గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, ఆగస్టు 2020, శనివారం

శ్రీమద్వినాయక చతుర్థి సందర్భంగా దండక గర్భ సీస మాలిక.

జైశ్రీమన్నారాయణ.
ఆర్యులారా!
ఈ రోజు శ్రీమద్వినాయక చతుర్థి. మన బుజ్జి గణపయ్య మనిళ్ళకు వచ్చి మనకు నచ్చిన పదార్ధాలను నైవేద్యంగా పెట్టితే సంతోషంగా ఆరగిస్తాడు. మన పనుల కెక్కడా ఆటంకం రాకుండా ఉండేలా అనుగ్రహిస్తాడు. అట్టి పవిత్రమైన ఈ పండుగ సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
ఆ గణపతిని మనం మనసారా ప్రార్థిద్దాం.

దండక గర్భ సీస మాలిక.
శ్రీమన్మహాదేవ! శ్రీవిఘ్ననాథుండ మాయింటికిన్ వచ్చి మహిత నీవు
మమ్మున్ గృపం జూచి, మా పూజలన్ గొంచు, మాశ్రద్ధనే మెచ్చి మన్ననమున
మేమిచ్చు పండ్లన్ సమస్తంబు సంతృప్తి గానారగించంగ కరుణతోడ
మాకోర్కెలన్ దీర్చ మాపజ్జనుండంగ ప్రార్థింతుమోదేవ భక్తితోడ
సిద్ధిన్ సుబుద్ధిన్ ప్రసిద్ధంబుగా నీవు నీవెంట రప్పించి నిత్య శుభద!
కొల్వుండు మాయింట కూర్మిన్ మమున్ గాంచు, క్షుత్తాపమున్ దీర్చు శుభ్రతేజ!
మాయింట పిన్నల్ నమస్కారముల్ జేసి మాతోడు నీవుండి మంచిగాను
యాటాడమంచున్ ప్రయత్నంబునేచేయు నీతోడ నాడంగ, నిష్కళంక
బాలుండవీవున్ గృపాయత్త చిత్తంబుతోనాడరావయ్య, మాననీయ!
శ్రీ పార్వతీ పుత్ర మా పాపలన్ గాంచి మా పాపముల్ బాపి మహిమఁ గనుమ,
యేబాధలున్ లేని యే దుస్థితుల్ రాని మాభావి కల్పించ శోభగూర్చ
నీవే సమర్ధుండ వీవేమముం గాచుమేవేళలోనైన నీప్సితదుఁడ!
నీ పాదముల్ తప్ప, నేనెంచగా నేర్వ నన్యంబు లేదింక ననవరతము
నీపై మనంబుంచి నే పద్యముల్ వ్రాసి నీకే సమర్పింతు నేర్చినంత
జ్ఞానప్రదాతా! గణాధీశ!రమ్మింక నీదివ్య భక్తాళి నిత్య శుభద
గాంచంగ వేగమ్మె. కన్పించగా రమ్ము కారుణ్యమొప్పార ఘన సుచరిత!
నే వేచితిన్ స్వామి నిన్నున్ గనన్ దేవ! వేగంబుగా రమ్ము ప్రీతితోడ
జ్ఞానప్రపూర్ణా నమస్తే నమస్తే!న - మస్తే నమః కాంచుమా మనోజ్ఞ!
తే.గీ. ప్రార్థనన్ మది వినుమయ్య భక్త సులభ!
వందనమ్ములు కొనుమయ్య సుందరాంగ!
చవితి పూజను చేసినన్ సదయఁ గనుచు
మమ్ముగాంచెడి గణపతీ! మంగళములు.

సీసమాలిక గర్భస్థ దండకము
శ్రీమన్మహాదేవ! శ్రీవిఘ్ననాథుండ మాయింటికిన్ వచ్చి
మమ్మున్ గృపం జూచి, మా పూజలన్ గొంచు, మాశ్రద్ధనే మెచ్చి
మేమిచ్చు పండ్లన్ సమస్తంబు సంతృప్తి గానారగించంగ
మాకోర్కెలన్ దీర్చ మాపజ్జనుండంగ ప్రార్థింతుమోదేవ
సిద్ధిన్ సుబుద్ధిన్ ప్రసిద్ధంబుగా నీవు నీవెంట రప్పించి
కొల్వుండు మాయింట కూర్మిన్ మమున్ గాంచు, క్షుత్తాపమున్ దీర్చు
మాయింట పిన్నల్ నమస్కారముల్ జేసి మాతోడు నీవుండి,
యాటాడమంచున్ ప్రయత్నంబునేచేయు నీతోడ నాడంగ,
బాలుండవీవున్ గృపాయత్త చిత్తంబుతోనాడరావయ్య,
శ్రీ పార్వతీ పుత్ర మా పాపలన్ గాంచి మా పాపముల్ బాపి
యేబాధలున్ లేని యే దుస్థితుల్ రాని మాభావి కల్పించ
నీవే సమర్ధుండ వీవేమముం గాచుమేవేళలోనైన
నీ పాదముల్ తప్ప, నేనెంచగా నేర్వ నన్యంబు లేదింక
నీపై మనంబుంచి నే పద్యముల్ వ్రాసి నీకే సమర్పింతు,
జ్ఞానప్రదాతా! గణాధీశ!రమ్మింక నీదివ్య భక్తాళి
గాంచంగ వేగమ్మె. కన్పించగా రమ్ము కారుణ్యమొప్పార
నే వేచితిన్ స్వామి నిన్నున్ గనన్ దేవ! వేగంబుగా రమ్ము
జ్ఞానప్రపూర్ణా నమస్తే నమస్తే!న - మస్తే నమః.

 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.