గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఆగస్టు 2020, శనివారం

ఆత్మలింగార్చన. చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఆత్మలింగార్చన. చింతా రామకృష్ణారావు.
౧. అమరి యున్నది మనలోన నాత్మలింగ
మదియె ప్రాణంబు నడిపించునదియె మనల.
మంచి మార్గము సూచించు మనము నడువ.
వినక చెడినచో మనఖర్మ విజ్ఞులార!

౨. దేహముననున్న శివదేవుఁ దెలియరేల?
మోహమున భ్రాంతి జలధిలో మునుగుటేల?
మంచి చెడ్డల శివదేవుఁ గాంచి నిరత
మాత్మలోపల నర్చించ యతఁడు మెచ్చు.

౩. జ్ఞాన జలధారతో శివున్ బ్రాణ శక్తి
ననవరత మభిషేకమ్మునాచరించు
టన్నదభిషేకమగునయ్య మన్ననమున.
నారికేళాదులవి బాహ్యచారులకగు.

౪. ఆత్మ నిలుపని యభిషేక మనవసరము.
అంగజుని వైరి మనలోని లింగమూర్తి.
భావనా సుధనమరిచి భక్తితోడ
నాత్మనభిషేక మొనరింతు రాత్మవిదులు.

౫. ఆకసంబున నమరియున్నణువణువున
చూడ శివలింగమే యుండు వీడకుండ.
తత్ శివుని మన మాత్మలో తలచి వలచి
ప్రేమతోఁ జూచి పూజింప శ్రేయమగును.
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.