గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, మార్చి 2015, ఆదివారం

అష్టాక్షర కందము. శ్రీ కందుల వర ప్రసాద్ కృతము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ కందుల వర ప్రసాద్ కృత అష్టాక్షర కందము తిలకించండి. 
అష్టాక్షర కందము:-
ధనవనమున, జన వనమున 
ధన మన ఘనమను ఘనమన ధనమను వనజా !
ఘన ధన మున మనమనునది 
దనుజుని వనమైనది! వినుత వనజ నయనా !  
ప్రతిపదార్థము:- ధనవనమున= ధనము నిండిన జగతిలో ,జన వనమున = జనులు నిండిన జగతిలో,
ధన మన= గొప్ప ధనము ఏది యనగా , ఘనమను = ఎటు లైన పేరు రావలెననును,
ఘనమన= గొప్పది ఏది యనగా,  ధనమను= అన్నింటి కన్న గొప్పది ధనమనును,
ఘన ధన మున= ఎక్కువ సంపద వలన,  మనమనునది = మనస్సనునది,
దనుజుని వనమైనది= రాక్షసుడు సంచరించు వనమైపోయినదికదా!  
భావము:- ఈ కలియుగములొ డబ్బు కన్నా ఘన మైనది లేదని విర్ర వీగు జనుల మది రాక్షసుడు సంచరించు వనము వలె నున్నది యని భావము.
కేవలము ఘ జ త ద ధ న మ వ అనే హల్లులు మాత్రమే ప్రయోగించి శ్రుతి పేయముగా రచించిన శ్రీ వరప్రసాద్ ను అభినందించుచున్నాను. 
జైహింద్.
Print this post

2 comments:

కంది శంకరయ్య చెప్పారు...

వరప్రసాద్ గారూ,
మీ పద్యం అద్భుతంగా ఉంది. చాలా సంతోషం!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శహభాష్ అద్భుతంగా ఉంది .అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.