గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, ఫిబ్రవరి 2010, బుధవారం

ఇదం కవిభ్యః పూర్వేభ్యో నమో వాకం ప్రశాస్మహేll

శ్లోll
ఇదం కవిభ్యః పూర్వేభ్యో నమో వాకం ప్రశాస్మహే
వందేమహి చ తాం వాణీ మమృతా మాత్మనః కలామ్.
భావము:-
శబ్ద బ్రహ్మ విదుఁడైన  భవభూతి తన పరిణత వాక్కుతో పలుకుచు, మ్రొక్కెను. ముందుగా అతఁడు కవులకును, ఆ పిదప కవుల కుపాస్య యైన వాణికిని మ్రొక్కెను. ఆ వాణీ అమృత స్వరూపిణి. ఆత్మ కళ. ఆమె కృపచే వశ్య వాక్కు లైన ఆ కవులే ప్రథమ పూజ్యులు గా భావించిన భవభూతి ఎంతటి ధీశాలియో కదా.
అంత గొప్ప వానిచే రచింపఁబడింది కాబట్టే అతని ఉత్తరరామ చరితము  అత్యద్భుతమయింది. 
"ఉత్తరే రామ చరితే భవభూతి ర్విశిష్యతే"అనే ప్రతిష్ఠ నతఁడు పొందెను.
అమృత స్వరూపిణి యైన వాణి కరుణచే వశ్య వాక్కులైన కవులకు నాహృదయ పూర్వక నమస్సులు.
జైహింద్. 

Print this post

2 comments:

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

చక్కని శ్లోకాలను వాటి సారాన్నందించే తేట తెనుగు పద్యాలను మాకోసం అందిస్తున్నదుకు కృతజ్ఞతలు. వీటిని చూస్తున్నప్పుడు సంస్కృతం నేర్చుకోవాలని కుతూహలంగా ఉంటుంది. పుస్తకాల ద్వారా అది సాధ్యమౌతుందా ? మార్గ నిర్దేశం చేయమని మనవి.

భవదీయుడు

ఫణి ప్రసన్న కుమార్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చక్కని శ్లోకములను గొని,
ఎక్కువగాచదువుడయ్య! ఇంపగు యర్థం
బెక్కడనున్నను గొను డది
చక్కగ వచ్చును. ఫణి ప్రసన్నకుమారా!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.