గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, ఫిబ్రవరి 2010, గురువారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత .32.

కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు రామాయణ కల్ప వృక్షంలో  కవిసమ్రాట్ విశ్వనాథ భావుకతఅను అంశంపై  చేసిన ఉపన్యాసమునుండి ఇప్పుడు 32 వభాగమును మీ ముందుంచుతున్నందుకు ఆనందంగా ఉంది.
చదివి, మీరూ ఆనందించ గలరని నా నమ్మకం. ఇక చదవండి.
మునికాళ్ళ నిలిచి కుందెలు
నను పరకాయించి చూచు నలినాక్షి కథల్
తనకుం దెలిసినఁ జెప్పను
తన చేతం గాకపోవు దక్షిణ దిశలన్. (వి.రా.క.వృ.కి.కాం. 1-32.)
ఈ కుందేలు "ముని కాళ్ళ ఎత్తి నిలిచి నావైపు పరకాయించి చూస్తూ సీత జాడ చెప్పఁ దలంచి, చెప్ప లేక దక్షిణ దిశకు పరుగెత్తుతున్నది." తన చేష్ట ద్వార రావణుని ఉనికిని కుందేలు తెలియఁ జేస్తున్నదని రాముని భావము.
అరణ్యమున సంచరించిన సీతా రాములకు అచ్చటి వృక్షములు జంతువులు కూడా బంధు గణములోనివే. చేతనా చేతనమైన సర్వ ప్ర కృతియు వారి  ఆత్మ బంధువే. రామాయణమున వాల్మీకి ఇట్లే వర్ణించాడు. సీత ప్రకృతి స్వరూపిణి. శ్రీరాముడు పురు షోత్తముఁడు.
రావణుఁడు  సీతను అపహరించుకొని పోవు సందర్భమున సీత తన దురవస్తను గోదావరికి, వనదేవతలకు, అన్ని ప్రాణులకు, మృగాలకు విన్నవించుకొని శరణు వేడుకొంది. దుఃఖించింది.
యాని కానిచిదప్యత్ర సత్వాని నివసంత్యుత
సర్వాణి శరణం యామి మృగ పక్షిగణానపి. (వాల్మీకి)
ఈ అరణ్యంలో నివసించే అన్ని ప్రాణులను మృగాలను పక్షి గణాలను శరణు వేడుకొంటున్నాను. నన్ను రక్షించండి. రావణుఁడు నన్ను అపహరించుకొని పోతున్నాడని నా రామునికి తెలపండి. అన్నది ఆమె.
సూక్ష్మ భావుడైన విశ్వనాథ ఈ ఘట్టమున ఒక అల్ప ప్రాణియైన కుందేలు సీతాపహరణ వార్త రామునకు చెప్పగా ప్రయత్నించి, నోరు లేని ఆ ప్రాణి నిస్సహాయంగా దక్షిణ దిశకు పరుగెత్తినదని , చేష్టా స్ఫురితంగా జరిగిన వృత్తాంతాన్ని తెల్పినదనీ వర్ణించారు. ఇది పరమ రమణీయమైన వర్ణన. ఇట్టి వర్ణనతో విశ్వనాథ కావ్య రస నిర్వహణ యందు తన అగ్రీయతను చాటుకొన్నాడు.
శ్రీమద్రామాయణ కావ్యము నందు 
బోయవాని బాణపు దెబ్బకు క్రింద పడిన ఆడ పక్షి (క్రౌంచి)విలపించినది.ఇది సహజమే. దానిని చూచి, మగ పిట్టయు ఏడ్చినది. 
"భార్యాతు నిహతం దృష్ట్వా రురావ కరుణాంగిరం."
అనంతరమున శ్లోకమున రామాయణము ఇట్లు చెప్పినది.
"తత: కరుణవేదిత్వా అధర్మోయమతి ద్విజ:
నిశామ్య రుదతీం క్రౌంచీ మిదం వచన మభ్రవీత్".
ఆడ పిట్ట తనకు తగిలిన దెబ్బ గురించి కాకుండా తన వియోగము వలన  తన భర్తయైన పెంటి పక్షికి కలిగిన దు:ఖమును చూచి, దు:ఖించు చున్నందు వలననే (అట్లు తలపోసినందువలననే) వాల్మీకి ఉద్విగ్నుడైనాడు. ఇక్కడే కరుణ రసము యొక్క మహా రహస్యము దగి యున్నది.
పరగత సుఖ దుఃఖముల యందు తాదాత్మ్యం కలగడం సత్వము. ఆ సత్వ గుణ ప్రథానమైన అంతఃకరనమునందు పొంగిన సహానుభూత భావమే కరుణము. ఇక్కడ అంతఃకరణమే ముఖ్య భూమిక వహించును కాని ఉపాధులతో పని లేదు. కరుణ వేదిత్వమే ప్రథానము.
సృష్టి లోని సమస్త ప్రాణులును ప్రకృతి పురుషుల ఎడబాటుకు తల్లడిల్లుతున్నవని విశ్వనాథ ఉద్దేశ్యము. అందునను సీతా విషయిక వియోగ దుఃఖితుడైన శ్రీరాముని వేదనకు అల్ప ప్రాణులైన జంతువులు సైతము కరుణ వేదిత్వ గుణమును వహించినవని కల్ప వృక్ష తీర్మానము.
రస ప్రస్థానము నందు విశ్వనాథ - కాళి దాసు్, భవభూతి వంటి ఉత్తమ కవుల కోవకు చెందిన వాడు.
బులుసు వేంకటేశ్వర్లు.
సెల్. 9949175899.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.