గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, జనవరి 2019, శనివారం

12వ పద్యపక్షము భారత రాజ్యాంగము అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ. రచన. చింతా రామ కృష్ణా రావు.

జైశ్రీరామ్.
12వ పద్యపక్షము 
భారత రాజ్యాంగము అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛ.
రచన. చింతా రామ కృష్ణా రావు.
౧. ఆటవెలది త్రయ గర్భ సీసము. 
శ్రీనివాసమదియె స్వేచ్ఛకు నిలయము - పలుకవచ్చు ధనము బలము చేసి.
భారతావనినిట ప్రకటింప భావముల్ - స్వేచ్ఛ లేదు నిజము వినుమ కృష్ణ!
స్వేచ్ఛ కలదటంచు వెలువరించితిమేని, - తుచ్ఛులైన నరులు తునుమ వచ్చు.
భావప్రకటనంబు ప్రాణంబులకు తెచ్చు - ముప్పు నిజము చూడ పూజ్య కృష్ణ!
ఆ.వె. మనసులోకలదని మాటలాడ తగదు. - మనుజులున్న లోక మార్గమెఱిఁగి.
బ్రతుకవచ్చు మనము ప్రఖ్యాతమెఱుఁగుచు, - బ్రతుకు బాట కనుచు రమ్య కృష్ణ!
౨. ఆటవెలది త్రయ గర్భ సీసము. 
స్వేచ్ఛ కలదటంచు నిచ్ఛానుసారము - మంచి చెడ్డలు విడి మాన్య జనుల
పరువు మంటఁ గలుపు ప్రకటనలనుచేయు - మూర్ఖ లధికమైరి పుడమిఁ గృష్ణ!
స్వేచ్ఛ కలుగనౌను. తుచ్ఛత సరికాదు. - భంగ పరుప రాదు పరుల శ్వేఛ్చ.
అట్టి భావప్రకటనంబునే రాజ్యాంగ - మొసగెనయ్య కనఁగ వసుధ కృష్ణ!
ఆ.వె. మాటలాడనగును మనభావమునుదెల్ప. - నోటి మాట, వినిన తోటివారి
యాత్మగౌరవమును హాని పరుపరాదు. - భావ భాగ్యమపుడె ప్రబలు కృష్ణ!
౩. ఆటవెలది త్రయ గర్భ సీసము. 
సమసమాజమునను సభ్యతా సంస్కార - ములను వీడఁ దగదు మూలమదియె.
భావప్రకటనంచు వాచాలురైనచో - శిక్షతప్పదపుడు శ్రీశ కృష్ణ!
వ్రాతలందయినను భాషణంబందైన - భావ ప్రకటనాన వరలుసుగతి
నీవు కనుచు మంచి నేర్పుమా ప్రజలకు - నేర్పు మీర జనులు నేర్వ కృష్ణ!
ఆ.వె. భావ ప్రకటనాన బ్రహ్మస్వరూపంబు - జూపు వారు ఘనులు. శోభిలుదురు.
మంచిఁ గొలిపి మాకు మర్యాద దక్కించు. - మంగళములు నీకు మహిత కృష్ణ!
శా. సర్వంబున్ తమదేయటంచు తలచే సంస్కార హీనుల్ మహద్
గర్వాంధంబున సంచరించుచు సదా గణ్యంపు రాజ్యాంగమున్
సర్వోదంచిత భావ స్వేచ్ఛ సుగతిన్ సర్వంబు వక్రించుచున్
నిర్వీర్యంబొనరించుచుండిరి మహిన్ నిస్తేజతన్ గొల్పుచున్.
ఉ. స్వస్తి జగాళికిన్ గొలుపు, స్వస్తిని గొల్పును భావ శ్వేచ్ఛ. వి
శ్వ స్తుతమై రహించు ప్రజ పద్య సుపక్షము ద్వాదశాకృతిన్
ప్రస్తుతిఁ గాంచు ధర్మము. పరాత్పర దర్శన మానసాళికిన్
స్వస్తిని గొల్పితీరు.. గుణ వర్ధక మంగళమీకు కృష్ణయా!
స్వస్తి.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.