గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఆగస్టు 2022, మంగళవారం

కళా విజయానందము..... రచన......డా. వెలుదండ సత్య నారాయణ పరమార్థ కవి

జైశ్రీరామ్.

 🌻 కళా విజయానందము🌻 


డా. వెలుదండ సత్య నారాయణ   పరమార్థ కవి

      "కళ" లో కకారం బ్రహ్మవాచకం కాబట్టి సృష్టిని సూచిస్తుంది. లకారం లయాన్ని సూచిస్తుంది. ఈ విధంగా కళ సృష్టి స్థితి లయ రూప మయింది. లలితకళలలో శిల్పకళ పేరెన్నిక గన్నది. ఆలయాలకోసం శిల్పాలు చెక్కడం అనాదిగా జరుగుతున్నది. ఆగమ శాస్త్రాలు దీని కాధారాలు. ఇవి శివోపాసనకోసం ఉద్దేశింపబడినవి. 3 వ శతాబ్దం నుంచి కూడ ఎందరో శిల్పులు శిల్పకళారాధననే శివారాధనగా భావించి కావించి తరించినారు.

     శిల్పకళ ఇతివృత్తంగా అవిభాజ్యమైన మహబూబు నగర్ జిల్లాలో ఇటీవల విరచింపబడి నా దృష్టికి వచ్చిన పద్యకావ్యాలు రెండు.

     1.శిల్పి: ఇదొక ఖండ కావ్యం. రచయిత "శ్రీ జి. యాదగిరి గారు. 2011 లో ప్రచురితం. "శ్రమకు దగ్గ కీర్తి సంపదలును లేక  బ్రతుకుబండలైన భగ్న జీవి" గా శిల్పిని అద్భుతంగా ఆర్ద్రంగా అభివర్ణించారు కవి. వారి చేతి వ్రాతతోనే పుస్తకం అచ్చయింది.

    2. శిల్పశ్రీ : ఇదొక చారిత్రక కావ్యం. రచయిత శ్రీ ముంజంపల్లి వీరబ్రహ్మేంద్రాచార్య గారు. 2016 లో ప్రచురితం. శ్రీ దరిశేటి వేంకట రామాచార్యుల వారి సంస్కృత కృతికి ఆనంద దాయకమైన అనుకృతి. శిల్పిని గౌరవించడానికి వచ్చిన రుద్రమదేవి శిల్పాన్ని గౌరవించడం అనన్య సామాన్యంగా యిందులో అభివర్ణించబడినది.

    అదే కోవలో వెలువడిన ప్రస్తుత కావ్యం "నిర్వచన శిల్పకళా విజయం". రచయిత కీ.శే. మన్నె రాములు గారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గొరిట గ్రామవాసులు. సమీప నారదగిరి క్షేత్ర శ్రీవేంకటేశ్వర భక్తులై సంకీర్తనాచార్యులుగా పేరందిన తిరునగరి లక్ష్మణదాసు గారికి ప్రియశిష్యుడైన నాగదాసునకు పౌత్రులు వీరు.

    ఈ కావ్యంలో 104 పద్యా లున్నవి. ఇది శివుని కర్పించబడింది. 9 పద్యాల్లో ప్రార్థనాదులు గావించి కథారంభం చేయబడింది.

      సత్యపురంలో ఒక శిల్పకళా ప్రవీణు డున్నాడు. భార్య సుగుణాంబరి.. వారి కుమారుడే పూర్ణయాచారి లేదా పరిపూర్ణాచారి. చిన్నతనంలోనే శిల్పకళలో ఆరితేరినాడు. ఈడేరి మంచి అందగాడైనాడు.

     కాముకు డనే ఆ దేశపు రాజు ఒక శివాలయ నిర్మాణం సంకల్పించి పురోహితుని సూచన మేరకు పరిపూర్ణాచారిని పిలిపించగా గుడి నిర్మాణం ఆరంభ మయింది. గర్భగుడి, మండపాదులు అద్భుతంగా శిల్పిస్తూ వుండగా నీళ్ళకోసం వెళ్ళే యువతు లెందరో అతని అందచందాలు చూసి అబ్బుర పడిపోయారు. అంతేకాదు. అతని చిత్ర రూప మెదలో తమకు తెలియకుండానే పదిలపరచుకున్నారు.

     రాజ కుమార్తె సురక్త ఒకనాడు వచ్చి శిల్పిని  చూసింది. ఇద్దరి మనసులు ఒక టైనవి. మాటా మాటా కలిసింది. నిర్మాణాదులు ముగిసాక తనను పెళ్ళాడు మని ప్రార్థించింది...

   అంత నొక వింత యా పురమందు గలిగె 

   ప్రసవ మందిన కాంతల శిశువుల గన 

   యువక శిల్పిని బోలిన యుజ్జ్వలంపు

   చెలువు ప్రతి శిశువందున చెలగియుండె 60. 

        ఆ మధ్యకాలంలో ప్రసవించిన కాంతలకు శిల్పి రూపు రేకలే అచ్చు గుద్దినట్టు వున్న శిశువులే నూర్ల కొలది జన్మించినారు.

     అది చూసి జనులు విస్తుపోవడమే గాక బాధ పడి రాజుగారికి విన్నవించగా రాజు "శిల్పి యింత వంచకు డనుకోలేదు. తల తీయించండి." అని ఆజ్ఞాపించాడు. శిల్పి ఎంతో వేడుకున్నాడు. 


"కమలాప్త సుతునకు ఘనమగు వాహనం

     బనదగు నొక మంత్రి యధిప! మీకు

గిరిశుని బంటుకు స్థిర వాహనంబైన

     యట్టివానికి జత యనగ నొకడు..

పాండవ మధ్యము పడగకు నీ డగు 

     నట్టివానికి బోల్చ నగు నొకండు 

కృష్ణ జన్మంబున గూయుచు మేల్కొల్పి

     నట్టి జంతు సమాను డనగ నొకడు

గలరు నీ మంత్రివర్యులు ఘనులుగాను 

అంత కంటెను వారలు నధికు లనగ

జాలుదురు తెల్వితేటలు మేలు మేలు. 

వారి గని యెన్న వచ్చు మీ ప్రభుతనంబు" 75 


అన్నాడు రాజుతో. కావ్యంలోనే ఇది ఒక గూఢార్థ సమన్వితమైన పద్య రాజం. "నీ కొలువులో ఇలాంటి వా రున్నా" రని చెప్పాడు. ఎలాంటివా రంటే..

      కమలాప్త సుతు డంటే సూర్యుని కుమారుడు- యముడు. ఆతని వాహనం మహిషము. దున్నపోతు లాంటి వా డొక డున్నా డని మొదటి పాదం యొక్క భావం..

     గిరిశు డంటే శివుడు. అతని బంటు అంటే భైరవుడు. అతని వాహనం శునకం. కుక్కలాంటి వా డొక డున్నా డని 2 వ పాదం యొక్క భావం. 

     పాండవ మధ్యము డంటే అర్జునుడు. పడగ అంటే అతని ధ్వజము. దాని మీద ఆంజనేయు డుంటాడు. కోతిలాంటి వా డొకడు నీ కొలువులో వున్నా డని 3 వ పాదం యొక్క భావం.

     కృష్ణ జన్మంబున అంటే కృష్ణుడు జన్మించి నప్పుడు కూయుచు మేలుకొల్పిన జంతు వంటే ఓండ్రపెట్టి అందరినీ మేల్కొలుప జూచిన గార్దభ మని భావం. కారాగారంలో కృష్ణుడు జన్మించినాడు. ఆతణ్ణి వసుదేవుడు (కృష్ణుని తండ్రి) వెంటనే రేపల్లెలోని యశోద వద్దకు చేర్చవలె. లేకపోతే కంసునితో ప్రమాదం. ఆ అర్ధరాత్రి కావలి వారంతా గాఢనిద్రలో వున్నారు. వారు లేవక ముందే ఆ పని జరుగాలి. కానీ గాడిద ఒకటి ఓండ్రపెట్ట జూచింది. "వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు" అనే లోకోక్తి మన కున్నది. వసుదేవుడు దాన్ని బ్రతిమలాడినా డట! "నీ కొలువులో ఓ రాజా! గాడిదలాంటి వా డొక మంత్రి వున్నా" డని 4 వ పాదం యొక్క భావం.

     అద్భుతమైన ఈ పద్యం కావ్యంలోనే తలమానికం. అంతే కాదు ధైర్యంగా సృష్టి రహస్యా న్నిలా విడమరచి రాజుకు విన్నవించాడు శిల్పి.

     మానసికంబునన్ గలుగు

          మానవకోటుల రూప భేదముల్

     పూనికతోడ దెల్పెదను

           పుణ్యవతుల్ ఋతుకాలమందునన్

     దేనిని నాత్మలో నిడి త

            దేకము ధ్యాన మొనర్చుచుందురో

     దానినె పిండరూపమున

             దైవ మొనర్చు నుదాత్త పద్ధతిన్ 

        కావ్య మంతా ఈ పద్యము మీదనే ఆధార పడి వున్నది.

      

 "ఇదే యథార్థమైతే ఒక సంవత్సరం గడు విస్తున్నాను. నిరూపించు." అన్నాడు రాజు.

      ఆ ప్రాంతంలో శిల్పికి ఒక పెద్ద ఆవుల మంద, ఒక తెల్ల గుండు కనిపించినవి. ఒక నెల లోపల అతడు గుండును సర్వాంగ సుందరంగా ఒక "నంది" గా మలచినాడు. ఇక ఆవు లన్నీ దాని చుట్టే తిరిగినవి. వాటి మనస్సులలో ఆ నంది ముద్ర పడిపోయింది దృఢంగా. పదకొండు నెలలకు దూడలు జన్మించసాగినవి. అన్నీ ఆ నంది పోలికలతోనే అలరారుతున్నవి. 

     రాజు వెళ్ళి చూసి ఆశ్చర్యపడి తన తప్పు తెలుసుకొని పరిపూర్ణునికి సాష్టాంగపడి క్షమించు మని వేడుకొన్నాడు. మిగిలిపోయిన ఆలయం పనులు గుర్తు చేయగా శిల్పి నెలరోజులలో పూర్తి చేశాడు. సురక్త తండ్రితో చెప్పింది శిల్పిని ప్రేమిస్తున్నా నని. రాజు అంగీకరించగా ఇద్దరికీ వైభవంగా పెండ్లి జరిగింది...

     శిశువులకు ముఖ కవళిక లెలా రూపు దిద్దుకుంటా యనడానికి వెనుక సృష్టిలో నున్న మర్మాన్ని విప్పి చెప్పే ప్రయత్నం కవి చేయడమే గాక సఫలీకృతుడు కావడం ఎంతో ప్రశంసించదగిన విషయం. ఇటువంటి వినూతనమైన ఇతివృత్తం మీద ఆధార పడి కావ్యరచన సాగడం చాలా అరుదైన విషయం. 

      కీ.శే. బైరోజు దామోదరాచార్యుల వంటి మహాశిల్పులకు కీ.శే. తిరునగరి లక్ష్మణదాసు వంటి సంకీర్తనాచార్యులకూ, కీ.శే. కపిలవాయి లింగమూర్తి గారి వంటి మహాకవులకు ఆలవాల మయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇటువంటి కళాత్మక కావ్యం రావడం ఆశ్చర్యమేమీ కాకపోయినా ఆనంద మెంతో అయి తీరుతుంది. 

     ఈ కృతి ప్రభాలోకనం చేయడాని కహరహం తపించి శ్రమించిన సంస్కార విశాల హృదయులు, నాటకకళా పిపాసులు, బహుగ్రంథకర్త శ్రీ దుప్పల్లి శ్రీరాములు గారి ప్రేరణతో కావ్యం ముద్రణ దశలో వున్నప్పుడే చదివి ఈ వ్యాసం వ్రాయటం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 

(కృతి పరిష్కర్త: శ్రీ కపిల వాయి లింగమూర్తి.. 

ప్రచురణ 2020 వెల: రూ.50/ ప్రకాశకులు:

య.డి.జహంగీర్ ఇం.నెం.11-45, రాంనగర్ కాలనీ, నాగర్ కర్నూల్ జిల్లా 509 209

చరవాణి : 9493079850) 


డా. వెలుదండ సత్య నారాయణ 

పరమార్థ కవి

పరమార్థకవిగారికి అభినందన పూర్వక ధన్యవాదములు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.