గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జులై 2022, గురువారం

స మోహం సర్వభూతేషు ..|| 9-29 || అపి చేత్సుదురాచారో . || 9-30 ||..//.. నవమోధ్యాయః - రాజవిద్యారాజగుహ్యయోగః

  జైశ్రీరామ్

 || 9-29 ||

శ్లో.  స మోహం సర్వభూతేషు న మే ద్వేష్యోऽస్తి న ప్రియః|

యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్.

తే.గీ. జీవులన్నిట నే నుంటి జీవ మగుచు,

ద్వేష రాగ విదూరుండ, భాసిల నను

భక్తి సేవించువారిలో వరలుచుందు

వారు నాలోన నుందురు వరలుచుండి.

భావము.

నేను ప్రాణులందరిలోను సమంగా ఉన్నాను. నాకు ద్వేషింప 

తగినవారు అంటూ లేరు, ప్రేమించవలసిన వారూ లేరు. అయితే 

నన్ను భక్తితో ఎవరు సేవిస్తారో వాళ్ళు నాలో ఉంటారు. నేను 

వాళ్ళల్లో ఉంటాను.

|| 9-30 ||

శ్లో.  అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్|

సాధురేవ స మన్తవ్యః సమ్యగ్వ్యవసితో హి సః.

తే.గీ. కన దురాచారుడైనను ఘనతరమగు

దీక్షతో నన్ను సేవింప తెలియ నతడు

సజ్జనుండుగా నెన్నుటే సరి, నిజంబు,

భక్తి సంయుక్తు లొందెడున్ ముక్తి, నిజము.

భావము.

ఎంత దుర్మార్గుడైనా అతడు అనన్య భావంతో సేవిస్తే అతడు 

సరైన నిర్ణయం తీసుకున్న వాడే, కాబట్టి సత్పురుషుడుగానే 

ఎంచతగిన వాడు.

జైహింద్

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.