గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఆగస్టు 2022, మంగళవారం

అనాదిమధ్యాన్తమనన్తవీర్య- ...11 - 19...//.. ద్యావాపృథివ్యోరిదమన్తరం హి , , .11 - 20,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

 జైశ్రీరామ్

|| 11-19 ||

శ్లో.  అనాదిమధ్యాన్తమనన్తవీర్య-

మనన్తబాహుం శశిసూర్యనేత్రమ్|

పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం

స్వతేజసా విశ్వమిదం తపన్తమ్.

తే.గీ‌. ఆది మధ్యాంత రహితుడ వపరిమిత మ

యిన మహాశక్తిశాలివి, యినడు శశియు

నేత్రములునీకు, భుజములనేక బాహు

వులను ప్రజ్వలితపువక్త్రవుగ గనితిని.

భావము.

నీవు ఆదిమధ్యాంత రహితుడవు. అపరిమితశక్తిశాలివి. 

అసంఖ్యాకములైన భుజములు గలవాడవు. సూర్యచంద్రులు నీ 

నేత్రములు. అగ్నివలె  నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. 

నీ తేజస్సులో ఈ జగత్తును సంతప్తమొనర్చుచున్నావు. 

అట్టి నిన్ను నేను చూచుచున్నాను.

|| 11-20 ||

శ్లో.  ద్యావాపృథివ్యోరిదమన్తరం హి

వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః|

దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం

లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్.

తే.గీ. దివిమొదలుగ నంతటనిటు భువివరకును

కలుగునాకాశమున నిండి కలిగితీవె,

అద్భుతంబు, భీకరమయి యలరు నిన్ను

జూచి ముల్లోకముల్ భీతి జొక్కె గృష్ణ.

భావము.

ఓ మహాత్మా! దివి నుండి భువి వఱకు గల అంతరిక్షమునం దంతటను 

అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవై యున్నావు. అధ్బుతమైన నీ 

భయంకరరూపమును చూచి ముల్లోకములును గడగడలాడుచున్నవి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.