జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ పొన్నెకంటి సూర్యనారాయణ రావు కవి కృత
సూర్య శ్రీరామము గ్రంథావిష్కరణ సందర్భముగా సమర్పించిన
సన్మాన కుసుమాంజలి.
రచన…చింతా రామకృష్ణారావు. తే. 05 – 03 – 2025.
శా. శ్రీమన్మంగళ సత్సభాసదులకున్, శ్రీ బేతవోల్ వంశజుల్
రామబ్రహ్మము గారికిన్, సురభికిన్, బ్రఖ్యాత జంధ్యాలకున్,
శ్రీమంతంబగు కావ్యమై పరగ నీ శ్రీ సూర్య శ్రీరామమున్
బ్రేమన్ వ్రాసిన పొన్నెకంటి కవికిన్, నే మ్రొక్కెదన్ విజ్ఞతన్.
శా. శ్లోకంబుల్ శతకోటి దేవతతికిన్ జూపించు బ్రహ్మంబు న
స్తోకంబౌ వర బ్రహ్మ తత్త్వమును నీశుండెంచె నీ ధాత్రిపై
శ్రీకల్యాణ కరంపు గ్రంథ కృతిగా చేయింప వాల్మీకిచే
శ్లోకంబుల్ పదివేలు నాల్గుపదివేల్ శోభిల్లఁ వ్రాయించెనే.
ఉ. శ్లోకములందునుండుటను చూచియు నేర్వగలేని వారికిన్
శ్రీకరమైన తెల్గున ప్రసిద్ధపు సద్వచనంబులోన మీ
రేకముగా రచించిరి మహిన్ సుకరంబుగపాఠకాళికిన్
మీకు శుభంబులౌ ధరణి, మేలగు పాఠక సజ్జనాళికిన్.
ఉ. రాముని సచ్చరిత్రమగు రమ్యతనొప్పెడి శ్లోకరాజికిన్
ధీమతి! బ్రహ్మవిద్యను గతిన్ విడనీయక రామవృత్తమున్
క్షేమము గూర్ప లోకులకు శ్రీకరమార్గమునందు వ్రాసిరే,
రాముఁడు మిమ్ముఁ గాచు తన రాజ్ఞిని గూడి నిరంతరంబుగా.
ఉ. మంగళమౌత మీకు, శుభ మంగళముల్ తమ పత్నికిన్, సదా
మంగళమౌత పాఠక సమంచిత మూర్తులకెల్ల ధాత్రిపై,
మంగళమౌత శాంభవికి, మంగళముల్ సభనున్నవారికిన్,
మంగళమౌత శ్రీహరికి, మంగళముల్ మన భారతాంబకున్.
మంగళమ్ మహత్ శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.