గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఫిబ్రవరి 2011, ఆదివారం

విమల కావ్య దాస! వేంకటేశ! (ఆరింటిలో మూడవది.)

పాఠకావతంసులారా! కవిసమ్రాట్టు  శ్రీ విశ్వనాథ సత్యనారాణ  యొక్క శ్రీమద్రామాయణ కల్పవృక్షమును ఆపోసన పట్టి కల్పవృక్షం నీడన తలదాచుకొనుచున్న కవివతంసులైన శ్రీమాన్ బులుసు వేకటేశ్వర్లు కవితా సంకలనమైన మువ్వ లో గల కవితలను కవితామృత ఖండికలనఁ దగి యున్నవి. 
నిరంకుశాః కవయః అన్నది ఎంతటి సత్యమో వీరి రచనయైన విమల కావ్యదాస! వేంకటేశ! మకుటముతో గల పద్య త్రింశత్తు గమనించినట్లైతే మన కవగతము కాక మానదు.
పాఠకులు ఆనంద పరవశు లగుదు రనే ఉద్దేశ్యంతో ఆరు భాగాలుగా మీ కందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇక చదివి మీరే చూడండి. చూచి మీ ఆనందాన్ని కవివతంసులకు మీ అపురూపమైన వ్యాఖ్య ద్వారా తెలియఁ జేయండి.
ఇక చదవండి.
పదవి వచ్చి ఒక్క పది నెలలు కాలేదు 
కుంభకోణమందు కూరుకొనియె
గ్రహ బలమ్ము బాగుగా లేదనె నతండు. 
విమల కావ్య దాస వేంకటేశ. ౧౧.
ఇంతి కోర్కె తీర్ప నిక్కట్లు పడి, టీ.వి.
కొనియె నొకడు నాటగోలె నింట
ఉడుగని తల పోటు లుమ్మడి జబ్బయ్యె.
విమల కావ్య దాస వేంకటేశ. ౧౨.
కట్ణమాశ చెంది కాల్చె కోడలి నొక్క 
అత్తగారు గొడవ యయ్యె తుదకు.
శిక్ష తప్పు కొఱకు చేయించె యాగాలు.
విమల కావ్య దాస వేంకటేశ. ౧౩.
పది నెలలును మోసి పాలిచ్చి పెంచుట
కొడుకునమ్ముకొనుట కొఱకు కాదు.
పడతు లొక్కటైన వరకట్నములు పోవు.
విమల కావ్య దాస వేంకటేశ. ౧౪.
కొడుకు పెండ్లి నాడు కోరు కట్నంబులు 
కూతు పెండ్లి వేళ ఘోరమనును.
ద్వంద్వ నీతి మనకు పాత కాలపు జబ్బు.
విమల కావ్య దాస వేంకటేశ. ౧౫.

(త్వరలో నాలుగవ భాగం మీ ముందుంటుంది. నమస్తే)

జైశ్రీరాం.
జైహింద్.
Print this post

3 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఒక్కొక్క పద్యం ఒక్కొక్క ఆణి ముత్యం.చాలా బాగున్నాయి తమ్ముడూ ! నిజమె ! " మనకొక నీతి ఎదుటి వారికి ఒక నీతి.ఇవ్వడానికి ఒక నీతి పుచ్చుకోడానికి మరొక నీతి ద్వం ద్వ నీతి పాత జబ్బు." " చివరి పాదాలు కొస మెరుపులు "

కథా మంజరి చెప్పారు...

చక్కని పద్యాలు. రుచికరంగా జిలేబి ల్లాగ ఎంత బాగున్నాయో మిత్రమా, నీకు నా అభినందనలు. మనవరాలితో మంచి కాలక్షేపం జరుగుతోంది అనుకుంటాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మిత్రమా! బాగున్నావా?
శ్రీ బులుసు వేంకటేశ్వర్లు పద్యాలను గరికిపాటివారు ఉదహరించడంలో ఆశ్చర్యపోలేదు కాని, అమెరికానుండి ఒకరు వాళ్ళ నాన్నగారు తనకు విమల కావ్యదాస వేంకటేశ అనే మకుటంతోగల పద్యాలను చెప్పారని, ఒక పద్యం ఉదాహరణగా వ్రాయడమే నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.నరత్నమన్విష్యతి మృగ్యతేహి తత్.అన్ననానుడికి తగినట్టుగా బులుసువారు ఆదరణ్కోసం పాకులాడరు. ఆదరించేవారే తనదగ్గరకు వస్తారనే స్వభావం అతనిది.అలాగని అహంకారమసలే కాదు సుమా. ఎదోవ్రాస్తున్నాను. కాల వాహినిలో కొట్టుకుపోయేవి కొట్టుకు పోతాయి, నిలపడేవి నిలపడతాయి అనే ఉదారమైన స్వభావ సంపన్నుడు. మీవంటివారి వ్యాఖ్యలు నేను చదివి చెపితే చాలా సంతోషమండి అంటారే తప్ప మరీ భావన కలిగి ఉండరు. రామాయణ కల్పవృక్షం లో విశ్వనాథనే కంఠస్థం చేసారు. అంతటి ప్రతిభాశాలి. నీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.