మధురకవి ‘కొండేపూడి’
-బులుసు వెంకటేశ్వర్లు
జనవరి 26, 2011 తేదీన దివంగతులైన కొండేపూడి సుబ్బారావుగారు ప్రసన్న భారతి సాహిత్య మాసపత్రిక సంపాదకులు. వ్యవస్థాపకులు కూడా. సుమారు తొంభై ఆరు సంవత్సరాలు జీవించి ఆశ్వాసాంతము పద్య రచన చేస్తూనే తనువు చాలించిన ధన్యులు. కొండేపూడి సుబ్బారావుగారు సాహిత్యంలో సంప్రదాయవాది. సుమారుగా శత గ్రంథ కర్త. ఈశ్వరార్పణము, హనుమత్ ప్రబంధము, గీతాసారము, ప్రసన్నభారతి మొదలైన పద్య కావ్యాలు; మహాభారత ధర్మశాస్తమ్రు, దేవీ భాగవతం, సౌందర్య లహరి, ముకుందమాల మొదలైన వచనానువాదాలు ఆయన సృష్ఠి. ‘ఆంధ్ర పద్య కవితా సదస్సు’ అనే సాహిత్య సంస్థను స్థాపించి, శిష్టా వేంకట్రావు, బులుసు, కోటారావువంటి సభ్యులతో ఆంధ్రదేశం అంతా పర్యటించి పద్య రచయితలకు ప్రోత్సాహం ఇచ్చిన కార్యశూరుడాయన. డిఫెన్స్ అకౌంట్స్ శాఖలో ఆఫీసర్‌గా పదవీ విరమణ చేసిన కొండేపూడి ఆశువుగా పద్యాలల్లేవారు. మరోపక్క భావుకతా ప్రధానంగా కావ్యాలూ రచించేవారు.
కొండేపూడి వారి సాహిత్య జీవితంలో ‘ప్రసన్నభారతి’ పత్రికా స్థాపనం గొప్ప మలుపు. పద్య కవితాభిమానులకు మేలుకొలుపు. వారు రచించిన కావ్యాల్లో హనుమత్ ప్రబంధము, కవితా మందాకిని మేలి రచనలు. ‘కవితామందాకిని’ని దేవతా-దేశభక్తి-ప్రకృతి-సాహిత్య సమాజ-ప్రకరణములు విభజించారు. ఇది బృహత్ ఖండకావ్యం-600 పద్యాలు. ‘‘కొందమ్మి రేకులో కురిసిన నునుమంచుటద్దమ్ముపై నరుణాంశు రేఖ’’ వంటి మాధుర్యధుర్యమైన శైలి వారిది. ప్రతిపద్యం ఆపాత మధురము. జీవితంలోనూ, రచనా రంగంలోనూ అచ్చమైన కర్మయోగిగా నడయాడిన కొండేపూడి సుబ్బారావు మహాకవికి శ్రద్ధాంజలి.
February 21st, 2011(ఆంధ్ర భూమి సౌజన్యంతో)