గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, అక్టోబర్ 2024, మంగళవారం

లక్ష్మీసహస్రం. 31వ శ్లోకం. 232 - 240. పద్య రచన చింతా రామకృష్ణారావు. పద్య గానం శ్రీమతి సుశీలాదేవి భాగవతారిణి.

 జైశ్రీరామ్.

శ్లోకౌశికీ వైదికీ దేవీ సౌరీ రూపాధికాఽతిభా

దిగ్వస్త్రా నవవస్త్రా కన్యకా కమలోద్భవా 31  

232. ఓం *కౌశిక్యై* నమః

నామ వివరణ.

పార్వతీకేశ సంభవ కౌశికి అమ్మయే.

సుగంధివృత్తము.

పార్వతీశిరోజజాత! పద్మనేత్ర *కౌశికీ! *

గర్వభంజనంబు చేసి కావుమా! ననున్ సదా,

నిర్వికార నిష్కళంక! నీ కృపా కటాక్షమే

సర్వసిద్ధి సత్ఫలంబుఁ జక్కగా నొసంగునే.

233. ఓం *వైదిక్యై* నమః

నామ వివరణ.

వైదిక సాంప్రదాయ స్వరూపిణి వైదికి మన అమ్మయే.

తే.గీదివ్య రూపిణి! వైదికీ! దేవి! కనుమ.

చిత్తమందున నినుగాంచి మత్తు వీడి

సత్తు చిత్తులన్ లోఁ గని శాంతితోడ

మసలుకొందును, నిన్ను నే మదిని గనుచు.

ఓం *దేవ్యై* నమః.

నామ వివరణ.

దేవీ స్వరూపిణి అమ్మయే.

తే.గీ.   కృపను గాంచుమా *దేవి*! నన్ క్షితిని వెలుగఁ

జేయ, నినుఁ గొల్తునోయమ్మశ్రేయములిడ!

నీవు లేకున్న దిక్కేది? నీరజాక్షి!

వందనంబులు చేసెద నందుకొనుము.

కందేవీ నీ శుభ నామము

భావింతును మనమునందు భవ్యఫలదవై

దీవించుము నిరుపమముగ

జీవము  నీవౌచు నిలుము శ్రీమన్ మాతా!

ఓం *వైదికీదేవ్యై* నమః

నామ వివరణ.

వైదిక సాంప్రదాయ స్వరూపిణిఅయిన దేవి  వైదికీదేవి మన అమ్మయే.

తే.గీదివ్య రూపిణి! *వైదికీదేవి*! కనుమ.

చిత్తమందున నినుగాంచి మత్తు వీడి

సత్తు చిత్తులన్ లోఁ గని శాంతితోడ

మసలుకొందును, నిన్ను నే మదిని గనుచు.

234. ఓం *సౌర్యై* నమః.

నామ వివరణ.

సూర్యుని యొక్క స్వరూపము అమ్మయే.

తే.గీ*సౌరి! * సూర్యప్రతాపంబు శాంతిలఁ గని

లోకులను గను, నిన్ గొల్తు శ్రీకరముగ,

నీవె మా ప్రాణమోయమ్మ! నీలవేణి!

వందనంబులు చేసెద నందుకొనుము.

ఓం *శౌర్యై* నమః.

నామ వివరణ.

పరాక్రమము యొక్క స్వరూపము అమ్మయే.

తే.గీసౌర తేజంబునొప్పెడి సౌరివమ్మ.

నాదు హృదయంబునన్ వెల్గు నయ నిధాన!

*శౌరి!* నీ తేజమున్ జూడఁ జాలనమ్మ,

జ్ఞాన నేత్రంబునిమ్ము నే కనెద నిన్ను.

ఓం *గౌర్యై* నమః

నామ వివరణ.

గౌర వ్ర్ణముతో ప్రకాశించు జనని మన అమ్మ.

తే.గీ*గౌరి!* నీ దివ్య రూపమున్ గనగనిమ్ము

భవ్యమైనట్టి నీపేరు పలకనిమ్ము,

చల్లనైనట్టి నీ దృష్టి సరిగ బరిపి

రక్షణమునిమ్ము భువిపైన క్రాలనిమ్ము.

235. ఓం *రూపాధికా*యై నమః

నామ వివరణ.

అధికమయిన రూపము కలిగిన జనని అమ్మ.

తే.గీమహిత *రూపాధికా! * నీదు మహిమ నెన్న

నాకసాధ్యంబు, నీవె సుజ్ఞానమిచ్చి

వ్రాయఁ జేయుము నిన్ గూర్చివాసిగొల్ప,

అందుకొనుమమ్మ నీవు నా వందనములు.

236. ఓం *అతిభాసే* నమః

నామ వివరణ.

మిక్కిలి ప్రకాశించు తల్లి మన అమ్మ.

కం.  *అతిభాసా! * నీకెవ్వరు

క్షితిపై గలరమ్మ సాటి? క్షేమప్రద వో

స్తుతమతి! నీ యౌదార్యము

నుతియింపగఁ జాలనమ్మ! నోములపంటా!

237. ఓం *దిగ్వస్త్రా*యై నమః

నామ వివరణ.

దిగంతములవరకూ వ్యాపించి దిక్కులే వస్త్రములుగా కలిగిన తల్లి.

తే.గీనీవు వ్యాపించి యంతటన్ నేర్పు మీర

భక్తులన్ గాచు *దిగ్వస్త్ర!* ప్రణతులమ్మ.

నా మనంబున వెలుగుచు క్షేమమిడుచు

సన్నుతంబుగ కాచెడి కన్నతల్లి!

238. ఓం *నవవస్త్రా*యై నమః

నామ వివరణ.

నిత్య నూతన వస్త్ర ధారణి అమ్మ.

కం*నవవస్త్రా!* సతతంబును

నవవస్త్రములీయఁ జాల నవ వస్త్రము లీ

కవనంబులె, కృపతోఁ గొను,

ప్రవిమలభావప్రభలను వరలింతు నినున్.

239. ఓం *కన్యకా*యై నమః

నామ వివరణ.

అమ్మ నిత్య కన్యకా స్వరూపిణి.

సాగర కన్యకామణివి సంస్తుత *కన్యక!* సన్నుతప్రభా

వాగమృతంబు నీవొసగి, పద్యకవిత్వము పండఁ జేసి, నా

యోగమె మార్చినావు, వరయోగసమృ ద్ధిని గొల్పు నిన్ను  నే

నేగతి నిర్వచించెద నహీన దయానిధి! నిన్ నుతించెదన్.

240. ఓం *కమలోద్భవాయై* నమః

నామ వివరణ.

కమలమునుండి జనించిన తల్లి అమ్మ.

తోటక వృత్తము.

*కమలోద్భవ!* నీ కృప కల్గినచో

ప్రముదంచిత కావ్యము వ్రాయనగున్,

సుమకోమల చిద్వర శోభలతోఁ

గమనీయ కవిత్వము కల్పితమౌన్.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.