గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, ఫిబ్రవరి 2010, ఆదివారం

ఆర్తి. {మత్తేభ - కంద - గర్భ సీస(గీత)ము(లు).}

http://maayaa.net/yahoo_site_admin/assets/docs/Divya_MangaLa_Swaroopam.208142825.bmp
ఓ సర్వాంతర్యామీ! పరమేశ్వరా!
సీll
సు జనులన్ గాచెడి శోభనాంగ! కరుణా సాంద్రా! మహన్ మానసా! సు పూజ్య!
సు గుణ సాంద్రుల్ నినుఁ జూడఁ గోరును కదా! కోపంబు నీకేల నోపఁ జాల
ని, నను, నీ సేవకునిన్ గనంగ తగదే? నా దైవమా! మోహనా! కృపాబ్ధి!
సుమనమున్ నిన్ దగఁ జూడనీయ తగదే? మాప్రాణమా! దైవమా! మహాత్మ!
గీll
నగవొలుకు నీదు ముఖముఁ గనగ తగదొకొ?   
నాదు ప్రాణ నాథుఁడ! రమణా! నిగమ వి 
రాజ! మొర వినన్ దగదొకొ? రక్షణ నిడ,
మదిఁ దలచుము సతమునసమాన తేజ!
సీస గర్భ మత్తే.ll
జనులన్ గాచెడి శోభనాంగ! కరుణా సాంద్రా! మహన్ మానసా!
గుణ సాంద్రుల్ నినుఁ జూడఁ గోరును కదా! కోపంబు నీకేలనో?
నను, నీ సేవకుఁనిన్, గనంగ తగదే? నా దైవమా! మోహనా! 
మనమున్ నిన్ దగఁ జూడనీయ తగదే? మాప్రాణమా! దైవమా! 
గీత గర్భ కం.ll
నగవొలుకు నీదు ముఖముఁ గ
నగ తగదొకొ?  నాదు ప్రాణ నాథుఁడ! రమణా!
నిగమ విరాజ! మొర వినన్
దగదొకొ? రక్షణ నిడ, మదిఁ దలచుము సతమున్!
జైహింద్.
Print this post

3 comments:

Sandeep P చెప్పారు...

చక్కనైన పద్యాలు వ్రాస్తున్నారు రామకృష్ణగారు! మీ పద్యాలు కచ్చితంగా ఆ శ్రీహరి దృష్టిని చేరగలవు!

మ:-
లత మారాకును వెన్ను చేసుకొనుచున్ లంఘించు చందంబునన్
గతమందెన్నడు చూడలేదు కవితల్ గర్భాలలోనుండుటన్
సతమౌ రీతిగనున్న పద్యచయముల్, సత్కీర్తనల్ జూసి శ్రీ
పతికారుణ్యము జూపడే! పెరిమతో పద్యాలఁభావించుచున్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రియమైన సత్ కవీశ్వరా! దీపూ!
అభినందనలు. ఇంతటి చక్కని కవితామృతాన్ని ఇన్నాళ్ళూ ప్రవహింపఁ జేయకుండా మీలోనే దాచుకోవడం వలన ఆ శారదాంబ సంతసించదు.
మీ కవితావేశాన్ని ఉప్పొంగనివ్వండి.
సజీవమై, శాశ్వితంగానిలిచే కవితా కన్యకలకు జన్మనివ్వండి.
మన అమృతోపమైన ఆంధ్ర భాష జీవభాషగా లోకులు గుర్తించడమే కాదు అద్భుత పడేలాగ, మీ శక్తినుపయోగించి చేయ గలగండి.
మీ కవిత రూపంలో మీరు శాశ్వితత్వాన్ని ఈ లోకంలో పొందండి.
మిమ్మల్ని చూడాలని ఉంది. మీతో మాటడాలని ఉంది. కాని ఎలా?

కంద గర్భ తేటగీతిll
తెలిసెనయ! నీదు నిపుణత. తెలిసెను గద
నీదు శక్తి. తీయని కమనీయ లలిత
కావ్య మధురిమల్. తెలిసెనుగాదె!తమరి
మది. తెలియను గనుట నసమాన దీప!

గర్భ కందము.
తెలిసెనయ! నీదు నిపుణత.
తెలిసెనుగదనీదు శక్తి. తీయని కమనీ
య లలిత కావ్య మధురిమల్.
తెలిసెను గాదె! తమరి మది. తెలియను గనుటన్.

కం.
దీపితమయ్యెను మీమది
దీపితమయె సత్ కవిత్వ తేజము మీలో.
దీపితము కానిదొక్కటి.!
ఏ పగిదిన్ మిమ్ముఁజూతు నెప్పుడు? దీపూ!

మీ అభిమానానికి కృతజ్ఞుఁడను.

Sandeep P చెప్పారు...

కందగర్భతేటగీతి!

తే:-
తీపికవితలల్లి తమరు దీపమగుచు
బాట మాకు తిరముగ జూపన్ మురియుచు
చూపరులు బాగుబాగన రూపుగ కవ
నము నుడివెద రుటముగ నే రామ! మాన్య!

కం:-
తీపికవితలల్లి తమరు
దీపమగుచు బాట మాకు తిరముగ జూపన్
చూపరులు బాగుబాగన
రూపుగ కవనము నుడివెద రుటముగ రామా!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.