ఆర్య సంస్కృతీ సంపన్నులారా!
భగవద్భక్తి పారవశ్యమున మనము దైవ దర్శనార్థమై గుడులూ గోపురాలూ ఎక్కడెక్కడున్నా తెలుసుకొని, శ్రమ దమాదులకోర్చుకొని, వెళ్ళి దర్శించుకొని వస్తాము. ఇది చాలా మహత్తర విషయమే. ఐనప్పటికీ అక్కడ దర్శనం కోసం లంచాలు చెల్లిచడం, దర్శనం సరిగా జరగకపోతే చింతించడం, లాంటి సంఘటనలు మన నిత్య జీవితంలో అనుభవైక వేద్యమే కదా!
ఐతే ఈ దైవ దర్శన పరమార్థం ఏమిటి? అనే విషయం మనకి తెలుసుననుకొంటుంటాం. మనం చేస్తున్న దైవ దర్శనమే చాలా గొప్పదని మనం అనుకొంటే మాత్రం అది అధమాధమ మని చెప్పుతున్న శ్లోకం చూడండి.
శ్లోll
ఉత్తమా తత్వ చింతాచ మధ్యమం శాస్త్ర చింతనం
అధమా మంత్ర చింతాచ తీర్థ భ్రాంత్య z ధమాధమం.
గీll
తత్వ చింతన శ్రేష్ఠము. తలచి చూడ!
శాస్త్ర చింతన మధ్యమ. చక్కనెఱుఁగ
మంత్ర చింతన మధమము మనుజులకును
తీర్థ చింతనయధమాధమర్థి నెఱుఁగ.
భావము:-
తత్వ విచారము ఉత్తమ మార్గము. శాస్త్రచింతన మధ్యమాధికారము. మంత్రోపాసనము అధమ మార్గము. ఇక తీర్థ పర్యటనాభినివేశము అధమాధమము.
ఈ శ్లోకాన్నితప్పుగా అర్థం చేసుకొనే పని లేదు. మనం పై మెట్టెక్కడానికి ప్రారంభం క్రింద మెట్టునించే అని మరువ కూడదు. మనం చేస్తున్న దైవ దర్శనాలు క్రిందిమెట్టుపై వేస్తున్న తొలి అడుగుగా మనం గుర్తించాలి. తద్వారా సంపాదించిన ఆధ్యాత్మిక శక్తితో పైమెట్టుకు, ఆపై మెట్టుకు క్రమంగా తత్వ చింతనకూ చేరాలి.
తత్ త్వం. ఆపరమాత్మయే నీవని గ్రహించాలి. అప్పుడు క్రింది మెట్టులతో పని ఉండదని గ్రహించాలి. అంతే కాదు తప్పైతే నన్ను క్షమించాలి.
జైహింద్.
Print this post
MUSIC CLASSES || Music Classes - Antha Ramamayam - P9 || Sangeetha Kala
-
జైశ్రీరామ్.
జైహింద్.
6 రోజుల క్రితం
1 comments:
క్షమించడం కాదు తమ్ముడు ! నువ్వు చెప్పింది ఖచ్చితమైన నిజం అక్షరలక్షలు హేట్సాఫ్ !
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.