గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, జనవరి 2019, శుక్రవారం

11వ పద్యపక్షము టీవీ సీరియళ్ళు - సమాజంపై ప్రభావం. రచన. చింతా రామ కృష్ణా రావు.

జైశ్రీరామ్.
11వ పద్యపక్షము 
టీవీ సీరియళ్ళు - సమాజంపై ప్రభావం.
రచన. చింతా రామ కృష్ణా రావు.
౧. ఆటవెలది త్రయ గర్భ సీసము. 
శ్రీపతి కనిపించు చేతనత్వముఁగొల్పు - రమ్మని పిలిచేమొ రారు జనులు.
దూరదర్శనమున దూరిపోదురు వారు - కాంచు కాంక్ష వలన, కనుము కృష్ణ!
బుల్లితెరను వచ్చు పుంఖానుపుంఖాల - నాటక క్రమదృష్టి నాట మదిని
చేటు కలుఁగఁ జేయు చిత్ర దర్శనమబ్బె. - మానవాళిఁ గనుమ మనిచి, కృష్ణ!
ఆ.వె. చూచువారి మదికి సూదంటురాయియే - దూరదర్శన మనివారణమయె.
ధనముచేసుకొనెడి మనమె కానఁగవచ్చు. - ప్రబలె దీని మహిమ. పాపు కృష్ణ!
౨. ఆటవెలది త్రయ గర్భ సీసము. 
సమయ పాలనమున సాక్షులై కనిపించు - బుధులు చూడ మరిగి విధులు మరచి
దూరదర్శనమున సారించి మనమును - దూరుదురయ దానిఁ గోరి కృష్ణ!
దూరదర్శన క్రమ భూరి దుర్గతి నాడు - వారు కూడ విడువఁ గోరు మగల
నాడువారి మనసులాకట్టుకొనునవి. - చెడ్డమార్పు లొసగుఁ జేటు కృష్ణ!
ఆ.వె. మంచియు చెడు నుండు మన దూరదర్శినిన్ - సమయపాలనమది జరుగనీదు.
కాలగతిని మరచి కాంచుటన్ వికటించి - జీవితములు సమసిపోవు కృష్ణ!
౩. ఆటవెలది త్రయ గర్భ సీసము.( నామ గోపన చిత్రము )
దూర దర్శనమున దురితంబులే చేయు - టీ వ్యవస్థ మరగు పృథ్వి పైన.
విలువలన్ విడుతురు విగత నైతికముల - వీక్షణమునఁ జేసి వినుత కృష్ణ!
విలువలెంచని మది నలముకొనదె యుదా - సీనత? మనకింక చెడుటె మిగులు.
ఇహ పరములపైన నేరీతిగా కల్గు - రిక్త జీవుల కనురక్తి? కృష్ణ!
ఆ.వె. ధర్మదూరులగుచు తరియింప లేక జ్ఞే -  ము నిలం దెలియక యలమటింత్రు.
అంతులేని కథల ననురక్తిఁ గనుచు, క్రు - ళ్ళుచు, కృశింతురు కలఁగుచును కృష్ణ!
౪. శా. కర్మంబియ్యది దూరదర్శనగతుల్ కాలుష్యసంపూర్ణముల్.
మర్మాతీతగుణాతిరిక్త కథలన్ మంత్రించు దృశ్యాళిచే
నైర్మల్యంబగు మానవాళి కలఁగున్ నారీజనోత్ప్రేరణన్
దుర్మార్గంబగు చిత్ప్రవృత్తి, కలుగున్ దుస్తంత్ర దుర్మార్గముల్..
౫. ఉ. కాలమునాహరించు కలికాలపు ధర్మమనంగ పెచ్చు, స
చ్చీలములన్ హరించు, వివశీకృతులౌనటు చేయునెల్లరన్.
గోలగనావరించు, గుణకోవిదునైనను మార్చు నద్దిరా!
యేలికలున్ గ్రహింపరె యహీన దురంతపు దూరదర్శనిన్.
స్వస్తి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
టీ.వీ . సీరియళ్ళూ " అన్న అక్షరములను పొందు పరచిన ఆటవెలదులు మరింత అద్భుతముగా నున్నవి . అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.