గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, మార్చి 2026, శుక్రవారం

శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.

శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది.


శా.  శ్రీమన్మంగళ శాంభవీ! శుభములన్ జేకూర్చు నిన్ వేడెదన్,

క్షేమంబున్ గొలుపన్ పరాభవయె నీ సేవామహాభాగ్యమున్

బ్రేమన్ మాకిడ వచ్చె, నామము కనన్ భీతిన్ మదిన్ గొల్పునే,

శ్రీమాతా! కనుమా పరాభవములన్ ఛేదించి రక్షింపుమా.


ఉ.  స్వాగతమో పరాభవ! ప్రశాంతిని మాకు ననుగ్రహింపగా

రాగదె భారతావనికి, రమ్యమహోజ్వల కాంతి పూర్ణమై,

సాగగనిమ్ము సజ్జముల సన్నుత వర్తన చక్కగాను, నీ

యాగమనమ్ము దుష్టులకు హానిని గూర్చుత, ధర్మనిష్ఠతోన్.


చం.  కలుగఁగఁ జేయకమ్మ భువి గణ్యుల కెట్టి పరాభవంబు, నా

పలుకులనెన్ని హైందవము వర్ధిలునట్టులఁ జేయుమమ్మ, ని

స్తులవని నిన్ను నే పొగడ, తోచుమ చక్కగ వత్సరాంతమున్,

వెలుగఁగనిమ్ము మాబ్రతుకు, విశ్వమునన్ వర శాంతి గొల్పుచున్.


ఉ.  ఓయి వసంత నీ కొఱకు నోర్పుగఁ జూచితిమింతకాలమున్,

శ్రేయములన్ రచించుటకు శ్రీకరమైన వసంతశోభతో,

న్యాయము నిల్పు దీక్షఁగొని నవ్యకళల్ విరజిమ్ముచున్ కృపన్

ధీయుతులెన్న వచ్చితివి, తేజము గొల్పి శుభాళి గొల్పుమా.


మ.  వరమౌ షడ్రుచులిచ్చినావు, ప్రకృతిన్ భాసిల్లగాఁ జేసి, సుం

దర భావామృత మొల్కఁ జేసితివి, విస్తారంబుగా సత్కృతుల్

స్థిరమౌ కీర్తిని గొల్ప నిచ్చితివి యుగాదీ! నీదు శోభల్ సదా

ధరపైనొప్పగ నిల్చి యుండుము, ప్రమోదంబున్ బ్రజన్ నిల్పగన్.


ఉ.  మంగళమో యుగాది శుభమంగళముల్ పికపాళికీధరన్,

మంగళమౌ వసంతునకు, మంగళమౌ సహకారపాళికిన్,

మంగళమౌత తెమ్మెరకు, మంగళమౌ సుజనాళికిన్ సదా

మంగళమౌత భారతికి, మంగళముల్ మన దేశమాతకున్.


అమ్మదయతో

చింతా రామకృష్ణారావు.

తే.11 - 3 - 2026.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.