గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

విమల కావ్య దాస! వేంకటేశ! (ఆరింటిలో మొదటిది.)


అసామాన్య పాండితీ విరాజితులు కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.
పాఠకావతంసులారా! కవిసమ్రాట్టు  శ్రీ విశ్వనాథ సత్యనారాణ  యొక్క శ్రీమద్రామాయణ కల్పవృక్షమును ఆపోసన పట్టి కల్పవృక్షం నీడన తలదాచుకొనుచున్న కవివతంసులైన శ్రీమాన్ బులుసు వేకటేశ్వర్లు కవితా సంకలనమైన మువ్వ లో గల కవితలను కవితామృత ఖండికలనఁ దగి యున్నవి. 
నిరంకుశాః కవయః అన్నది ఎంతటి సత్యమో వీరి రచనయైన విమల కావ్యదాస! వేంకటేశ! మకుటముతో గల పద్య త్రింశత్తు గమనించినట్లైతే మన కవగతము కాక మానదు.
పాఠకులు ఆనంద పరవశు లగుదు రనే ఉద్దేశ్యంతో ఆరు భాగాలుగా మీ కందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇక చదివి మీరే చూడండి. చూచి మీ ఆనందాన్ని కవివతంసులకు మీ అపురూపమైన వ్యాఖ్య ద్వారా తెలియఁ జేయండి.
ఇక చదవండి.
కవికి తాను వ్రాయు కైత గుర్తుండదు.
విన్నవాని కసలె వేడ్క లేదు.
నేటి కవిత వట్టి నేతి బీరైపోయె.
విమల కావ్యదాస వేంకటేశ. ౧.
విశ్వసించునొకటి. వివరించు నొక్కటి.
వ్రాయునొకటి తాను చేయునొకటి.
కవులు గణికలట్లు కాలంబు పుత్తురో?
విమల కావ్యదాస వేంకటేశ. ౨.
ఇంటి దాని గూర్చి, చంటి దానిని గూర్చి
ప్రథమ రాత్రి గూర్చి, వలపు గూర్చి
ఏదొ చెత్త వ్రాసి ఎత్తుమా కవి రూపు.
విమల కావ్యదాస వేంకటేశ. ౩.
కవిత లాలకించి ఘన గౌరవాల్ సేయు
రాజులేగిరట్టి రోజులేగె.
ఆలకించువాఁడె ఆంధ్రభోజుఁడు నేడు
విమల కావ్యదాస వేంకటేశ. ౪.
ప్రజల నుద్ధరింప పదవేల? ఓట్లేల? 
జయము కొఱకు నోట్లు చెల్లుటేల?
దొంగడబ్బు జల్లి దొరలౌట గనుమయా
విమల కావ్యదాస వేంకటేశ. ౫.
(త్వరలో రెండవ భాగం మీముందుంటుంది. నమస్తే)
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శ్రీ మాన్ బులుసు వేంకటేశ్వర్లు గారి పద్యములు " విమల కావ్య దాస వేంకటేశ మకుటంతో " మకుటాయ మానం గా ఉన్నాయి. ఎంతొ సులభ శైలిలొ నా వంటి పామరులకు సైతం అర్ధమయ్యె రీతిలొ హృద్యమం గా ఉన్నయి. నిజమె నేటి కవితలు నేతి బీరలె .చెప్పే దానికి చేసే దానికి పొంతన ఉండదు.కవులను ఆదరించే అలనాటి రాజులు లేరు.రాజ్యాలు లేవు ఆరోజులు పోయాయి [ అలా అనుకుంటే ఎంతొ బాధగా ఉంది ]ఏముంది ? దొంగలు దొరలు గా చలామణి అవుతున్న రోజులివి. హృదయానికి హత్తుకునేలా చక్కగా వివరించారు. ధన్య వాదములు. మా కందించిన చింతా వారు అభినంద నీయులు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.