గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఆగస్టు 2022, మంగళవారం

ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో- ...11 - 31...//.కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో- , , .11 - 32,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

 జైశ్రీరామ్.

|| 11-31 ||

శ్లో.  ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో

నమోస్తు తే దేవవర ప్రసీద|

విజ్ఞాతుమిచ్ఛామి భవన్తమాద్యం

న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్.

తే.గీ. వందనంబులు పరమేశ!  వందుచుంటి

యెవరివో నీవు తెల్పు మేనెరుగ నిన్ను,

నాది పురుషుడవైన నిన్నరయ నుంటి,

నీ ప్రవృత్తిని సృష్టిలో నే నెరుంగ.

భావము.

ఓ పరమాత్మా! నీకు నా నమస్కారములు - ప్రసన్నుడవు కమ్ము. 

ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. 

ఆదిపురుషుడవైన నిన్ను విశదముగా తెలిసికొనగోరుచున్నాను.

 ఏలనన నీ ప్రవృత్తిని ఎఱుంగలేకున్నాను.

శ్రీభగవానువాచ|.

భావము.

భగవానుడు పలుకుచుండెను,

|| 11-32 ||

శ్లో.   కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో

లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః|

ఋతేऽపి త్వాం న భవిష్యన్తి సర్వే

యేవస్థితాః ప్రత్యనీకేషు యోధాః.

తే.గీ. అంతమున్ జేయ సృష్టినే యమరితిచట

కాలునిగ నింక పోరీవు కా దనినను,

రిపులు మిగులరొక్కరును  హరింతు నేను,

కాలధర్మంబు తప్పింప గాంచుమీవె.

భావము.

నేను లోకములన్నింటిని తుదముట్టించుటకై విజృంభించిన 

మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొని

యున్నాను. కనుక నీవు యుద్దముచేయకున్ననూ ప్రతిపక్షముననున్న 

ఈ వీరులెవ్వరును మిగులరు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.