గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఫిబ్రవరి 2011, శనివారం

విమల కావ్య దాస! వేంకటేశ! (ఆరింటిలో రెండవది.)


పాఠకావతంసులారా! కవిసమ్రాట్టు  శ్రీ విశ్వనాథ సత్యనారాణ  యొక్క శ్రీమద్రామాయణ కల్పవృక్షమును ఆపోసన పట్టి కల్పవృక్షం నీడన తలదాచుకొనుచున్న కవివతంసులైన శ్రీమాన్ బులుసు వేకటేశ్వర్లు కవితా సంకలనమైన మువ్వ లో గల కవితలను కవితామృత ఖండికలనఁ దగి యున్నవి. 
నిరంకుశాః కవయః అన్నది ఎంతటి సత్యమో వీరి రచనయైన విమల కావ్యదాస! వేంకటేశ! మకుటముతో గల పద్య త్రింశత్తు గమనించినట్లైతే మన కవగతము కాక మానదు.
పాఠకులు ఆనంద పరవశు లగుదు రనే ఉద్దేశ్యంతో ఆరు భాగాలుగా మీ కందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇక చదివి మీరే చూడండి. చూచి మీ ఆనందాన్ని కవివతంసులకు మీ అపురూపమైన వ్యాఖ్య ద్వారా తెలియఁ జేయండి.
ఇక చదవండి.

పాఠమొక్క సారి పఠియించు మాష్టారు
మఱల చెప్పుడనిన మండి పడును.
వంద రూకలిమ్ము ప్రైవేటులో చెప్పు
విమల కావ్య దాస! వేంకటేశ! ౬.
తెలుగు పాఠ మనిన తేలికగా చూచి,
క్లాసు వదలి తిరిగె ఘనుడొకండు.
ప్రేమ లేఖ వ్రాయ వేయి తప్పులు వచ్చె
విమల కావ్య దాస! వేంకటేశ! ౭.
కట్ణ కానుకలకు కాంతను హింసించి
చంపుటొకటి క్రొత్త జబ్బు. పోదు.
సతి యొనర్చు ప్రాత జబ్బు కన్పడెతిర్గి
విమల కావ్య దాస! వేంకటేశ! ౮.
వందలేండ్ల క్రింద వరలు దురాచార
లతల మూల కంద వితతి నేడు
చావు లేక కొనలు సాగి వర్తిల్లెరా!
విమల కావ్య దాస! వేంకటేశ! ౯.
మంచి చెడ్డదనుచు మాటలాడగ వచ్చు
చెడ్డ మంచిదనుచు చెప్ప వచ్చు.
రెండు తలల పాము నిండు పాండిత్యమ్ము.
విమల కావ్య దాస! వేంకటేశ! ౧౦.
(రూప్ కన్వార్ ఉదంతం)
(త్వరలో మూడవ భాగం మీ ముందుంటుంది. నమస్తే)
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

3 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
మనకు ఆనందాన్ని కలిగించేది ఎన్ని భాగము లుంటే నేం ? ఎంతటి కావ్యమైనా ప్రీతి గా చదవ వచ్చును. అందునా కల్ప వృక్షమునే అవుపోసన బట్టిన పండితుల కలం నుంచి అమృత వర్షమె కురుస్తుంది.మరి." పాఠాలు చెప్పే మాస్టారు దగ్గర్నుంచి తెలుగును తేలిక గా అవమానించే వారు ,కట్న కానుకలకు హింసించె దురాచారుల వరకు తమ కలంలొ పొందు పరచారు.అన్నిటిని మించి " రెండు తలల పాము నిండు పాండిత్యమ్ము " శెహభాష్ .చాలా బాగుంది.అభినందనలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

విమల కావ్య దాస! వెంకటేశ! - నాకు తెలిసిన ఒక పద్యం
ఇన్‌‌బాక్స్‌
X
జవాబివ్వు
Ravindra S. Lanka కి నాకు
వివరాలను చూపించు 7:01 ఉ (46 నిమిషాల క్రితం)
వెనకబడ్డ విద్యార్థులకు extra classes పెట్టి పాఠాలు చెప్పమని గవర్నమెంట్ ఉత్తరువు జారీ చేస్తే, మా నాన్నగారి నుండి విన్న బులుసు వారు చెప్పిన పద్యం.

రాతివంటి వాని రాపాడి రాపాడి
విద్య గరపజూచు వెర్రివాడ!
యెంత మేతబెట్ట నెద్దు పాలిచ్చురా?
విమల కావ్య దాస! వెంకటేశ!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రవీంద్రా! నీ జ్ఞాపక శక్తి అద్భుతం. ఇంత చక్కగా శిక్షణ నిచ్చిన మీ పితృ దేవులకభినందన పూర్వక నమస్సులు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.