గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఫిబ్రవరి 2010, మంగళవారం

కవిసమ్రాట్ విశ్వనాథ భావుకత 30 & 31.

http://www.engr.mun.ca/~adluri/telugu/pictures/visvanatha.jpg
కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్య నారాయణ. (1890-1976)
కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు ఉపన్యాసము నుండి కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్ప వృక్షము నందలి భావుకతను వివరిస్తున్న 30 వ&;31 వ భాగములు చూద్దాం.
ఆll
వేప కొమ్మ మీద విరుదించు కాకమ్మ
దీని ప్రశ్న యడుగఁగాను వలయు.
మీకు ననుగు తల్లి కాకమ్మ కాకమ్మ
వనిత ఎపుడు తిరిగి వచ్చు చెపుమ! (కి.కాం.నూ.1-30.)

వేప కొమ్మ పైనుండి కూస్తున్న కాకమ్మను శ్రీరామ చంద్రుఁడు చూసాడు. దానిని ఒక ప్రశ్న వేయా లనుకొన్నాడు. " కాకమ్మా! కాకమ్మా! సీత మీకు తల్లి వంటిది కదా! ఎప్పుడు వస్తుందో చెప్పమ్మా!" అని ప్రశ్నించాడు.
తెలుగు నాట కాకి కూత బంధు జనాగమ సూచకం. చుట్టాలు వస్తారా? అని కాకిని ప్రశ్నించడం, అది కూయగానే చుట్టాలు వస్తారని సంబర పడడం తెలుగుల విశ్వాసం. తరతరాల సంప్రదాయాలు జాతి విశ్వాసాలు మహాకవుల కావ్యాల్లో ఎలా ఒదిగిపోతాయో ఈ వర్ణన వల్ల మనకు తెలుస్తుంది.
రాముఁడు బేలతనంతో కాకిని ప్రశ్నించడం మనల్ని  విషాద హృదయుల్ని చేస్తుంది.
ఆll
గంతువేసి కూయకయ లేచిపోయెను. 
పాడు కాకి ప్రాత పగఁ దలంచి.
తల్లి బిడ్డలకునె చెల్లనీయదు కదా
కోప మెంతయైన కుటిల గుణము. (కి.కా.నూ.స.31.)

శ్రీరాముని ప్రశ్న తరువాత కాకి ఒక గంతు వేసి  కూయకుండానే ఎగిరిపోయింది. కాకికి సీతయందు ఇంకా ప్రాత పగ ఉన్నదని అంటాడు రాముడు. సీత వలన తన జాతికి వచ్చిన ఆపదను తలచుకొని సీతపై కాకి కోపంతో ఉన్నదనీ, కోపము తల్లీ బిడ్డలను వేరు చేయఁగల సామర్థ్యం కలదని శ్రీ రాముడు అనును.
పై పద్యం కాకాసురుని వృత్తాంతం జ్ఞప్తికి తెచ్చును.
శ్లోll
నిమిత్తం లక్షణ జ్ఞానం శకున స్వర దర్శనం
అవశ్యం సుఖ దుఃఖేషు నరాణాం ప్రతిపద్యతే.(వా.రా.అ.కాం. 52-2.)

లక్షణముల జ్ఞానం, కన్ను అదరడం, పక్షుల స్వరాలు వినఁబడుట, మొదలగునవి మానవులకు రాఁబోవు సుఖ దుఃఖాలను సూచిస్తాయని పై  శ్లోకం మనకు వివరిస్తోంది.

మూల రామాయనంలో రావణుఁడు సీతను అపహరించిన పిదప ఒక కాకి ఆకాశంలోకి ఎగిరి, శ్రీరామునకు సీతాపహరణ సూచించినట్లు ఇప్పుడదే కాకి వృక్షముపై కూర్చుండి సంతోషముతో అరుచు చున్నట్లు,
కావున  తనకు సీత లభించ కలదని రాముడు సంతోష పడినట్లు వర్ణింపఁబడింది.
శ్లోll
తాం వినాధ విహంగోzసౌపక్షీ ప్రణదితస్తదా
వాయసః పాదప గతః ప్రహృష్ట మభికూజతి.ll

పక్షీ మాంతు విశాలాక్షాః సమీపముపనేష్యతి - అని కూడా రాముడంటాడు. ఈ పక్షియే నన్ను సీత వద్దకు తీసుకొని వెళ్ళ కలదు. - అని.

కాని కల్ప వృక్షంలో కాకి ప్రసక్తి మాత్రం తీసుకోబడింది. దానిపై అల్లిన వర్ణన మాత్రం పూర్తిగా విశ్వనాథ ప్రతిభా సముద్భూతమే.

వాల్మీకి రామాయణంలోని కాకిని రాముడు హితునిగా భావించగా కల్ప వృక్షంలో ఈ సందర్భంలోనే కాకి రామునికి శత్రువుగా భావింపఁ బడింది.
ఈ మార్పు రస పోషణకు చాలా దోహద పడిందన్న విషయం చెప్పఁబోయే  భాగాల్లో తెలుస్తుంది.

(బులుసు వేంకటేశ్వర్లు, 9949175899)
జైహింద్
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.