గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

సమస్య. *రమ్మును దెచ్చె మారుతియె రామునికై, ముదమంద వానరుల్* కు పూరణ.

0 comments

జైశ్రీరామ్.

సమస్య. *రమ్మును దెచ్చె మారుతియె రామునికై, ముదమంద వానరుల్*

నా పూరణ.

తమ్ముఁడు మూర్ఛపోయెనని తల్లడమందుచునున్న రామునిన్ 

గ్రమ్మిన బాధఁ బాపగ వరుండగునా హనుమంతుడంత వే

గమ్మున నేగి యోషధుల కల్పకమౌగిరి రాజ వైద్య సా

*రమ్మును దెచ్చె మారుతియె రామునికై, ముదమంద వానరుల్*

శ్రీ సూరం శ్రీనివాసులు గారి పూరణ

ప్రమ్మగఁ గంజజాస్త్రము నభస్స్థల మెల్ల తమోవృతమ్ము యు

ద్ధమ్మున రామమూర్తి వసుధాస్థలి గూలెను మూర్ఛతో నసా

ధ్యమ్ములనైన చేయగల యట్టిడు దివ్యమహౌషధీమహీ

ధ్రమ్మును దెచ్చె మారుతియె రామునికై ముదమంద వానరుల్

జైహింద్.


31, జనవరి 2023, మంగళవారం

నియతం సఙ్గరహితమ - ...18 - 23...//... యత్తు కామేప్సునా కర్మ - ...18 - 24,,,//.....అథాష్టాదశోధ్యాయము - మోక్షసంన్యాసయోగము

0 comments

 జైశ్రీరామ్.

శ్లోనియతం సఙ్గరహితమరాగద్వేషతః కృతమ్|

అఫలప్రేప్సునా కర్మ యత్తత్సాత్త్వికముచ్యతే. || 18-23 ||

తే.గీవిగతసంగము, మరి ఫలాపేక్ష రహిత

ము ననురాగమునుద్వేషములకు దూర

ముగ మసలి చేయు నిత్యకర్మ గతిసాత్వి

కముగ నెరుగుమీవర్జునా! కనుము నిజము.

భావము.

సంగభావం లేక, ఫలం మీద ఆశ లేక, రాగ ద్వేషాలు లేక చేసిన నిత్య కర్మ సాత్విక కర్మ.

శ్లోయత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః|

క్రియతే బహులాయాసం తద్రాజసముదాహృతమ్. || 18-24 ||

తే.గీకోరికలతోడను  దురహంకారమునను,

మిక్కుటమ్మగు శ్రమతోడ మేదినిపయి

చేయుకర్మ రాజసికంబుచిత్తమలర

వినుచు గ్రహియింపుమర్జునా! విశదముగను.

భావము.

కోరికతో అహంకారంతో బహు శ్రమతో చేసే కర్మ రాజసిక కర్మ.

జైహింద్.

నా శతకములపై శ్రీ రాణీ సదాశివమూర్తిగారి కితాబు.

0 comments

జైశ్రీరామ్.

 [6:51 am, 15/01/2023] Chinta Rama Krishna Rao: 

సహృదయులయిన  జ్ఞాన స్వరూపులయిన మీకు మకరసంక్రాంతి శుభాకాంక్షలు. 

శ్రీలక్ష్మీనరసింహుల పరిపూర్ణ ఆశీస్సులు మీ అందరికీ లభించాలని 

మనసారా కోరుకొంటున్నాను.🙏

ఇట్లు

సుజనవిధేయుడు

చింతా రామకృష్ణారావు.

[8:25 am, 15/01/2023] రాణీ సదాశివ మూర్తి: 🌱🎋🌾🐄🐂🌅🐓🌾🎋🌱

సిక్తోऽసితైర్హిమకణై: పరితశ్శుభార్కః

రక్తోऽధునా తవ శుభోదయగీతగానే।

స్నిగ్ధాభ ఏష తనుతాన్మకరే ప్రవిష్ట:

సన్మంగళాని పరివారయుతాయ తుభ్యమ్  ।। 

భావం: అంతటా అసితమైన (ప్రాత: కాలమగుటచేత అంత తెల్లగా లేని) 

మంచుకణములచే తడుపబడిన సూర్యుడు  మీ శుభోదయ 

గీతగానమునందు ఇష్టము కల్గిన ఉన్నాడు.    మకరమున ప్రవేశించిన 

స్నిగ్ధ కిరణుడైన ఆ రవి  మీ పరివారముతో కూడిన మీకు,  

సన్మంగళములను కలుగజేయు గాక!

ఆచార్య రాణి సదాశివ మూర్తి 

🌱🎋🌾🐄🐂🌅🐓🌾🎋🌱

[11:15 am, 15/01/2023] Chinta Rama Krishna Rao: 🙏🙏🙏

[7:51 am, 31/01/2023] రాణీ సదాశివ మూర్తి: 

శతకవ్రాతము శాతకుంభఛవులన్  సంతానవృక్షద్యుతిన్

హితమున్ బంచుచు మించుమోదమొసగన్ హ్రీంకారసంధాయిగా।

శ్రితభక్తాళికి దేవతాళి శుభముల్ చింతాన్వయార్యోక్తులన్

నుతులన్ నిల్చుచు నిక్కమిచ్చు వినుడో నూర్లేఱులన్ హంసలై।।

చింతాన్వయార్య - శ్రీ చింతా రామ కృష్ణా రావు గారు

నూర్లేఱులన్ - శతకప్రవాహములలో

[9:25 am, 31/01/2023] Chinta Rama Krishna Rao: 

మాటల్ రావు మహాత్మ మిమ్ము పొగడన్, మాబోటి యల్పజ్ఞులన్

మేటిన్ జేసి వచించుటన్నది ఘనమ్మే, మీదు సద్భావనా

పేటిన్ మంచియె కల్గుటన్ మహిమతో వీక్షింపఁ జేసెన్ ననున్,

పాటింతున్ భవదీయ భావనకు తగన్, భవ్యా! నమస్కారముల్🙏

జైహింద్.

30, జనవరి 2023, సోమవారం

పృథక్త్వేన తు యజ్జ్ఞానం - ...18 - 21...//... యత్తు కృత్స్నవదేకస్మిన్కార్యే - ...18 - 22,,,//.....అథాష్టాదశోధ్యాయము - మోక్షసంన్యాసయోగము

0 comments

 జైశ్రీరామ్.

శ్లోపృథక్త్వేన తు యజ్జ్ఞానం నానాభావాన్పృథగ్విధాన్|

వేత్తి సర్వేషు భూతేషు తజ్జ్ఞానం విద్ధి రాజసమ్. || 18-21 ||

తే.గీవేరువేరుగ కనిపించు వివిధ రూప

ములను జీవులు వేరని తలచుటదియె

రాజసికమగు జ్ఞానంబురాజ తనయ!

పార్థుడా! నీవు గ్రహియించు ప్రస్ఫుటముగ.

భావము.

వేరు వేరు కనబడే రూపాలలో వేరువేరు జీవుళ్ళు ఉన్నారని గ్రహించేది రాజసిక జ్ఞానమని 

తెలుసుకో.

శ్లోయత్తు కృత్స్నవదేకస్మిన్కార్యే సక్తమహైతుకమ్|

అతత్త్వార్థవదల్పం తత్తామసముదాహృతమ్. || 18-22 ||

తే.గీ. ఒక్క వస్తువే సర్వమం చొప్పనట్టి

యుక్తికి విరుద్ధముగనెంచి, యొప్పనట్టి

విధముగా పట్టుకొనుటది విశ్వమందు

తామసికమగు జ్ఞానమ్ము, తలచు మిదియు.

భావము.

ఒక వస్తువే సర్వమూ అని, యుక్తికి విరుద్ధంగా, అసంబద్ధంగా, అల్పత్వంతో 

పట్టుకు కూర్చునేది తామసిక జ్ఞానమని అనబడుతుంది.

జైహింద్.