గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, మార్చి 2018, బుధవారం

పద్య రచయితలకు శ్రీమతి పావులూరి సుప్రభ గారి సూచన.

 జైశ్రీరామ్.
పద్య రచయితలకు శ్రీమతి పావులూరి సుప్రభ గారి సూచన.
వ్రాసేటప్పుడు గణములు సరిగా నున్నాయో లేదో తెలిసికొనుటకు పదములను గణములకనువయిన రీతిని విభజించుకొన్నా, పద్యము ప్రచురించేముందు పదములుండవలసిన రీతిగా నుంచిన చదువ సులభమవుతుంది. చూడ సొబగుగా నుంటుంది. చదివే వారు తికమక పడకుండ అర్థము కూడ త్వరగా బోధపడుతుంది.
చేసినా, పలికినా వంటి దీర్ఘములున్న పదములు వ్యావహారికములు. వ్యాకరణ విరుద్ధములు. పద్యరచనలో సమ్మతములు కావు.
అలాగే పద్యములో గణము కొఱకని హ్రస్వముతో అంతమయెడి పదములను దీర్ఘములుగా చేయుట ( చేసీ, చూచీ, ... వలె ) , దీర్ఘములుగా నుండవలసిన వానిని హ్రస్వములుగా వాడుట దోషమవుతుంది. ( ముఖ్యముగా లో, తో వంటివి ). (గేయరచనలో సమ్మతమవవచ్చును కాని, పద్యములో కూడనిది.) అవసరమైతే పద్యమునకు ఒకటి రెండు నిముషములు అధికముగా కేటాయించి సరియైన పదము నెన్నుకొనుట యుచితము.
పద్యము మధ్యలో ఒక వాక్యము అంతమయితే తప్ప, సాధ్యమైనంతవరకు అచ్చులతో పదములు ప్రారంభించకండి.
వ్యాకరణపరముగా మౌలికమైన కొన్ని సూత్రములనయినా తెలిసికొని, గుర్తు పెట్టుకొంటే చాల వరకు తప్పులు దొరలకుండా జాగ్రత్త వహించవచ్చు.
[[ ఉకార సంధి నిత్యము. ప్రథమా విభక్తి కాక యితర విభక్తులు వాడుతున్నప్పుడు, శత్రర్థక చు(న్) తో అంతమయే పదములలో మాత్రము కొన్ని సార్లు జరుగుతుంది.కొన్ని తడవలు జరగదు.
(ద్వితీయా విభక్తి.-- ఉదా: నన్నున్+ అడిగెను = నన్నడిగెను, నన్నునడిగెను. చతుర్థీ విభక్తి.-- నాకొఱకున్ + ఇచ్చె= నాకొఱకిచ్చె, నాకొఱకునిచ్చె .అలాగే షష్ఠీ, సప్తమీ విభక్తులు కూడ. శత్రర్థకము ఉదా: చూచుచున్+ ఏగెను= చూచుచేగెను, చూచుచునేగెను )
భూతకాలిక అసమాపక క్రియలకు ఇకార సంధి లేదు. ( ఉదా: వచ్చి + ఇచ్చెను= వచ్చి యిచ్చెను .వచ్చిచ్చెను కాదు చేసి+ అడిగెను = చేసి యడిగెను. చేసడిగెను కాదు )
ద్రుతము ( నకారపు పొల్లు, ను ) మీది పరుషములు ( క,చ,ట,త,ప) సరళములుగా (గ,జ,డ,ద,బ ) మారుతాయి. ( భాగవతము నుండి రెండు ఉదాహరణలు.1. మేరువు తలక్రిందైనను , బారావరము లింకఁబాఱిన .. ను పైని పా బా గ మారినది. 2. గలశరంధ్ర మాఁపగాను దెలిసి -- ను మీఁది పరుషము తె దె గా మారినది )
తెలుగు విభక్తులు చేరని సంస్కృతపదములకు, అచ్చతెలుగు పదములు కలిపి సమాసములు చేయకూడదు. అటువంటివి దుష్ట సమాసములవుతాయి. ]]
వస్తుంది, వస్తాడు వంటివి గ్రామ్యములు. పద్యములో నిషిద్ధములు.
అచ్చ తెలుగులో వు,వో లతో మొదలయే పదములు లేవు. వున్నాడు, వూరు వంటివి సరికావు.
పదము సహజముగా యకారము తో మొదలయేదయితే తప్ప (యజించి యత్నము ..), అ,ఇ,ఎ, వంటి అక్షరాలతో ప్రారంభించవలసిన పద్యమును య,యి,యె లతో మొదలుపెట్టకూడదు. అలాగే మిగిలినవి కూడ అవి సంధి జరిగి యడాగమము వచ్చినప్పుడు మాత్రమే వాడ వీలవుతుంది.
ఉకారము తో అంతమయే పదముల తరువాత యడాగమము రాదు. రాముడు + అనెను = సంధి జరిగి రాముడనెను అవుతుంది. రాముడు యనెను కాదు.
అరసున్న లు వాడదలచుకొంటే --జాగ్రత్త వహించగలరు. కొన్ని కొన్ని పదములకు అరసున్న వాడినపుడు ఒక అర్థము, అరసున్న లేనపుడు వేరొక యర్థము వస్తుంది.
పదాల ఆడంబరము కొఱకు చూడకుండ, సాధ్యమైన రీతిగా సులభముగా, దోషరహితముగా, అర్థవంతముగా నుండే విధముగా యత్నించగలరు.
ఒక పదము సరియైనదా కాదా అని అనుమానము వచ్చినప్పుడు నిఘంటువు/లను పరిశీలిస్తే ప్రయోజనకరముగా నుంటుంది. ( పెద్ద పెద్ద నిఘంటువులు తెరిచి వెతికేపని లేకుండ ఆంధ్రభారతి సైట్ వద్ద చాలవరకు లభ్యమవుతున్నాయి. )
http://www.andhrabharati.com/dictionary/index.php
అక్కడే భాష/ ఛందస్సు విభాగము క్రింద ఛందోగ్రంథములు "సులక్షణసారము", "ఛందోదర్పణము" లభ్యమవుతున్నాయి. బాలవ్యాకరణము కూడ నున్నది.
ఆర్కైవ్.ఆర్గ్ ( archive.org )వద్ద యింకెన్నో లభ్యమవుతున్నాయి.
కొంచెము సమయము వెచ్చించి దానిని చదివితే పద్యరచనలో వలసిన విషయములు తెలిసి, సులభమగుటయే కాక ఆత్మవిశ్వాసము కలుగుతుంది. ఛందో గ్రంథములతో పాటు అందుబాటులో నున్న పూర్వ/ఆధునిక పద్య కావ్యములను కూడ పరిశీలిస్తుంటే యితరమైన విషయము లెన్నో తెలుస్తాయి.
శుభాకాంక్షలతో.
స్వస్తి.
సుప్రభ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సుప్రభగారి సూచనలు నావంటి నేర్చుకునే వారికి అద్భుతముగా నున్నవి . ధన్య వాదములు . చక్కని రచనలను అందిస్తున్న శ్రీ చింతా సోదరులకు కృతజ్ఞతలు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.