జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.🙏🏻
అష్టావధాని శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ సరదాగా చేసిన
ఆశుగ అష్టావధానము.
తే. 23 -02 -2026.రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు
నిర్వహణ. చింతా రామకృష్ణారావు.
అవధాని ప్రార్థన.
ఉ. ఏ శుభతుండ మీజగతినెవ్విధి కష్టములన్ని తీర్చునో,
ఏ శుభ వక్త్రమే సుముఖమీశ్వరసత్కృతమౌచు తోచునో
ఏ శుభలాస్యమే చెలగి యీశ్వరి నవ్వుల పంటయయ్యెనో
ఆ శుభ విఘ్ననాథునికి నంజలులిత్తు వధానకేళిలోన్.
గీ. అంచనెక్కిన రాణివై యందగించి
నాదు హృదయసుధాంబుధిన్ నాట్యమాడు
నీదు కృపలేక నాకింక లేదు గతియె
కాన భారమ్మునీదె వాగ్రాణి వాణి!
వర్ణన.
అంశము. (శ్రీ దండిభొట్ల దత్తాత్రేయ శర్మ)
అంశము. వందపురుళ్ళుపోసిన మంత్రసాని గర్భవతి అయి తనపురిటి
సమయంలో ఆమె మనసు వర్ణన.
సమాధానం.
గీ. ఎన్ని పురుడులు పోసితో యింతవరకు
తల్లులెందరి దీవనో తలపలేను
నాదు కడుపిట్లు పండె నిన్నాళ్ళకిటుల
ప్రసవసమయమ్ము నాకింక వరమె యగుత.
సమస్య. (శ్రీ చింతా రామకృష్ణారావు)
సమస్య. దండిభొట్ల మాట దడను గొలుపు.
పూరణ.
ఆ.వె. దత్తశర్మచేత ధారణన్ జేయింప
శతవధానిగాను ధృతిని నిలుప
తలపనతని ప్రశ్న తల్లడఁబడఁజేసె
దండిభొట్లమాట దడనుగొలుపు.
దత్తపది. (శ్రీ దండిభొట్ల దత్తాత్రేయ శర్మ)
అంశము. ఇమ్ము ' అనే నాలుగు పదాలతో అవధాని మనసును వర్ణించండి .
సమాధానం.
ఉ. ఇమ్మునిముఖ్యులే కొలువ నీప్సితమిత్తు వదెంతజాలియో
ఇమ్ముదయాలవాల కను మీవొక కంటను నన్ను వాక్సతీ!
ఇమ్ము సుఖమ్ములన్ నిరతమీశ్వరసేవను, నిశ్చయమ్ముగా
నిమ్ము భయమ్ము లేని రస హీనముకాని కవిత్వధారలన్.
నిషిద్ధాక్షరి. (శ్రీ చింతా రామకృష్ణారావు)
అంశము.
అవధాన శిక్షణా శిబిరంలో ఛాత్రావధానుల సాధనఫలము.
పూరణ.
క. (శ్రీకారేతరవర్ణ నిషేధము)
శ్రీ(-)ప్ర(ద)జ్ఞన్(-)గూ(ర)డన్(గ)ధీ
(ర)క్షిప్ర(వ)త(ర)ల(ర)oది(-)oచు(మ)నె(-)ల్లశ్రీ(య)లన్(గ)ద(గ)మ(ద)హా
కం. శ్రీ ప్రజ్ఞన్ గూడన్ ధీ
క్షిప్రత లందించు నెల్ల శ్రీ లంద మహా
శు ప్రతిభ వెలయఁజేయున్
విప్రాశిషములనుగూర్చు విజ్ఞత పెంచున్.
న్యస్తాక్షరి. ( శ్రీ విట్టుబాబు)
విషయం. ఎడపెడమొగములతోనున్న భార్యాభర్తలు కలిస్తే భర్త మనస్స్థితి
ఎలా ఉంటుంది?
నిర్దేశితాక్షరములు
1లో1వ అక్షరం క
2లో2వ అక్షరం ల
3లో3వ అక్షరం న
4లో4వఅక్షరం ము
పూరణ.
చ. కలవరమాయె నామదిని కాగలకార్యము తీర్చుటెట్టులో?
అలకలు మాని నా సతియె హాయిని కౌగిలి చేరుటెట్టులో
చలనములేనిరేయి నను సాధ్విని శీఘ్రమె చేర్చు దైవమా!
ఫలితము విస్మయమ్ము నగు భావనగల్గుట తథ్యమీ నిశిన్.
ఛందోభాషణ ( శ్రీ చింతా రామకృష్ణారావు)
దత్తాత్రేయా సుఖమా!
ఇత్తీరున నుంటి నేను, ఎక్కడ? ఉన్నా
నిత్తఱిని ఓరుగల్లున!
మత్తును గలిగించితివొ? ప్రమత్తుడ నేనే!
ఆశువు ( శ్రీ దండిభొట్ల దత్తాత్రేయ శర్మ)
విషయము .. అరవై యేళ్ళ వయసులో ఆలి మీద కలిగే ప్రేమ భావన
కం. మరువని పరువము తానై
తరువౌచు నిలిచె నాకు తానొక దిక్కై
అరవైలో ప్రణయంబున
కిరవై ముదిమది గలుగని యింతియె తానౌ!!
(శ్రీ విట్టుబాబు, శ్రీ దండిభొట్ల దత్తాత్రేయ శర్మ లు ఎడాపెడా అప్రస్తుతప్రసంగం చేశారు)
ఒకగంటవ్యవధిలో ఈ అవధానం సుసంపన్నం చేసిన అవధాని శ్రీ మరుమాముల
దత్తాత్రేయశర్మగారికి అభినందనలు.
జైహింద్.
Print this post
వ్రాసినది



1 comments:
దత్తాత్రేయ వధానమె
ఎత్తుకు పైయెత్తుగాగ నింపుగ చేసెన్
తత్తర పాటును లేకయె
అత్తరి చేసెను విశేష మంచన శ్రోతల్!! // అన్నారు శ్రీ vబాలకృష్ణమూర్తి.. కాశీ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.