
రాసుతులు మదించి చేసి రింతని జన
స్థానస్థుఁ డగు ఖరుతో నుడువుచు
గీ. నేడ్చె వలవల, వాఁడు దండెత్తె హత్తి
మొన; క్షితిజతో ననుజు బిల(మునను నుండ
సలిపె ఘనుఁడగు హరి)వంశబలుఁ; డెదిర్చె
సేన; శరవర్షము గురియించి రరు; లట్లు. (౬౯)
భారతము-
ఆ. కామినియునుఁ దీవ్రతామసంబునఁ బోయె
భవ్యజిష్ణుసుకృతిపౌరుషంబు
వదల దూఱు చడలఁ జద; లది యజ్ఞాత
మునను నుండ సలిపె ఘనుఁ డగు హరి. (౬౯)
టీక- జిష్ణు = (రా) జయశీలునియొక్క, (భా) అర్జునునియొక్క; పౌరుషంబు = (రా) కోపము, (భా) పురుషభావము (పుంస్త్వము); దూఱుచు = తిట్టుచు; వదలన్ = (రా) వదలఁగా, (భా) వీడునట్లు; అది = (రా) శూర్పణఖ, (భా) ఆ తిట్టు; హరి = (రా) సూర్యునియొక్క, (భా) ఇంద్రుఁడు; చదలు = ఆకాశము.
రామాయణము (నాగబంధము)-
చం. హరి (మిగులౌ నివాతకవచావగుణుల్ తనరంగఁ జంపెఁ బా
లితకృతిశ్రీ)ల నీతి నల లీలను నున్న నికామబాణుఁ డా
పతి, (తగవారిఁ బాతకుల వాలగు దుష్టుల బాగుగాను నా
యతరమతో)న; ఖ్యాతి నఱి యాఱిరి పెల్లరి బంతిజోదులున్. (౭౦)
భారతము-
కం. మిగులౌ నివాతకవచా
వగుణుల్ తనరంగఁ జంపెఁ బాలితకృతి శ్రీ
తగవారిఁ బాతకుల వా
లగు దుష్టుల బాగుగాను నాయతరమతో. (౭౦)
టీక- నివాతకవచ = (రా) గాలిదూఱని కవచములుగల, (భా) నివాతకవచులను రాక్షసులు; నికామబాణుఁడు = యథేచ్ఛమగు బాణములు గలవాఁడు; హతి = కొట్టుటయందు; అవగుణులు = దుర్గుణులు; కృతి = సమర్థుఁడు; అఱి = నశించి.
రామాయణము-
సీ. బిరుదు దూషణుఁ డరి(భీముఁ డొచ్చె మెలసె
వేగ సౌగంధిక)రాగుఁ డయి, ర
ఘువరుండు నేలకు గోలకుఁ దెచ్చిన
(కారణమున; వెండి కడిమినిఁ జటు)
లోద్దండగతిఁ బోర (నుడిపె ధృతి యుధిష్ఠి
రుఁడు రాముఁడు నహు)లఁ డకటొంకు
లను దౌష్ట్యమున హెచ్చుగను త్రిశిరుని శితే
(షు దివి కనిపె; జిష్ణుఁడు దగ వచ్చె)
గీ. నో నరాకృతి నీగతితో నని దిగు
లందు పదునాల్గు వేవుర నసురుల ఖరు
నణఁచెఁ; బోయి శూర్పణఖ రావణుని కనియెఁ
దనదు బన్నమునకు సీతఁ గొను మటంచు. (౭౧)
భారతము-
ఆ. భీముఁ డొచ్చె మెలసె వేగ సౌగంధిక
కారణమున, వెండి కడిమిని జటు
నుడుపె, ధృతి యుధిష్ఠిరుఁడు రాముఁడును నహు
షు దివి కనిపె, జిష్ణుఁడు దగ వచ్చె. (౭౧)
టీక- సౌగంధిక = సౌగంధికపుష్పము, సౌగంధికరాగుఁడయి = సౌగంధికపుష్పముయొక్క రంగు గలవాఁడై (అనగా ఎఱ్ఱనివాఁడై, రక్తముచే నని ధ్వని.) జటు = (భా) జటుఁడగు రాక్షసుని; యుధిష్ఠురుఁడు = (రా) యుద్ధమునందు స్థిరమగువాఁడు; రాముఁడు = (భా) రమ్యమగువాఁడు; అహుల = (రా) పాములను; జిష్ణుఁడు = (రా) ఇంద్రుఁడు, (భా) అర్జునుఁడు; హెచ్చుగను= హెచ్చయిన; ఒచ్చెము = అవమానము; కడిమి = పరాక్రమము; శితేషు = వాడియగు బాణములు గలవానిని.
రామాయణము-
సీ. దశకంధరుఁడు నాపె దశను గాంచి, (చెలఁగు
రహి వచ్చి యాదరించె; హరిఘోష)
ణముఖసుశకునాల్ వినక లేడియై (యాత్ర
నాచరించెను గరమఘుఁడునగు సు)
రారీశ్వరాజ్ఞచే మారీచుఁడను (యోధ
నుండు భూపతిసూను లుండు కడకు;)
సీత కై పట్టవచ్చిన రాముచే (భంగ
పడి తనవెంపఱి వాఁడు సనియె)
గీ. దివికి హాలక్ష్మణా యంచు భువిసుత విన;
నన్న కేమి భయంబు లేదన నుడుగక
దూఱి పనుపంగ సౌమిత్రి తోయజాక్షు
రామచంద్రుని దిక్కేగె, రావణుండు. (౭౨)
భారతము-
గీ. చెలఁగు రహివచ్చి యాదరించె హరి; ఘోష
యాత్ర నాచరించెను గరమఘుఁడునగు సు
యోధనుండు భూపతిసూను లుండు కడకు,
భంగపడి తన వెంపఱి వాఁడు సనియె. (౭౨)
టీక- హరి = (భా) కృష్ణుఁడు; హరిఘోషణ = (రా) గుఱ్ఱముల సకిలింతలు; ముఖ = మొదలగు; అఱి = తగ్గి.
రామాయణము-
చం. అరుదగుమౌనియై (చెలఁగి హాళిని, లోఁతున సింధురాజు)నై
కౌలుచు, జానకీ(వనిత కృష్ణమృగేక్షణ పర్ణశాల)యం
దురుపరివేదనం (బరఁగ నొంటరి నుండఁగ బల్మి గొంచుఁ) దా
సరగను నాపెతోఁ (జనియె సంతస మందుచు స్వాంతమందు)నన్. (౭౩)
భారతము-
గీ. చెలఁగి హాళిని లోఁతున, సింధురాజు
వనిత కృష్ణ మృగేక్షణ పర్ణశాలఁ
బరగ నొంటరినుండఁగ బల్మిఁ గొంచు
జనియె సంతస మందుచు స్వాంతమందు. (౭౩)
టీక- సింధురాజు = (భా) సైంధవుఁడు; లోఁతుల సింధురాజునై = (రా) లోతున సముద్రమునుఁ బోలినవాఁడై; (భా) కృష్ణ = ద్రౌపది, మృగేక్షణ = లేడివంటి కన్నులుగలది; (రా) కృష్ణమృగేక్షణ = కృష్ణమృగమువంటి కన్నులుగలది; హాళి = ఆనందము; కెరలుచు = అతిశయించుచు.
రామాయణము-
సీ. కవిసి పోరియు జటాయువు (భంగపడె; నేగె
వడిని నా పరమఖలుఁడు) దనుజుఁ డ
వనిజ నుంచె నశోకవనములోపల (క్షోణి
తలనాథజులు రాజకులతిలకు ల)
బలఁ గాన కడరున వచ్చి రాస(రణి నె
మకుచునుఁ దమహితమణి వలఁతి జ)
టాయువుఁ గని రయ్యెడ ఖగరాజ(ము హిత
మునుఁ బొంది మనముల ముదము గనిరి)
గీ. దహనకార్యంబు సేసి రతండు సమయఁ
జదిపి దైత్యుఁ గబంధుని శబరిఁ బ్రోవ
ఋష్యమూకాద్రి కేగి సుగ్రీవు చెలిమి
సల్పు డంచు హితంబు నా శబరి నుడివె. (౭౪)
భారతము-
గీ. భంగపడె నేగె వడిని నా పరమఖలుఁడు;
క్షోణితలనాథజులు రాజకులతిలకు ల
రణి నెమకుచునుఁ దమహితమణి వలఁతి జ
ము హితమునుఁ బొంది మనముల ముదము గనిరి. (౭౪)
టీక- (భా) అరణి = మథించి నిప్పుఁ బుట్టించెడు కొయ్య; నెమకుచు = వెదకుచు; వలతి = నేర్పరి.
రామాయణము-
చం. మనముల నెన్నుచున్ (మిగుల మాన్యచరిత్రులు మేటి మత్స్య)లో
చన నుడిఁ, గోఁతికాఁ(పురము సద్రుచిఁ జేరిరి మోదమంది;) తా
ము నయముగా మదిన్ (మఱువఁబోక హితంబును మాఱురూపు) లం
తనుఁ బడి నంతఁ, జా(ల ధృతిఁ దాల్మి ధరించిరి లగ్గు మించఁ)గన్. (౭౫)
భారతము-
గీ. మిగుల మాన్యచరిత్రులు మేటి మత్స్య
పురము సద్రుచిఁ జేరిరి మోదమంది,
మఱువఁబోక హితంబును మాఱురూపు
ల ధృతిఁ దాల్మి ధరించిరి లగ్గు మించ. (౭౫)
టీక- (రా) కోఁతికాఁపురము = ఋశ్యమూకాద్రి; మాఱురూపు లంతనుఁ బడి వంతన్ = అంతట దుఃఖముచే కళావిహీనులై; లగ్గు = శ్రేయము; మత్స్యలోచన నుడి = శబరి మాటలు; వంత = దుఃఖము.
రామాయణము-
సీ. (క్షోణినాథసుతులు సోమముఖులు విరా)
జిల్లుపంపఁ గనిరి; క్షితిజమగఁడు
క్ష్మాజకొఱకు రాల్చెఁ గన్నీటిచుక్క దా
(టు; నెఱిఁ దద్వనజవదననుఁ గృష్ణ)
వేణి వెదకుచు, హా(విమలపల్లవపద
భ్రమరాక్షి యజ్ఞాత) పాళి నుంటె?
హాసతి నాకిప్పు డయ్యెను దినమొక్క
(వత్సరమ్ము; కొలిచి రుత్సహించి)
గీ. తొల్లి దాసీజనము ని న్నతులితముగ ని
పుడు వనట నొందితె యని రాముఁ డనుచుండె;
బలమునకుఁ బట్టుకొమ్మల వారి వాలి
పంపెఁ దనుఁ జంప నని భయపడె రవిజుఁడు. (౭౬)
భారతము-
ఆ. క్షోణినాథసుతులు సోమముఖులు విరా
టు, నెఱిఁ దద్వనజవదననుఁ గృష్ణ
విమలపల్లవపద భ్రమరాక్షి, యజ్ఞాత
వత్సరమ్ము కొలిచి రుత్సహించి. (౭౬)
టీక- (రా) పంపన్ = పంపాసరోవరమును; కృష్ణవేణిన్ = నల్లనిజడగలదానిని; అజ్ఞాతపాళిన్ = తెలియబడని చోటునందు; (భా) తద్వనజవదనను = అతని భార్యను (సుధేష్ణను); కృష్ణ = ద్రౌపది; దాటు = గుంపు; వనట = దుఃఖము.
రామాయణము-
సీ. వారి మారుతి దెచ్చె బాస సల్పిరి రామ
తరణిజు లొకరి కొకరునుఁ దోడు
నీడలై మన; ధరణీజ గొంపోబడు
చున్ ధర వైచిన సొమ్ము రాఘ
వుఁడు గాంచె; సూర్యసుతుఁడు సెప్పెఁ దన్నుఁ బు
రమునుండి తోలి యగ్రజుఁడు నైంద్రి
(ఘన సింహబలుఁడు పైకొనుటను స్వరమణిఁ
బావని, విని డాక బలిమితో)డ
గీ. రఘువరుఁడు దుందుభికళేబరంబు గోఁట
మీటె సతతాళ్ళడచెఁ; జెట్టు చాటునుండి
(గొనబుగను వాలి వీరుఁడు బనివడి నయ
విరహితుఁ డగు వానినిఁ జదిపెన్) శరమున. (౭౭)
భారతము-
కం. ఘనసింహబలుఁడు పైకొను
టను స్వరమణిఁ, బావని వినిడాక బలిమితో
గొనబుగను వాలి వీరుఁడు
బనివడి నయవిరహితుఁడగు వానినిఁ జదిపెన్. (౭౭)
టీక- ఐంద్రి = (రా) వాలి; సింహబలుఁడు = (రా) సింహమువంటి బలముగలవాఁడు, (భా) కీచకుఁడు; పావని = (రా) పావనమైనదానిని, (భా) భీముఁడు; వాలి = (భా) విజృంభించి; సతతాళ్ళను = ఏడు తాటిచెట్లను; పైకొనుటను = (రా) కవియుట, (భా) యత్నించుట; తరణిజుఁడు = సూర్యుని కుమారుఁడగు సుగ్రీవుఁడు; మనన్ = ఉండునట్లు; డాక = శౌర్యము.
రామాయణము-
సీ. అంగదు యువరాజు నవనీపు సుగ్రీవు
గిష్కింధకుం జేసె క్షితిజమగఁడు
(నుతబలుఁడు సుయోధనుఁడు, దాయ లసమాన
చరిత వెలఁది యుండు క్ష్మాతలంబు)
వెదకింపఁగా గోరి వేచి వర్షర్తు వం
తమగువఱకు మహీధరచరులనుఁ
(గోవిదస్తుతులను గురు భీష్మముఖులను
రయము గూడఁగను నరసి కనుఁగొని)
గీ. రండనుచుఁ బంపెఁ; గొని యుంగరంబు దక్షి
ణమున కంగదాదులతో హనుమ యరిగి మ
హేంద్రగిరి నుండు సంపాతి హితమున నభ
మున కెగిరె గరుడునిఁ బోలి వనధి దాఁట. (౭౮)
భారతము-
ఆ. నుతబలుఁడు సుయోధనుఁడు దాయ లసమాన
చరిత వెలఁది యుండు క్ష్మాతలంబుఁ
గోవిదస్తుతులను గురు భీష్మముఖులను
రయము గూడఁగను నరసి కనుఁగొని. (౭౮)
టీక- సుయోధనుఁడు = (రా) మంచియోధుఁడు, (భా) దుర్యోధనుఁడు; (రా) దాయ = రావణుఁడు;లసమానచరిత = ఒప్పుచున్న చరిత్రగలది (సీత); (భా) దాయలు = పాండవులు; అసమానచరిత = సమానములేని చరిత్రగలది (ద్రౌపది); గురుభీష్మముఖులను = (రా) ఎక్కువ భయంకరములగు ముఖములు గలవారిని, (భా) ద్రోణుఁడు భీష్ముఁడు మొదలగువారిని.
రామాయణము-
సీ. శోధించి మైనాకు, సురస సింహిక మించి,
లంకనుఁ బరిమార్చి లంకజొచ్చి
కన్నీరు మున్నీరుగా నేడ్చు క్ష్మాజనుఁ
గని, దశముఖుని జం కెనలను విని,
రాముక్షేమము దెల్పి, రమణి కొసఁగి యుంగ
రము రత్నమంది, వనము పెకల్చి,
వనపాలకులఁ దోలి, వక్త్రనాసాదులఁ
జదువ రావణుఁ డల్గి జంబుమాలి
గీ. గురు(భుజబలము గల్గెడి యురుఖలు, జడు
పెఱుఁగని వలఁతిం, దులువను, హితు, సుశ)స్త్ర
మ(ర్మజితరిపుఁ, బనుపఁగ మహితగజహ
యరథభటులతోడఁ గదలె నతఁడు వే)గ. (౭౯)
భారతము-
కం. భుజబలము గల్గెడి యురుఖ
లు, జడు పెఱుఁగని వలఁతిం, దులువను, హితు, సుశ
ర్మజితరిపుఁ, బనుపఁగ మహిత
గజహయరథభటులతోడఁ గదలె నతఁడు వే. (౭౯)
టీక- (రా) సుశస్త్ర = మంచి శస్త్రములయొక్క; మర్మ = మర్మమువలన; జిత = గెలువబడిన; రిపున్= శత్రువులుగలవానిని;మున్నీరు = సముద్రము; మహిత = ఎక్కువగు.
రామాయణము-
చం. తమ(బల మొప్ప సైనికులు దక్షులు దానుఁ గడంగఁ బోయి, కొం
చు మమతఁ గో)ల లాకపినిఁ జూచిరి; మర్కటచేష్ట రాలబా
రు మి(వులఁ బట్ట నవ్వి రటు గ్రొవ్వి లలిన్; విడిపించి రంత భీ
మముఖులు వే)ల్పుగొంగలు నమందగతిం దమ తేజి పగ్గముల్. (౮౦)
భారతము-
కం. బలమొప్పు సైనికులు ద
క్షులు దానుఁ గడంకఁ బోయి, కొంచు మమత గో
వులఁ బట్ట నవ్విరటుఁ గ్రొ
వ్వి లలిన్, విడిపించి రంత భీమముఖులు వే. (౮౦)
టీక- (రా) కోలలు = బాణములను; నవ్విరటు = అటుల నగిరి; (భా) అవ్విరటు = ఆ విరాటరాజును భీమముఖులు = (రా) భయంకరములగు ముఖములు గలవారు, (భా) భీముఁడు మొదలగువారు; వేల్పుగొంగలు = రాక్షసులు; తేజి = గుఱ్ఱపు; రాలబారు = రాళ్లసమూహము; ఉరుశిల = గొప్పరాతిని.
రామాయణము-
చం. ఉఱికెఁ గపీంద్రుఁడున్ (హననయుక్తుఁడునై కొనె నా లసద్బ)లుం
డురుశిల వారిఁ దో(లుడు, సుయోధనదుష్టుఁడు లోఁచు చుత్త)రం
బుఱువుగ బంట్లబా(రుఁ గడు నొప్పుచుఁ గూడి పరుం గలంచి) యి
చ్చె; రిపునిఁ జంపి తా (మురిసె శ్రీని మరుద్వరపుత్రుఁ డంత)టన్. (౮౧)
భారతము-
గీ. హననయుక్తుఁడునై కొనె నాల సద్బ
లుఁడు సుయోధనదుష్టుఁడు; లోచు నుత్త
రుఁ గడు నొప్పుచుఁ గూడి పరుం గలంచి
మురిసె శ్రీని మరుద్వరపుత్రుఁ డంత. (౮౧)
టీక- (రా) ఆ, లసద్బలుఁడు = మంచి బలముగలవాఁడు; (భా) ఆలన్ = ఆవులను, సద్బలుఁడు; సుయోధనదుష్టుఁడు = (రా) మంచియోధుఁడగు దుష్టుఁడు, (భా) దుర్యోధనుఁడను దుష్టుఁడు; ఉత్తరున్ = (భా) ఉత్తరుని; (రా) మరుత్ = దేవతల, వర = రాజు (ఇంద్రుని) పుత్రుఁడు (అర్జునుఁడు).
రామాయణము-
సీ. దశకంఠుఁ డల్గె; నా(తతబలాఢ్యుఁ డయిన
తగునేర్పరి యభిమ)తమునఁ బోయి
యమ్ము లక్షుండు నేయ, విటపి హనుమ ధ
(న్యుఁడు గ్రహించెను; ధృతి నుత్తరమును)
వాని కిచ్చె; నసుర(వరసుయోధనకృతి
పాండుసమాఖ్యునిఁ) బావని శర
ముల నొంచి మించె; సల్లలితధైర్యము దితి
(కొమరు లొందిరి; తమతమ బలముల)
గీ. కొలఁదిఁ బోర, వాయుజుఁడు వారలను నొంచి
నేలఁ గలిపె నక్షకుమారుని; దనుజపతి
యంప హనుమంతుఁ బట్టెద నంచు నింద్ర
జిత్తు కత్తి నూఱుచు నేగె సేనతోడ. (౮౨)
భారతము-
ఆ. తతబలాఢ్యుఁ డయిన తగునేర్పరి యభిమ
న్యుఁడు గ్రహించెను ధృతి నుత్తర; మును
వరసుయోధనకృతి పాండుసమాఖ్యుని
కొమరు లొందిరి తమతమ బలముల. (౮౨)
టీక- ధృతి = (రా) ధైర్యముతో, (భా) ప్రీతితో; ఉత్తరమును = (రా) జవాబు; (భా) ఉత్తర = ఉత్తర యను విరాటరాజ పుత్రికను, మును = ముందుగా; అసురవరసుయోధనకృతి = రాక్షసులలో మంచి యోధుఁడగు దిట్ట (అక్షకుమారుఁడు); పాండుసమాఖ్యుని = (రా) తెల్లనికీర్తి గలవానిని, (భా) పాండుడను పేరుగల రాజుయొక్క; బలముల = (రా) శక్తుల, (భా) సైన్యముల; విటపి = చెట్టు.
రామాయణము-
సీ. ఘోరుఁ డాతం డిట్లు (తోరపుధృతి నేగి
దుర్యోధనసుజిష్ణు) ధూర్తరిపు మ
రుత్సుతు డాసె; దీరుల నేయుటకు దైత్యు
(లు వెస గైకొనిరి; హరి విజయుఁడు సు)
కృతి కలగుండు వారిఁ బఱచెఁ; బఱచె సే
నలు; మరల్చెను మేఘనాదుఁ డుగ్ర
యోధనుండు మొనల; నొప్పుచుఁ దా బద్మ
జాస్త్రమ్ము వైచెను హనుమమీఁద
గీ. బావని యజమంత్రప్రభావమున నిలిచె;
నతని బంధించె డనుజాధిపాగ్రనంద
నుండు రోషారుణిత(నయనుఁడు; సనియెను
గన గురువిభునిఁ) బంక్తికంఠుని హనుమఁడు. (౮౩)
భారతము-
ఆ. తోరపు ధృతి నేగి దుర్యోధన సుజిష్ణు
లు వెసఁ గైకొనిరి హరి విజయుఁడు సు
యోధనుండు మొనలఁ; నొప్పుచుఁ దాఁ బద్మ
నయనుఁడు సనియెను గనఁ గురువిభుని. (౮౩)
టీక- దుర్యోధనసుజిష్ణు = (రా) యోధుల కలవికాని వారిని జయించువానిని, (భా) దుర్యోధనార్జునులు; హరి = (రా) కోతి. (భా) కృష్ణుని; విజయుఁడు = (రా) జయశీలుఁడు, (భా) అర్జునుఁడు; పద్మనయనుఁడు = (భా) కృష్ణుఁడు; గురువిభుని = (రా) గొప్పప్రభుని, కురువిభుని = (భా) ధృతరాష్ట్రుని; ధృతి = (రా) ధైర్యము, (భా) ప్రీతి; తోరపు = అందమగు; తీరుల = బాణములను; పఱచె = పరువెత్తెను; అజ = బ్రహ్మ.
రామాయణము-
శా. (ఆవీరుండు సభన్ ధృతి)స్ఫురణు దైత్యాలిప్రభుం గాంచె; నా
పై (వావిం గని చెప్పె నెట్టిపనికై వచ్చెన్) దనుం దెల్పె నా
(హా విఖ్యాతుఁడ వంచు ను)ర్విజను నీవర్పింపవే యంచునుం
దా(వేవేగను మీఱి పల్కె విరివౌ తాల్మిన్) గడున్ గూడుచున్. (౮౪)
భారతము-
కం. ఆవీరుండు సభన్ ధృతి
వావిం గని చెప్పె నెట్టిపనికై వచ్చెన్
హా విఖ్యాతుఁడ వంచును
వేవేగను మీఱి పల్కె విరివౌ తాల్మిన్. (౮౪)
టీక- స్ఫురణు = ప్రకాశించువాఁడు.
రామాయణము-
ఆ. (మీఱి పలికె వెండి మిగులశూరుఁడగు సు
యోధనవిభుఁ జూచి యుదుటుతో)డఁ
(బోరు వినవొ నష్టము మఱి యారయఁగనుఁ
బొందు లాభ మంచుఁ బుడమిలో)న. (౮౫)
భారతము-
కం. మీఱి పలికె వెండి మిగుల
శూరుఁడగు సుయోధనవిభుఁ జూచి యుదుటుతోఁ
బోరు వినవొ నష్టము మఱి
యారయఁగనుఁ బొందు లాభ మంచుఁ బుడమిలో. (౮౫)
టీక- సుయోధనవిభు = (రా) మంచియోధులకు ప్రభున్ (రావణుని), (భా) దుర్యోధనుని.
రామాయణము-
సీ. నిక్కంబు నామాట (నక్క యెక్కడ మఱి
నాక మెక్కడ, వారి)జాక్షుఁ డవని
జావరుండు; బలుండు; కావలవదు వాని
(పాలు; నెమ్మి నొసఁగు పాడి దలఁచి
యటులఁ గానియెడలఁ బటిమఁ దోషియయి దూ)
బ నినుగూల్చును రామభద్రుఁ; డతని
యనుజుఁ డట్టిడ; వార లరులను మించు శూ
(రు; లయిన నిడు, నీవు పొలియఁ బోవు)
గీ. వనధి నిన్ను ముంచిన వాలి దునిమె రామ
విభుఁడు; నిన్ను వంచిన కార్తవీర్యుని మడి
పిన పరశురాముఁ గెల్చె; నీవనఁగ నెంత?
లీల గుడి మ్రింగువానికి లింగమెంత? (౮౬)
భారతము-
ఆ. నక్క యెక్కడ మఱి నాక మెక్కడ వారి
పాలు నెమ్మి నొసఁగు పాడి దలఁచి,
యటులఁ గానియెడలఁ బటిమ, దోషి! యయి దూ
రులయిన నిదు నీవు పొలియబోవు. (౮౬)
టీక- (రా) తోషియయి = సంతోషముతో గూడినవాడయి, (భా) దోషి = దోషమయుఁడా;అయిదూరులు = (భా) అయిదు గ్రామములను; నాకము = స్వర్గము; దూబ = అధముఁడవగు.
రామాయణము-
చం. అన(విని యుత్తరం బొసఁగె నా చెన టిట్లని,వెఱ్ఱి, యేనుఁ జే
సిన పనిచే)సితిన్, విడువ సీతను సున్నము వానిఁ జేతు వీ
కను, (వనటొంది వాడియునుఁ గానను హీనతఁ జిక్కియున్ రణం
బొనరుచుటా?) భలే! యుడుత యూపుల కెందును మ్రాఁకు లూఁగునే. (౮౭)
భారతము-
కం. విని యుత్తరం బొసఁగె నా
చెన టిట్లని, వెఱ్ఱి, యేనుఁ జేసినపనిచే
వనటొంది వాడియునుఁ గా
నను హీనతఁ జిక్కియున్ రణం బొనరుచుటా. (౮౭)
టీక- చెనటి = (రా) రావణుఁడు, (భా) దుర్యోధనుఁడు.
రామాయణము-
గీ. (అలుకగనె భీముఁ దనియెదు, తెలియు మెదను
భయపడను దదీయములగు పల్కులకునుఁ
బేదకినుక యీయిలలోనఁ బెదవులకును
రహినిఁ జెఱుపె హరీ) నొంతు రాము గీము. (౮౮)
భారతము-
కం. అలుకగనె భీముఁ దనియెదు,
తెలియు మెదను భయపడను దదీయములగు ప
ల్కులకునుఁ, బేదకినుక యీ
యిలలోనఁ బెదవులకును రహినిఁ జెఱుపె హరీ (౮౮)
టీక- భీముఁడు = (రా) భయంకరుఁడు; హరీ = (రా) కపీ, (భా) కృష్ణుఁడా.
రామాయణము-
చం. అన(విని పల్కె నాహరియు హ్రాదిని సద్దులఁ గట్టెవంకఁ దీ
ర్చును పొయి, యో)ర్చుకొ మ్మసుర, క్షోణిని వంగుట చిల్లపెంకు నో
పునె (జనదూర, పుల్లలనె పోవును బుట్టిననాటి బుద్ధి భూ
మి, నొసఁగవా) మహీసుతను, మేలు దలంపకు కీడు నెన్నకే. (౮౯)
భారతము-
కం. విని పల్కె నాహరియు హ్రా
దిని సద్దులఁ గట్టెవంకఁ దీర్చును పొయి, యో
జనదూర, పుల్లలనె పో
వును బుట్టిననాటి బుద్ధి భూమి, నొసఁగవా? (౮౯)
టీక- హరి = (రా) కోఁతి (హనుమంతుఁడు), (భా) కృష్ణుఁడు.
రామాయణము-
చం. అనియును వెండి నా(ప్రభుని నారసి యీగతి పెల్కెఁ, బాక)మే
ఘనరుచి నుండినన్ (గుణము గ్రాహ్యమె తెడ్డునకుం? గడంక)మైఁ
గనలకు పెల్లుగా (నడవిఁ గాచిన వెన్నెల యయ్యె నాదు) క్షే
మ నయ యుతంబులౌ (నుడులు, మంజులయుక్తమునుం దలంపు)మా. (౯౦)
భారతము-
గీ. ప్రభుని నారసి యీగతి పెల్కెఁ, బాక
గుణము గ్రాహ్యమె తెడ్డునకుం? గడంక
నడవిఁ గాచిన వెన్నెల యయ్యె నాదు
నుడులు, మంజులయుక్తమునుం దలంపు. (౯౦)
టీక- ప్రభుని = (రా) రావణుని, (భా) ధృతరాష్ట్రుని.
రామాయణము-
గీ. (కటకట జనించెఁ జెడుతఱి విటపికిఁ గడు
కుక్కమూతిపిందె లనఁగఁ గూకటులును
మూల లెనసి యక్కట వంశము సమయుటకు
ను ఖలమతి వొడమెన్) నాదు నుడుల వినుము. (౯౧)
భారతము-
కం. కటకట జనించెఁ జెడుతఱి
విటపికిఁ గడు కుక్కమూతిపిందె లనఁగఁ గూ
కటులును మూల లెనసి య
క్కట వంశము సమయుటకును ఖలమతి వొడమెన్. (౯౧)
టీక- ఖలమతి = (రా) దుష్టమగు బుద్ధి, (భా) దుష్టబుద్ధి యగు దుర్యోధనుఁడు.
రామాయణము-
ఆ. (నేత, విడుము కుమతిని, విను సీతాజన
నంబు లంక చేటునకె సుమీ) సు
(నీతి వదల కిమ్ము నియతిచేతఁ, దగదు
నీకు మారు చెడుపని ధరలో)న. (౯౨)
భారతము-
కం. నేత, విడుము కుమతిని, విను
సీతాజననంబు లంక చేటునకె సుమీ
నీతి వదల కిమ్ము నియతి
చేతఁ, దగదు నీకుమారు చెడుపని ధరలో. (౯౨)
టీక- కుమతి = (రా) దుష్టబుద్ధి, (భా) దుష్టబుద్ధియగు దుర్యోధనుని; నీకుమారు చెడుపని- (రా) నీకు, మారు = మన్మథుని,చెడుపని, (భా) నీ, కుమారుని = పుత్రుని, చెడుపని; సీతాజననంబు లంక చేటునకే = (భా) సామెత. అనఁగా దుర్యోధనుని జన్మము నీవంశనాశనమునకే యని ధ్వని; నేత = ప్రభూ.
రామాయణము-
సీ. (అన సుయోధనఖలుఁ డలుకఁ దాడితభోగి
వలెను బుస్సని, వెస బంట్ల నంపి)
నిలు వంటయింటికుందెలు వయి తని, తోక
కగ్ని నంటింపించి, యనిపెఁ ద్రిప్ప;
స్వసఖజు వహ్ని గాల్పకయుండె, లంకఁ బా
వని గాల్చె, మంటార్పుకొనె, దనుజులు
(పట్టఁబోవఁగ హరి వారి వారించి, గ
ర్జనముచేఁ దనరి, విరాడ్గతిఁ జనె)
గీ. నంగదాదుల వద్దకు నబ్ధిదాటి,
వారిఁ గలిసి యరిగిఁ రామభద్రు కడకు
గంటి సీత మన్మాత లంక నని పలికి
పూస గ్రుచ్చినగతి సర్వము న్నుడివెను. (౯౩)
భారతము-
ఆ. అన సుయోధనఖలుఁ డలుకఁ దాడితభోగి
వలెను బుస్సని, వెస బంట్ల నంపి
పట్టఁబోవఁగ హరి వారి వారించి, గ
ర్జనముచేఁ దనరి విరాడ్గతిఁ, జనె. (౯౩)
టీక- సుయోధనఖలుఁడు = (రా) రావణుఁడు, (భా) దుర్యోధనుఁడు; హరి = (రా) హనుమంతుఁడు, (భా) కృష్ణుఁడు; విరాడ్గతి = (రా) పక్షివలెను, (భా) విరాడ్రూపముచే, తాడిత = కొట్టబడిన; భోగి = పాము.
రామాయణము-
సీ. దుఃఖకృత పదహతులఁ బూచి నీపైనిఁ
బడుపూలె తెల్పు శుభము, తలపువు
వాడకుండు మనుచుఁ బలికితి ననె, రాఘ
వుఁడు కీశసేనతోఁ గడలి డాసె,
నచట లంకను రాముఁ డని దిరుడనె విభీ
షణుఁడు, వెండియును రావణు సకుంభ
(కర్ణుఁ గాంచెను, దినకాంతసంతతి సుకృ
తి భవమూలమును యుధిష్ఠురు ధృతిఁ)
గీ. (జేరు పోవడవకు క్షితిఁ జెలువుగ శుభ
మగు నని పలుక వినడయ్యె నతఁడు,) వినక
తిన్నయింటివాసంబుల నెన్నెదో ప
యోముఖవిషకుంభమ యని యుఱికి తన్నె. (౯౪)
భారతము-
ఆ. కర్ణుఁ గాంచెను, దినకాంతసంతతి సుకృ
తి భవమూలమును యుధిష్ఠురు ధృతిఁ
జేరు పోవడవకు క్షితిఁ జెలువుగ శుభ
మగు నని పలుక వినడయ్యె నతఁడు.
టీక- దుఃఖకృత...పూలె = (రా) అశోకవృక్ష మేకాల మందైనను స్త్రీల కాలితాఁపుచేఁ బుష్పించునని కవిసమయము; (రా) దినకాంత = సూర్యుని, సంతతి = వంశములోని, సుకృతి = మంచిపనుల జేసినవాని (రాముని); భవమూలమును = జన్మమర్మము (అనగా విష్ణుఁడు రాముఁ డయి రావణుని కొఱకే యవతరించె ననుట); (భా) దినకాంత = సూర్యును; సంతతి = కుమారుఁడగు (కర్ణుఁడు) సుకృతి; భవమూలము = జన్మమర్మము (కర్ణుఁడు కుంతీసుతుఁ డనుట); యుధిష్ఠిరు = రాముని (రాముఁడు యుద్ధమందు స్థిరుఁడని చెప్పెను గనుక యుధిష్ఠిర శబ్దము రామునకే యన్వయము); కీశ = కపులు, కడలి = సముద్రము.
రామాయణము-
సీ. వచ్చి రాముశరణుఁ జొచ్చె విభీషణుం;
డతని దాశరథి లంకాధిపతిగ
సలుపుదు ననె; వార్ధి యలరి మిన్నందె ఖ
లుఁడు సచ్చునని; రాఘవుఁ డుదధి తన
కడ్డుపడెనని; సాయక మేయఁ బూనఁ, గ
న్పడి సముద్రుఁడు సెప్ప నలునివలన
సింధుఁ గట్టెను; లంకఁ జేరె నంగదు సంధి
కై యంప నాఱుమూడయ్యె నదియు;
గీ. (నెఱి నటుల సంధి చెడుటయు హరి యరిగె ని
యోక్తుపాలి కంతట సునయోత్కరములు
తననుడులు, జవాబరిపట్టఁ దను మొదలిడు
ట యఖిలము పలికెన్) బెల్లు నయముగ విని. (౯౫)
భారతము-
కం. నెఱి నటుల సంధి చెడుటయు
హరి యరిగె నియోక్తుపాలి కంతట సునయో
త్కరములు తననుడులు, జవా
బరిపట్టఁ దను మొదలిడుట యఖిలము పలికెన్. (౯౫)
టీక- హరి = (రా) హనుమంతుఁడు, (భా) కృష్ణుఁడు; నియోక్తుపాలికి = (రా) రామునికడకు, (భా) ధర్మరాజుకడకు; అరి = శత్రువు; తనున్ = తన్ను, పట్ట మొదలిడుట, సాయకము = బాణము.
రామాయణము-
సీ. లీల ‘వినాశకాలే విపరీతబు
ద్ధి’ యనుచు దాశరథియును నీలు
(వరబలయుతు నాహవధృతు ధృష్టద్యుమ్ను
వీరుని నిజసైన్యవిభుని జేసె,)
కొంకక వానరు ల్లంక కెగఁబడ న
సురధవాజ్జనుఁ బ్రహస్తుండు మెండు
(దండియగు యుధిష్ఠిరుండు భీష్ముండు దా
నురవడి నడపించె గురుబలంబు)
గీ. దనుజసేన; నదియు వాలితనయు గవయ
శరభకేసరిసుగ్రీవజాంబవన్న
లగజమైందసుషేణనీలద్వివిదశ
తబలివాయుజముఖ్యులఁ దారసిల్లె. (౯౬)
భారతము-
ఆ. వరబలయుతు నాహవధృతు ధృష్టద్యుమ్ను
వీరుని నిజసైన్యవిభుని జేసె
దండియగు యుధిష్ఠిరుండు భీష్ముండు దా
నురవడి నడపించె గురుబలంబు. (౯౬)
టీక- (రా) ధృష్ట = దట్టమైన, ద్యుమ్నుని = సత్త్వముగలవానిని; యుధిష్ఠిరుండు = యుద్ధమందు స్థిరమగువాఁడు; భీష్ముఁడు = ఘోరమగువాఁడు; గురుబలంబు = గొప్పసేన; (భా) కురుబలంబు = కౌరవసేన; ఆహవకృతి = యుద్ధమునందు నేర్పరి;ఉరవడి = శౌర్యముతో.
రామాయణము-
ఉ. చూపరి రాము దద్(రిపులఁ జూచెను జిష్ణుఁడు శ్రీని; బంధు)ర
శ్రీపతి దుష్టులౌ (జనులఁ జివ్వను నెంతయుఁ జంపమాన)డ
చా పరముం గనెన్ (హరియు; నాదటఁ బల్కెను హాళి గీత)ముల్
ద్రోవడి క్రోఁతులున్; (నరవరుండునుఁ బూనె రణంబుఁ జేయఁ)గన్. (౯౭)
భారతము-
గీ. రిపులఁ జూచెను జిష్ణుఁడు శ్రీని; బంధు
జనులఁ జివ్వను నెంతయుఁ జంపమాన,
హరియు; నాదటఁ బల్కెను హాళి గీత
నరవరుండునుఁ బూనె రణంబుఁ జేయ. (౯౭)
టీక- జిష్ణుఁడు = (రా) దేవేంద్రుఁడు, (భా) అర్జునుఁడు; హరి = (రా) దేవేంద్రుఁడు, (భా) కృష్ణుఁడు; గీతముల్ = (రా) పాటలను (యుద్ధమునకు ముందుత్సాహముచేత); గీత = (భా) భగవద్గీత; నరవరుండు = (రా) రాముఁడు, (భా) అర్జునుఁడు; చూపరి = అందగాఁడు; చివ్వ = యుద్ధము; ఆదట = ప్రేమ; త్రోవడి = ఒకరిచే నొకరు త్రోయబడుచు.
రామాయణము-
సీ. రవిజుండు కపులతోఁ జెవియొగ్గి వినుఁడు నా
ది శిలాక్షరము విరోధీబలమునకు
వెన్నుఁజూపకుడు చూపిన యమాలయమున
కతిథు లయ్యెద రనె; ననఁగ వారు
కాసువీసముగారు క్రవ్యాదులు, చిదిమి
పెట్టమె చిచ్చఱ పిడుగులమయి
రాయి గ్రుద్దెదము వారలతలలనుఁ దన్నె
దమని గంతులిడి రుత్సాహమునను;
గీ. (ఘనగతిని దక్షిణోత్తరవనధు లలుక
గొనుచుఁ బెనగుభాతినిఁ గడుగొబ్బున నిరు
మొనలు గవిసి చేసెను యుద్ధమునుఁ బదహతు
ల క్షితియును వడఁకన్,) బో రలఘువు నయ్యె. (౯౮)
భారతము-
కం. ఘనగతిని దక్షిణోత్తర
వనధు లలుక గొనుచుఁ బెనగుభాతినిఁ గడుగొ
బ్బున నిరుమొనలు గవిసి చే
సెను యుద్ధమునుఁ బదహతుల క్షితియును వడఁకన్. (౯౮)
టీక- ఉత్సాహమునను = వీరరసముతో; క్రవ్యాదులు = రాక్షసులు; గొబ్బున = త్వరగా; మొనలు = సైన్యములు.
రామాయణము-
గీ. (ధర బయలు నిండు టంకృతులరొద నడఁగు
హుంకృతుల్, చలంబు నెనయు యోధరథహ
యగజచయముఁ గప్పురజంబు, నతినిశితవిశి
ఖములతతి, చెలఁగెన్) భయంకరముగఁ గన. (౯౯)
భారతము-
కం. ధర బయలు నిండు టంకృతు
లరొద నడఁగు హుంకృతుల్, చలంబు నెనయు యో
ధరథహయగజచయముఁ గ
ప్పురజంబు, నతినిశితవిశిఖములతతి చెలఁగెన్. (౯౯)
టీక- భయంకరముగన్ = భయానకరసముగాన్; బయలు = ఆకాసము; చలము = పట్టుదల; ఎనయు = కూడు; చయము = గుంపు; రజము = దుమ్ము; విశిఖములతతి = బాణసమూహము.
రామాయణము-
గీ. (చెడెఁ గరులు, గూలెఁ దేరులు, పడిరి భటులు,
సమసె భూరివాజులు, పెలుచన్ వడిఁ జనె
రక్తనదులునుం గడు భాసురగతి శిరము
లెగసె నభమునకున్,) జుగుప్సగనని మనె. (౧౦౦)
భారతము-
కం. చెడెఁ గరులు, గూలెఁ దేరులు,
పడిరి భటులు, సమసె భూరివాజులు, పెలుచన్
వడిఁ జనె రక్తనదులునుం,
గడు భాసురగతి శిరము లెగసె నభమునకున్. (౧౦౦)
టీక- జుగుప్సగన్ = భీభత్సరసముతోన్; వాజులు = గుఱ్ఱములు.
రామాయణము-
గీ. (దురపుభువి, రక్తమె జలము, కరము శవము
లె లహరిఁ జను కట్టెలు, మెదడే) తెలియగు
(నురు, గెముకలె చేఁపలు, పొలె బురద, కచమె
నాచుగఁ, బొలుపుం గనె నదినాన్) మఱియును. (౧౦౧)
భారతము-
కం. దురపుభువి, రక్తమె జలము,
కరము శవములె లహరిఁ జను కట్టెలు, మెదడే
నురు, గెముకలె చేఁపలు, పొలె
బురద, కచమె నాచుగఁ, బొలుపుం గనె నదినాన్.
టీక- (రెంటికి) లహరిన్ = ప్రవాహామందు; పొల = మాంసము; కచము = వెండ్రుకలు; దురపుభువి = యుద్ధభూమి.
రామాయణము-
గీ. (అని విజయరక్షకై హరుల నడపి పురు
షోత్తముఁడు చెలంగెఁ బెనఁగి రొప్పి నరవ
రుఁడు రణకృతిపావని దస్రరుహులు మిగులు
ద్రుపదముఖ్యులునున్) లక్ష్మణపృథుబలుఁడు. (౧౦౨)
భారతము-
కం. అని విజయరక్షకై హరు
ల నడపి పురుషోత్తముఁడు చెలంగెఁ బెనఁగి రొ
ప్పి నరవరుఁడు రణకృతిపా
వని దస్రరుహులు మిగులు ద్రుపదముఖ్యులునున్. (౧౦౨)
టీక- అనిన్ = యుద్ధమందు; విజయరక్షకై = (రా) జయమును సాధించు నిమిత్తమై, (భా) అర్జునుని రక్షణకొఱకు; హరుల = (రా) కపులను, (భా) గుఱ్ఱములను; పురుషోత్తముఁడు = (రా) రాముఁడు, (భా) కృష్ణుఁడు; రణకృతి = (రెంటికి) రణమందు నేర్పరియగు; పావని = (రా) హనుమంతుఁడు, (భా) భీముఁడు; దస్రరుహులు = అశ్వినుల కుమారులు (రా) మైందద్వివిదులు, (భా) నకులసహదేవులు; మిగులు = (రా) శేషించిన, (భా) హెచ్చయిన; ద్రుపదముఖ్యులు- (రా) ద్రు = వృక్షమును, పద = స్థానముగాఁ గలిగినవారిలో (కపులలో) ముఖ్యులు = శ్రేష్ఠులు, (భా) ద్రుపదుడు మొదలగువారు.
రామాయణము-
చం. బిరుదగు నింద్రజిద్(బలుఁడు భీష్ముఁడు వైరుల వాసిరీతి)గా
మురువగునట్టి నా(గశరముల్ నిగుడించుచు గాసిపెట్టి) సం
గరమున వేడ్కతో (మురియఁగా, హరిచక్రము పూనె, జిష్ణు)జి
ద్వరకృతి దోల నా(కతనఁ దా మరలెన్ వృథగాగ పూన్కి)యున్. (౧౦౩)
భారతము-
గీ. బలుఁడు భీష్ముఁడు వైరుల వాసిరీతి
గశరముల్ నిగుడించుచు గాసిపెట్టి
మురియఁగా హరిచక్రము పూనె, జిష్ణు
కతనఁ దా మరలెన్ వృథగాగ పూన్కి. (౧౦౪)
టీక- భీష్ముఁడు = (రా) ఘోరుఁడు; నాగశరముల్ = పాము బాణములను; హరిచక్రము = క్రోతులగుంపు; జిష్ణుజిత్ = ఇంద్రజిత్తు; (భా) హరి = కృష్ణుఁడు; చక్రము = సుదర్శనచక్రమును; మురువు = అందము; గాసి = బాధ; కతన = కారణమున.
రామాయణము-
సీ. తనయున్కి గననీక తమములఁ గప్పి రా
క్షసుఁ డట్లు మించ, నగ్రజుని శత్రు
(భీష్ముకడకు నేగెఁ బ్రీతి యుధిష్ఠురుం)
డగు లక్ష్మణుఁ, డతని కాజితరిపుఁ
(డధికభక్తి నెఱఁగె, నడిగె దాను) విరోధి
పురమును బ్రహ్మాస్త్రము వలనను ద
హింప నాజ్ఞ నిడ, వాఁ డెందు నున్ననుఁ జెల్లు
నటులైన ననె, రాముఁ డంటివి కడు
తే. సరిగ (జయము నొందుగతి, నిజమ, రణపు వె
రవు) సునీతి బాహ్య మొక యరాతికొఱకుఁ
గూల్ప సర్వస్వ, మిత్తెఱఁగు వల దెందు
ననుచు (న్యాయబుద్ధిఁ బలుక నతఁడు సనియె.) (౧౦౪)
భారతము-
ఆ. భీష్ముకడకు నేగెఁ బ్రీతి యుధిష్ఠురుం
డధికభక్తి నెఱఁగె, నడిగె దాను
జయము నొందుగతి, నిజమ, రణపు వెరవు
న్యాయబుద్ధిఁ బలుక నతఁడు సనియె. (౧౦౪)
టీక- యుధిష్థిరుండు = (రా) యుద్ధమున స్థిరమగువాఁడు; ఎఱఁగె = నమస్కరించె; (రా) నిజమ; రణపువెరవు = యుద్ధమార్గము; (భా) నిజ = తనయొక్క; మరణపువెరపు = చావునకు దారి; తమము = చీకటి.
రామాయణము-
చం. నవ(రమ దోప వైరిజననాశముఁ జేయుచు శత్రు భీష్ము స
ద్బ్రవరు శిఖం)డిరౌతు సరి రాముని లక్షణుఁ గీశులన్ ఘనం
బు వ(డి మఱుంగుగా మహిని మోదముతోఁ బడ నేసి యేగెఁ దా
ను విజయుఁడున్) జితేంద్రుఁడును నొంచె ఖగేంద్రుఁడు పాపతూపులన్. (౧౦౫)
భారతము-
కం. రమ దోప వైరిజననా
శముఁ జేయుచు శత్రు భీష్ము సద్బ్రవరు శిఖం
డి మఱుంగుగా మహిని మో
దముతోఁ బడ నేసి యేగెఁ దాను విజయుఁడున్. (౧౦౫)
టీక- (రా) శత్రుభీష్మ = శత్రువులకు భయంకరుని, (భా) శత్రున్ = విరోధియగు; భీష్ముని; (రా) శిఖండి = నెమలి, రౌతు = వాహనముగాఁ గలవానికి (కుమారస్వామికి); సరి = (రా) జయశీలుఁడు; జితేంద్రుఁడు = గెలువబడిన యింద్రుఁడు గలవాఁడు (ఇంద్రజిత్తు); పాపతూపులన్ = నాగబాణములను.
రామాయణము-
సీ. అని యయ్యె వెండిఁ, బావనియు ధూమ్రాక్షు న
కంపనుఁ జంపె, నంగదుఁ డడఁచె మ
హాకాయుఁ, గెడపె బ్రహస్తు నీలుం, డంత
వినఁబోక మండోదరినుడు లక్షు
(గురుఁడు ప్రతినఁ బట్టెఁ బరఁగు యుధిష్ఠిరు)
శ్రీరాఘవునిఁ జంపి సీతఁ జెట్టఁ
(బట్టఁ, గుట్ట కొకఁడు చెట్టున కొకఁ డైరి
పరులు నారయ నడుప గురుసేన)
గీ. దనుజబలము నాతఁడు, మించె హనుమ నీలు,
శక్తి లక్ష్మణు నొంప దాశరథ దోలె,
నిద్ర లేపఁగ బల్మియు నీతుల ఘట
(కర్ణుఁడు వెడలె ధృతిగనుఁ గలనికి) వెస. (౧౦౬)
భారతము-
ఆ. గురుఁడు ప్రతినఁ బట్టెఁ బరఁగు యుధిష్ఠిరుఁ
బట్టఁ, గుట్ట కొకఁడు చెట్టున కొకఁ డైరి
పరులు నారయ నడుప గురుసేన
కర్ణుఁడు వెడలె ధృతిగనుఁ గలనికి.
టీక- అక్షుగురుఁడు = (రా) అక్షకుమారుని తండ్రి (రావణుఁడు), (భా) గురుఁడు = ద్రోణుఁడు; యుధిష్ఠిరు = (రా) యుద్ధమందు స్థిరమగువానిని, గురుసేన = (రా) గొప్పసేన, కురుసేన = (భా) కౌరవసేన; పరులు = విరోధులు; ఘటకర్ణుఁడు = కుంభకర్ణుఁడు;కలనికి = యుద్ధమునకు.
రామాయణము-
సీ. హరులఁ జెవుల పట్టి యాడించె రవిజుచే
ముక్కు గోల్పడె; వచ్చి పోరెఁ బోలి
నిండుచెర్వుఁ గలంచు (దండిగజము, గూడి
కొండగతి భగద)క్షుండు మేటి
ఘోరశరీరుండు కుంభకర్ణుండు మ
(త్తుఁడు నరవరుచేతఁ బడె; బలుఁ డభి)
మానియు వీరుండు (మన్యుఁడు రిపులోక
మహితపద్మవ్యూహ)మదకరియయి
గీ. తనరు దేవాంతకుని నరాంతకుని హనుమ
యును ఋషభుఁడు మహాపార్శ్వుని నడచి రతి
కాయుఁడు గురుయుద్ధ(ముననఁ గాల మొనరి
చెను బెనఁగుచు) లక్ష్మణుచేత; దనుజవిభుఁడు. (౧౦౭)
భారతము-
ఆ. దండిగజముఁ గూడి కొండగతి భగద
త్తుఁడు నరవరుచేతఁ బడె, బలుఁ డభి
మన్యుఁడు రిపులోక మహిత పద్మవ్యూహ
ముననుఁ గాల మొనరిచెను బెనఁగుచు. (౧౦౭)
టీక- హరుల = (రా) కపులను; (రా) భగ = శక్తియందు; దక్షుండు = ప్రవీణుఁడు; నరవరుచేత = (రా) రామునిచేత, (భా) అర్జునునిచేత; మన్యుఁడు = (రా) కోపి
రామాయణము-
గీ. (తనయుమరణంబునకు లలిగనుఁ బొగిలెఁ ద
నుఁ గడుఁ దేర్పగా స్వజనులునున్), ధృతిజిత
(ఘనబలితజిష్ణుఁ డెవ్వఁడు వనటనుఁ గలి
గించె వానిపై నెద నలిగెన్) మఱియును. (౧౦౮)
భారతము-
కం. తనయుమరణంబునకు లలి
గనుఁ బొగిలెఁ దను గడుఁ దేర్పగా స్వజనులునున్
ఘనబలితజిష్ణుఁ డెవ్వఁడు
వనటనుఁ గలిగించె వానిపై నెద నలిగెన్. (౧౦౮)
టీక- జితఘనబలితజిష్ణుఁడు = (రా) గెలువబడిన గొప్పబలముగల దేవేంద్రుఁడు గలవాఁడు (ఇంద్రజిత్తు), (భా) జిష్ణుఁడు = అర్జునుఁడు; లలి = ఎక్కువ.
రామాయణము-
ఉ. ఆరసి తండ్రినిన్ (శపథ మాపృథువీరుఁడు సల్పె సింధు)గం
భీరుని భూమిజా(విభుని భీమబలాఢ్యుని బిద్దఁజేయఁ) దా
ఘోరుఁడు భాజిత(ద్యుమణి గ్రుంకక యుగ్రతనొప్ప, దూఱ)రే
వైరినిఁ దా శర(స్ఫురితవహ్నిని జంపనిచో నటంచు)నున్. (౧౦౯)
భారతము-
గీ. శపథ మాపృథువీరుఁడు సల్పె సింధు
విభుని భీమబలాఢ్యుని బిద్దఁజేయ
ద్యుమణి గ్రుంకక యుగ్రతనొప్ప, దూఱ
స్ఫురితవహ్నిని జంపనిచో నటంచు. (౧౦౯)
టీక- (రా) సింధు = సముద్రపు; భూమిజావిభుని = సీతమగనిన్; బిద్దఁజేయన్ = చంపుటకు; భా = కాంతివలన; జిత = గెలువబడిన; ద్యుమణి = సూర్యుఁడుగలవాఁడు; క్రుంకక = చావక; దూఱరే = తిట్టరా; (భా) సింధువిభుని = సైంధవుని; దూఱన్ = చొచ్చుటకు; పృథు = గొప్ప.
రామాయణము-
గీ. (కరము మిగిలి కారములను మిరియములను
నూఱె హితులు మెచ్చ గరిమనున్) బెనఁగఁగ
(హరులు దగఁ బూనఁ దోలె నరిరమణ దన
చేవ మెఱయ ఱేకును మడఁచెన్) మిగులను. (౧౧౦)
భారతము-
కం. కరము మిగిలి కారములను
మిరియములను నూఱె హితులు మెచ్చ గరిమనున్
హరులు దగఁ బూనఁ దోలె న
రిరమణ దన చేవ మెఱయ ఱేకును మడఁచెన్. (౧౧౦)
టీక- హరులు = (రా) కపులు, (భా) గుఱ్ఱములు; తగన్ = (రా) తగినట్లు, దగ = (భా) దప్పిని; ఱేకుమడచుట = తగ్గించుట.
రామాయణము-
సీ. మించి రాముని నా య(మిత్రు ధృతిని మూసి
మీఱెను హరిచక్ర) మారు రహిఁ గ
పుల నొంచె బ్రహ్మాస్త్ర(మునఁ బరువడి మోద
మెనయ సంధ)వథి కేభభటులు;
ఘననాదుఁ డేగె, బావని దెచ్చె ద్రోణాద్రి;
మొన మంచె; దానిస్థలి నగ ముంచె;
దనుజులు రేఁగులఁ దంగేళ్లుగాఁ ద్రొక్కఁ
గపులు గాలిచె లంక; గంపనుఁడు మె
గీ. ఱయఁ జదిపె వాలిభ(వుఁడు విజయుఁడు వానిఁ;
గెడపె వైరి ఘటోత్క)చిత్తుఁడగు కుంభు
బేరజంబును నీ(చున్ రవిజుఁ; డడంచె
జోక శక్తి) నికుంభుఁడన్ సోకు హనుమ. (౧౧౧)
భారతము-
ఆ. మిత్రు ధృతిని మూసి మీఱెను హరిచక్ర
మునఁ బరువడి మోద మెనయ సైంధ
వుఁడు; విజయుఁడు వానిఁ గెడపె; వైరి ఘటోత్క
చున్ రవిజుఁ డడంచె జోక శక్తి. (౧౧౧)
టీక- (రా) అమిత్రు = విరోధియొక్క, (భా) మిత్రున్ = సూర్యుని; హరిచక్రము = కపులగుంపు, (భా) హరి = కృష్ణుఁడు, చక్రమున = సుదర్శనచక్రమున; వాలిభవుఁడు = (రా) అంగదుఁడు; విజయుఁడు= (రా) జయశీలుఁడు, (రా) వైరి = శత్రువుల, ఘట = గుంపునందు, ఉత్క = ఉత్సాహముగల, చిత్తుఁడు = మనస్సుగలవాఁడు; (భా) వైరిన్, ఘటోత్కచున్; శక్తిన్ = (రా) బలముచేత, (భా) శక్తియను నాయుధముచేత, ఆరురహి = ఒప్పుచున్న ప్రీతితో, బేరజము = కుత్సితుఁడు, జోక = ఉత్సాహము, సోకు = రాక్షసుని, సైంధవ = (రా) గుఱ్ఱము.
రామాయణము-
చం. ఖలు మకరాక్షునిన్ (మడిపె గద్దఱియై కడుమాను వీఁక) వీ
రు లలర రాముఁడున్ (గురువరుండును శూరుఁడు ఘోరుఁ డౌచు) దా
య లెనయ భీతి వా(వి రటు నాదట గూల్చెను వీక శత్రు)లం
జెలగుచుఁ గీశులున్, (ద్రుపదసింహము సూర్యుసుతుండు చూడ)గన్. (౧౧౨)
భారతము-
గీ. మడిపె గద్దఱియై కడుమాను వీఁక
గురువరుండును శూరుఁడు ఘోరుఁ డౌచు
విరటు నాదట గూల్చెను వీక శత్రు
ద్రుపదసింహము సూర్యుసుతుండు చూడ. (౧౧౨)
టీక- గురువరుండును = (రా) గొప్పశ్రేష్ఠుఁడు, (భా) ద్రోణుఁడు; (రా) వావిరి = అటున్; (భా) విరటు = విరాటరాజును; ద్రుపదసింహము - (రా) వానరశ్రేష్ఠుఁడు, (భా) ద్రుపదునిన్, సూర్యసుతుఁడు = (రా) సుగ్రీవుఁడు, (భా) కర్ణుఁడు; మాను = ఒప్పు; దాయలు = శత్రువులు.
రామాయణము-
చం. దణి ఘననాదుఁడున్ (మిగిలెఁ దాననిశత్రుల మించి; చంపె) ల
క్ష్మణుఁడును వానినిన్; (వినియెఁ జానగుపుత్రుఁడు బిద్దె నంచు) దు
ర్గుణుఁడగు నింద్రజిద్(గురుఁడు; గూడె నతండును గోడు; వాని)దౌ
రణకృతి సైన్యముం (బొలిపె రాముఁడు సైన్యవిభుండు హెచ్చు)కాన్. (౧౧౩)
భారతము-
గీ. మిగిలెఁ దాననిశత్రుల మించి చంపె;
వినియెఁ జానగుపుత్రుఁడు బిద్దె నంచు
గురుఁడు; గూడె నతండును గోడు; వాని
బొలిపె రాముఁడు సైన్యవిభుండు హెచ్చు. (౧౧౩)
టీక- (రా) ఇంద్రజిద్గురుఁడు = రావణుఁడు, సైన్యవిభుండు = నీలుఁడు, హెచ్చు, కాన్ = కాగా- అనగా సంతోషింపగా; (భా) గురుఁడు = ద్రోణుఁడు, సైన్యవిభుండు = ధృష్టద్యుమ్నుఁడు, దణి = ప్రభువు; జానగు = ఒప్పుచుండు; బిద్దుట = చనిపోవుట; కృతి = సమర్థత; పొలిపె = చంపెను.
రామాయణము-
చం. కడు(వగ గూడ భూసురుని గాటపు శాపముచేతనైన యా
రడిఁ దన తే)జ మాఱిన సురామనుఁ గాచెను, బొంది రావణుం
డడ(రు గడంకఁ గ్రుంగ, నరికచ్చుగఁ జావు మరుద్వరాత్మజుం
డిడె; లలిఁగాన్) రిపుం డటుల నీల్గగ దెచ్చెను ద్రోణశైలమున్. (౧౧౪)
భారతము-
కం. వగ గూడ భూసురుని గా
టగు శాపముచేతనైన యారడిఁ దన తే
రు గడంకఁ గ్రుంగ, నరి
కచ్చుగఁ జావు మరుద్వరాత్మజుం డిడె లలిఁగాన్. (౧౧౪)
టీక- సురామను = (రా) ధాన్యమాలిని, (రా) మరుత్ = వాయువునకు, వర = శ్రేష్ఠుఁడగు, ఆత్మజుఁడు = కుమారుఁడు (హనుమంతుఁడు); (భా) మరుత్ = దేవతలకు, వర = ప్రభుని (ఇంద్రుని), ఆత్మజుండు = కుమారుఁడు (అర్జునుఁడు).
రామాయణము-
చం. అరి(జనలోకభీకరుఁడునై తన భీషణశక్తిచేతఁ దా
గురుబలమున్) మహాదనుజకోటినిఁ గూల్చెను; మాల్యవంతు నా
శర(ఘనసేనఁ దోలు పృథుశల్యునిఁ జంపె యుధిష్ఠిరుండు నొ
ప్పు రణమునన్) వరుం డనిలపుత్రుఁడు దారిని; మంచె లక్ష్మణున్. (౧౧౫)
భారతము-
కం. జనలోకభీకరుఁడునై
తన భీషణశక్తిచేతఁ దా గురుబలమున్
ఘనసేనఁ దోలు పృథుశ
ల్యునిఁ జంపె యుధిష్ఠిరుండు నొప్పు రణమునన్. (౧౧౫)
టీక- శక్తిచేత = (రా) బలముచేత, (భా) శక్తియను నాయుధముచేత; (రా) గురుబలమున్ = గొప్పసేనను, (భా) కురుబలమున్ = కౌరవసేనను; ఆశర - (రా) రాక్షసుల, పృథుశల్యుని = గొప్పబాణములు గలవానిని, (భా) గొప శల్యుని; యుధిష్ఠిరుండు = (రా) యుద్ధమునందు స్థిరమయినవాఁడు.
రామాయణము-
సీ. నగముంచి దానిస్థానమున మరలి వచ్చె
నీదకం; దెలసె మండోదరి యల
జడి రావణు జననా(శకునిపోక కనిఁ ద
మకమును వీడి ద్వై)మాతురపితృ
భక్తుండు దీక్షసల్పగ హోమముఁ జెఱుపఁ
గపులు వచ్చిరి; గేలి కైకొలిచెద
భార్య నీడ్చుటను ను(పాయనమున, డాగు
వరసుయోధ)ఖలుని సురరిపువిభు
గీ. ననుచు నాగతిఁ జేసి వేయంగదుడు ఘ
(నుడు బిరుదు యుధిష్ఠిరుఁడు బలుడు సుకృతియు
వీఁక (వెడలద్రోయఁ జనెఁ బెనకువకును)
దశముఖుఁడు నిప్పులొల్క నేత్రంబులందు. (౧౧౬)
భారతము-
ఆ. శకునిపోక కనిఁ దమకమున వీడి ద్వై
పాయనమున డాగు వరసుయోధ
నుఁడు బిరుదు యుధిష్ఠిరుఁడు బలుడు సుకృతి
వెడలఁ ద్రోయగఁ జనె బెనకువకును. (౧౧౬)
టీక- శకుని పోకకు = (భా) శకుని చావునకు; అని = యుద్ధమును; (రా) ద్వైమాతుర = వినాయకుని, పితృ = తండ్రి (శివుని); ఉపాయనమున = (రా) కానుకచేత; యుధిష్ఠిరుఁడు = (రా) యుద్ధమందు స్థిరమైనవాఁడు;ఈదకందు = వాయుపుత్రుడగు హనుమంతుఁడు; అలజడి = చింత; తమకమున = సంభ్రమున; పోక = (రా) నడవడి, (భా) చనిపోవుట; పెనకువ = యుద్ధము; కేళికై... యనుచు = పరిహాసమున కారీతి పలుకుచు.
రామాయణము-
చం. చని (వెస భూమి శ్రీ గదల సద్వసుధాజనదూరుఁ డేచి, పా
యని ధృతిఁ బో)ర నేసెను మహాస్త్రము లాకపు లుల్క, వానికిన్
వన (టెసగంగ గంతుగొనె వాయుసుతోరుహతుండునై సుయో
ధనబలుఁడున్) ఖలుం డధికధైర్యసమేతుఁడు ఖడ్గరోముఁడున్. (౧౧౭)
భారతము-
కం. వెస భూమి శ్రీగద లస
ద్వసుధాజనదూరుఁ డేచి, పాయని ధృతిఁ బో
టెసగంగ గంతుగొనె వా
యుసుతోరుహతుండునై సుయోధనబలుఁడున్. (౧౧౭)
టీక- (రా) కదల = కదలగా; (భా) గద = గదయను నాయుధముతో; (రా) వాయుసుతు = హనుమంతునిచే,ఉరుహతుండునై; (భా) వాయుసుతు = భీమునిచే, ఊరుహతుండునై = తొడలు విఱగ కొట్టబడినవాఁడై;సుయోధన = (రా) మంచియోధుఁడు; ఏచి = విజృంభించి; ఉల్క = భయపడునట్లు; గంతుకొనె = చచ్చెను.
రామాయణము-
సీ. అరివచ్చు నపుడైన (పరఁగు ఘూకకృతి క
లరుచు, నశ్వత్థామ)లకముఖభువి
జము లేసెఁ గపులు దాశరథి సంగరమహి
(మాతులబలు నండచేతఁ; గృష్ణ)
ఘోరతనులఁ దితి (కొడుకులఁ దమిఁ గూల్చె
నడఁచె ధృష్టద్యుమ్నుఁ) డంగదుఁడు
క్రూరగుణుని సర్పరోముఁడన్ రాక్షసుఁ;
(గాలుపురికి నంపె ఘనుశిఖండి)
ఆ. గమనుఁ బోలు నీలుఁ డమర వృశ్చికరోము;
నగ్నివర్ణు రాముఁ డణఁచె; మాత
లి రహిఁ దెచ్చిన మఘవు రథ మెక్కె; నపహృ
తామృతుండు నయ్యె నసురవిభుఁడు. (౧౧౮)
భారతము-
ఆ. పరఁగు ఘూకకృతి కలరుచు, నశ్వత్థామ
మాతులబలు నండచేతఁ; గృష్ణ
కొడుకులఁ దమిఁ గూల్చెనడఁచె ధృష్టద్యుమ్నుఁ
గాలుపురికి నంపె ఘనుశిఖండి. (౧౧౮)
టీక- ఘూకకృతికి = గుడ్లగూబ పనికి (రా) (శత్రువున కయిన దుశ్శకునమునకు); (రా) అశ్వత్థ = రావిచెట్టు,అమలక = ఉసిరిక చెట్టు; సంగరమహిమ = యుద్ధప్రౌఢియందు; అతుల = సమానరహితుఁడు; (భా) మాతుల = మేనమామ (కృపుడు); కృష్ణ = (రా) నల్లని, (భా) ద్రౌపదియొక్క, తమి = (రా) కోరికతో, (భా) రాత్రియందు,ధృష్టద్యుమ్నున్ = దిట్టయైన సత్త్వము గలవానిని; శిఖండిగమను = నెమలి నెక్కి పోవువాఁడు (కుమారస్వామి); మఘవు = ఇంద్రుని.
రామాయణము-
సీ. అరివచ్చు నపుడైన (పరఁగు ఘూకకృతి క
లరుచు, నశ్వత్థామ)లకముఖభువి
జము లేసెఁ గపులు దాశరథి సంగరమహి
(మాతులబలు నండచేతఁ; గృష్ణ)
ఘోరతనులఁ దితి (కొడుకులఁ దమిఁ గూల్చె
నడఁచె ధృష్టద్యుమ్నుఁ) డంగదుఁడు
క్రూరగుణుని సర్పరోముఁడన్ రాక్షసుఁ;
(గాలుపురికి నంపె ఘనుశిఖండి)
ఆ. గమనుఁ బోలు నీలుఁ డమర వృశ్చికరోము;
నగ్నివర్ణు రాముఁ డణఁచె; మాత
లి రహిఁ దెచ్చిన మఘవు రథ మెక్కె; నపహృ
తామృతుండు నయ్యె నసురవిభుఁడు. (౧౧౮)
భారతము-
ఆ. పరఁగు ఘూకకృతి కలరుచు, నశ్వత్థామ
మాతులబలు నండచేతఁ; గృష్ణ
కొడుకులఁ దమిఁ గూల్చెనడఁచె ధృష్టద్యుమ్నుఁ
గాలుపురికి నంపె ఘనుశిఖండి. (౧౧౮)
టీక- ఘూకకృతికి = గుడ్లగూబ పనికి (రా) (శత్రువున కయిన దుశ్శకునమునకు); (రా) అశ్వత్థ = రావిచెట్టు,అమలక = ఉసిరిక చెట్టు; సంగరమహిమ = యుద్ధప్రౌఢియందు; అతుల = సమానరహితుఁడు; (భా) మాతుల = మేనమామ (కృపుడు); కృష్ణ = (రా) నల్లని, (భా) ద్రౌపదియొక్క, తమి = (రా) కోరికతో, (భా) రాత్రియందు,ధృష్టద్యుమ్నున్ = దిట్టయైన సత్త్వము గలవానిని; శిఖండిగమను = నెమలి నెక్కి పోవువాఁడు (కుమారస్వామి); మఘవు = ఇంద్రుని.
రామాయణము-
ఉ. రోసము మించగా (నరవరుండు నతండు నొనర్చి రాజి)నిన్
వేసెను రాముఁడున్ (బలిమి భీషణలీలనుఁ బద్మజాస్త్ర) మె
చ్చౌ సరి నెన్ని బా(ములను, నారిపు తేజము మొత్తె; వేగ) నా
దోసినిఁ గూల్చెఁ, దద్(విజయు దోర్బల మర్మిలి వేల్పు లెన్నఁ)గన్. (౧౧౯)
భారతము-
గీ. నరవరుండు నతండు నొనర్చి రాజి
బలిమి భీషణలీలనుఁ బద్మజాస్త్ర
ములను, నారిపు తేజము మొత్తె; వేగ
విజయు దోర్బల మర్మిలి వేల్పు లెన్న. (౧౧౯)
టీక- నరవరుండు = (రా) రాముఁడు, (భా) అర్జునుఁడు; ఆజి = యుద్ధమును; పద్మజాస్త్రము = బ్రహ్మాస్త్రము; (రా) ఎచ్చౌ = హెచ్చగు; బాముల = కష్టముల; విజయ = జయశీలుని; దోర్బలము = భుజబలము; అర్మిలి = ప్రేమ.
రామాయణము-
ఉ. తా (క్షితి నిట్లు దుష్టులను దంచి తగం బురుషోత్తముండు శ్రీ
దక్షుఁ బరీ)తభూతి ఘనతాయుతు నింద్రుని దైత్యబాధ సం
ర(క్షితు సాఁకె; రాజుగను రాజితుఁ డయ్యె యుధిష్ఠిరుండు క్షే
మక్షణుఁడున్) విభీషణుఁడు మంగళుఁడై రఘురాము నానతిన్. (౧౨౦)
భారతము-
కం. క్షితి నిట్లు దుష్టులను దం
చి తగం బురుషోత్తముండు శ్రీదక్షుఁ బరీ
క్షితు సాఁకె; రాజుగను రా
జితుఁ డయ్యె యుధిష్ఠిరుండు క్షేమక్షణుఁడున్. (౧౨౦)
టీక- పురుషోత్తముఁడు = (రా) రాముఁడు, (భా) కృష్ణుఁడు; పరీత = (రా) చుట్టుకొనబడిన; యుధిష్ఠిరుండు = (రా) యుద్ధమందు స్థిరమగువాఁడు; క్షణుఁడు = (రెంటికి) ఉత్సాహముగలవాఁడు; దంచి = నాశనము చేసి;భూతి = ఐశ్వర్యము.
రామాయణము-
సీ. అగ్నిలోఁ జొప్పించి, యతివపాతివ్రత్య
ముఁ బరీక్ష సల్పి రాముండు ప్రీతి
బ్రహ్మేంద్రముఖ్యామరనుతులఁ గొని, తండ్రి
బ్రత్యక్షమైనంత భక్తి నెఱగి,
యవనిజాతాలక్ష్మణాదులతోఁ బుష్ప
కము నెక్కి వచ్చి గరిమ నయోధ్యఁ
బట్టాభిషిక్తుఁడై ప్రబలెఁ దమ్ములు గొల్వఁ;
బుత్రులను గుశలవులనుఁ గాంచె;
గీ. (సలిపె హయమేధ మత డలర లలి బుధులు;
ప్రజలు రామరాజ్యము మఱువన్) జన మని
(బలువిడలరొంద నేలెను; నెలకుఁ దిగ జ
డు లొలసెఁ బ్రజ నీతిగనెఁ గడున్) సుఖమున. (౧౨౧)
భారతము-
కం. సలిపె హయమేధ మత డల
ర లలి బుధులు;ప్రజలు రామరాజ్యము మఱువన్
బలువిడలరొంద నేలెను;
నెలకుఁ దిగ జడు లొలసెఁ బ్రజ నీతిగనెఁ గడున్. (౧౨౧)
టీక- (రెంటికి) హయమేధము = అశ్వమేధయజ్ఞము; తిగ జడులు = మూడువానలు; పలువిడి = ఎక్కువ.
కం. శర్మదముల నీకథల వి
నిర్మలమతిఁ బాడినన్ వినినఁ జదివిన స
ద్ధర్మమయుఁడు సర్వేశ్వరుఁ
డర్మిలితోడుత నొసఁగు మనోభీష్టంబుల్. (౧౨౨)
కం. శ్రీరావిపాటి లక్ష్మీ
నారాయణ యొనరిచె రచనన్ గర్భమునన్
భారత మిడి నిర్వచనము
గా రామాయాణముఁ జంద్రకమలాప్తముగన్. (౧౨౩)
చక్రబంధము
(మొదటి మూడుపాదములందలి మొదటినుండి మూడవ చివరినుండి మూడవ యక్షరములు కవిపేరును,మొదటినుండి యాఱవ చివరినుండి యాఱవ యక్షరములు గ్రంధముపేరును తెలుపును.)
శా. రక్షోరాతి పరాత్పరా వరద ధీరా రమ్యశూరాన్వితా
దక్షా లక్షణ మత్తసంహర కృతీ దాతక్రమా యచ్యుతా
రక్షా నాకులభాగ్యమా వరగభీరా ముక్త బాణవ్రతా
తాక్షోణీరమణా దయాశరధి భూతాళిస్తుతా కామితా. (౧౨౪)
చంపకమాల(...)లో, కందద్వయము [...]లో, తేటగీతి {...}లో, ఆటవెలది “...”లోఁ దెలుపబడి, యివి గర్భితమైన సీసము
సీ. (అతి[కరుణాత్ముడా {పతి యనంతరసాన్వి
తప్రస్ఫుటాంగ}తా])త సుగుణకలి
([త తతబలా] ప్రభూ {పతితతారక సద్ధృ
తి ప్రాజ్ఞవీర} సం)ధితరుచిర వి
(తత[వరదాయకా {యతుల నవ్యరమాయు
త ఖ్యాతియుక్త} పా)]తకరహిత ల
([లితసుభగా] విభూ {కృతి సులేఖ సుధీవ
రశ్రేష్ఠబంధు}రా) రమ్యచరిత
గీ. “నత[వరద రవిశశినయన పర పరమ
పురుష భక్తతోష భరితభువన” భా]స
“హిత [సురమునిజనవినుత హతదితిరుహ
త్రిగుణమయ లసన్మతి వితతి శుభ”దా]త. (౧౨౫)
(సీసములో నాలుగుపాదముల యందును ౧౬వ అక్షరములగు త, తి, త, రలు సీసమునందు గురువులు,తక్కిన కంద గీత చంపకమాలలందు లఘువులు. అనఁగా సీసమునందు అనంతరసాన్వితప్రస్ఫుటాంగ,సద్ధృతిప్రాజ్ఞ, నవ్యరమాయుతఖ్యాతియుక్త, సుధీవరశ్రేష్ఠబంధు యని యొక్కొక్కదానిని సమాసముగఁ జదువవలెను. కంద, గీత, చంపకమాలలందు అనంతరసాన్విత, ప్రస్ఫుటాంగ, సద్ధృతి, ప్రాజ్ఞ, నవ్యరమాయుత,ఖ్యాతియుక్త, సుధీవర, శ్రేష్ఠబంధు యని వేఱువేఱుగా జదువవలెను.)
గర్భిత చంపకమాల-
అతికరుణాత్ముడా పతి యనంతరసాన్విత ప్రస్ఫుటాంగతా
త తతబలా ప్రభూ పతితతారక సద్ధృతి ప్రాజ్ఞవీర సం
తత వరదాయకా యతుల నవ్యరమాయుత ఖ్యాతియుక్త పా
లితసుభగా విభూ కృతి సులేఖ సుధీవరశ్రేష్ఠబంధురా!
గర్భిత కందద్వయము-
కరుణాత్ముడా పతి యనం
తరసాన్వితప్రస్ఫుటాంగతాత తతబలా
వరదాయకా యతుల న
వ్యరమాయుత ఖ్యాతియుక్త పాలితసుభగా.
వరద రవిశశినయన పర
పరమపురుష భక్తతోష భరితభువన భా
సురమునిజనవినుత హతది
తిరుహ త్రిగుణమయ లసన్మతి వితతి శుభదా.
గర్భిత తేటగీతి-
పతి యనంతరసాన్వితప్రస్ఫుటాంగ
పతితతారక సద్ధృతి ప్రాజ్ఞవీర
యతుల నవ్యరమాయుత ఖ్యాతియుక్త
కృతి సులేఖ సుధీవరశ్రేష్ఠబంధు.
గర్భిత ఆటవెలది-
నతవరద రవిశశినయన పర పరమ
పురుష భక్తతోష భరితభువన
“హిత సురమునిజనవినుత హతదితిరుహ
త్రిగుణమయ లసన్మతి వితతి శుభ.
గద్యము-
ఇది విద్వద్విధేయ, రావిపాటి చలమయామాత్యపుత్ర, లక్ష్మీనారాయణ ప్రణీతంబయిన
నిర్వచన భారతగర్భ రామాయణముసర్వము నేకాశ్వాసము సంపూర్ణము.
ఈ గ్రంథము శంకరాభరణమున ఒక్కొక్క పద్యముగాఅనేక భాగములుగా ప్రచురించబడి యుండగా అన్నిటినీ కలిపి మొత్తము గ్రంథమును పాఠకుల సౌకర్యార్థము ఇచ్చట ప్రచురించియున్నాను.శ్రీ కంది శంకరయ్యగారికి ధన్యవాదములు.
జైహింద్.