గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, మార్చి 2026, ఆదివారం

శ్రీ సీతారామ కల్యాణం ఎదురుకోళ్ళు ౨౬ - ౩ - ౨౦౨౬.

 జై శ్రీరామ్.🙏🏻

ఉ.  శ్రీమన్మంగళ భక్తులార! విలసత్ సీతా మహా సాధ్వికిన్,

రామాఖ్యుండగు సద్వరూత్తమునకున్ రమ్యంబుగా పెండ్లినే

ధీమంతుల్ జరిపించ నుండిరిచటన్ దేదీప్యమానంబుగా

ప్రేమన్ భక్తిని గల్గి చూడ నిచటన్ వేగంబె రారండయా.

ఆ.  ఎదురుకోళ్ళలోననిందరమిచ్చట

చేరినాము రామ సీతలకును

జోడు కుదురునంచు శోభిల్ల వర్ణించి

చెప్పనుంటిమయ్య గొప్పగాను.

ఉ.  శ్రద్ధగ విన్నవారలకు చక్కగ సీతయు రామచంద్రుఁడున్

బద్ధతినొప్పుసంస్కృతిని, భక్తిని, యద్భుత యుక్తి నిచ్చు, మీ

వృద్ధికి మూలమిద్ది, ప్రభవించును దివ్యమహత్వ శక్తి,, మీ

రిద్ధర సీత పెండ్లికని ఈప్సితముల్ నెరవేర్చుకొండయా!

1.  మగపెళ్ళివారు.

శా.  శ్రీరాముండు వరూత్తముండగుటచే సీతామహాసాధ్వినే 

మా రాముండు వివాహమాడదలచెన్, మాకన్నిటన్ సమ్మతం

బీ రమ్యాత్మనొసంగి పెండ్లి త్వరితంబే చేయుడీ మీర లో

పేరున్గాంచిన జ్ఞానులార! శుభముల్ విఖ్యాతి మీకందెడున్.🙏🏻

౧.  ఆడపెళ్ళివారు.

శా.  శ్రీమన్మంగళ గణ్య దేవతయె మా సీతమ్మ, సత్ ప్రేమ నా

రాముండంతటి వాఁడె కోరుకొనె మా రమ్యాత్మయౌ జానకిన్, 

ధీమంతుల్ జనకాత్మజన్ కొలుతురే దేదీప్యమానంబుగా,

నేమాత్రంబగు నీడు రాముఁడిలపై నీ సీతకున్? జెప్పుడీ!

2.  మగపెళ్ళివారు.

సీ.  శ్రీరామచంద్రుండు శ్రితపారిజాతమే,  కల్యాణగుణపూర్ణ గణ్యుఁడతఁడు,

మా రామచంద్రుండు మారుమాటాడక తండ్రి యాజ్ఞను తాను తలను దాల్చు,

మహిత విశ్వామిత్ర మహనీయు శిష్యుఁడై, దివ్యాస్త్రవిద్యలు దీక్షను గొనె, 

తాటకిన్ వధియించి, తనియఁ జేసెను గురున్,  యజ్ఞసంరక్షణ నతఁడు చేసె,

గీ.  నుత గుణాఢ్యుని రాముని సతిగ నగుట

కెట్టి యర్హత కలిగిన పట్టి సీత?

తెలుపుఁడయ్యరో మీరలు తెలియునటుల,

రాముఁడనగ సామాన్యుఁడా? రమ్యగుణుఁడు.

౨.  ఆడపెళ్ళివారు.

సీ.  సీతమ్మ మాయమ్మ, చిఱునవ్వు వెన్నెలల్ చిందుచు చుండెడి యందగత్తె,

సునయన జనక రాజుల పట్టి జానకి, శోభనాంగి మరియు సుగుణపూర్ణ,

చెలికత్తెలను జూచు స్నేహభావంబుతో, నానందవారాశి, యమృత మూర్తి,

శివధనుస్సును తీసె చేతితో నాటాడు బంతికై,  వనిత పూబంతి సీత,

గీ.  ఖ్యాతి నొప్పెడి సంపత్సమేత సీత

అట్టి యీ కన్య సీతనే బట్ట నెట్టి

యోగ్యతను గల్గి యుండెనా యోధుఁడైన

రామచంద్రుండు? తెలుపుడీ ప్రేమ మీర.

3.  మగపెళ్ళివారు.

శా.  శ్రీరాముండిల వీరుఁడై నిలిచె నీ పృథ్విన్, మహాకార్ముకం

బీ రాముండె దళించి, సీతమదిలో హృద్యంబుగా నిల్చుటన్

మీ రామామణికొప్పు రాఘవుఁడె, స్వామిన్ సద్వరూత్తంసుగా

మీరేలన్ గ్రహియింపకుండిరకటా? మీదేమి పాండిత్యమో?

౩.  ఆడపెళ్ళివారు.

ఉ.  జ్ఞానికి మాత్రమే తెలియు జానకి జన్మరహస్య మెన్నగా,

మౌనముతోడ నాత్మలను  మా జనకాత్మజ స్తుత్యనామమున్

ధ్యానము చేసి పొంగుచును ధన్యతగాంతురు మౌనులే భువిన్,

ఈ నయవర్తి కీడగునె యింపుగ మీ రఘురాముఁడిద్ధరన్? 

4.  మగ పెళ్ళివారు

ఉ. భద్రతఁ గొల్పు నేర్పుననె వర్ధిలె శ్రీరఘురామ భద్రుఁడై,

సద్రసరమ్య వాఙ్మహిత సారము శ్రీరఘురామ నామమే,

భద్రముగా నిరంతరము భార్యగ సీతను పొంది చూచు, సం

పద్రమణీ లలామ కిల వాసిగ నీతఁడె యీడు జోడగున్.

౪.  ఆడపెళ్ళివారు.

సీ. ఏ దేవి శుభనామమే దారి యగుచుండు నిహపరంబులు కనన్ మహిని ప్రజకు,

ఏ దేవి రూపంబు నెద నెంచి ప్రార్థింప నిట్టులే పనులౌను సృష్టి లోన,

ఏ దేవి జనకుండె యిహపరంబులు గనన్ నీ తల్లినే పెంచె నింపుగాను,

ఏ దేవి మూలమో యీ సృష్టికంతకు నాదేవియే సీత, యనుపమ సతి,

గీ.  అట్టి  యా దేవితో సరి యెట్టులగును

రామచంద్రుండు? చెప్పడీ ! రామ రామ,

భూమిజాతకు నతఁడెట్లు పోలికగును?

సీత సరి జోడు లేరింక భూతలమున?

5.  మగ పెళ్ళివారు.

సీ.  రాజీవ నేత్రుండు రాజేంద్రుఁడీ రఘు రాముండు ధరణిపై రమ్య గుణుఁడు,

జిత శత్రు వర్గుండు, నుత వాఙ్మి, మితభాషి, స్మితవక్త్రుఁ డనుపమ శ్రీకరుండు,

వేదాంత సారుండు, వేదాత్మ రూపుండు, విశ్వ విఖ్యాతుండు, విశ్వవిభుఁడు,

సత్యవ్రతుండును, సత్యవిక్రముఁడును, శివధనుర్భంగుండు, ప్రవరుఁడితఁడు,

గీ. అట్టి శ్రీరామచంద్రునే యెట్టులిటుల

జోడు కాదంద్రు సీతకు? పాడిఁ దలచి

వరునిగా మీరు గుర్తించి, వాసిగనుఁడు,

రామచంద్రుండు సీతకున్ ప్రాణమగును.

౫.  ఆడపెళ్ళివారు.

చ.  రమయన మాత సీత, గుణరమ్య సమావృత, రమ్య భాతి, మా

రమ యసమాన నేత్రి, కనరారు జగాన రమాసమానులే, 

రమకు సమానమై వెలుగ రామయటంచని పేరు కల్గినన్

రమకిలసాటియౌనె తమ రాముఁడు? రమ్య గుణాభిరాముఁడా?

6.  మగ పెళ్ళివారు.

ఉ. రమ్యగుణాభిరాముడిల రాముఁడు, సత్యము, నిత్యుఁడాతఁడే,

సౌమ్య సుతత్త్వుఁడున్, సుగుణసారము రాముఁడు సీతపోలికన్,

గమ్యము చూపు భక్తులకు, కంజదళాక్షుఁడు, సృష్టి లోపలన్

రమ్యగుణాలవాలమగు రాముఁడె సీతకు ఈడుజోడగున్.

౬.  ఆడపెళ్ళివారు.

ఉ.  ఒప్పిదమై రహించుటనె యొప్పుగ రామ యనంద్రు సీతనే,

గొప్పలు చెప్పుకో మరిగి కుంభినిపై నుత రామ నామమున్

చెప్పుకొనంగనౌనె? అది సిగ్గుగ లేదొకొ మీకు, వారికిన్?

ఇప్పుడు సీతకౌనె సరి? యేమని చెప్పుదు రయ్య? చెప్పుడీ!

7.  మగ పెళ్ళివారు.

ఉ. ఒప్పుగ పుట్టు సీత యని, యొప్పును రాముఁడు సీతకంచునే

గొప్పగ రామనామమును కూర్మిని ముందుగ పెట్టియుండుటన్,

నిప్పనఁదగ్గ సీతకు మనీషులుమెచ్చెడి జోడు రాముఁడే,

యిప్పటికైన నమ్ముడయ, యీశ్వరి సీత, రమేశుఁ డీతఁడే.

౭.  ఆడపెళ్ళివారు.

ఉ.  స్వాగతమయ్య మీకు గుణసన్నుత రాముని కిత్తుమయ్య మా

శ్రీ గుణగణ్య సీత, నిక చేకొన శ్రీరఘురామచంద్రునిన్

వేగమె పెండ్లివేదికకు వేడుకగా గొనిపోదుమయ్య, సద్

యోగము లోకమంతటికి, నొప్పుగఁ గల్గఁగఁజేయ నిత్తరిన్.

8.  మగ పెళ్ళివారు.

ఉ.  సంతసమయ్యె మాకు, గుణసన్నుత సీతకు రామమూర్తికిన్

పంతులు మంత్రముల్ చదువ భక్తిగ నిప్పుడె పెండ్లి కార్యమున్

శాంతిగ లోకముల్ వెలుగ చక్కగ జేసెదమయ్య, రండయా!

చింతలు తీరుగాక, వరసిద్ధిని  మంగళమౌత ధాత్రికిన్.  

స్వస్తి.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.