గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఫిబ్రవరి 2010, శనివారం

చెప్పుకోండి చూద్దాం 35.

ప్రియ సోదరీ సోదరులారా!
మహావీరాచార్యుల వారు సంస్కృతమున రచించిన గణిత సార సంగ్రహము అనే గ్రంథమును పావులూరి మల్లన ఆంధ్రీకరించారు. ఈ పావులూరి గణితము నుండి శ్రీ పంతుల జోగారావు తన కథామంజరి బ్లాగులో ఒక ప్రశ్న - దానికి సమాధానము కూడా (పావులూరి రచననుండి) తీసుకొని మనకు చక్కగా వివరించారు. చాలా అనందకర విషయం. వారికి ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.
అలాగే పావులూరి గణితమునుండి ఇక్కడ ఒక ప్రశ్న మీ ముందుంచుతున్నాను. సమాధానంచెప్పుకోండి చూద్దాం.
ఆll
ఆరునొక్కట్ల నొడుపుగా నమరఁబెట్టి,
యంత గుణకంబు చేతను నమరఁబెంచి,
సొరిది వర్ణించి జనులకుఁ జోద్యముగను
హిమకరోపమ లబ్ధంబు నెనయ వచ్చు.
భావముll
111111  X   111111 = ?
వచ్చే సమాధానము చంద్రుని  జీవితంతో సరి పోల్చ దగినట్టుంటుంది.
ఇంకెందుకాలస్యం? సమాధానం పంపండి.
జైహింద్. 
Print this post

3 comments:

కోడీహళ్లి మురళీమోహన్ చెప్పారు...

ఒకపరి నెక్కు చంద్రునకు ఒండొక మారు తగ్గు తేజముల్
ప్రకటిత యాంధ్ర తేజ చతురంబగు ప్రశ్నకు యుత్తరంబిదే
ఒకపరి వ్రాయుమీ వరుస నొండొక మారున ముందు వెన్కలన్
ఒకటియు, రెండు, మూడులును ఒప్పుగ నాలుగు ఐదు యారులన్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధర సమ్మాన్యుఁడ! కోడి హళ్ళి మురళీ! ధన్యాత్మ! మీ రన్నదే
సరియౌనయ్య! భలే వచించితిరి. మీ చాతుర్యమత్యద్భుతం
బరయన్ మారట తగ్గు తేజ మనుటే యత్యంత భావ్యంబయా!
సరి చేయుండది చంపకంబు మొదటన్ సౌజన్య మూర్తీ! కృపన్.

కోడీహళ్ళి మురళీ మోహన్ చెప్పారు...

గురువుగారూ! ఆలస్యానికి క్షంతవ్యుణ్ణి. నా పద్యాన్ని సంస్కరించినందులకు కృతజ్ఞతాభివందనములు. మీ ఆజ్ఞానుసారము సరిచేశాను. చిత్తగించండి.

ఒకపరి నెక్కు చంద్రునకు ఒండొక మారున తగ్గు తేజమున్
ప్రకటిత యాంధ్ర తేజ చతురంబగు ప్రశ్నకు యుత్తరంబిదే
ఒకపరి వ్రాయుమీ వరుస నొండొక మారున ముందు వెన్కలన్
ఒకటియు, రెండు, మూడులును ఒప్పుగ నాలుగు ఐదు యారులన్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.