గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఆగస్టు 2010, శుక్రవారం

ఇదిగో లంచం. తీసుకొని ఆ కిటుకేంటో చెప్పవే నెమలీ!

కంద - గీత - గర్భ ఉll
ఓ నెమలీ! సఖీ! ఎటుల నోచి; మదీయుని; కృష్ణుఁ  జేరి; శ్రీ
జ్ఞాన మతిన్ సదా చతుర! కామ్య ఫలంబును చక్క నందితో?
నీ నమనంబునన్ శిరము నేర్పుమెయిన్ దగఁ జేరినావు. పో
నీనునినున్. కృపన్ తెలిపి నేర్పును గొల్పుము దివ్యుఁ జేరగా!
కll
నెమలీ! సఖీ! ఎటుల నో
చి; మదీయుని; కృష్ణుఁ  జేరి; శ్రీ జ్ఞాన మతిన్.
నమనంబునన్ శిరము నే
ర్పుమెయిన్ దగఁ జేరినావు. పోనీనునినున్.
తే.గీll
ఎటుల నోచి; మదీయుని; కృష్ణుఁ  జేరి; 
చతుర! కామ్య ఫలంబును చక్క నంది
శిరము నేర్పుమెయిన్ దగఁ జేరినావు.
తెలిపి నేర్పును గొల్పుము దివ్యుఁ జేర!
కంద - గీత - గర్భ ఉll
లంచము నిచ్చెదన్. కలుగు లాభము నిచ్చెద. గాంచుమమ్మ! బా
లంచు మదిన్; ననున్ వెలుగు లందును నీ కృప వెల్లు వైనచో
లంచము నిచ్చు నా హరియు లాస్యము  సేయును. హాయిఁ గొల్పు చా
లంచననౌన్ గదా! శిఖిరొ! డంబము చాలును.చెప్పు మమ్మరో!
కll
చము నిచ్చెదన్; కలుగు లా
భము నిచ్చెద; గాంచుమమ్మ! బాలంచు మదిన్.
చము నిచ్చు నా హరియు లా
స్యము సేయుచు; హాయిఁ గొల్పు; చాలంచన నౌన్.
తే.గీll
కలుగు లాభము నిచ్చెద గాంచుమమ్మ!
వెలుగు లందును నీ కృప వెల్లువైన.
హరియు లాస్యము సేయును; హాయిఁ గొల్పు.
శిఖిరొ! డంబము చాలును. చెప్పవమ్మ!
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

9 comments:

లంకా రవీంద్ర చెప్పారు...

అయ్యా! పలుకులు లేవయ!
వయ్యారములొలకబోయు వాగర్ధసుధల్
తియ్యంగ మమ్ము తాకగ
కొయ్యయి కూర్చుండె జిహ్వ, కొనియాడ మిమున్!
(ఆ తీపిని వదులుకోలేక కదలటంలేదని నా భావం)

యిదియే విధముగ సాధ్యము?
పదముల కురిపించుయతడు పద్మాసనుడా?
మదియబ్బురమున మునిగెను,
సదమల అంతస్థ పిహిత సరసిన రామా!
(లంచం వెనుక యెంత అద్భుతమైన పదపద్మాకరాన్ని రూపించారో!)

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆ చిత్రం ఆ పద్యాలు చూస్తుంటే మతి పోతుంది.[ అసలుంటేగా ] ? పద్యాలు చిత్రం ఒకదాని కొకటి పోటీ పడుతున్నాయి. చాలా బాగుంది

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఆ చిత్రం ఆ పద్యాలు చూస్తుంటే మతి పోతుంది.[ అసలుంటేగా ] ? పద్యాలు చిత్రం ఒకదాని కొకటి పోటీ పడుతున్నాయి. చాలా బాగుంది

లంకా రవీంద్ర చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
లంకా రవీంద్ర చెప్పారు...

కం:-
నెమలేమి కనుల గన్నదొ,
సుమధుర కవితాస్రవంతి శోభల యాడన్?
రమణీయ రామకృష్ణుల
కమనీయ కలమ్ముగనిన కలలున్ నిజమౌ!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మంకెన పూ వలె; మృదుల య
లంకార విరాజమాన లంబుష మనగన్
జంకును గొంకును లేక యు
టంకించిన కందమమరె టంకారముగా.

నీ ఆదరాభిమానాలకు ధన్యవాదములు రవీ .

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాజేశ్వరి అక్కవు కదా! నీ అభిమానం నీ మాటలే తెలియఁ జేస్తున్నాయి.
ధన్యవాదాలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నెమలేమి లంచ మడిగెనొ
కమనీయపు కిటుకు జెప్ప కవి వర్యులకున్
తమ మానస ముప్పొంగగ
రమణీయపు కావ్య మిచ్చె నెమలి లంచమ్మనగా

క్షమిం చాలి ఇది చందో బద్దంగా లేక పోయినా ఊరికె కవిత లాగ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నెమలేమి లంచ మడిగెనొ
కమనీయపు కిటుకు జెప్ప కవి వర్యులకున్
తమ మానస ముప్పొంగగ
రమణీయపు కవిత కేకి రాజిల్లె నిటుల్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.