గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 35వ శ్లోకం. 267 - 270. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోఈషణాత్రయనిర్ముక్తా సర్వరోగవివర్జితా  

యోగిధ్యానాంతగమ్యా యోగధ్యానపరాయణా 35  

267. ఓం *ఈషణాత్రయనిర్ముక్తా*యై నమః.

నామ వివరణ.

దారేషణ, పుత్రేషణ, ధనేషణ, అను ఈషణత్రయమునుండిపూర్తిగా విముక్తి పొందియున్న

తల్లి మన అమ్మ

తే.గీ*ఈషణాత్రయ నిర్ముక్త! * భాష చాల

దమ్మ నిన్ను వర్ణించగా నమరవినుత!

నన్ను నీషణత్రితయంబు నలిపివేసె

నోర్వ లేనమ్మ కావు నన్నుర్విపైన.

268. ఓం *సర్వరోగవివర్జితా* యై నమః.

నామ వివరణ.

సమస్త రోగములనూ విడిచిన తల్లి మన జనని.

తే.గీ*సర్వ రోగ వివర్జితా! *యుర్విపైన

నున్నవారికి రోగములుండి తీరు,

నీవె కాపాడవలయు మాకీవె శరణు,

రోగబారిని పడకుండ ప్రోవుమమ్మ.

ఓం ఈషణాత్రయనిర్ముక్తా సర్వరోగవివర్జితాయై నమః.

నామ వివరణ.

దారేషణ, పుత్రేషణ, ధనేషణ, అను ఈషణత్రయమునుండిపూర్తిగా విముక్తి పొందియున్న

తల్లి మన అమ్మ, సమస్త రోగములనూ విడిచిన తల్లి మన జనని.

స్వయంకల్పిత రోగవివర్జ వృత్తము.

గణములు ….         యతి..11 అక్షరము.. ప్రాస కలదు.

సతి! యీషణాత్రయనిర్ముక్తా సర్వరోగవివర్జితా!

క్షితిపై ధనాదుల నాశింపన్ కీడు ప్రాప్తమగున్ గదా,

స్తుతియింతు నిన్ త్రయనిర్ముక్తిన్ సుప్రదా కలిగించుమా

నుతమార్గమందు మదంబా  నిన్నున్ స్తుతింపగఁ జేయుమా.

269. ఓం *యోగిధ్యానాన్తగమ్యా*యై నమః

నామ వివరణ.

యోగులకు ధ్యానాంతమున గమ్యముగా ఉన్న తల్లి మన జనని.

కంమా గతి యోగము మార్చును,

యోగంబున ధ్యానమొప్పియుండుననుచునే

యోగులు గాంచెదరమ్మా!

*యోగి ధ్యానాన్త గమ్య! * యొసగుము సిద్ధిన్.

270. ఓం *యోగధ్యానపరాయణా*యై నమః

నామ వివరణ.

యోగము, ధ్యానము, పరాయణముగా కల జనని మన అమ్మ.

కం.  *యోగధ్యానపరాయణ!*

వేగమె నా యోగమగుచు. ప్రీతిని గనుమా

రాగల కాలమునందున 

యోగమె సన్ముక్తిదముగ నుంచుమ జననీ!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.