గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 32వ శ్లోకం. 241 - 249. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోశ్రీస్సౌమ్యలక్షణాఽతీతదుర్గా సూత్రప్రబోధికా

శ్రద్ధా మేధా కృతిః ప్రజ్ఞా ధారణా కాంతిరేవ 32  

241. ఓం *శ్రీస్సౌమ్యలక్షణా*యై నమః

నామ వివరణ.

మృదు స్వభావము కల తల్లి మన అమ్మ.

తే.గీవినుత *శ్రీ స్సౌమ్య లక్షణా! * వినుము మొరను,

సౌమ్య సత్వస్వభావంబు చాలినంత

యొసగియుంటివి, నీ కృపన్ మసలుచుంటి

నీవె నాలోననుండుటన్ నీరజాక్షి!

ఓం *శ్రీ*యై నమః

నామ వివరణ.

మంగళప్రదమయిన శ్రీకారముగా ఉన్న తల్లి అమ్మ.

కం*శ్రీ! * దేవీ! వందనముల్,

వేద ప్రభవీవె కనగ విశ్వాత్మా!

మ్మోదంబున నన్ గనుమా,

బాధలు వారించి, భవ్య పథము నొసగుమా.

ఓం *సౌమ్యలక్షణా*యై నమః

నామ వివరణ.

సౌమ్య స్వభావగుణ సంపన్న మన జనని.

తే.గీ*సౌమ్య లక్షణా!* శ్రీమత్ప్రశాంతరూప!

నాకు సౌన్య స్వభావంబు  శ్రీకరముగ

నీవొసంగుచు కృపఁగని నిలిపినావు,

వందనంబులు చేసెద నందుకొనుము.

242. ఓం *అతీతదుర్గా*యై నమః

నామ వివరణ.

ఎవరికినీ అధిగమింప శక్యము కాని దుర్గమమయిన తల్లి మన అమ్మ.

తే.గీదీప్తి వీవమ్మ జగతి *నతీత దుర్గ! *

దుర్గమంబగు దైవత్వ మార్గమందు

నన్ను నడిపింపఁ బూనిన సన్నుతాత్మ!

వందనంబులు చేసెద నందుకొనుము.

243. ఓం *సూత్రప్రబోధికా*యై నమః

నామ వివరణ.

వేద సూత్రములను బోధించు జనని.

తే.గీవినుత *సూత్రప్రబోధికా! * వేదసూత్ర

సారమీవేను నిజమిది, సత్ప్రబోధ

నీదు కృపచేతఁ గల్గును, మోదమునను

వందనంబులు చేసెద నందుకొనుము.

244. ఓం *శ్రద్ధా*యై నమః

నామ వివరణ.

మనకు కలిగెడి శ్రద్ధ అనునది అమ్మ స్వరూపమే.

కం*శ్రద్ధా! * సన్నుత లక్ష్మీ!

శ్రద్ధగ నినుఁ గొలుచు శక్తి చక్కగనిమ్మా,

శ్రద్ధారూపవుకద,

శ్రద్ధను విడఁజేసి నాకు  శ్రద్ధనొసగుమా.

245. ఓం *మేధా*యై నమః

నామ వివరణ.

మనకు కలిగెడి మేధా శక్తి అమ్మయే.

కం.  *మేధా! మేధా రూపవు,

సాధనమున మేధ పెఱుగు చక్కగ నీవే

మోదముతో నొసగుచు, నా

బాధలనెడబాపి శ్రద్ధ వరలగనిమ్మా.

246. ఓం *కృత*యే నమః

నామ వివరణ.

కూర్పబడిన సృష్టి అమ్మయే.

కంకృతి వీవే *కృతి! * సన్నుత

గతివీవే, నాకు చూడ, కంజదళాక్షీ!

నుతకృతులను వెలయించగ

మతిలోనీవుండుమమ్మ మార్గము చూపన్.

247. ఓం *ప్రజ్ఞా*యై నమః

నామ వివరణ.

నైపుణ్యము అనెడిది అమ్మయొక్క శక్తియే.

కంప్రజ్ఞా రూపవు *ప్రజ్ఞా!*

యజ్ఞానము పారద్రోలి యనుపమరీతిన్

బ్రజ్ఞను గొలుపుమ నాకున్,

సుజ్ఞేయము సేసెద నిను సుకృతిని జగతిన్.

248. ఓం *ధారణా*యై నమః

నామ వివరణ.

మనకు కలిగెడి ధారణ అనెడి శక్తి అమ్మయే.

తే.గీధారణా రూపవౌ నీదు తత్వమరయ

ధారణాశక్తి ప్రబలును తప్పక భువి,

*ధారణా!* ధారణాశక్తి దయనొసంగి,

నిన్ను నుతియింపఁ జేయుమా నిరుపమముగ.

249. ఓం *కాన్త*యే నమః

నామ వివరణ.

వెలుగు అనెడిది ఏది కలదో అది అమ్మయే.

తే.గీ*కాన్తి!* నీరూపరేఖలన్ గాంతు మదిని

వర్ణనంబును జేయఁగ భక్తితోడ,

శాంతిసౌభాగ్యదాయినీ! జయ నిధాన!

వందనంబులు చేసెద నందుకొనుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.