గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, ఫిబ్రవరి 2011, గురువారం

విమల కావ్య దాస! వేంకటేశ! (ఆరింటిలో ఆరవది.)


పాఠకావతంసులారా! కవిసమ్రాట్టు  శ్రీ విశ్వనాథ సత్యనారాణ  యొక్క శ్రీమద్రామాయణ కల్పవృక్షమును ఆపోసన పట్టి కల్పవృక్షం నీడన తలదాచుకొనుచున్న కవివతంసులైన శ్రీమాన్ బులుసు వేకటేశ్వర్లు కవితా సంకలనమైన మువ్వ లో గల కవితలను కవితామృత ఖండికలనఁ దగి యున్నవి. 
నిరంకుశాః కవయః అన్నది ఎంతటి సత్యమో వీరి రచనయైన విమల కావ్యదాస! వేంకటేశ! మకుటముతో గల పద్య పంచ త్రింశత్తు గమనించినట్లైతే మన కవగతము కాక మానదు.
పాఠకులు ఆనంద పరవశు లగుదు రనే ఉద్దేశ్యంతో ఆరు భాగాలుగా మీ కందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇక చదివి మీరే చూడండి. చూచి మీ ఆనందాన్ని కవివతంసులకు మీ అపురూపమైన వ్యాఖ్య ద్వారా తెలియఁ జేయండి.
ఇక చదవండి.

కవుల కంటె జాతి ఘన గౌరవాల్ నిలుపు
వారు గలరె ? వారి మీఱ గలరె?
కవుల తిమిర జగతి రవి చంద్ర తేజులు 
విమల కావ్య దాస వేంకటేశ! ౨౬.
కవికి జన్మ భూమి కాదొకో లోకమ్ము? 
లోక వృత్తి కవిత లోని కొదుగు.
కవుల రస పిపాస భువిని స్వర్గము సేయు.
విమల కావ్య దాస వేంకటేశ! ౨౭.
పదవి కొఱకు ఘనుల ప్రాపకము కొఱకు
గతుల కొఱకును బహుమతుల కొఱకు
భజన సేయు కవులు ప్రజకేల? మనకేల?
విమల కావ్య దాస వేంకటేశ! ౨౮.
గత చరిత్రమెల్ల కల్మష భరితమ్ము
నేడు వాడు గొప్పవాడునయ్య.
వాని పొగడు కవులపై జాలి పడుమయా.
విమల కావ్య దాస వేంకటేశ! ౨౯.
ఆటగానికిత్తురాఫీసరుద్యోగ
మకట! కవికి తిండి యైన లేదు.
కడుపు మండుచుండ కైతలో దుఃఖించు
విమల కావ్య దాస వేంకటేశ! ౩౦.
జాతి మెచ్చునట్టి చక్కని కావ్యాలు
వ్రాయు కవికి బ్రతుకు భారమయ్యె.
బూతు పాట వ్రాయ భోగమ్ము వానిదే.
విమల కావ్య దాస వేంకటేశ! ౩౧.
ఆత్మ గౌరవమ్ము ఆరవ ప్రాణమ్ము
గాగ కవితలల్లు కవుల కెల్ల
నొనర జేయుచుంటి నొక వేయి దండాలు.
విమల కావ్య దాస వేంకటేశ! ౩౨.
మ్రాను వంపు తీర్ప మహిలో నసాధ్యమ్ము
మొక్క వంపు తీర్ప చక్కనగును.
నైతికత పునాది నవతరానికి నాంది.
విమల కావ్య దాస వేంకటేశ! ౩౩.
హృదయ వర్తనంపు చదువులు చదవక
యంత్రములకు దాసుడయ్యె నరుడు.
తానె యంత్రమగునొ! తలపోయగా నింక.
విమల కావ్య దాస వేంకటేశ! ౩౪.
నిజము చెప్పువాని నిందలపాల్జేయు.
సంప్రదాయమునకు చావు లేదు.
సత్య దర్శనమ్ము చాల కష్టమ్మురా.
విమల కావ్య దాస వేంకటేశ! ౩౫.
సమాప్తం.
ఇంత చక్కటి సులభ శైలిలో కవితలల్లి, కవితపై పాఠకులకుత్సాహం కలిగించిన శ్రీ బులుసు వేంకటేశ్వర్లు కవి వతంసులను మనసారా అభినందిస్తూ, ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను.

జైశ్రీరాం.
జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఎంత చక్కగా చెప్పారంటే కవుల బాధ లైనా భావుకత ఐనా కలం లోనె తప్ప ఆదరణ లేదు సరికదా హేళన .కవులంటే చులకన [ సినిమా కవులు కాదు లెండి. ] నిజాల్ని పాతేసి కలుషిత ప్రపంచం లొ హాయిగా చలామణి అవుతున్న వారె ఎక్కువ నీతి చచ్చి పోయి అవినీతి రాజ్య మేలుతున్న రోజులివి.ఇటువంటి కావ్యాలను చదివి చదివి కొంతైన బాగుపడితె ముదావహం. ఇంత చక్కటి కావ్యం అప్పుడే ఐపోఇందా ? అనుకుంటే బాధ గా ఉంది. .అందించిన శ్రీ బులుసు వెంకటేశ్వర్లు కవి వతంసుల వారికి ధన్య వాదములు.మాకందరికి అందించి పుణ్యం సంపాదించు కొంటున్న చింతా వారు కడు ప్రశంస నీయులు. [ నీకు అభినమదన మందారాలు తమ్ముడు ! " లాంగ్ ...లివ్ ..... మై ... డియర్ "

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.