జైశ్రీరామ్.
భారత ఇతిహాసం - హరి వంశ పురాణం
.బ్రహ్మశ్రీ ముదిగొండ విశ్వేశ్వర శాస్త్రి
ప్రపంచ వాఙ్మయంలో వేదముల తర్వాత అంతటి స్థానాన్ని పొందిన మహత్తర గ్రంధం మహా భారతం మాత్రమే. కాబట్టే అది "మహత్వాత్ భారవత్వాచ్చ మహా భారత మిష్యతే" అని "ఎన్నభారతే తన్నభారతం" అని ప్రశస్తి పొందింది. ఐతే వేదాలు నాలుగు అపౌరుషేయాలైతే ఋషిప్రోక్తమైన భారతం పంచమ వేదమైనది. ఈ పంచమ వేదమైన భారతం ఇతిహాస గ్రంధంగా పేరొందితే దానికి కొనసాగింపుగా రచింపబడిన పరిశిష్ట గ్రంధం మహా భారత ఖిల భాగమైన హరి వంశం మాత్రం పురాణమైనది.
కాని ఇది అష్టాదశ పురాణాల జాబితాలో మాత్రం చేర్చబడలేదు. అదే హరి వంశం ప్రత్యేకత. నిజానికి భారత హరి వంశాలు రెండూ ఒకటే. ఐనా కూడా ధర్మార్ధ కామములనే త్రయీ వర్గ ప్రతిపాదితమైన వేదం వంటిది భారతం. ఐతే మోక్ష సాధకమై ఉపనిషత్ ప్రతిపాదిత విషయాలను బోధించేది హరి వంశం అవుతున్నది. అపుడే వాటిని ఆశ్రయించిన మానవుడు తాను కోరే వేదవిహితమైన చతుర్విధ ఫల పురుషార్ధాలను సక్రమంగా పొందగలుగుతాడు. ఆ వేదధర్మాలను సులభంగా అర్ధం అయ్యేలా చేసేవే పురాణ, ఇతిహాసాలు.
శ్లో || ఇతిహాస పురాణాభ్యామ్ వేదం సముప బృoహయేత్ |
బిభేత్యల్ప శృతాద్వేదో మామయం ప్రహరిష్యతి || (భార- 1-267)
అంటే ఇతిహాస పురాణాల సహాయంతో వేదంలోని నిగూఢమైన విషయాలను సంవర్ధింప చేయాలి. వేదాలను అధ్యయనం చేయలేనివారు, అల్పజ్ఞులు ఐనవారు తన గురించి ఎక్కడ అపార్థాలకు దారి తీస్తారో అని వేదం కూడా భయపడుతుందిట. అంటే ఇతిహాస పురాణాలు మాత్రమే వేదార్ధాలను సక్రమంగా వివరించగలుగుతాయని దీని తాత్పర్యము. వాటి సహాయంతోనే వేద హృదయాన్ని గ్రహించగలగాలి.
ఇక ఇతిహాసమంటే ఒక్క భారతమే అనేది సుస్పష్టమే. కాని పురాణములంటే వ్యాసుడు వ్రాసిన అష్టాదశ పురాణములను అన్నింటిని గ్రహించాలా? లేక కొన్నింటిని మాత్రమే గ్రహించాలా? ఐతే వాటిలో ఏది అన్నది ప్రశ్న.
కాని శ్లోకంలో "ఇతిహాస పురాణాభ్యామ్" అని తృతీయా విభక్తి ద్వివచనమును ప్రయోగించటం జరిగింది. కాబట్టి ఇతిహాసమైన భారతము దాని ఖిల భాగమైన హరి వంశ పురాణము చేతను మాత్రమే వేద మంత్రార్థ వివరణము చేయవలయును అని పండితుల అభిప్రాయము.
ఐతే ఇక్కడ ఒక్క సందేహము మాత్రము కలుగకమానదు. భారతం ఇతిహాసంగా ప్రసిద్ధము. హరి వంశం పురాణంగా ప్రసిద్ధము. అది భారతానికి ఖిల గ్రంధము. ఖిలము అనగా మిగిలినది, పరిశిష్టము అని అర్ధము. కాగా ఇతిహాసంలోని చివరి భాగం కూడా ఇతిహాసమే కావాలి. కానీ పురాణం ఎలా అయింది. వ్యాసుడు మహాభారతానికి " జయోనామ ఇతిహాసోయం ". ఈ ఇతిహాసము జయమను పేరు గలది అని స్పష్టంగా ప్రకటించాడు.
ఇతిహాసానికి వుండే లక్షణాలను పరిశీలిస్తే
శ్లో|| ధర్మార్ధ కామ మోక్షాణాం ఉపదేశ సమన్వితం |
పూర్వవృత్త కథోపేతం ఇతిహాసం ప్రచక్షతే ||
ధర్మాన్ని గాని, అర్థాన్ని గాని, కామాన్ని గాని, మోక్షాన్ని గాని ఉపదేశించేదిగా ఉండి గతంలో జరిగిన వృత్తాంతాన్ని తెలియపరిచేది ఇతిహాసం. " ఇతిహాస: పురావృత్తం" అని అమరసింహుని వచనం. కాబట్టి భారతం ఇతిహాసమే. ఇక పురాణం శబ్దాన్ని పరిశీలిస్తే దాని లక్షణాలను కూడా అమరసింహుడు ఇలా
శ్లో|| సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ |
వంశాను చరితం చేతి పురాణం పంచ లక్షణం||
సృష్టి, ప్రళయము నానా ఋషుల, రాజుల వంశావళులు, మనువుల విశిష్ట కాల గణనము, సుప్రసిద్దులగు రాజుల, ఋషుల చరిత్రలు అను ఈ అయిదింటితో కూడినది పురాణమని చెప్పినాడు.
అట్లని భారతంలో పురాణం లక్షణములు లేవని భావించరాదు. స్వల్పంగా కనిపించినను అది మాత్రం ఇతిహాసమే. కాని హరి వంశములో మాత్రము పురాణ లక్షణములను సంపూర్ణముగా గమనించవచ్చును. అట్లని ఇతిహాస లక్షణములు అసలే లేవనియును కాదు.
మహాభారతం స్వర్గారోహణ పర్వంతో ముగిసినట్లు అనిపించినను నూరు పర్వములను లెక్కించుటలో హరి వంశము కూడా ఉండుటచే హరి వంశాంతమే సంపూర్ణ భారతము అని వ్యాసుడే హరి వంశంలో ఇలా స్పష్టం చేసాడు.
శ్లో|| భారతం సర్వశాస్త్రాణాం ఉత్తమం భరతర్షభ |
భారతాత్ ప్రాప్యతే మోక్ష: తత్వమేతత్ బ్రవీమితే || (హరి- 132 -93)
శ్లో|| యత్ర విష్ణు కథా: దివ్యా: శృతయశ్చ సనాతనా:|
తత్ శ్రోతవ్యం మనుష్యేణ పరంపద మిహేచ్ఛతా|| (హరి -132-96)
కాబట్టి వేదాలకు ఉపనిషత్తులు ఎలాంటివో భారతానికి హరి వంశం కూడా అలాంటిదే.
భారతంలో కృష్ణుడు అర్జునునికి ఉపదేశం చేసిన గీత ఉపనిషత్తే ఐనా ఇంకా ఉపనిషత్తుల లాంటి గీతలు అనేకం వున్నా అవన్నీ భారత కథా భాగంలో అంతర్భాగంగా మాత్రమే ఉండిపోయాయి. తరువాత కాలక్రమేణా రామాయణంలోని సుందరకాండ వలే భగవద్గీత కూడా ప్రత్యక పారాయణ గ్రంధంగా ప్రచారం పొందింది. కాబట్టే ఉపనిషత్ స్వరూపమైన హరి వంశాన్ని వ్యాసులవారు ప్ర త్యేకంగా రచించటం జరిగింది అనవచ్చు. అసలు హరి వంశాన్ని 19వ పర్వంగా భావించేవారు కూడా లేకపోలేదు. అందుకే వ్యాస హృదయాన్ని గ్రహించిన ఎర్రన భారతం అరణ్య పర్వ శేషం పూరణం చేసినా మరలా హరి వంశం రచించటంలోని ఆంతర్యం కూడా ఇదియే అని పండితుల అభిప్రాయం.
నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే.
స్వస్తి
భద్రమస్తు
ముదిగొండ విశ్వేశ్వర శాస్త్రి
9440103664.
జైహింద్.