గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 34వ శ్లోకం. 261 - 266. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోమాహేంద్రీ మంత్రిణీ సింహీ చేంద్రజాలస్వరూపిణీ

అవస్థాత్రయనిర్ముక్తా గుణత్రయవివర్జితా 34  

261. ఓం *మాహేన్ద్ర్యై* నమః

నామ వివరణ.

మహేంద్రునికన్నను గొప్ప తల్లి మహేంద్రి.

తే.గీ. వినుము  *మాహేన్ద్రి! * నాదగు విన్నపమ్ము,

నీవె సర్వమ్ము సృష్టిలో నేర్పు మీర

నన్ను రక్షింప తగదొకో? మన్ననమున,

కన్నులన్ బెట్టి చూడుమాపన్న రక్ష!

262. ఓం *మన్త్రిణ్యై* నమః

నామ వివరణ.

ఆమె సమస్తమునకు మంత్రి.

తే.గీ*మన్త్రిణీ!* సృష్టి నడిపించు మంత్రివీవు,

నన్ను నడిపించు వేళలో నాకు ముక్తిఁ

గొలుపు మార్గాన నడిపించఁ గోరితి నిను,

నీదు సాన్నిధ్యమున్ గొల్పి యాదుకొమ్ము.

263. ఓం *సింహ్యై* నమః

నామ వివరణ.

ఆడుసింహము అమ్మయే.

తే.గీ*సింహి*! నాలోని పశువును సంహరించు.

కలుగుషట్ఛ్ఛత్రులన్ జంపి వెలుగు నింపు

నాదు మదిలోన, నచ్చట మోదమునను

నీవె వసియింపు మమ్మరో నీరజాక్షి!

264. ఓం *ఇన్ద్రజాలస్వరూపిణ్యై* నమః

నామ వివరణ.

ఇంద్రజాలము యొక్క స్వరూపము అమ్మయే.

తే.గీ*ఇంద్రజాలస్వరూపిణీ!* యింద్రియముల

కేను లొంగుచునుంటి, నహీనశక్తి

మనసునకునిమ్ము, గెలిచెద ఘనతరముగ,

నింద్రియంబులన్, నినుఁ గొల్తు నిందువదన!

తే.గీ. చంచలత్వంబుతో మది చెలగు *నిన్ద్ర

జాలరూపిణీ!* మాపు  చాంచల్య గుణము,

నీదు పదపద్మములపైన నాదు చిత్త

మమరి యుంచునట్లుగఁ జేయుమా మదంబ!

265. ఓం *అవస్థాత్రయనిర్ముక్తా*యై నమః

నామ వివరణ.

జాగ్రత్స్వప్నసుషుప్తావస్థలనుండి బయట పడవేయు తల్లి మన అమ్మయే.

కంజయమోయమ్మ *యవస్థా

త్రయ నిర్ముక్తా!* సుబోధితంబగుమమ్మా!

ప్రియముగ భక్తి నొసంగుమ,

నయమార్గమునందు గొలుతు నా జనని నినున్.

266. ఓం *గుణత్రయవివర్జితా*యై నమః

నామ వివరణ.

సత్వరజస్తమోగుణములను పూర్తిగా వర్జించిన తల్లి మన అమ్మ.

కంకోరెద సత్వగుణంబును

చేరగవాఛించి నిన్ను శ్రీకరముగ నో

స్మేర ముఖాంభోజ! మహో

దార! *గుణత్రయవివర్జితా!* కృప గనుమా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.