గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఫిబ్రవరి 2010, సోమవారం

పురుష సూక్తము యొక్క వివరణ.(తెలుగులో).


ఓం నమో నారాయణాయ.
పురుష సూక్తము.
ఈ లోకమందు ఎల్ల ప్రాణులును పరమాత్మ యొక్క విరాడ్రూపమునం దుండుట వలన ఆ ప్రాణుల శిరస్సు మొదలగు నవయవములు పరమాత్మవి గనుకనే ఆ పరమాత్మ అనేక తలలు గలవాడును,  అనేకమైన కన్నులు గలవాడును, అనేకమైన పాదములు గలవాడును అగుచున్నాడు. అట్టి పరమాత్మయే బ్రహ్మాండ రూపమైన భూగోళ మంతటను ఆవరించుకొని బ్రహ్మాండము వెలుపల గూడా వ్యాపించి యున్నాఁడు. ఆ పరమాత్మ భూత భవిష్య ద్వర్తమానాత్మకమైన సమస్త ప్రపంచముగానగుచున్నాడు.   మఱియు నీ పరమాత్మ స్వయం ప్రకాశమాన మగు అమృతత్వమునకు ప్రభువై జీవులకు అన్నమను కారణముచే స్వకీయ కారణావస్థను అతిక్రమించి ఈ చూడంబడెడి జగ దవస్తను పొందుచున్నాడు.  ఇట్లు పరమాత్మ కర్మ ఫలమనుభవించు జీవుల యొక్క జగదవస్థను అన్నమను నిమిత్తముచే పొందుటయే కాని ఆ యీశ్వరునకు నిజముగా ఈ యవస్థ లేదు. అతీతానాగత వర్తమాన రూపమైన ఈ జగత్తు ఎంత కలదో ఇది అంతయు ఆ పరమాత్మ యొక్క స్వకీయమగు సామర్ధ్యాతిశయమేను.  పరిపూర్ణుడగు పరమాత్మ ఈ యగపడు తన శక్తి కన్న మిగుల నెక్కువయిన వాడు. ౧.

తన శక్తి కంటె అతిశయమగు జగత్తు కన్న నెక్కువ వాఁడయిన యా పరమాత్మకు ఈ భూతము లన్నియు నొక పాతిక భాగముగ నున్నవి.  తక్కిన ముప్పాతిక రూపమును నాశ రహితమై స్వప్రకాశ స్వరూపమునందున్నది.  ముప్పాతిక స్వరూపమైన పరమాత్మ అజ్ఞాన కార్యమగు జన్మ జరా మరణాది రూపమున దేహము కంటె బైట నుండు వాడై దాని సంబంధమైన గుణ దోషములచే స్పృశింపఁబడక సర్వోత్కృష్టముగ నుండెను. మిగత పాతిక భాగము సృష్టి సంహారముల చేత మాయను పొందు చున్నది.  మాయను పొందిన వెనుక దేవ తిర్యగాది రూపములతో నానా విధమయి  చేతనా చేతనములలో వ్యాపించి యుండెను.  ఆ పరమాత్మ వలన విరాట్టును పుట్టెను.  ఈ దేహములను ఆధారము చేసుకొని పరిపూర్ణుడగు పరమాత్మ పురుష స్వరూపుడైన జీవుడాయెను.  ఇట్లు జీవించిన విరాట్టువిరాడ్వ్యతిరిక్తమైన దేవతిర్యఙ్మనుష్యరూపుడాయెను.  ఈ ప్రకారము దేవాది జీవ భావమును పొందిన తరువాత భూమిని సృజించెను.  భూమిని సృజించిన వెనుక ఆ దేవాది జీవులకు సప్త ధాతువులతో గూడిన దేహముల సృజించెను. ౨.

ముందు విరచించిన ప్రకారము దేవ శరీరములు పుట్టిన తర్వాత ఉత్తర సృష్టి సిద్ధించుటకై దేవతలు అందులకు సాధనముగ నొక యాగమును జేసిరి.  అప్పటి బాహ్య ద్రవ్యములు కలుగక పోవుట చేత వేరొక హవిస్సు  లేకపోవుట వలన బురుష స్వరూపమునే మనస్సు నందు యజ్ఞమున హవిస్సుగా భావించి మానస యజ్ఞము నెప్పుడు చేసిరో అప్పుడట్టి యజ్ఞమునకు ఆజ్యమునకు వసంత ఋతువును, సమిధలకు గ్రీష్మ ఋతువును, పురోడాశాది హవిస్సునకు శరదృతువును భావించుకొనిరి.  ఈ యజ్ఞమునకు ఛందస్సులు ఏడు ఎల్లలుగాను, ఆ ఏడును ఇరువదియొక్కటిగా చేయబడినవి. ఆ ఇరువదియొక్క పదార్థములే సమిధలుగా భావింపఁబడినవి.  బ్రహ్మ యొక్క ప్రాణేంద్రియ స్వరూపములైన దేవతలు మానసికముగా యజ్ఞమును చేయువారై పశువుగ విరాట్టును భావించి యూపమునకు గట్టిరి. ఆ యజ్ఞ సాధనము సృష్టికి పూర్వమును జనించినవాడునగు విరాట్పురుషుడను పశువును విశసించిరి. ౩.

సృష్టికి ముందు పుట్టిన విరాట్టుతో బ్రహ్మ ఇంద్రియ స్వరూపులగు దేవతలును ప్రాణ రూపులగు సాధ్యులును వారి కనుకూలమగు మంత్ర వేత్తలగు ఋషులును, వీరలందరును మానస యాగమును జేసిరి.  ఆ విరాట్టే హోమముగాఁ గలిగిన ఆ మానస యజ్ఞము నుండి పృషదాజ్యము లోనగు భోగ్యవస్తు సముదాయ మంతయుఁ గలిగెను.  వాయు దేవతాకములగు పశువులును గ్రామ్యములగు గోవులు మొదలైనవియు వేదములును గాయత్ర్యాది ఛందస్సులును ఆ యాగము నుండియే కలిగెను. ౪.

ఆ యజ్ఞము నుండి గుఱ్ఱములును, గర్దభాదులును, గోవులును, మేఁకలును, గొఱ్ఱెలును పుట్టెను.  బ్రహ్మ వేత్తలు బ్రాహ్మణాది సృష్టిని గూర్చి ప్రశంసించి యెప్పుడు ప్రజాపతి ప్రాణేంద్రియ రూపులగు దేవతలు విరాట్టునాకారమును సంకల్పముచేఁ బుట్టించిరో అప్పు డన్ని ప్రకారములుగా విషయమును కల్పించిరి. ముఖము మొదలైనవి ఏవి యని యడుగఁగా ఈ రూపునకు బ్రాహ్మణుడు ముఖము, క్షత్రియుఁడు భుజము. ౫

కోమటితొడలు, శూద్రుఁడు పదములు ఆయెనని చెప్పి, ఆ విరాట్టు యొక్క మనస్సు వలన చంద్రుఁడును, నేత్రము వలన సూర్యుఁడును, ముఖము వలన ఇంద్రాగ్నులు, ప్రాణము వలన వాయువు బొడ్డు వలన అంతరిక్షము, నెత్తి వలన ద్యు లోకమును, పాదముల వలన భూమియు, శ్రోత్రముల వలన దిక్కులును కలిగెను. ఆప్రకారముననే ఎల్ల లోకములను కల్పించిరి. ౬

ఈ ముందు చెప్పిన విరాట్టు యొక్క ధ్యాన మంత్రమును జెప్పువాఁడు స్వకీయ ధ్యానము యొక్క అనుభవమును వెల్లడి చేయుచున్నాఁడు.ఏ విరాట్టు ఎల్ల యాకారముల నిర్మించిఇతఁడు దేవుఁడు ఇది పశువు, ఇతఁడు మనుజుఁడు, మొదలగు నామములు బెట్టి ఆ నామములతో నెల్లెడల ప్రవర్తించు చున్నాఁడో అట్టి వానిని ఎల్ల గుణములచే నధికుని సూర్యుని వలెనే ప్రకాశమానమగువానిని ధ్యానముచే సదా అనుభవించు చున్నాఁడు. అట్టి వాఁడు అజ్ఞానాతీతుఁడై యున్నాఁడు. కావున గురు శాస్త్రోపదేశరహితు లగు అజ్ఞానులచేఁ తెలిసికొన శక్యుఁడు గాఁడు. ఏ విరాట్టుని ఉపాసించు వారల మంచికిఁ గాను ప్రజాపతి ప్రసిద్ధ పఱచెనో ఎల్ల దిక్కులయందుండునట్టి ఎల్ల ప్రాణుల గ్రహిమ్చుచున్నైంద్రుఁడును,అ జీవులయనుగ్రహము కొఱకు దేనిని వెల్లడి చేసెనో ఆ ప్రజాపతీంద్రుల ఉపదేశము వలన ఆ విరాట్టుచే ఈ చెప్పఁబడిన ప్రకారము తెలిసికొనిన వాఁడు ఈ జన్మముననే మరన రహితుఁడగు చున్నాఁడు.విరాట్టె నేను అని సాక్షాత్కారముఁ జేసికొనెడివాఁడు వర్తమాన దేహ స్వరూపము లేకపోవుటచే వాని స్మరణము వలన మరణము చెందును. అట్టివిరాట్టుని సాక్షాత్కారము లేకమోక్షమునకు ఇతర మార్గము లేదు. కర్మలచే మోక్షము చెంద వీలు లేదు. ప్రజాపతి ప్రాణ రూపులైన దేవతలు మానవ యజ్ఞ స్వరూపుఁడగు ఏ దేవుని పూజించుట వలన జగద్రూప వికారములను జెందిన ధర్మములు ప్రసిద్ధములైనవి ఆయెను. 7. 

పురాతనులగు సాధ్యులును, దేవతలును విరాట్ప్రాప్తి రూపమునఏ స్వర్గమునందుండిరో అట్టి స్వర్గము మహనుభావులు చెందుచున్నారు. 8.

నారాయణుఁడెవఁడో అతఁడు నీళ్ళ నుండి జనించెను. ఎల్లెడలనుండు నీళ్ళలో బ్రహ్మాండము పుట్టెను. ఇది ముఖ్యముగా నీళ్ళ వలననే పుట్టినది గాదు. భూ సంబంధమైన యుదకము నుండి పుట్టినది. ఇది పరమేశ్వరుని వలన అధికముగఁ బుట్టినది. ఇట్టి బ్రహ్మాండమునకు అభిమాని యైన చేతన స్వరూపుఁడగు పురుషుఁడు ఎవఁడోవాఁడు ఈశ్వరుని యంశము. అట్టి విరాట్టుకు చత్య్ర్దశ లోకావయవ సంస్థితి యైన రూపమును గలుగఁ జేయుచుండెడి విశ్వ కర్మ యైనజగదీశ్వరుఁడు కలఁడు. ఆ విరాట్టు సంబంధమైన ప్రసిద్ధమగు ఈ మనుష్యాది రూపమైన సమస్త ప్రపంచము సృష్యాదియందు అంతట పుట్టెను. ఇట్టి విరాట్టును గొప్ప వానినిఁ గాను, అజ్ఞానమునకు బైట ఆదిత్యుని వలెనే ప్రకాశించు వానినిఁగా నెఱిఁగి ధ్యానించెడి వాఁడు ఇక్కడనే మరణ రహితుఁడగు చున్నాఁడు. ముక్తి కొఱకు యిట్టియుపాసన కంటె నితర మార్గము లేదు. ఈ బ్రహ్మాండము లోపల ప్రజాపతి యున్నాఁడు. నిజమైన యాకారము కలవాఁడు కాఁడు. ఈ ప్రజాపతి పుట్టుక లేనివాఁడైనను నా సంబంధమైన రూపముతో స్థావర జంగమాదికమై అనేక విధములుగాఁ బుట్టు చున్నాఁడు. ౯.

జ్ఞానులు యోగముచే  నిరోధింపఁ బడిన ఇంద్రియములు గలవారై ఆ ప్రజాపతి యొక్కనిజ రూపమును యెఱుఁగు చున్నారు. బ్రహ్మలు ప్రజాపతి యొక్క , ఆ స్వరూపముచే నియమించు వారలై మరీచి మొదలగు వారి స్థానమును గోరు చున్నారు. ఏ పరమాత్మ దేవతలకు గాను సర్వత్ర ప్రకాశించుచు ఆ దేవతలకు దేవత్వము సిద్ధించుటకు వారి మనస్సులలో చైతన్య రూపమునఁ బ్రవేశించి ఆవిర్భవించు చున్నాఁడో ఎవఁడు దేవతల గురువగు బృహస్పతి అయెనో, ఎవఁడు దేవతలకన్నా పూర్వుఁడగు హిరణ్య గర్భుఁడో, అట్టి పరబ్రహ్మ స్వరూపమునకు నమస్కార మగుఁ గాక. దేవత లందరును బ్రహ్మ సంబంధమైన చైతన్యమును జ్ఞానముచే నుద్భవింపఁజేయుచు ఆ పరబ్రహ్మ తత్వమును సంబోధించి, ఓ పరమాత్మా! ఏ బ్రాహ్మణుఁడు, మరలజన్మించి నిన్నే విధి ప్రకారము తెలియునో అట్టి బ్రహ్మ వేత్తకు ఎల్ల దేవతలును స్వాధీను లగుచున్నారు. వాఁడే తానా దేవతలకెల్లఱకును అంతర్యామి యగు పరమాత్మ యగుచున్నాఁడు.  ఓ పరమాత్మా! లజ్జాభిమానిని యగు దేవతయును, ఐశ్వర్యాభిమానిని యగు దేవతయును నీ భార్యలు. రాత్రింబవళ్ళే నీ పార్శ్వములు. ఆకాశమందలి నక్షత్రములు నీ రూపము. అస్వినీ దేవతలే నీ ముఖము. అట్టి విరాట్ పురుషుఁడా! మేము కోరు జ్ఞానము నిమ్ము. ఈ ప్రపంచమునందలి సంపదలన్నిటినీ యిమ్ము.ఐహికాముష్మికమైన సమస్తమును దయచేయుము. ఇది 10 వ భాగము. సమాప్తము.
పురుష సూక్తము ముగిసెను.
ఓం తత్సత్. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.