గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, ఏప్రిల్ 2017, గురువారం

పద్య పక్షమ్. ఛందస్సు. (1)

జైశ్రీరామ్.

ఛందస్సు
ఓం శ్రీ గురుభ్యో నమః.
ఆర్యులకు నమస్సులు.
శా. శ్రీలన్ దేల్చు మనోజ్ఞ భారతిని సచ్చీలంబుతోఁ గొల్చుచున్,
శీలోత్ప్రేరక సత్ కవిత్వ పథమున్ చిత్తంబునం గాంచు,
చ్చీలోద్భాసిత సత్కవీంద్ర తతికిన్ చేతున్ ప్రణామంబులన్.
మీలోనొక్కడ నేను కూడ, కనుదున్ మీతోడ ఛందోద్గతిన్.

మనలో అనేకులకు కవితాసక్తి ఎంతగానో ఉన్న మాట నిజం.  ఐతే వ్రాసే ధైర్యం మాత్రం అంతగా ఉండకపోవచ్చును. దీనికి అనేకమైన కారణాలు. ముఖ్యంగా మనం ఎంతగా శిక్షణ పొందినప్పటికీ ఇంకా ఏదో లోపం ఉండి ఉంటుందేమో, దోషాలు ఎక్కడేనా వస్తాయేమోనన్న అనుమానం.
ఈ అనుమానాలు తీరుటకు మనకున్న మార్గం ఛందశ్శాస్త్రం ఏం చెప్పిందో అది తెలుసులోవడం ఒక్కటే. మనకు సగం ధైర్యం పుంజుకుంటుంది.
నేనైతే ఒక్కటే సూచిస్తాను. మీకు వ్రాయాలనుందా? వ్రాసేయండి. చూచేవారే మీకు అందులో ఉండే గుణదోషాలను చెప్పుతారు. తద్వారా మీరు సుశిక్షితులౌతారు.
నేను ఛందస్సునకు సంబంధించిన ప్రాథమికాంశాలను తెలుసుకొనే ప్రయత్నంతో ఉండి, తెలుసుకొన్నవి మీ ముందుంచితే తప్పులుంటే మీరే సూచిస్తారు కాబట్టి నేను నేర్చుకొనే సదవకాసం కలుగుతుంది. ఒప్పులే ఐతే తెలుసుకొనేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంక ఆ జగన్మాత దయ. పచ్చని పద్యాన్ని ప్రేమిద్దాం.

1. శ్రీకారము  కృత్యాదిని కలిగినచో దాని ప్రభావము.
క. శ్రీకారము కృత్యాదిని - బ్రాకటముగనున్నఁ జాలు - బహుదోషములం
బోకార్చి శుభము లొసఁగును - బ్రాకృతముగ నినుముసోఁకు - పరుసము భంగిన్‌. (సు.ల.సారము 189)
కావ్యాది వర్ణశుద్ధి
తే. ఆదిపద్యాది శ్రీకారమైన, దేవ -  వాచకంబైన నప్పుడు వఱలు సిరులు
నాది పద్యాది మూఁడు గణాక్షరములు - చూడవలెఁ గాని యన్నియుఁ జూడవలదు.  (సు.ల.సారము 195)
భావము సులభ గ్రాహ్యమే కదా?

2. కృతి రచనకుఁ బ్రశస్త వారములు
గీ. శుక్ర గురు బుధ వారముల్‌ - సొంపు సేయు - సోమవారంబు సంపదల్‌ - సొరిది నిచ్చు
శనియు మంగళవారముల్‌ - చావుదెచ్చు - భానువారంబు సంగరం - బమరఁ జేయు. (సు..సారము 269)

భావము. బుధ వారము, గురువారము, శుక్రవారము, కృతి యారంభించిన గ్రంథముమనోహరంబయి యుండును. సోమవారమునాడు ఆరంభించిన సంపద కలుగును.శనివారము, మంగళ వారము ఆరంభించిన మృతి సంభవము. ఆది వారము ఆరంభించిన కలహము సంభవించును
గురులఘువులు. 
మాత్రయన నొక్క లఘువగు ( I ) -  మాత్రలు రెండైన గురువు ( U ).
గురు లఘువుల స్వరూపము
క. వివిధముగఁ జాఁపి పలికెడు - నవియును మఱి యూఁదిపలుకు నవియును గురువుల్‌
భువి నిలిపి పలుకు వర్ణము - లవియెల్లను లఘువులయ్యె నంబుధి శయనా! (అనంతుని ఛందము)
వివరణము.
హ్రస్వములు అనగా ఒక్క లిప్త (సెకెను) కాలము మాత్రము పలుకఁబడే 
----- లు, అచ్చులతో కూడిన హల్లు వర్ణములు లఘువులు.                                                           
అంతకన్న ఎక్కువ కాలము పలుకఁబడు వర్ణములు గురువులు. 
ఆ ఈ ఊ ౠ ఏ ఓ మొదలగునవి.

ఐ.ఔ అనేఅచ్చులు, వీటిమ్ని కలిగి ఉన్న హల్లులు గురువులు. కైకలో కై గురువు. కౌరవులులో కౌ గురువు.

సున్న, విసర్గలతో కూడిన అచ్చులు హల్లులు గురువులు. 
అంకము లో సున్నతో కూడిన అ గురువు 
దుఃఖము లో విసర్గముతో కూడియున్న దు అనే అక్షరము గురువు.

ద్విత్వ, సంయుక్త పొల్లు అక్షరములకు ముందున్న అక్షరములు గురువులు. 
అక్కర లో క్క కు ముందున్న అ గురువు. 
అక్షరము లో క్షకు ముందున్న అ గురువు. 
అతనిన్ లో న్ అనే పొల్లుకు ముందున్న ని అను అక్షరము గురువు.
అల్పారంభః క్షేమ కరః అని పెద్దల నానుడి. కబట్టి ఇప్పటికి స్వస్తి.
జైహింద్.
Print this post

15 comments:

అజ్ఞాత చెప్పారు...

మీ క్లాసులో నేను చేరిపోయానండీ...
Anantha Krishna

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఒక అమ్మ బిడ్డలం అన్నదమ్ములం, కలిసి చదువుకొందాం, కలిసి జీవిద్దాం, కలిసి ఆనందానుభూతు పొందుదాం.

అజ్ఞాత చెప్పారు...

నన్ను గూడాచేర్చుకోండి.
Mothkuri Manikyarao •

అజ్ఞాత చెప్పారు...

నేను చేరుచున్నాను.
Surya Ganapati Rao Devaguptapu

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Surya Ganapati Rao Devaguptapu గారూ! చిత్ర కవిత్వ వేదులిటు చేరుట చిత్రము. దేవ గుప్తమై
ధాత్రిని వెల్గు చిత్ర కవితారథసారధి! సూర్యతేజసా!
పాత్రత నాకుఁ గొల్పితిరి భక్తిగ ఛందము నేర్వనిద్ధరన్.
మిత్రులు మీరలున్న వరమే కదనాకు శుభంబులొందగన్.

అజ్ఞాత చెప్పారు...

నేను కూడా చేరెదనండి
Polimera Malleswara Rao

అజ్ఞాత చెప్పారు...

మహద్భాగ్యం ప్రసాదించిన గురువర్యులు
శ్రీ చింతా రామకృష్ణా రావు గారి చరణారవిందములకు శతకోటి నమస్కారములు
Phaneendhar Goud Gurunatham.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చతుర్విధ కందము.
నుతులందుమ గురునాథుఁడ!
హితుఁడా! క్షితిపై మహితుఁడవే కద! మతిలో
గతిలో, నతులిత మాన్యుఁడ
ధృతిలో సతతంబు వెలుగు దివిజుఁ డనుతరిన్

క్షితిపై మహితుఁడవే కద!
మతిలో గతిలో, నతులిత మాన్యుఁడ ధృతిలో
సతతంబు వెలుగు దివిజుఁ డ
నుతరిన్ నుతులందుమ గురునాథుఁడ!హితుఁడా!

గతిలో, నతులిత మాన్యుఁడ
ధృతిలో సతతంబు వెలుగు దివిజుఁ డనుతరిన్
నుతులందుమ గురునాథుఁడ!
హితుఁడా! క్షితిపై మహితుఁడవే కద! మతిలో.

సతతంబు వెలుగు దివిజుఁ డ
నుతరిన్ నుతులందుమ గురునాథుఁడ!హితుఁడా!
క్షితిపై మహితుఁడవే కద!
మతిలో గతిలో, నతులిత మాన్యుఁడ ధృతిలో

అజ్ఞాత చెప్పారు...

ధన్యోస్మి గురువు గారు .
అనన్య సామాన్యమైన తమ చతుర్విధ కంద
కవితా పాండితీ ప్రతిభా విశేషముల
నోలలాడిన నా జన్మ చరితార్థము.
భవత్పద పంకజములకు మరోమారు
నమస్కారములు
Phaneendhar Goud Gurunatham

అజ్ఞాత చెప్పారు...

బాగుంది.కొనసాగిం చండి.అయితే ఒక్కమాట!

1మగణమ్ముగదియరగణము
వగవక కృతినిల్పునట్టివానికి మరణం!
బగు;నిక్కమండ్రు మడియడె
యగుననియిడి తొల్లిటేంకణాదిత్యుడనిన్

2 ఆరింటను తాబెట్టిన
వారిం టను బీనుగెళ్ళు వసుమతిలోనన్/
ఇత్యాది కవిలోక ప్రసిధ్ధవిషయాలను కూడా జోడించండి.వివరించండి!
శుభం!
Satyanarayana Choppakatla

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

తప్పకుండా ముందు ముందు ప్రస్తావించబడతాయండి.మీకు ధన్యవాదములు.

అజ్ఞాత చెప్పారు...

నన్ను కూడా చేర్చుకోండి
Venkateswarlu Bulusu

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఘనులు కవితావతంసులు గళము విప్పి
చేర్చుకొమ్మనుటేమిటి? చేరమనుచు
పద్య పక్షమే తమబోంట్ల పరవశమున
కోరుచుండెను కృపతోడ చేరుడయ్య.

అజ్ఞాత చెప్పారు...

గురుదేవులకు ప్రణామములు మీ దయ వల్ల మేము పద్యములు వ్రాయగలుగుతున్నాము. మీ ఈ ప్రయత్నము తో మరి కొందరు పద్య రచన చేసి తెలుగు సాహిత్య విలువలను కాపాడి, మన జాతి వైభవమును పెంచాలని ఆకాంక్షిస్తూ...
Varaprasad Nagendra Kandula

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Varaprasad Nagendra Kandula గారూ! బాగున్నారా? మీరు పద్యరచన ప్రశంసనీయముగా చేయఁగలుగుచున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు అభినందనలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.