గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

సమస్యా పూరణము. 11.


సాహితీ ప్రియులారా! చాలా కాలంగా శంకరాభరణం బ్లాగులో అద్భుతమైన పూరణలతో సమస్యలను పూరిస్తూ అనేకమంది పాఠక లోకాన్ని రంజిపఁ జేస్తున్నారు కవి పండితులు. వారందరికీ మనసారా నా అభినందనలు తెలియఁ జేస్తున్నాను. అమృత ప్రాయమైన మీ అపురూప మేధా సంపత్తిని మీ పూరణల రూపంలో ఆంధ్రామృత రూపంలో అందజేయడం కోసం ఒక సమస్య పూరణార్థం మీ ముందుంచుతున్నాను. చూడండి ఆ సమస్యేమిటో.
బక మంత్రము కాచు నిన్ను పావన చరితా!
అప్పుడే పూరించడానికి సంసిద్ధులైపోతున్నారా! చాలా సంతోషం.
ఐతే నాదొక చిన్న మనవి.
ఈ సమస్యనుమీరు ఎన్ని ఛందములలో నింపగలరో అన్ని ఛందములలోనూ నింప గలందులకు మనవి.
ఈ సందర్భంగా అందులో ఉన్న సంబోధనను విడిచిననూ అపురూపముగనే ఉండును.
మీ ఆలోచనామృతాన్ని పాఠకలోకానికి మీ పూరణల ద్వారా అందించండింక.
శుభమస్తు.
జై శ్రీరాం.
జైహింద్.
Print this post

13 comments:

కంది శంకరయ్య చెప్పారు...

నికట మరణ పీడితునకు
మృకండు ఋషి తన సుతునకు మేలును గూర్చన్
సకరుణఁ జెప్పె నిటుల "త్ర్యం
బక మంత్రము గాచు నిన్ను పావన చరితా!"

కంది శంకరయ్య చెప్పారు...

మరణ మాసన్నమైన కుమారు మోముఁ
జూచి "త్ర్యంబక మంత్రము గాచు నిన్ను
పావన చరితా!" దాని జపంబు సేయ
నండ శివుఁడగు" ననెను మృకండుఁ డపుడు.

కంది శంకరయ్య చెప్పారు...

చం.
తన సుతుఁ డల్పమైనదగు నాయువు గల్గినవాఁడు గాఁగ నా
తనిఁ గని యా మృకండుఁ డనె "త్ర్యంబక మంత్రము గాచు నిన్ను పా
వన చరితా! మనమ్మున నవారిత భక్తి శశాంకశేఖరుం
గనుచు నుతింపఁగా యముని గండము దప్పును; విశ్వసింపుమా!"

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

నుత కవిచంద్రమా! గతిమనోజ్ఞ వరంబగు, కంది వంశజా!
కృతి తనరెన్ గదా! రచన కేవల మీశ్వర ప్రాప్తమయ్య. సత్
కృతి భవదీయమై చణ సుకృద్భవమైనది శంకరాఖ్య! భా
రతి తనయా! సదా కవిత బ్రాఁతిగ చేయుఁడు కాంక్ష తీరగా.

కవిచంద్రమా! గతి మనో
జ్ఞ వరం బగు, కంది వంశజా! కృతి తనరెన్
భవదీయమై చణ సుకృ
ద్భవమైనది శంకరాఖ్య! భారతి తనయా!

గతిమనోజ్ఞ వరంబగు, కంది వంశ!
రచన కేవల మీశ్వర ప్రాప్తమయ్య!
చణ సుకృద్భవమైనది. శంకరాఖ్య!
కవిత బ్రాఁతిగ చేయుఁడు కాంక్ష తీర!

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

కంది శంకరయ్య గారి పూరణలు అధ్బుతంగా ఉన్నాయి. ఇంకో ఛందస్సులో..

ఆ.వె.
తండ్రి సుతుని గాంచి త్ర్యంబక మంత్రము
కాచు నిన్ను పావన చరితా!య
ముని భయమ్ము విడుము మ్రొక్కుమీశునియంచు
పలికె కూర్మి తోడ పరము తెలిపె

కంది శంకరయ్య చెప్పారు...

ఫణిప్రసన్న కుమార్ గారూ,
మీ ఆటవెలది పూరణ బాగుంది.
కాని రెండవ పాదంలో "ప్రాసయతి" తప్పింది. ప్రాసాక్షరానికి ముందు గురులఘువులలో ఏది ఉంటే మిగిలిన చోట్లలోను అదే ఉండాలని నియమం కదా!

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

శంకరయ్య గారూ,
అవును. కొత్త ఛందస్సులో ప్రయత్నిద్దామనే తొందరలో చూసుకోలేదు. తప్పే. తప్పు చూపించినందుకు ధన్యవాదములు.
భవదీయుడు
ఫణి

రవి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రవి చెప్పారు...

అతికష్టం మీద ఈ పద్యం రచించాను. తప్పులుంటే మన్నించగలరు.

సందర్భం: కృష్ణుడు వినాయక చతుర్థి రోజు పాలలో చంద్రుని ప్రతిబింబం చూశాడు. అందుకు పరిహారం నారదుడు ఇలా వినాయకుని మంత్రం పఠించమని చెబుతున్నారు.

పనుగొనుఁ యోషధీశు గనఁ భాద్రపదంపు చతుర్థినాడు పా
ప నెపము లెన్నగా! అమిత భక్తిఁ పఠింప మురారి! విఘ్నభీ
షణు, పరమేశనీలగళశాబక మంత్రము కాచు నిన్ను పా
వన చరితా! ప్రదోషములుఁ బారును నిక్కము విశ్వసింపుమా!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రవీ! పరమేశ్వరుని నీలగళుని పశి బిడ్డగా చేసి నీ ప్రత్యేకభక్తిని కనపరిచి అద్భుతంగా సమస్యాపూరణ చేసినందుకు నా అభినందనలు

చంద్రశేఖర్ చెప్పారు...

శంకరయ్య మాష్టారి పద్య రచనా ప్రతిభ చింతా వారి బ్లాగు లోనయినా చూడగలుగున్నందుకు సంతోషం. వారి సొంత బ్లాగు లో మా తప్పులు దిద్దటమే సరిపోతోంది మాస్టారికి.

రాఘవ చెప్పారు...

నేను చూచేసరికి అందఱూ పూరించేసారండీ. నాకు వేఱే దారి తోచక, ససజభస లతో వృత్తాన్ని తీసికొని పూరించాను, యతి స్థానం భగణపు మొదటి అక్షరంగా తీసికొన్నాను. ఇలాంటి వృత్తం ఇంతకు ముందు ఎవరైనా వాడారో లేదో నాకు తెలియదండీ. ఎక్కడైనా ఇప్పటికే ఉంటే సరి, లేదంటే దీనికి నేను పెట్టుకుంటున్న పేరు "నాకపభవము". :)

శ్రీకృష్ణుఁడు తన సఖుఁడైన అర్జునునికి చెప్పినట్టుగా---

సకలాస్త్రములన్ వరించ శర్వుని హరునిన్
సకలానిమిషేశుఁ గొల్చి సన్నుతులిడగా
నకులాగ్రజ సవ్యసాచి నాకపభవ త్ర్యం
బకమంత్రము గాచు నిన్నుఁ బావనచరితా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.