గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, డిసెంబర్ 2009, గురువారం

మేలిమి బంగారం మన సంస్కృతి 74.( తేటగీతి గర్భ కందము.)

4 comments


ప్రియ పాఠక బంధువులారా!
సమాజానికికంటక ప్రాయంగా ఉండే దుర్మార్గుల విషము లోను, కంటకముల విషయము లోను రెండు పరిష్కార మార్గాలు ఈ క్రింది శ్లోకంలో సూచించ బడ్డాయి. చాలా చక్కని సూచన చేయఁబడింది. గమనించండి.
శ్లో:-
ఖలానాం, కంటకానాంచ, ద్వివిధైవ ప్రతిక్రియా!
ఉపానన్ముఖ భంగోవా, దూరతోవా విసర్జనమ్.
తే.గీ.:-
ఖలునకునుకంటకమునకు నలతిగ తగి
న ప్రతిక్రియల్ రెండు గనన్ గలవిల.
చెప్పున ముఖమున్ మడచుటొ,తప్పుకొ్నుటొ,
తగు,మనకది పరగునయ్య! సుగమ మిదియె. 
తే.గీ. గర్భ కందము 4పాదాలు 4రంగుల్లో.:-
ఖలునకునుకంటకమునకు నలతిగ తగి
న ప్రతిక్రియల్ రెండు గనన్ గలవిల.
చెప్పున ముఖమున్ మడచుటొ,తప్పుకొ్నుటొ,
తగు,మనకది పరగు(న్ + అ)నయ్య! సుగమ మిదియె. 
భావము:-
దుష్టులకు, ముండ్లకు  ప్రతి క్రియ రెండే విధములు.  చెప్పుతో ముఖ భంగము చేయుటో, తప్పుకొని దూరముగా పోవుటో, ఈ రెండే తగిన మార్గములు.

నా అనువాదమైనతేటగీతి పద్యముననే కందపద్యము కూడా గర్భితమై యున్నదన్న విషయమును మీకు  స్పష్ట పరచఁ  గలిగాననుకొంటున్నాను. గమనింప మనవి.
జైహింద్.

30, డిసెంబర్ 2009, బుధవారం

చెప్పుకోండి చూద్దాం.33.

1 comments

ప్రియ పాఠకులారా! ఈ క్రింది పద్యంలో గల ఔచిత్యంతో కూడిన అర్థాన్ని చెప్పుకోండి చూద్దాం.
తే.గీ:-
హరి కుమారుడై యొప్పు నాతడు హరి !
హరికి దక్షిణ నేత్రమౌ నాతడు హరి !
హరికి శిరము తోడ వరలు నాతడు హరి !

హరికి వామాక్షమై యొప్పు నాతడు హరి !

అర్థం కాలేదా?
ఐతే శ్రీ పంతుల జోగారావు గారి బ్లాగు " కథామంజరి " లోచూసి తెలుసుకొని తెలియఁజేయవచ్చునని మనవి.
లేదా దీనిపై వచ్చిన కామెంట్ చూడ మనవి.
జైహింద్.

ద్వ్యర్థి శ్లోకమున కనువాద పద్యము.

1 comments

ప్రియ సాహితీ బంధువులారా!
శ్లో:-
య:పూతనా మారణ లబ్ధ వర్ణ:,
కా కోదరోయేన వినీత దర్ప:,
యస్సత్యభామా సహితస్సపాయా
న్నాధో యదునా మధనా రఘూణామ్!(రచన:- కోలాచలం పెద్దిభట్టు)
తే.గీ:-
లక్ష్య పూతనామారణ లబ్ధ కీర్తి,
ఉగ్ర కాకోదరో వినీతోద్ధతియును,
తుష్టి సత్యభామా సహితుండు నయిన
కృష్ణ రాముఁడు మిమ్ము రక్షించుఁ గాక!
రాముని పరముగా అన్వయార్థ దండాన్వయములు.:-
లక్ష్య = లక్ష్యముతోఁ గూడిన,
పూత=పవిత్రమైన
నామా=పేరు గలవాడును,
రణ = యుద్ధము చేయుటయందు,
లబ్ధ కీర్తి=లభించిన కీర్తి గలవాడును,
ఉగ్ర =భయంకరమైన
కాకోదరో(కాక+ఉదర:)=నిర్భయముగ ప్రవర్తించు కాకాసురుని యొక్క, 
వినీతోద్ధతియును=గర్వాపహారియును,
తుష్టి =తృప్తి కరముగా,
సత్య=సత్య వర్తియు,
భా=ప్రకాశవంతమైనవాడును,
మా సహితుండు నయిన=లక్ష్మితో కూడిన వాడును అయిన,
కృష్ణ =నీలి వర్ణుడయిన,
రాముఁడు=శ్రీరాముడు, 
మిమ్ము రక్షించుఁ గాక=మిమ్ములను కాపాడును గాక!
దండాన్వయము:-
లక్ష్యముతోఁ గూడిన పవిత్రమైన పేరు గలవాడును, యుద్ధముఁ జేయుట యందు లభించిన కీర్తి కలవాడును, నిర్భయముగ ప్రవర్తించు భయంకరుడగు కాకాసురుని యొక్క గర్వాపహారియును, తుష్టుగా సత్యప్రవర్తకుడును, కాంతివంతుడును,గృహ రాల్య లక్ష్మితో కూడుకొన్నవాడును, నీలి వర్ణుడయిన శ్రీరాముడు మిమ్ములను కాపాడు గాక!
కృష్ణుని  పరముగా అన్వయార్థదండాన్వయములు:-
లక్ష్య =లక్ష్యమును కలిగి,
పూతనా=పూతన యను రాక్షసిని,
మారణ =చంపుట చేత,
లబ్ధ కీర్తి=లభించిన కీర్తి కలవాడును,
ఉగ్ర =భయంకరమైన,
కాకోదరో=కాళియుడను సర్పము యొక్క, 
వినీతోద్ధతియును=అణచివేయఁబడిన గర్వము కలవాడును,
తుష్టి =తృప్తికరముగ,
సత్యభామా సహితుండు నయిన=సత్యభామా సహితుడును అయిన,
కృష్ణ = కృష్ణుడను పేరుతోగల,
రాముఁడు=రమ్య మూర్తి, 
మిమ్ము రక్షించుఁ గాక= మిమ్ములను కాపాడును గాక.
దండాన్వయము:-
లక్ష్యమును కలిగి పూతన యను రాక్షసిని చంపుట చేత లభించిన కీర్తి గలవాడును, భయంకరమైన కాళీయుఁడను సర్పము యొక్క గర్వ మడంచిన వాడును, తృప్తికరముగ సత్యభామతో కూడి యున్నవాడును,  రమ్యమూర్తి యగు కృష్ణుఁడు మిమ్ములను రక్షించుఁ గాక!
జైహింద్.

మేలిమి బంగారం మన సంస్కృతి 73.

0 comments

మహోదయులారా!
సామాన్యులకు, మాన్యులకు గల భేదం ఒక చిన్న శ్లోకం వ్యక్తం చేస్తోంది. గమనించండి.
శ్లో:-
అయం నిజ:? పరో?వేతి గణనా లఘు చేతసామ్.
ఉదార చరితానాం తు వసుధైక కుటుంబకమ్.
క:-
నావారా? పైవారా?
ఏవార?లటంచు హీను లెంతురు ప్రజలన్.
భూవలయ సంస్థిత ప్రజ
నావారని తలతు రెపుడు నయత నుదారుల్.
భావము:-
ఎదుటి వారిని వీరు నాకు సంబంధించిన వారా? లేక పై వాళ్ళకు సంబంధించిన వారా/ అనేటువంటి హీనులకే ఉండును. విశాలమైన హృదయము కలవారలకు ఏ భూమిపై గల జనులందరు ఒకే కుటుంబము అనే భావనే ఉండును.
జైహింద్.

29, డిసెంబర్ 2009, మంగళవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 72.

1 comments

సాహితీ ప్రియులారా!
మానవత్వము పరిమళించే మనము  మన  నిత్య కృత్యములలో  తెలిసియు, తెలియకయు పాప కార్యములు చేయుచుందుము. తెలిసి చేసిన పాపానికి పరిహారము కర్మానుభవమే. మరి తెలియక చేసిన పాపము మన దృష్టికి వచ్చినచో ఆ జరిగిన పాపానికి మనము చాలా చింతిస్తూ ఉంటాము. ఆ విషయమై ఒక చక్కని శ్లోకము మనకు పూర్వీకులందించి యుండిరి. దానినిటఁ జూడుడు.
శ్లో:-
కృత్వా పాపం హి సంతప్య, తస్మాత్  పాపాత్ ప్రముచ్యతే.
నైవ కుర్యాత్ పున రితి నివృత్యా పూయతే తు స:.
క:-
తెలియక పాపముఁ జేసినఁ
గలఁగి, మదిఁ దపింతు మేని కలుగదు పాపం
బలసత నికఁ జేయ ననుచుఁ
దలచినచో  తద్విముక్తి  తధ్యము మనకున్.
భావము:-
పాప కార్యము మనకు తెలియ కుండానే మనము మనచేఁ జేయఁబడినచో, అదితెసిన పిదప ఆ పాప భీతితో ఆవేదనకు లోనగుదుము. అట్టి తఱి తద్ విషయమై మిక్కిలి పశ్చాత్తాపముతో ఇకపై జాగరూకతతో మెలగి ఇట్టి పాపములు జరుగ కుండా చూచుకొందునని మనము దృఢచిత్తులమయి నిశ్చయించుకొన్నచో తెలియక చేసిన పాపము వలన కలిగిన దోషము  ఆ పశ్చాత్తాపముతోనే పరిహారమగును.
అలసత్వము వీడి జాగరూకతతో పాపదూరులమై మనము ప్రవర్తింతుము గాక.
జైహింద్.

28, డిసెంబర్ 2009, సోమవారం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్త కోటికి శుభాకాంక్షలు.

0 comments





భగవద్బంధువులారా!
వైకుంఠ ఏకాదశి పర్వ దిన సందర్భంగా మీఅందరికీ శుభాకాంక్షలు.
మ:-
భగవద్భక్తులు పుణ్యభూమి సభికుల్. వైకుంఠ యేకాదశిన్
నిగమాంతున్, హరి, నుత్తరాభిముఖునిన్, నిత్యున్, మనోజ్ఞాకృతున్,
సొగసుల్ గాంచఁగ నేగి, పొంగిరి కదా సొంపార దర్శించి. యా
నిగమాంతుండు కృపాకటాక్షములతో నిత్యంబు గాచున్ మిమున్.
జైహింద్.

తిరిపతి వేంకట కవులు 1.

2 comments

కవి, పండిత, పాఠకావతంసులారా!
తిరుపతి వేంకటాఖ్య కవి  
ధీమణు లిర్వురు నొక్క జంటయై
గరువము తోడ నాంధ్ర మున  
కమ్మని సత్ కవితాంభుధిన్ సృజిం
చె. రుచిర పద్య పాటవము  
చే కొనఁ జాలిన పండితాళికిన్
నిరువురు చేవఁ జూపుచు య  
ధేచ్ఛగ పద్యము లల్లి చెప్పిరే!
అట్టి అద్భుత శతావధానులయిన ఆ మహా కవి
పుంగవులను చిత్రములందైననూ నేడు కనఁ గలుగు చున్న మన మెంతటి భాగ్యవంతులమో కదా!
ఆమహనీయులు సరస్వతీ మాతకు ముద్దు బిడ్డలు. లేఖకుడు వ్రాయలేనంత వేగముగా ఆశుధారగా ఆ సుధనే ధారగా ఆ తల్లి ఆముద్దు బిడ్డల నోట ముద్దు ముద్దుగా పలికించడమే కాదు, అహంభావ కవులకు అక్షరాలతో వాతలు కూడా పెట్టించేది. అంతటి ప్రతిభాశాలురా జంట కవులు.
ఆ జంట కవుల పూర్తి నామధేయములు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి.
దివాకర్లవారిది పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం తాలూకా, ఎండ గండి గ్రామం.
తల్లిదండ్రులు:-శేషమ - వేంకటావధాని.
ప్రజోత్పత్తి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ దశమీ బుధవారం జననం.(1872).
చెళ్ళపిళ్ళ వారిది తూర్పు గోదావరి జిల్లా,ధవళీశ్వరం సమీపమున గల కడియము గ్రామం.
తల్లిదండ్రులు:- చంద్రమ్మ - కామయ్య.
ప్రమోదూత నామ సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశీ సోమ వారం.(1870)
ఈ జంట కవులు  నర్మోక్తులతో, హాస్య సంభాషణతో, చతుర వచో విలాసంతో, సభాసదులను ఆనంద పరవశుల్ని చేసే వారు. వాగ్గాంభీర్యంతో ప్రత్యర్థుల్ని అవాక్కయేలా చేసేవారు. సరస సంభాషణలో కూడా వీరుతక్కువవారేంకాదు.
ఒకపర్యాయం వీరు మండపేటలో కళాభిజ్ఞత, లోకజ్ఞత, రసజ్ఞత గల " మణి " అనఁబడే వేశ్యను చూచి, ఆమె చేసిన నాట్యాన్ని చూచారు. చాలా సంతోషింఛారు. అభినందించారు.
అంతటితో ఊరుకోక ఆమెతో కొంటెగా " మణి మామూలుగా ఉండే కంటే " కడియం " లో ఉంటే సార్థకత లభిస్తుంది. శోభస్కరంగా ఉంటుంది. అన్నారు. (వారిది కడియం గ్రామమేకదా! అక్కడుంటే--- ఊఁ ----అన్ని విధాలా చాలా బాగా ఉంటుందని వారి నర్మ గర్భ సంభాషణా సారాంశం.)
వెంటనే ఆమె ఆకవులతో చమత్కారం ఉట్టిపడేలాగా సమాధానం చెప్పి వారిని మరింత మెప్పించింది.
ఏమందో చూడండి.
మహాకవులు మీకు తెలియని దేముంది? స్వచ్ఛమైన మణి (ఆమె నిర్మల అన్న మాట.)కడియంలో ఉంటే యేమిటి? పేటలో(మండపేట, ఆమె నివాస గ్రామం) ఉంటే యేమిటి?
వెంకట శాస్త్రిగారి చతురతకు దీటైన చతురతనామె కనఁబరచింది కదూ?
మీకు తెలిసిన మరి కొన్ని ఈ కవులకు సంబంధించిన విషయాల్ని వ్యాఖ్య ద్వారా పంపండి.
జైహింద్.

27, డిసెంబర్ 2009, ఆదివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 71.

0 comments

సాహితీ ప్రియులారా!
కొన్ని కొన్ని విషయాలలో మనం కొంత నియమ బద్ధంగా ఉండక తప్పదు. అలా కాని నాడు గౌరవము లోపించే అవకాశం లేకపొలేదు.
ఈ క్రింది శ్లోకాన్ని చూస్తే మనకు అవగతమగును.

శ్లో:-
వస్త్రేణ , వపుషా, వాచా, విద్యయా, వినయేనచ,
నకారైః పంచభిర్హీనః వాసవోపి న పూజ్యతే.

తే:-
ప్రథిత వస్త్రము, దేహము, వచనములును,
విద్య, వినయము లవి లేని వేల్పునైన
గౌరవింపదు లోకము. కాన వాని
నరసి వర్ధిల్లఁ గలిగిన సురుచిరమగు.

భావము:-
వస్త్రము, వపుస్సు, వాక్కు, విద్య, వినయము, ఈ ఐదు వకారములతో హీనుడైన వాడు వాసవుడే ఐననూ పూజింపఁ బడఁడు కదా!

జైహింద్.

నే పొందిన సజ్జన సాంగత్య ఫలం.

2 comments




మిత్రులారా! ఆ పరమాత్మ మనకు సజ్జన సాంగత్యం సంప్రాప్తింపఁ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.
" కథామంజరి " బ్లాగరు శ్రీ పంతుల జోగారావు.M.A., మంచి మంచి సాహిత్యాంశాలను మనముందుంచుతున్నారు. అవి మన మానసోల్లాస కరంగా ఉంన్నాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
వారి ప్రశ్నలకు నా స్పందనలను కొన్ని మీ ముందుంచుతున్నాను. గమనించ మనవి.


పంతుల జోగారావు | Posted in the blog KATHAMANJARI on Saturday, December 12, 2009 | in the label " మన సాహితీ సంపద"


రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం
భాస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రీ
యిత్థం విచింతయతి కోన గతే ద్విరేఫే
హా ! హంత హంత ! నళినీం గజవుజ్జహార !


దానికి సమాధానంగా నేను వ్రాసిన పద్యం.
క:-
రాతిరి ఆయెను, చిక్కితి,
పూతలుపులు మూసుకొనగ.పూజ్యుడు సూర్యుం
డేతరి వచ్చెడు నని, యలి,
వేతు ననెను. రాత్రి పీఁకివేసెను గజమున్.
(చింతా రామకృష్ణారావు. Said On Saturday, December 12, 2009)




22-12-2009.వ తేదీని జోగారావుగారు తన కథామంజరి బ్లాగులో ఉంచిన ప్రశ్న.
నక్షత్రము గల చిన్నది
నక్షత్రము చేత బట్టి, నక్షత్ర ప్రభున్
నక్షత్రమునకు రమ్మని
నక్షత్రము పైన వేసి నాధుని పిలిచెన్ !!


దానికి నా ప్రత్యుత్తరం తిలకించండి.
క:-
ఉత్తర భరణిని చేఁ గొని,
యత్తఱి యభిమన్యుఁ బిలిచె నాశగ తనతో
నెత్తఱి మూలకు రమ్మని
మత్తుగ చెయి వేసి పైన. మహనీయుండా!


ఈ నా సమాధానానికి ఆ కవిగారి స్పందన చూడండి.
క:-
చుక్కల చిక్కుల పేరిట
చిక్కని పద్యము నొసగఁగ చింతా వారూ !
చక్కగ వివరించిరి కద !
మిక్కిలిగా నాదరింతు మదిలో మిమ్మున్. !


సజ్జన సాంగత్యఫలాన్ని ఈ విధంగా పొందిన నేను అదృష్టవంతుడనుగా భావిస్తున్నాను.
మరి మీరేమంటారు?


జైహింద్.

26, డిసెంబర్ 2009, శనివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 70.

1 comments

శ్లోll
అకృత్వా పర సంతాపం అగత్వా ఖల మందిరం
అక్లేశయత్యచాత్మానం యదల్ప మపి తద్బహుః.
తే.గీll
పరుల సంతాప హేతువై ప్రబల రాదు.
చెడుగు సహవాసమెన్నడు చేయరాదు.
సుకృత లేశంబులవియెయౌన్ చూచుచుండ
ఘనతరంబుగ మనకిది కనగ నగును.
భావము
ఇతరులకు సంతపము కలిగించకయు; ఖలులతో సహవాసము చేయకయు; గావించిన కొలది సుకృతములు కూడా మహత్తరమైనవగుచున్నవి.
ఈ క్రిందిశ్లోకాదులు మేలిమి బంగారం మన సంస్కృతి 62.న గలవి పునరుక్తమైనవి.

పాఠక మహాశయులారా!
సంసార విష వృక్షముపై జీవనము సాగించు చున్న మానవాళికి అమృతోపమైన ఫలములను గూర్చితెలియఁజేస్తున్న ఒక మంచి శ్లోకం ఉంది. చూడండి.
శ్ల్లో:-
సంసార విష వృక్షస్య ద్వే ఫలే అమృతోపమా.
కావ్యామృత రసాస్వాదః, సంగమ స్సజ్జనై స్సహ.
గీ:-
అరయ సంసార విష వృక్షమందు రెండు
ఫలము లమృ తోపమము లుండె, భవ్యమైన
కావ్య సుధఁ గ్రోలు టొక్కటి, ఘనతఁ గన్న
సజ్జనులతోడి సన్మైత్రి సలుపు టొకటి.
భావము:-
సంసారమనే యీ విష వృక్షమునకు అమృతోపమైన ఫలములు రెండే రెండు కలవు. ఒకటి కావ్యామృత రసాస్వాదనము, రెండు సజ్జన సాంగత్యము.
ఇవి అనుభవైక వేద్యాలు మాత్రమే. ఆవిషయం మీకూ తెలియనిది కాదు కదా!
జైహింద్.

మేలిమి బంగారం మన సంస్కృతి 69.

0 comments

మిత్రులారా!
మానవులమైన మనం నిత్యం సుఖ దుఃఖాల ననుభవిస్తూ సుఖానుభూతిలో ఎంత కాలాన్నైనా లెక్ఖ చెయ్యం కాని, దుఃఖాన్ని అనుభవించ వలసి వస్తే మాత్రం చాలా ప్రతిస్పందింస్తూ, గడుపుతున్న ప్రతీ ఒక్కక్షణమూ వెత చెందుతూ, ఆఖరికి దైవానికి మొరపెట్టుకొంటాం.
ఐతే దుఃఖ హేతువులైన అనుభవాలన్నీ కూడా మన కర్మఫలాలుగా గ్రహించ లేము. సరి కదా, వీటికి మరెవరో కారణమని నిందిస్తూ ఉంటాము.
ఈ క్రింది శ్లోకాన్ని చూడండి.

శ్లో:-
రోగ, శోక, పరీతాప, బంధన, వ్యసనానిచ,
ఆత్మాపరధ వృక్షాణాం ఫలాన్యేతాని దేహినాం.

క:-
మనిషికి రోగము, శోకము,
ఘన బంధన, వ్యసనము లివి కలుగుట, తన చే
సిన కర్మ విష ఫలంబులు.
మనమునఁ గని చేయకుంట మంచిది మనకున్.

భావము:-
మనుజులకు రోగము, దుఃఖము, పరితాపము, బంధనము, వ్యసనము మొదలైనవి తాము గావించు తప్పు పను లనెడి విష వృక్షము యొక్క ఫలములే సుమా.

పైన చెప్పిన విషయం యదార్థానికి దర్పణం పట్టుతోంది కదూ?

జైహింద్.

25, డిసెంబర్ 2009, శుక్రవారం

మీరూ చెప్పండి, నిజమో కాదో?

5 comments

మిత్రులారా!
మనం చూస్తున్నాం నేటి కుహనా రాజకీయ వేత్తల రాజకీయాలు.
ఎందరో వారి మాటల మాయా జాలంలో పడి ధన మాన ప్రాణాలనే కాక, విలువైన విద్యను, భవిష్యత్ ను కూడా నష్టపోయిన వారినీ, నష్టపోతున్న వారినీ మనం చూస్తున్నాం కదా!

అందుకే పూర్వీకులు మన సాహిత్యంలో నిక్షిప్తం చేసిన అపార లోకానుభవ అద్భుత సారాన్ని పాఠాలతో పాటు మనం చదువుకోవడం ద్వారా తెలుసు కొని, విచక్షణతో మసలుకో గలిగిన సత్తా సంపాదించుకోవాలి.

తద్విరుద్ధంగా ఈ నాటి పాఠ్య ప్రణాళికలుండడంతో ఆ అవకాశమే లేనినేటి తరం ఎన్నోఅనర్థాలకు లోనౌతోందనిపిస్తోంది.
చూడండి ఒక చక్కని శ్లోకంలోఎంత అద్భుతమైన నగ్న సత్యాన్ని తెలియఁ జేసారో మన పూర్వీకులు.

శ్లో:-
నగణస్యాగ్రతో గచ్ఛేత్. సిద్ధే కార్యే సమం ఫలం.
యది కార్య విపత్తిశ్యాత్ ముఖరస్తత్ర హన్యతే.

క:-
గణమునకు మొదట నడువకు.
కనఁగ ఫలము సమము మనము గణమున నిలువన్.
అనుకొనని చెడులు కలిగిన
మును గల జనములకు కలుగు మును చెడు ఫలముల్.

భావము:-
గుంపునకు ముందు ఎప్పుడూ పోవద్దు.పని సానుకూలమైతే ఫలితం అందరకు సమమే. కాని ఎదురు తిరిగినట్లైతే ముందున్నవాళ్ళు తత్ ఫలితంగా బాధను అనుభవించ వలసి ఉంటుంది.

స్వార్థంతో ఆలోచిస్తే మాత్రం నిజమే అనిపిస్తోంది కదండీ!

జైహింద్.

24, డిసెంబర్ 2009, గురువారం

ఇల్లరికం అల్లుళ్ళూ! ఏమి భోగమయ్యా మీది!

5 comments

సుగుణ వందితులారా!
ఒక్కొక్క పర్యాయం మనకు కొన్ని కొన్ని శ్లోకాలు భలే బాగుండడమే కాదు ఒక్కొక్కసారి అవి యదార్థానికి దర్పణాలుగా కూడా తోస్తాయి. ఈ క్రింది శ్లోకాన్ని మీరే చూడండి.

శ్లో:-
అసారే ఖలు సంసారే సారం శ్వశుర మందిరం!
హిమాలయే హర శ్శేతే! హరి శ్శేతే మహోదధౌ!

ఆ:-
సార హీనమైన సంసారమందున
సార మయము అత్త వారి యిల్లు.
హరుడు హిమ గృహమున, హరి పాల కడలిని
నిండు మనముతోడ నుండెఁ గాదె!

భావము:-
సార హీనమైన యీ సంసారమునందు అత్తవారిల్లే (మామగారిల్లే) సారవంతంగా ఉంటుంది. అందుకే గదా పరమ శివుడు తాను తన అత్తవారిల్లైన (మామగారిల్లైన) హిమాలయ పర్వతముపై కైలాసమున నివసించుచున్నాడు? సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా తన అత్తవారిల్లైన(మామగరిల్లైన) పాల కడలలోనే నివసిస్తున్నాడు? ఎంత సారవంతమైనవి కకపోతే అలా ఉంటారు?

జైహింద్.

23, డిసెంబర్ 2009, బుధవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 68.

0 comments

ఆర్యులారా!
మనకు యోగ్యమైన వాటిని మనము పొందాలుకున్నప్పుడు ఎచ్చట నుండైనను స్వీకరింప వచ్చుననే ఒక చక్కని విషయాన్ని తెలియఁ జేసే శ్లోకాదులను చూద్దాం.

శ్లో:-
స్త్రియో, రత్నా, స్తథా విద్యా , ధర్మం, శౌచం, సుభాషితం,
వివిధాని చ శిల్పాని, సమాధేయాని సర్వతః ll

తే:-
తరుణి, రత్నంబు, విద్యయు, ధర్మబుద్ధి,
శుచియు, సద్భాషణములు, శిల్ప చయములను
యెచ్చటున్నను గొన వచ్చు, నిచ్చ యున్న.
సద్గుణంబులఁ గలిగిన సరళిఁ గనుచు.

భావము:-
తరుణీ్రత్నము, రత్నము, విద్య, ధర్మము, సదాచారము, మంచి మాట, సుందర శిల్పములు, ఇవి ఎక్కడ నుండి యైనను స్వీకరింప వచ్చును.

జైహింద్.

22, డిసెంబర్ 2009, మంగళవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 67.

2 comments

సుజ్ఞాన సంపన్నులార!
మనము గ్రహింపఁ దగినవి ఎందుండైనను గ్రహింపఁ దగునని ఒక చక్కని శ్లోకము కలదు. దాని నిపు డరయుదము. చూడుడు.

శ్లో:-
విషాద ప్యమృతం గ్రాహ్యం, బాలాదపి సుభాషితం.
అమిత్రాదపి సద్ వృత్తం, అమేధ్యాదపి కాంచనం.

తే:-
సుధను విషము నందున్నను వెదకి, గొనుత.
బాలునుండైన గొనుత సద్ భాషణంబు.
శత్రునుండైన సద్వృత్తి చక్కఁ గొనుత.
స్వర్ణము నమేధ్యమున నున్నఁ జక్కఁ గొనుత.

భావము:-
అమృతమును విషమునందున్నట్టిదానినైనను గ్రహింప వచ్చును. మంచి మాటలను చిన్న పిల్లవాడు చెప్పుచున్నవైనను గ్రహింప వచ్చును. మంచి నడవడికను శత్రువు నుండియు గ్రహింప వచ్చును. బంగారమును అపవిత్ర స్థలమునందున్నదియైనను గ్రహింప వచ్చును.

అందుకేనేమో మృత్యువుతో పోరాడుచున్న తన శత్రువైన రావణాసురునుండి రాజనీతిని గ్రహించ వలసినదిగా లక్ష్మణుని రాముడు ఆదేశించి ఉంటాడు. అంటే మనం మంచియన్నదానినెక్కడనుండైననూ గ్రహించ వచ్చునని గ్రహించాలి.

జైహింద్.

21, డిసెంబర్ 2009, సోమవారం

తేదీ.22 - 12 - 2009. ప్రపంచ గణిత దినోత్సవము

0 comments

సహృదయ రంజకులారా!

శ్లో:-
యథా శిఖా మయూరాణాం - నాగానాం మణయో యథా
తద్వ ద్వేదాంగ శాస్త్రాణాం - గణితం మూర్ధని వర్తతే.

నెమళ్ళకు శిఖలు వలెను, పాములకు మణుల వలెను, వేద వేదాంగ శాస్త్రము లన్నింటికినీ శిరస్సున అంటే అగ్ర భాగమున గణితము ఉన్నది, అని వేదాంగ జ్యోతిష గ్రంథమున కలదు.

నేను గణితంద్వారానే సత్యాన్ని గ్రహిస్తాను అన్నారు శ్రీనివాస రామానుజన్
తేదీ. 22 - 12 - 2009. న " ప్రసిద్ధ భారతీయ గణిత మేథావిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన " మన యీ శ్రీనివాసరామానుజన్ జన్మ దినోత్సవము.

దీనిని ప్రపంచ గణిత దినోత్సవముగా జరుపు కొను చున్న సందర్భముగా గణిత విద్యా పారంగతులకు, గణిత శాస్త్రాభిమానులకు శుభాకాంక్షలు.

జైహింద్.

20, డిసెంబర్ 2009, ఆదివారం

పూజా ప్రారంభ సమయంలో గంట ఎందుకు వాయిస్తారో తెలుసా?

6 comments

భగవద్బంధువులారా!
మనం పూజా సమయంలో గంట మ్రోగిస్తాం. ఎందుకో తెలుసా?
తెలుసుకోవాలనుకొంటే ఏ క్రింది శ్లోకాన్ని, అనువాద పద్యాన్ని, చూడండి.

శ్లో:-
ఆగమార్థంతు దేవానాం - గమనార్థంతు రాక్షసాం
కురు ఘంటా రవం తత్ర - దేవతాహ్వాన లాంఛనం.

గీ:-
దేవతల రాక కొఱకని తృప్తిఁ గొలుప,
రాక్షసుల పోక కొఱకు, పరాకు లేక
గంట వాయించు టొప్పును, గర్భ గుడిని,
దేవ తాహ్వాన పద్ధతి తెలియఁ దగును.

భావము:-
పూజా సమయంలో మనం పూజించే దేవతలు అక్కడికి రావడం కొఱకు, మన బాహ్యాంతర ప్రదేశాల నుండి రాక్షసులు పోవడం కొఱకు, గంట మ్రోగించ వలెను. దేవతల నాహ్వానించు లక్షణము ఇదేసుమా.

దోషములు న్నచో తప్పక తెలియఁ జేసి, సరి చేయఁ బ్రేరేపించ మనవి.

జైహింద్.

చెప్పుకోండి చూద్దాం 32 కు నా వివరణ.

0 comments

శ్రీమ దాంధ్రామృ తాస్వాదనా లోలులారా!
దీనికి ముందు టపాలో "చెప్పుకోండి చూద్దాం 32" కు శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారు కామెంట్ ద్వారా చక్కని వివరణను కొంత వరకు ఇచ్చి యున్నారు. నాకు తోచిన వివరణను మీముం దుంచుతున్నాను. దోషము లుండకపోవు. కంటఁ బడితే మాత్రం వెంటఁ బడి మరీ చెప్పి, సరిచేయండి.
ఇక పరిశీలించండి.


తే:-
అతివ కచ నాభి జఘన దేహాననము " త
మీనదరసాలతారాజపా " నిరాక
రణ మనంతమనాది నేత్ర గళ భుజ న
ఖోష్ఠ కుచ వచో దంతంబు లుభయ గతుల.
భావము:-
1:-
అతివ యొక్క
-- కచ ----- నాభి ------ జఘన ------ దేహ --------ఆననము లతో
-- తమీ ---- నద ------- రసా---------లతా -------- రాజ.
-- చీకటి. --- సుడి ------ భూమి ------ లత ---------చంద్రుడు. సరి పోలును.
నిరాకరణ మనంత = అంతమందలి "పా" విడిచిపెట్ట వలెను.


2:-
అనాది = ఆది అక్షరమైన "త" విడిచి పెట్టినచో.
---నేత్ర ---- గళ -------- భుజ ------- నఖ ----------ఓష్ఠ ములతో
---మీన----దర---------సాల---------తారా----------జపా
---చేప. --- శంఖము.----ప్రాకారము---నక్షత్రములు.-- మంకెనపువ్వు.
సరి పోలును.


3:-
కుచ వచో దంతము లుభయ గతులు = ఆద్యంత్యాక్షరములను తొలగించి అనగా ఆద్యక్షరము "త". అంత్యాక్షరము"పా". అను రెండిటినీ విడిచిపెట్టి చూడఁ దగును


--- కుచ --------------- వచో ------------------------ దంతము లకు
---మీనద---------------రసాల-----------------------తారా
---కుంభములు(?)------తీయ మామిడి రసము--------నక్షత్రములు
సరిపోలును.


అని నే నూహిస్తున్నాను. ఇంతకన్నా యుక్తమైన సమన్వయం మీకు తోచినచో తప్పక తెలుపఁ గలరని ఆశిస్తున్నాను.


జైహింద్..

19, డిసెంబర్ 2009, శనివారం

చెప్పుకోండి చూద్దాం 32.

6 comments

సాహితీ బంధువులారా!
ఒక చక్కని తేట గీతం అత్యద్భుతమైన భాషా పాటవాన్ని, అర్థ సౌష్టవాన్ని కనఁబరుస్తోంది.
మీరూ దీనిని చదివిన పిదప, ఆ పద్యాంతర్గత భావ పాటవాన్ని వెలికి తీసే ప్రయత్నం చేయాలనే ఆసక్తితో ఉంటారనే ఉద్దేశంతో మీ ముందుంచుతున్నాను. ప్రయత్నించి చూడండి.


తే:-
అతివ కచ నాభి జఘన దేహాననము " త
మీనదరసాలతారాజపా " నిరాక
రణ మనంతమనాది నేత్ర గళ భుజ న
ఖౌష్ఠ కుచ వచో దంతంబు లుభయ గతుల.


చూచారుకదా! మఱెందు కాలస్యం? ప్రయత్నించండి. మీ కామెంట్ ద్వారా పాఠకుల కందించుదురని ఆశిస్తున్నాను.
సమాధానం తెలియకపోతే కామెంట్స్ లో ఉంది. చూడండి.


జైహింద్.

18, డిసెంబర్ 2009, శుక్రవారం

తేదీ 28 - 10 - 2009. ఏ వారమో లెక్ఖ చేసి తెసుకొందాం.

6 comments

ఆర్యులారా!
దీని ముందు టపాలో ఒక ఆంగ్ల తేదీ చెపితే అది ఏవారమో ఏ పద్ధతి ప్రకారం తెలుసుకోవాలో వివరించఁ బడింది కదా!
ఇప్పుడు దానికి ఉదాహరణను ప్రయోగాత్మకంగా చేసి చూద్దాం.

తేదీ 28 - 10 - 2009. ఏ వారమో చెప్పండి?
అని అడిగారే అనుకొందాం. దానికి సమాధానం ఎలా పడికట్టాలో క్రింద పరిశీలిద్దాం.
దీనికి సమాధానం. గమనించండి.
సంవత్సరములు 1900 ఒక లెక్ఖ.
తరువాత మళ్ళీ ప్రారంభమవుతుంది సంవత్సరం.
ఉదాహరణ:-1999 అనుకొందాం.
1999-1900=99 అవుతుంది
2009 అనుకొంటే 2009-1900=109. వస్తుంది.
ఇప్పుడు ఆ 109 ನಿ 4 చే భాగించగా { శేషాన్ని విడిచిపెట్టాలి.} వచ్చిన భాగ ఫలాన్ని ఆ 109 కి కలపాలి.
తరువాత తేదీని దానికి కలపాలి.
ఆతరువాత నెలకు గల సంకేత సంఖ్యను కలపాలి.
నెల సంఖ్య:----- 1 - 2 - 3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12.
సంకేత సంఖ్య:---1 - 4 - 4 - 7 - 2 - 5 - 7 - 3 - 6 --01 -04 - o6.
అని గుర్తుంచుకోవాలి.
అప్పుడు
ఆ మొత్తాన్ని 7 చే బాగించగా వచ్చిన శేషం 1 ఐతే> ఆది, 2 > సోమ, 3 > మంగళ, 4 > బుధ, 5 > గురు, 6 > శుక్ర, O > శని వారము. అని గుర్తించి చెప్పాలి.
ఊదా:-
తేదీ 28 - 10 - 2009 ఏ వారము?

సమాధనం:-
2009 - 1900 =109.
109 ని 4 చే భాగించగా భాగ ఫలం = 27. { శేషాన్ని విడిచిపెట్టెయాలి.}
109 కి ఆ భాగ ఫలాన్ని అనగా 27 ను కలుపగా 136 అయింది. దానికి
తేదీ అయిన 28 ని కలుపగా 164 అయింది. ఆ తరువాత
164 కు ఆంగ్ల మాసమైన అక్టోబరు కు గల సంకేత సంఖ్య అయిన 1 ని కలుపగా 165. అయింది.
165 ను 7 చే భాగించగా మిగిలిన శేషము 4 వచ్చింది. అంటే బుధ వారమన్న మాట.

ఈ పర్యాయం మీరూ ప్రయత్నంచేసి, తేదీ.15-8-1947. ఏ వారమో లెక్ఖ చెసి నిరూపించగలరేమో ప్రయత్నంచగలరు
అలాగే మీరు పుట్టిన తేదీని, మీ పిల్లల పుట్టిన తేదీలను, వివాహాది ముఖ్యమైన తేదీలను ఏ వారాలో పడికట్టండి.

జైహింద్.

17, డిసెంబర్ 2009, గురువారం

చెప్పుకోండి చూద్దాం 31.ఒక ఇంగ్లీషు తేదీ చెప్పితే అది ఏ వారమో ఎలా చెప్పాలి?

2 comments

ప్రియ పాఠక మహోదయులారా!
ఎవరైనా ఒకరు ఆంగ్ల తేదీని చెప్పి " ఏ వారమో చెప్పండి చూద్దాం ", అని అడిగితే అయ్యో, అది నాకు రాదే అని మీరేమీ జంకకండి.
ఉదాహరణకి:- 15-8-1947 అని తేదీ ఇచ్చారనుకోండి.
ఈ క్రింది పద్ధతి నర్థం చేసుకొని, ప్రయత్నించండి.
తెలియకపోతే మీ సందేహం తెలపండి.
ఇప్పుడు నేను వ్రాసిన ఈ క్రింది పద్యాలను చూడండి.

సీ:-
ఈప్సితమగు(Date) తేది నిచ్చిన దానిలో
వత్సరమ్మును ముందు పట్టవలయు.
పందొందివందలు పరిధిగా గమనించి
పై పడ్డ సంఖ్యను పట్టి, పిదప
భాగించి నాల్గుచే, భాగఫలముఁ గల్పి,
తేదీని కలిపినఁ దేలు కొంత.
మాస సంకేతమ్ముమరల దానికి కల్పి,
ఏడుచే భాగింపనేది మిగులు?
తే:-
శేష మొకటైన ఆది గా చెప్పవలయు.
రెండు మూణ్ణాల్గు ఐదారు నిండు సున్న
సోమ మంగళ బుధ గురు శుక్ర శని
వారమును తెల్పి వర్థిల్ల వచ్చు మనము.

ఆ:-
ఆంగ్ల తిథికి వార "మాంధ్రామృతము" మీకుఁ
జెప్పె. జనవ(JANUARY)రాది కొప్పు వరుస
నొ్కటి, నాల్గు, నాల్గు. ఒద్దికతో ఏడు,
రెండు. ఐదు, ఏడు, ఉండు, పిదప
మూడు, ఆరు, ఒకటి, ముచ్చట తో వచ్చు
నాల్గు, ఆరు, వచ్చు. నయత నొప్పు.
ఆంగ్ల మాస క్రమము నరయు పద్ధతి యిదే.
ఆర్యులార! దీని నరసి కనుడు.

ఇంతేనండి. ఈ మాటు ఏతేదీ ఏవారమో అన్న విషయాన్ని మీరే అద్భుతంగా చెప్పఁగలరు.
అర్థమైంది కదండీ! ఐతే ఇక ప్రయత్నించండి.
ఉదాహరణకు మీరు పుట్టినతేదీ, లేదా మీకు ముఖ్యమైన తేదీ తీసుకోండి. యత్నించి సాధించి తెలియఁ జేయండి.

జైహింద్.

16, డిసెంబర్ 2009, బుధవారం

చెప్పుకోండి చూద్దాం 30.

2 comments

సుజ్ఞాన సంపన్నులారా!
అజ్ఞాతకవి రచించిన ఈ క్రింది చాటువును చదివి సమాధానం చెప్పుకోండి చూద్దాం.

క:-
నగ పగతు పగతు పగతుకు
పగతుండౌ మగధ రాజుఁ బరిమార్చిన యా
జగ జెట్టి యన్న తండ్రికి
తగువాహన మైనయట్టి ధన్యుడవు భళా !

జైహింద్.

15, డిసెంబర్ 2009, మంగళవారం

కొంటె బొమ్మల బాపు - గుండె ఊయలనూపు.

3 comments



బాపూ! నీ తలి,దండ్రి, నీకొఱకు యే ప్రఖ్యాతమౌ దేవతల్
ప్రాపున్బొందఁగ వారిఁ గొల్చిరొ కదా? భాగ్యంబు పండన్, నినున్
తా పూజా ఫలమట్లు పొందెఁగదయా! ధన్యాత్ములైనారు. నీ
ప్రాపున్మానవ జాతికూడ వెలిగెన్. ప్రఖ్యాత చిత్రాళితోన్.

బాపూ గారికి జన్మ దిన శుభాకాంక్షలు !

జైహింద్.

14, డిసెంబర్ 2009, సోమవారం

చెప్పుకోండి చూద్దాం 29.

5 comments

ఆర్యులారా!
మనం కొన్ని కొన్ని విషయాలు ఎన్ని పర్యాయాలు విన్నా సరే మళ్ళీ వింటున్నప్పుడు వినాలనే అనిపిస్తాయి. అందుకు కారణం ఆ విషయాలలోనున్న చమత్కారం. కొన్ని కొన్ని పద్యాలైతే ఆలోచనామృతాలే అనిపిస్తాయు.

ఇప్పుడొక తమాషా పద్యాన్ని మళ్ళీ మనం చూద్దాం. గద్వాలు సోమరాజును పొగడుతూ ఒక కవి ఎంత గమ్మత్తుగా ఆకాశానికెత్తాడో మీరే చూడండి.

నలుగురు బలికిరి సరియని
నలుగురు బలి కిరి సురూప నయ దాన ధరా
వలయ ధురా చరణోన్నతి
పొలుపుగ గద్వాల సోమ భూపాల నకున్ !

గద్వాల సోమ భూపాలుడికి సురూప నయ దాన ధరావలయ ధురాచరణోన్నతిలో నలుగురు బలికిరి సరియని నలుగురు బలికిరట.

మీకేమైనా అర్థం సుగమ మనిపిస్తోందా? నాకైతే ఆలోచింపచేస్తోందే కాని సుగమ మనిపించటం లేదు. కొంచెం లోతుగా వివరణాత్మకంగా ఆలోచించి, కవి ఉద్దేశంలో నుండే అభిప్రాయాన్ని వ్రాయ వలసినదిగా మనవి చేసుకొనుచున్నాను.

జైహింద్.

13, డిసెంబర్ 2009, ఆదివారం

చెప్పుకోండి చూద్దాం 28

6 comments

సాహితీ ప్రియులారా!

చెప్పుకోండి చూద్దాం అనే శీర్షికలో ఉంచిన అన్నిపద్యరూప ప్రశ్నలకూ చక్కగా స్పందించి కొందరు వచన రూపంలోను, ఎక్కువమంది పద్య రూపంలోను చక్కగా సరైన సమాధానాలిచ్చారు. అందరికీ నాహృదయపూర్వక అభినందనలతోపాటు కృతజ్ఞతలు.

రోజు మీ ముందుకొస్తున్న ప్రశ్నకు కూడా మీ నుండి ప్రతిస్పందన చక్కగా ఉంటుందని నమ్ముతున్నాను.

చూడండి ప్రశ్నేంటో.

తే:-

అరయ నాల్గక్షరముల శివాఖ్య యొప్పు

వాని తలఁ గొట్ట యిందిరా వల్లభుడగు.

వాని తలఁగొట్ట నర్థంబు భర్త యగును.

అట్టి పదమేదొ తెలుపుడీ! ఆర్యులార.

చూచారు కదా! మరెందు కాలస్యం? వెంటనే సరైన సమాధానాలు పంపండి.

జైహింద్.

12, డిసెంబర్ 2009, శనివారం

చెప్పుకోండి చూద్దాం 27.

5 comments

ప్రియ పాఠకులారా!
ఈ క్రింది పద్యంలోని ఆంతర్యాన్ని గ్రహించి సమాధానం చెప్పుకోండి చూద్దాం.

ఆ:-
వేయి కనులు గలిగి వెలయు. ఇంద్రుడు కాడు.
కాళ్ళు నాల్గు కలిగి కాదు పశువు.
నరుడు పట్టకున్న నడువగా జాలదు.
దీని భావమేమి? తిరుమలేశ.

మీరు సునాయాసంగా చెప్పెస్తారని నాకు తెలుసు. అందుకే మీ సమాధానంకోసం ఎదురు చూస్తుంటాను.
వీలైతే ఛందో బద్ధంగా చెప్పి పాఠకుల నానంద పరవశుల్నిచేయండి.

జైహింద్

11, డిసెంబర్ 2009, శుక్రవారం

చెప్పుకోండి చూద్దాం 26.

4 comments

సహృదయ బంధూ!
ఈ క్రింది కందంలో గల ప్రశ్నకు సమాధానం చాలా సులువే మీకు. అఈ సమాధానం చెప్పడమే కాక అది ఛందో బద్ధంగ కందంలాంటి దానిలో చెప్పితే చాలా ఆనందం కలుగుతుంది మన ఉభయులకే కాక తదితర పాఠకులకు కూడా.
గమనించండి.

క:-
కర చరణంబులు కలిగియు
కర చరణ విహీను చేత కర మరుదుగ తా
జల చరుడు పట్టు వడెనని
శిర హీనుడు చూచి నవ్వె చిత్రము కాగన్.

చూచారుగా! మరింకెందుకాలస్యం? వెంటనే ప్రయత్నించి పంపండి.

జైహింద్.

10, డిసెంబర్ 2009, గురువారం

చెప్పుకోండి చూద్దాం 25

4 comments

పాఠకా! సులభంగా కనిపించే ప్రశ్నలు కూడా ప్రశ్నలే. తప్పించుకొనే యత్నం చెయ్యక సమాధానం చెప్పండి.

క:-
ఎద్దీశున కశ్వంబగు?
గ్రద్దన నేదడవితిరుగు ఖర కంటకియై?
హద్దుగ నేవాడు ఘనుడు?
పద్దుగ నుత్తరములిందె పడయంగానౌన్.

ప్రశ్న1: ఏ+అది=ఎద్ది = ఏది, ఈశునకు = ఈశ్వరునకు, అశ్వంబు + అగు = వాహనమై ఉంది ?
------- ఈశ్వరుని వాహన మేది?

ప్రశ్న2: గ్రద్దన = శీఘ్రముగా, ఏది + అడవి లో = అడవిలో ఏది, ఖర కంటకియై = ముండ్లతో, తిరుగు = తిరుగుతుంది ?
---------అడవిలో ముండ్లతోతిరిగే జంతువేది ?

ప్రశ్న3: హద్దుగ = నిర్దిష్టముగా, ఏ + వాడు = ఏవాడు = ఎటువంటివాడు , ఘనుడు = గొప్పవాడు ?
---------నిర్దిష్టముగా ఎటువంటి వాడు గొప్పవాడు ?


సమాధానం టపాలో ఉంచుతారు కదూ?
ఆఁ. ఒక్క విషయం మరువకండీ--- సమాధానాలు పై పద్యంలోనుండే గ్రహించి వ్రాయాలండోయ్.
ఇక పంపండి.

జైహింద్.

9, డిసెంబర్ 2009, బుధవారం

చెప్పుకోండి చూద్దాం 24.

4 comments

ప్రియ సాహితీ పిపాసా తప్త హృదయులారా! ఈ క్రింది పద్యాలలో ఒక కవీశ్వరుడు, ఒక నెఱజాణయైన వేశ్యల మధ్య జరిగిన చతుర సంభాషణను గమనించండి.
సమాధానాలను రాబట్టి కామెంట్ ద్వారా తెలియఁజేయ గలందులకు మనవి.

ఇక చూడండి్ కవీశ్వరుని చలోక్తి.

తే:-
పర్వతశ్రేష్ఠ పుత్రిక పతి విరోధి,
అన్న పెండ్లాము అత్తను గన్న తండ్రి,
ప్రేమ తోడుత వానికి పెద్ద బిడ్డ !
సున్నమిట్టుల తేగదే సుందరాంగి?


నెఱజాణ యగు వేశ్య ప్రత్యుత్తరము:-

క:-
శత పత్రంబుల మిత్రుని
సుతు జంపిన వాని బావ సూనుని మామన్
సతతము తల దాల్చిన శివ
సుత వాహన వైరివైరి సున్నంబిదిగో.

సమాధానం పంపుతారు కదూ!
ఇటువంటి పద్యములు మన ఆంధ్ర సాహితీ జగత్తులో అనంతముగా కలవు.
మీరు మీకు తెలిసిన ఆహ్లాద జనకమైన యిటువంటి పద్యములు పంప గలిగినచో అందరికీ మన ఆంధ్రామృతము ద్వారా పంచ గలనని మనవి చేయు చున్నాను.

జైహింద్.

8, డిసెంబర్ 2009, మంగళవారం

చెప్పుకోండి చూద్దాం 23.

4 comments

సులభంగా చెప్ప గలిగిన చిన్న ప్రశ్న నిస్తున్న గీతపద్యాన్ని చూడండి.
సమాధానం వ్రాస్తారని ఆశిస్తాను.

గీ:-
ఒక్క ఉద్యోగి పేరు నాల్గక్కరములు.
మొదటి వర్ణంబు చెరపిన కదన మగును.
మూడవది చెరుపగ హస్తమునకుఁ జెల్లు
అట్టి ఉద్యోగి యెవ్వడో అరసి చెపుడు.

తప్పక సమాధానం వ్రాసి పోష్ట్ చేస్తారుకదూ!

జైహింద్.

దండం దశ గుణం భవేత్.

7 comments

దండం దశ గుణం భవేత్. అంటారుకదా! ఆ దశ గుణాలూ ఏవో మీకు తెలుసా? తెలుసుకోవాలనుందా?
ఐతే చూడండి.

శ్లో:-
విశ్వామిత్రాహి పశుషు - కర్దమేషు జలేషుచ
అంధే తమసి వార్థక్యే - దండం దశగుణం భవేత్.

ఆ:-
పక్షి, కుక్క, శత్రు, పాము, పశులఁ ద్రోల,
చేతి కర్ర మిగుల చేవఁ జూపు.
బురద, నీరు, రేయి, ముసలి, గ్రుడ్డియుఁ గల్గ
చేతికర్ర దాటఁ జేయు మనల?

భావము:-
పక్షులు, కుక్కలు, అమిత్రులు, పాములు, పశువులు, వీటిని పారద్రోలుటకున్ను, బురదలో, నీళ్ళలో, చీకటిలో, గ్రుడ్డితనంలో, ముసలితనంలో అవలంబనంగానున్ను, చేతి కర్ర పనికివస్తుంది. అందుచేతనే దండం దశ గుణం భవేత్ అంటారు.

జైహింద్.