గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఆగస్టు 2018, బుధవారం

దేశమంటే మట్టి కాదా? బ్రహ్మశ్రీ బులుసు వేంకటేశ్వర్లు.

జైశ్రీరామ్.
దేశమంటే మట్టి కాదా?? బ్రహ్మశ్రీ బులుసు వేంకటేశ్వర్లు.

"లేదురా ఇటువంటి భూమి ఇంకెందు"--రాయప్రోలు!
"సారె జహాసే అచ్చా"-ఇ క్బాల్!
"పంజాబ్ సింధుగుజరాత్ మరాఠా "--రవీంద్రుడు
శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీమ్ --బంకించంద్ర
ఇవ్వన్నీ. దేశభక్తి గీతాలే. వీటిలో దేశ భౌతిక స్వరూపం,అలంకారికంగా తల్లి పోలిక, కనిపిస్తాయి.
దేశాన్ని తల్లితో పోల్చినప్పుడు ,అతల్లి బిడ్డలందరూ
నిజంగా అన్నదమ్ముల వలెవున్నారా ?!లేరు!
కులాల మధ్య జాతులమధ్య అనేక అసమానతలు
(ఇప్పటికీ) ఉన్నాయి.
అన్న దమ్ములవలె ప్రజలు ఉండాలని,కులం ఏదైనా మతం ఏదైనా ,అందరూ చెట్టాపట్టాలేసుకుని నడవాలని
భావించాడు .గురజాడ.
"సాటి మనిషిని జంతువుకన్నా హీనంగా చూస్తూ
మేమంతా సోదరులం, అనడమేమిటి అసహ్యంగా"
అన్నాడు(డైరీలో)
ఇంత మధనపడ్డాక""దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్" అని చెప్పవలసి వచ్చింది
ఆయన!
అంతే కాదు
దేశాన్ని మట్టితో పోల్చడానికి ఇష్టపడని గురజాడ
చెట్టుతో పోల్చి చూపాడు.
దేశమనే చెట్టు ప్రేమలనేపూలు పూయాలని,
నరుల చెమటతో వృక్షమూలం తడిసి ధనం పంటలు
పండాలని ఉదాత్తంగా చెప్పాడా మహాకవి.

గురజాడదేశభక్తి గీతాన్ని విశ్లేషిస్తున్నామంటే
ఇతర కవుల దేశభక్తి ని కానీ,వారి గీతాల్ని కానీ
తక్కువ చేయడం కాదు. భౌగోళిక సౌ0దర్యం ఆధారంగా
దేశభక్తి గీతం అల్లితే అది కాలాన్ని జయించక పోవచ్చు.
నిన్నగాక మొన్ననే "మాతెలుగు తల్లికి"పాట కొత్తరాష్ట్రం
చేత నిరాకరించబడింది
కనుక గురజాడ తన రచన సార్వకాలికంగాను,
సర్వజనీనంగానూ ఉండాలని ఆశించాడు. దేశాభివృద్ధికి వ్యక్తి అంకిత మయ్యేలా ఆపాట దోహదపడాలని ఆయన ఉద్దేశ్యం.
"పెద్దపెద్దకొండలు,నదులు,,వృక్షాలు పూలు,పళ్ళు, వెన్నెలరాత్రుళ్ళు, ఇవా దేశమంటే-ఒక్కో యుగంలో
ఒక్కోజాతిలో మహాపురుషులు పుడతారు. వారి గుణగణాలు వర్ణించబడాలి. ప్రజల్లో చైతన్య0 రెచ్చగొట్టేవి
అవే""-అన్నాడు గురజాడ,గిడుగురామమూర్తి గారితో.
బహుశా ఈ గేయరచన లో ఆభావాలే గురజాడని
ప్రభావితం చేసివుంటాయ్.
కావుననే గురజాడ దేశభక్తి కి కొత్త
నిర్వచనం చెప్పవలసి వచ్చింది.
వట్టిమాటలు(వూకాదంపుడు ఉపన్యాసాలు) కట్టిపెట్ట
మని, పరులకు గట్టిమేలు తలపెట్టమని చెప్పాడు.
ముందు పాడిపంటలు పొంగి పొర్లేలా చెయ్యమని,
అప్పుడే నువ్వు ఈసురో మని అనకుండా వుండగలవని తెలిపాడు.ఈసురో మని మనుషులుంటే దేశమేగతి
బాగుపడునోయ్ --అన్నదందుకే!!
ఎంగిలీషు వారి వ్యాపార రహస్యాలు గమనించాడు కనుకనే
"" అన్నిదేశాల్ గ్రమ్మవలెనోయ్
దేశి సరుకులు అమ్మవలెనోయ్
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తిసంపద లబ్బవోయ్"'అన్నాడు గురజాడ.
ఇప్పటికీ మనతీరు మారిందా! మిల్లు బట్టల్ని వదలి
మగ్గం బట్టలు కొంటున్నామా!!
తాతల వైభవాలనుతల్చుకోడం వల్ల లాభం లేదని,
మంచిగతమున కొంచమేనోయ్ అంటూ మందగించక ముందు కడుగేయ్--వెనుకబడితే వెనుకేనోయ్!!--అని
ప్రజల్ని తొందరపెడతాడు ఆ మహాకవి!!

ముందుకు అడుగు వెయ్యమన్న గురజాడ
అహమహమికవల్ల వల్ల స్పర్ధలు వస్తాయని గ్రహించి
ఆరోగ్యకరమైన స్పర్ధ విద్యలందు--వైరము వాణిజ్యమందు చూపమన్నాడు.
"కత్తివైరం కాల్చవోయ్ "అని ముక్తాయించాడు.
"స్వంతలాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడుపడవోయ్"అంటూ
ప్రతివ్యక్తిని పలకరించాడు.
ముఖ్యంగా మనదేశం లో భిన్నత్వం (వేషభాష సంస్కృతి ,పెళ్లి , దైవపూజ, శ్రాద్ధ విధులు మొ,,)ఎక్కువ. వాటిని కాదనకుండానే గురజాడ అవన్నీ దేశాభివృద్ధికి అడ్డుపడకూడదని వాంచిస్తాడు
మతము వెరైతేమి ఎమోయ్
మనసులొకటై., మనుషులుంటే--అనిప్రశ్నిస్తాడు.!!
ఇంత తపనపడితే పుట్టినగేయం అది.
దీన్ని ఎలారాయాలి
పదాడంబరం లేకుండా,తేటగా,వినగానే అర్ధం అవడం
కాదు-మనసులోకి చొచ్చుకుపోయే లా-ఉండాలి.నక్కకు కూజా.లో, కొంగకుపళ్ళెం లో పాయసంలా వుండకూడదు కదా.
ఆ మహాకవి ముత్యాల సరాన్ని ఎన్నుకున్నారు
జాతి కి కంఠాభరణాన్ని బహుకరించారు.
గుమ్మడేడే గుమ్మడేడే
ముద్దుముద్దు గుమ్మడేడే --అని తెలుగుల ఇళ్లల్లో వినిపించే చతురస్రతాళ గతి స్త్రీలపాటని సంస్కరించి
3-4;3-4 మాత్రలుగా 3 పాదాలు, 3-4-2మాత్రలుగా
చివరిపాదం విరిగేలా ఒక నూత్న ఛందస్సు సృష్హించాడు.
దీనికి మొదట సంగీతం కూర్చినది. ద్వారం
నాయుడు గారు. ఇప్పటికీ అదేవరసలో మనం పాడుకొంటున్నాం.
ఒక మహా రచన ఆవిర్భావం వెనుక ఇంత
మధన0వుంటుంది. కొట్టిపడెయ్యడం తేలిక. ముత్యాలసరాల్ని కవులు ఆదరించారు .విశ్వనాధ మొదలుకొని మన శోభమ్మగారిదాక రచనలు చేస్తూనేవున్నారు .
మహకవుల విలువను గుర్తించి వారిని
అనుసరించే సుగుణం ప్రజలకు అలవడాలని
మనం కోరుకుందాం .
స్వస్తి.
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.