గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, మార్చి 2015, ఆదివారం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి నా శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి నా శుభాకాంక్షలు.
ఈ సృష్టి స్థితి లయ కారకులైన ఆ త్రిమూర్తుల దేవేరులైన ఆ సరస్వతీ మాత, లక్ష్మీ మాత, పార్వతీ మాతల పరి పూర్ణమైన అంశలతో భూమిపై సంచరిస్తున్న మహిళా లోకానికి నా సాష్టాంగ నమస్కారములు.
తల్లులారా! మీరు లలితభావామృత వాహినులు. సుకుమార పేశల మనోభిరామలు. జాలి, కరుణ, దాతృత్వాది గుణ పూర్ణులైన మాతృ స్వరూపులు. ఈ సృష్టికి మూలములు. 
ఇంతటి మహనీయులైన మీరు నిరంతర సంతోషవాహినిలో ఓలలాడుతూ ఉంటేనే జగత్కల్యాణం. లేకుంటే జగద్వినాశనమే.
మీరు ధీర చిత్తలై, విస్మయము విడనాడి నయ, భయ, దండనాదులతో మీ ప్రతికూల వర్తులను అదుపు చేయండి. మీకు ఆ పరమాత్మ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనసారా కోరుకొంటున్నాను.
చ. జయముల కీరె హేతువులు, సద్గుణ సంపదకీరె మూలముల్.
ప్రియముగ మాటలాడుటయు, విజ్ఞత చూపుట మీదు సంపదల్.
శ్రియమును కోరు సజ్జనులు చిత్తములన్ మిము కొల్తురెల్లెడన్.
భయములవేల మీకుననివార్యులకున్ తగు శిక్షవేయుడీ.
అమ్మా! శారద! లక్ష్మి! శాంభవి! సదాహార్యమ్ములన్, భాగ్యముల్,
సమ్మోదమ్మును, శాంతియున్, సుఖము, ధీశక్తి, యుక్త్యాదులన్,
నెమ్మిన్ గొల్పుచు స్త్రీజనావళినిలన్ నిత్యంబు రక్షింపుడీ!
సమ్మాన్యత్వము గొల్పుడీ!శుభములే సర్వత్ర కల్పింపుడీ!
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

namaskaaramulu
mahiLala kRshi .chaalaa baagumdi

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.