గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, మార్చి 2013, శుక్రవారం

ప్రపంచ మహిళా దినోత్సవము సందర్భముగా మహిళా లోకానికి శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా!
ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవముగా గుర్తించి మహిళలకు ప్రపంచ స్థాయిలో సమున్నత స్థానమును గుర్తించడం సహృదయులైన మానవులకందరికీ ఆనందదాయకం అనడంలో సందేహం లేదు.
ఈ సందర్భముగా మహిళా లోకానికి నా శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను.
ఈ సృష్టికి మూలము మహిళ.
జన్మ కారణము మహిళ.
విద్యా బుద్ధులకు మూల హేతువు మహిళ.
అభివృద్ధికి మూలము మహిళ.
సృజనాత్మకత ప్రేరేపణకు మూలము మహిళ.
అదే విధముగా సర్వార్థసంపత్కరి మహిళ.
మూలశక్తిగా ఆరాధింపబడే దైవము మహిళ.
త్రిమూర్తుల సృష్టికి మూలము మహిళ.
అంతటి మహోన్నత స్థానమును సృష్టిలో పొంద గలిగిన మహిళలను గౌరవించడమన్నది స్రీ కారణముగా జన్మనొందిన ప్రతీ మనిషికీ కనీస బాధ్యతగా ఒకరు గుర్తు చేయవలసిన పని లేదు.
తన జన్మ కారణమైన తల్లిని,
తన ఆత్మీయతకు కారణమైన సోదరీమణులను,
తన సంతోష జీవన హేతువైన మిత్రురాలిని,
తన జీవనమైన అర్థాంగిని,
తన ప్రాణంలో ప్రాణమైన కూతుళ్ళను,
తనను తన కుమారుని కళ్ళల్లో పెట్టుకొని నిరంతరం కాపాడుతుండే కోడండ్రను,
వృద్ధాప్యంలో కూడా ఆనందాన్ని వెల్లివిరియ జేసే మనుమరాడ్రను,
సమాజంలో తమ చిఱునవ్వులతో అత్మీయతానురాగాలతో గౌరవించే మహిళామణులను,
ఇలా ఎందరెందరు మహిళలనో మనం కనీసం మంచి మాటలతోనైనా ఆనందపరచవలసిన ధర్మాన్ని మనం మరచిపోతే ఆ పరమాత్మ కాని, ఆ ఆది పరా శక్తి కాని క్షమిస్తారా?
ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఇది నగ్న సత్యంగా తోచక మానదు.
అందుకే మనం
యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః. అని మనసులో ప్రతీ ప్రాణిలోనూ ఆ జగదంబను తలచుకొని ప్రార్థన చేయాలి. స్త్రీలు కంట పడితే మంచి మనసుతో మనసారా వారిని ముమ్మూర్తులా జగన్మాతగా భావించి, ఆలోకమాత తనకు తానుగా ప్రత్యక్షమైతే ఎక్కడ జడుచుకొని ప్రాణం వదిలెస్తామోనని భావించి, ఇలా ఎదురుపడే మహిళల రూపంలో మనను కటాక్షిస్తోందని భావించి ఆ మహిళా రూపంలో ఉన్న ఆ జగదంబను మనం గౌరవించాలి.
ఇక మహిళలు
ఈ విషయంలో తమకు స్త్రీ జన్మ పరమాత్మ ప్రసాదించిన వరంగా భావించాలి.
ఆ జగన్మాతలకు మారు రూపగా ఈ సమాజం అభివృద్ధి మార్గంలో నడచుటకు, తనచుట్టూ ఉండే వారిని నడుపుటకు మనసారా సంసిద్ధం కావాలి.
తనకు గల గురుతరమైన బాధ్యతను స్త్రీ మరువ కూడదు.
స్త్రీ జాతిపై లోకులకుండే అపారమైన గౌరవాన్ని తన ప్రవర్తనద్వారా నిలప గలగాలి.
సమాజాన్ని పురుషులను చిన్నగా చూడ కూడదు.
గౌరవస్థానంలో తాను నిలుచుటకు తగినంత కృషి తాను చేయడానికి వెనుకాడకూడదు.
లౌకికమైన అపోహలకు లోను కాకూడదు.
లౌకికమైన అసంబద్ధమైన దుష్ట వాంఛలకు లోను కాకూడదు.
సమాజంలో కొందరు స్త్రీలను చూసేసరికి పాదాభివందనం చేయాలనిపిస్తుంది. అటువంటి స్త్రీలలో ఉండే ఏ గుణములు వారికి గౌరవాన్ని కలిగిస్తున్నాయో గ్రహించి, అటువంటి గౌరవప్రదమైన సత్ప్రవర్తనను మహిళలు అలవరచుకోవాలి.
ఎక్కడో పుట్టి పెరిగి, ముక్కూ మొహమూ తెలియకపోయినా వివాహబంధంతో అత్తవారింటికి చేరిన స్త్రీ ఆయింటికే దీపం ఔతోంది. ఆ కుటుంబ గౌరవం, ఆ కుటుంబ వృద్ధి కేవలం ఆ కోడలిపైనే ఆధారపడి ఉంది.
ఇంతటి అత్యద్భుతమైన పాత్రపోషించ వలసియున్న మహిళ తన బాధ్యతను గుర్తించి, తనను తాను తీర్చి దిద్దుకోవాలి. అందరి మన్ననలకు పాత్రత పొందగలగాలి.
అలాంటి పాత్రత పొందాలంటే ముఖ్యంగా
౧)స్మిత పూర్వ భాషణము.(చిఱునవ్వుతో మాటాడుట)
౨)సౌశీల్యము,
౩)నిష్కళంక హృదయము కలిగి యుండుట,
౪)మాటలలో తొణికిసలాడే మంచితనము కలిగి యుండుట,
౫)ఎంతటి శ్రమనైనా ఓర్పుతో చేయగలుగుట.
౬)అత్యద్భుతమైన నిండైన శారీరక, మానసిక సుస్వరూప ప్రదర్శనము.
అంటే చక్కని నిష్కపటమైనమనసు కలిగి ఉండుట,
నిండైన వస్త్రధారణము, అలంకరణలతో చూడ ముచ్చటగా సమాజములో ఒప్పుట.
౭)అన్నిటికీ మించి ఆత్మ నిగ్రహము.
ఇవి కలిగి ఉంటే ఏ స్త్రీ మూర్తీ కూడా ఎటువంటి దురాగతములపాలు అయే అవకాశము ఉండదు.
కావున
లక్ష్మీ-సరస్వతి-పార్వతీ స్వరూపులైన మహిళాలోకాన్ని మనసార వేడుకొంటున్నాను. ఈ సమాజాన్ని కాపాడమని, తమ సత్ప్రవర్తనతో లోకానికే ఆదర్శమూర్తి కావాలని కోరుకొంటున్నాను.
ఈ నా మాటలో దోషములుగా మీ మనసునకనిపిస్తే మనసారా మన్నించే సంస్కారం మీకు ఉంటుందని ఆశిస్తున్నాను.
మీ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను మీరు నిర్భయంగా అనుభవించాలని మనసారా ఆశిస్తున్నాను.
అమ్మా!శాంభవి-లక్ష్మి-వాణిజననీ! హాయిన్ ప్రసాదింపుడీ
సమ్మోదమ్మున లోకమందు వెలిగే సత్శీలతల్ గొల్పుడీ!
మిమ్మే మానసమందు గాంచగలిగే మీ తత్వ సత్ శోభలన్
నెమ్మిన్ గొల్పగ వేడెదన్ మహిళకున్ నిత్యత్వమున్ గొల్పుచున్.
మహిళామణులకు మరొక్కమారు నా శుభాకాంక్షలు తెలియజేసుకొంటూ
సుజన విధేయుఁడు
రామకృష్ణ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.