గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 26వ శ్లోకం. 187 - 191. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోసముద్రవసనావాసా బ్రహ్మాండశ్రేణిమేఖలా (శ్రోణి)

పంచవక్త్రా దశభుజా శుద్ధస్ఫటికసన్నిభా 26  

187. ఓం *సముద్రవసనావాసా*యై నమః

నామ వివరణ.

సముద్రమనెడి వస్త్రమునే ఆవాసముగా కలిగిన తల్లి.

కంఅసమానవు! ధీ జలధిని

వసనముగా కల *సముద్రవసనావాసా!*

వసుధను నీ సేవకునిగ

రసరమ్య కవిత్వ ఖనిగ ప్రబలింపుము నన్.

188. ఓం *బ్రహ్మాణ్డశ్రేణిమేఖలా*యై నమః

నామ వివరణ.

విశ్వశ్రేణిని మొలత్రాడుగా కలిగిన జనని.

కంబ్రహ్మజ్ఞానాసక్తుల్

*బ్రహ్మాణ్డశ్రేణిమేఖలా!* నినుఁ గనినన్

బ్రహ్మజ్ఞానము కలుగును,

బ్రహ్మజ్ఞానంబు నాకుఁ బట్టుగ నిమ్మా.

189. ఓం *పఞ్చవక్త్రా*యై నమః

నామ వివరణ.

విశాలమయిన ఐదు ముఖములు కలిగిన జనని.

పంచచామరము.

విశాలపంచవక్త్రవమ్మ! విశ్వశాంతిఁ గొల్పుమా.

విశిష్ట! *పఞ్చవక్త్ర!* నీకు ప్రీతినంజలించెదన్,

ప్రశాంత చిద్విరాజమాన భవ్య భావన ప్రభల్

ప్రశస్తిగానొసంగుమానిరంతరంబు గొల్చెదన్.

190. ఓం *దశభుజా*యై నమః

నామ వివరణ.

పది భుజములు కలిగిన తల్లి మన అమ్మ.

కందశదిశలన్ భుజములుగా

*దశభుజ!* నీవొప్పుచుండి ధరియించితె యీ

నశియించు దేహమందున

నశియింపని నీవు కలిగి నన్ గృపఁ గనితే.

191. ఓం *శుద్ధస్ఫటికసన్నిభా*యై నమః

నామ వివరణ.

స్వచ్ఛమయిన పటిక్వలె శుద్ధమయినది మన అమ్మ.

కంఆశలు చెలరేగుచు నా

శ్రీశునిపై ధ్యాసఁ దప్పఁజేయుచునుండెన్,

శ్రీ శక్తీ! కావగ రా

వా! *శుద్ధస్పటిక సన్నిభా!* ననుఁ బ్రోవన్

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.