గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, మే 2020, మంగళవారం

తే.03 . 5 . 2020 ని శంకరాభరణం లో జరిగిన అవధానమును నేనూ అనుసరిస్తూ ప్రయత్నించి చేసిన పూరణలు.

జై శ్రీరామ్.
తే.03 . 5 . 2020 ని శంకరాభరణం లో జరిగిన అవధానమును నేనూ అనుసరిస్తూ ప్రయత్నించి చేసిన పూరణలు.

నిషిద్ధాక్షరి. మిర్చిబజ్జి
ఈవేళన్ నే దింటిన్.
భావంబున్ గలిగినట్టి పచ్చి మిరపచే
జీవంబిచ్చెడి బజ్జీ.
దేవా రుచిచూడుమయ్య. తెలియును నీకున్.

సమస్యాపూరణము.
ఉ.  కల్లయెకాదు చూడ కలికాలమహత్యము లోకమందు సం
ధిల్లెడునీయనసంగతము దేవర వింతలు చూడ నేరవా?
చల్లగ వృద్ధురాలికిట సంతతి కల్గెమరంతెకాదు యీ
పిల్లకు పిల్లబుట్టెగద పిన్నతనంబుననబ్బురంబుగన్!

దత్తపది. కరోన సమయంలో స్త్రీసుస్వభావ.
కీటకము,భూతము, రాక్షసి, కయ్యము.

ఉ.  పాయఁగఁ జేసి కీటకము భద్రతనిద్ధర మానవాళికిన్
స్త్రీయె శుభప్రదంబగుచు తీరుగ కాచుచు భూతజాలమున్
పాయ కరోన రాక్షసియె పన్నుగ జేసును శౌచ్యమున్ భువిన్
జ్ఞేయము కయ్యముల్ తుడిచి శ్రేయము గొల్పును స్త్రీలె నమ్మినన్.

న్యస్తాక్షరి.
పార్వతీ పరిణయము.
విశ్వము మెచ్చునట్టులుగ (౧౦ వి)జ్ఞతతో గిరి రాజ కన్య తా
శాశ్వితమైన(౬ మా)ర్గమని చక్కగ నీశ్వరునే వరించగా
శశ్వదనంతకీర్తి గన సమ్మతి (౧౩ సా)గగ జేసె నత్తరిన్
విశ్వవిభున్ మదిన్ గొలిచి వేగమ పెండ్లిని (౧౬ పె)పెద్ద తానెయై.

వర్ణన.
విశ్వరూపంలో కరోనా కల్లోలం శార్దూలములో/
శ్రీకృష్ణా! వర విశ్వరూపమున నే చిత్రంబుగానో కరో
నా కల్లోలము చూచుచుంటి నకటా! న్యాయంబు కాదే కనన్.
నీకే న్యాయము లేనిచో నిక మమున్ నిష్టన్ సదా రక్షణన్
లోకంబందెవరయ్య చేయుదురహో లోకేశ! రక్షింపరా!

ఆశువు. 1
వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి మనోగతం కరోనా వల్ల ఏకాంతంగా పూజల్కందుకొంటున్నందున.
మానవ జాతి చేసెడి యమానుషకృత్య ఫలంబు దైవమౌ
నేనును పొంద తప్పదయె.నిత్యమహోత్సవమీ విధంబుగన్
మౌనముగానె పొందుటది మాకును తప్పకపోయె నక్కటా.
నేనె కరోన బాపెద మనీషులు నాకడ నుండఁ జేయగన్.
చిత్రానికి పద్యం. 1
నల్లపూసలదండ నా నల్లనయ్య
భార్య మెడలోన వేయుటన్ బరవశమున
బ్రాహ్మణాళియు చూచుచు పరవశులవ
లక్ష్మియుప్పొంగె చూడుడు లక్ష్యమునను.

ఆశువు ౨. కరోనా కారణంగా వలస కూలీల బాధ.
కష్టమును చేసి బ్రతికుటే కష్టమయ్యె
పనులు లేవుకరోనచే పస్తులింక
తప్పవాయెను బ్రతుకులే దైన్యమాయె
మమ్ము కాపాడ రావేల మా మహేశ!
చిత్రానికి పద్యం ౨. 
దినకరు తేజమెన్నగ సుధీమణులేకద తగ్గ వారు. నే
ఘనముగ నెన్నఁ జూచినను కన్నులనీరవిఁ గాన నేరనే
మనమున గాంచ నెంచినను మాన్యుఁడు నన్ను ననుగ్రహించునా?
క్షణము మనమ్మునన్ నిలువ కమ్మగ నే గని వ్రాయఁ గల్గుదున్.

ఆశువు 3.
చదువులు చెప్పినా మకట సన్నుతి గొల్పగ శిష్యపాళికిన్
వదల దహో కరోన. వరభావ సమృద్ధులు శిష్యులెన్నగా.
మదులు విచార మగ్నమయె మాయపరీక్షలు కాకపోవుటన్.
హృదయము కల్గు దేవ! మదినెన్ని తొలంగగ జేయుమీస్థితిన్.
చిత్రానికి పద్యం 3.
బంగినపల్లి మామిడిది భద్రము మిత్రమ! పెట్టిలోపలన్
రంగుదలిర్ప నుంచుము. పరాకును వీడుము పాడుచేయబో
కంగురుదేవుఁ జేరి యట గౌరవమొప్పగ వారికిమ్ము. ని
న్నంగజ వైరి కాచుత శుభాస్పదుఁడై భువి వెల్గఁ జెయుతన్.

జై శ్రీమన్నారాయణ.
చింతా రామకృష్ణారావు.
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.