నందఁ జేసితి, నే, ముక్తి నంద గోరి.
1. శివా! భవా! నమో೭స్తుతే! విశేష భక్త వత్సలా!
భవాని వామ భాగమందు భవ్యయై వసింపగా
నవీన దివ్య తేజసంబు నాట్యమాడు నీ దరిన్.
నివాసముండుమా మదిన్. వినీల కంధరా! శివా!
2. నమో೭స్తు తే. సదా శివా! సనాతనా! నమో೭స్తు తే.
నిమేషమందె నీల కంఠ! నీ కృపా కటాక్షముల్
ప్రమోదమందఁ జేయుఁగా, ప్రభావపూర్ణ తేజమై,
నమస్కరింతునయ్య నీకు. నన్నుఁ గాంచుమా! శివా!
3. శశాంక శేఖరా! హరా! విశాల నేత్ర! సుందరా!
ప్రశాంత చిద్విరాజమాన భవ్య భక్త వత్సలా!
నిశీధిలో విశేష కాంతి నింపి లింగమూర్తిగా
నశేష భవ్య భక్త కోటి యార్తిఁ బాపితే! శివా!
4. ఉపాసనా ప్రభావ మెన్న నో హరా! పొసంగునే?
కృపా నిధీ! ఉపాసకుల్ నిరీక్షణన్ నినున్ గనన్
ప్రపూజ్యమాన దివ్య తేజ భద్ర లింగ దర్శనం
బపూర్వమై, యమేయమైన హాయి గొల్పుఁగా! శివా!
5. సమస్త దోష హారి వంచు జాగరంబుఁ జేసి, నిన్
ప్రమోద మందఁ జేయఁ బూను భక్త కోటిఁ గాంచితే?
క్షమింపుమా దురాత్ములన్, విశాల నేత్ర! శంకరా!
నమామి భక్త వత్సలా! ప్రణామమందుమా! శివా!
6. సరోరుహాననా! నినున్ ప్రసన్నతం గనుంగొనన్
ధరాతలంబునన్ బుధుల్ ప్రతాపమొందు చుందురే!
దురాత్ములైన గాని నిన్నుఁ దోయిలించి మ్రొక్కినన్
కరావలంబమిచ్చి దీక్ష కాచు చుందువే! శివా!
7. ప్రదీప్త దీప మొక్కటైన భక్తి నీదు సన్నిధిన్
ముదంబుతో వెలుంగఁ జేసి పూజ చేయు వారికిన్
సదా సుయోగ భాగ్యమిచ్చి, సత్ కృపన్ గ్రహింతువే!
మదీయ చిత్త సంస్థితా! సుమంగళాకరా! శివా!
8. దురంత దుష్కృతంబులేను దుర్మదాంధ వర్తినై
నిరంతరంబు చేసితో! వినీతునై చెలంగితో.
కరంబు నిచ్చి గాచితీవు గౌరవంబు దక్కెరా!
వరంబు నాకు నీ యుదార భావ మీశ్వరా! శివా!
9. ప్రదోష కాలమందు నిన్ను భక్తి తోడఁ గాంచితిన్.
ముదావహంబుగా భవాని పూజ లందుచున్ భవా!
సుధా సుదృక్పరంపరన్ సుశోభఁ గూర్చి, యంబకున్
విధేయతా స్వభావ మీవు వెల్వరించితే! శివా!
10. స్వధర్మ రక్షణంబు లోన సాధుపుంగవాళి నీ
విధేయులై మనోజ్ఞ భావ వీక్షణాళి నొందగా
మదిన్ దలంచి చూచుచుంద్రు, మాంద్యభావ శూన్యతన్,
ప్రదీప్త దివ్య తేజమిచ్చి రక్ష సేయుమో శివా!
11. ప్రపూజ్య దివ్య భక్తి భావ పారవశ్యమందు నే
ప్రపూజ్యుఁడా! ముదంబు తోడ పాప భావ నాశమున్,
తపో విధాన భాగ్యమున్, ప్రధాన భక్తి తత్వమున్,
నెపంబు నెంచకిమ్మటంచు నిన్నుఁ గోరనా? శివా!
12. వరంబయెన్ నమశ్శివాయ పంచ వర్ణ మంత్ర మీ
ధరన్. దురంత దుఃఖ దూరతన్, కృతార్థతన్, భవత్
కరావలంబమున్, పరంబు కల్గఁ జేయు. భక్తులన్
నిరంతరంబు కాచు చుండు, నిర్వికారుఁడా! శివా!
13. మనోజ్ఞుఁడా! నమో೭స్తుతే. ఉమాపతీ! నమో೭స్తుతే.
యనాధుఁడా! నమో೭స్తుతే.మహాత్ముఁడా!నమో೭స్తుతే.
వినీతుఁడా! నమో೭స్తుతే. సువేద్యుఁడా! నమో೭స్తుతే.
పునీతుఁడా! నమో೭స్తుతే. సుపూజ్యుఁడా! మహా శివా!
14. నిరామయుండ! నిర్గుణుండ! నిర్వికార! ఈశ్వరా!
ధరాతలంబు నేలు చుండె దౌష్ట్యముల్. గ్రహించితే?
కరావలంబ మీవె యిచ్చి కావకున్న మాకికన్
చరింప సాధ్యమా! మహేశ! సత్ స్వరూపుఁడా! శివా!
15. నరాధముల్, నరాంతకుల్, వినాశకారకుల్ భువిన్
పరాపకార మూర్ఖులున్, స్వభావ సిద్ధ దుష్టులున్,
చరించు చుండ్రి స్వేచ్ఛగా. విచార మగ్న చిత్తులై
నరోత్తముల్ కృశించు చుండ్రి. న్యాయమేదిరా? శివా!
16. స్వభావ సిద్ధ భక్తి భావ సాధు మానవాళికిన్
శుభాకరా! ప్రపూజ్య! నీదు సూక్ష్మ దివ్య బోధనల్
ప్రభాసమాన! స్పష్టమయ్య. భాగ్యమీవ వారికిన్.
విభుండ వీవ కాతువంచు విశ్వసింతురో శివా!
17. గణాధిపుండు మీ విశిష్టగౌరవంబునెన్నుచున్,
ప్రణామముల్ ప్రదక్షిణల్ ప్రభావమున్ గ్రహించి తా
ననేక మాచరించెగా! గణాధిపత్యమందెగా!
సనాతనా! నినున్ గనన్ బ్రశాంతి కల్గునో శివా!
18. హిమాద్రి పుత్రి నీ విచిత్ర హృద్య సుస్వరూపమున్
ప్రమోదమందెఁ గాంచి, యేమి భాగ్య మబ్బె నామెకున్?
ప్రమాణ మీవ సృష్టికంచు భవ్య భావనన్ వివా
హ మాడె నిన్నుఁ బ్రేమతో, మహాత్ముఁడా! మహాశివా!
19. హిమాచలాద్రి పుత్రి యుత్సహించి నీపయిన్ మహా
ప్రమోద మానసంబుతోడ భక్తి భావ యుక్తయై
యమేయ దీక్షఁ బూన, నీవు నామెనంది యుండగా
యమోఘమంచు దివ్యులెల్ల హర్షమందిరో శివా!
20. నమామి తే! మనోహరా! అనాధనాధ! సుందరా!
నమామి తే! ప్రభాన్వితా! అనంత రూప! తే నమ:!
నమామి తే! వినీల కంఠ! నాగ భూషణా! నమ:!
నమామి తే! జగత్పితా! ప్రణామమందుమా! శివా!
21. ఉమాపతీ! కృపాంబుధీ! సమున్నతత్వమంది నిన్
బ్రమోద మానసుండనై సభక్తిఁ గొల్చి, భ్రాంతులన్,
సమస్త లంపటంబులన్, విషాద పూర్ణ జన్మమున్,
బ్రమాదమున్ బరిత్యజింతు. ప్రాపుఁ గొల్పుమా! శివా!
22. ఉమాహరుల్ స్వరూపమందు నొక్కటై రహించగా
రమేశుఁడున్ విరించియున్ సరస్వతీ రమా సతుల్
ప్రమోద మంది గాంచిరే వరంబుగా! మనంబునన్
నిమేషమైన నిన్ను నిల్పు నేర్పు నీయుమా ! శివా!
23. సముజ్జ్వలత్ప్రశస్త లింగ సత్కృపా కటాక్షముల్
నమస్కరించు నట్టి వారు, నవ్య దివ్య భావులున్
ప్రమోద దివ్య చిత్తులున్, ప్రభాత సేవ భక్తులున్,
నిమేష కాలమందు పొందు, నిత్యుఁడా! మహా శివా!
24. మృకండు పుత్ర రక్షకా! వరేణ్యులన్నఁ బ్రీతితో
ప్రకాశమాన గౌరవంబు, ప్రాభవంబుఁ గొల్పుదే?
దుకూల, సర్వ భోగ భాగ్య దుండ వౌదువయ్య! త్ర్యం
బకా! మహాత్మ! నన్ను కావుమా! మహేశ్వరా! శివా!
25. జలాభిషేకమొప్పఁ జేయ, చాల సంతసింతువే!
కులాలుడైనఁ గాని వానిఁ కూర్మితో గ్రహింతువే!
విలాసవంతులైన గాని, పేదలైన గాని నీ
తలంపునందునొక్కటే. నితాంత భాగ్యదా! శివా!
26. ప్రపంచ భూత సాక్ష్య దివ్య పంచ వక్త్ర శోభివే,
విపంచి నాదమాధురిన్ సువేద్యమౌదువే హరా!
కృపాకటాక్ష వీక్షణల్ ధరిత్రిపైన నింపితే!
ప్రపూజ్య ఓం నమశ్శివాయ భవ్య మంత్రమై. శివా!
27. వినాశమన్నదెన్న లేని విశ్వ సాక్షివే ! హరా !
మనోజ్ఞ సృష్టి చేసి, దాని మట్టిఁ జేయ న్యాయమా ?
ప్రణామముల్ ప్రపంచ దివ్య భవ్య భాగ్య రక్షకా!
ననున్ గనంగదోయి సాంబ! నా మనోజ్ఞుఁడా! శివా!
28. నిరంతరాయ దృష్టి నీది. నిర్వికల్పుఁడా! భవా!
భరింపరాని దుష్ట భావ పాపు లేల పుట్టిరో!
విరించి చేయు సృష్టిఁ గాంచి వేగమే గ్రహించి, యీ
భరంబుఁ బాపి కావుమయ్య భారతాంబ నో శివా!
29. కవీశ్వరుల్ గ్రహించునట్లు కానిపించుమా హరా!
నివేదనంబు లందుమా! వినీతులన్ గ్రహింపుమా!
సువేద్యమై, మనోజ్ఞమైన సుందరాకృతిన్ కృపన్
కవిత్వ తత్వ రూప మొంది కాంచఁ జేయుమా! శివా!
30. గుణత్రయంబు నీవయై, ప్రకోప దుష్ట సంహతిన్
వినాశమొందఁ జేయవేమి? విశ్వ రూపుఁడా! హరా!
వినీతులెల్ల బాధలొంద ప్రీతి తోడఁ గాంతువా?
అనాది దుష్ట తత్వమెన్ని యార్పుమా! మహా శివా!
31. సుమంగళాకరా! నినున్ బ్రశోధనంబు చేయుచో
యమంగళంబులన్ని బాయు నాత్మ తేజ దర్శనం
బమోఘమై లభించునయ్య! హర్షణీయమై. సదా
సమాధి సుస్థితిన్ వెలుంగ సాధ్యమౌనుగా! శివా!
32. ప్రభాత వేళ స్నాన సంధ్య ప్రార్థనల్ చరించుచున్,
విభో! త్వదీయ లింగ మూర్తి వేల్పుగా గణించి, మా
యభీప్సితంబు లెల్లఁ ద్రోచి, యద్భుతాభిషేకముల్
శుభాకరా! గ్రహింపుమన్నశోభఁ గూర్తువే! శివా!
33. నిదానమే ప్రధానమంచు నిన్ను నమ్మి యున్నచో,
విధాత వ్రాయు వ్రాత నైన విశ్వసింపనేలరా!
సుధా ప్రపూర్ణ జీవితంబు శోభిలన్ యమర్తువే !
మదిన్ విశాల భావమున్న మమ్ముఁ గాతువే ! శివా !
34. విరించి సృష్టి లోనఁ గల్గు వింతలెల్ల కంటివా?
ధరాతలంబునందునుండు ధర్మమే నశించదా!
నరాధముల్ పొనర్చు దౌష్ట్య నర్తనంబు కానరా!
కరావలంబమిచ్చి మమ్ము కావుమా! మహా శివా!
35. త్రినాధ పూర్ణ దివ్య రూప! దేవ దేవ! శంకరా!
త్రినేత్రుఁడా! మనోజ్ఞ భావ దీప్తిఁ గొల్పి కావరా!
అనాధనాధుఁడా! కనన్ మహా విశిష్ట దైవ మీ
వనంగ నుండుమా యెదన్, శుభాస్పదంబుగా, శివా!
36. రమా వినోది యైన విష్ణు రక్షణంబు చూచితిన్!
యమోఘ వాణినేలు బ్రహ్మ యాత్మ శక్తి చూచితిన్!
ప్రమోద మానసుండవై వరంబు లిచ్చుటందు నీ
సమానులన్ గనంగ లేను. శంకరా! మహాశివా!
37. స్వభావ సిద్ధ సత్స్వభావ భాగ్య మీవ కొల్పినన్
విభో! దురంత దౌష్ట్యముల్ నవీనులందు కల్గునా?
శుభప్రదంబు నీకు, మాకు, చూచి మంచి కొల్పుమా!
ప్రభో! శుభంకరా! మహేశ! భక్త బాంధవా! శివా!
38. నిశాచరుల్ నరాధముల్ వినీతి దూరులీ భువిన్
నశింపఁ జేయుచుండ్రి. వారి నాశనంబు చేయుమా.
నిశీధిలోన నంగనల్ పునీత మార్గమందునన్
వశింపగల్గఁ జేయుమా! భవా! గ్రహింపుమా! శివా!
39. నవీన మార్గ మంచు నేడు నాట్య శాలలందునన్
వివస్త్రలై కృశాంగులే సవిస్తరంబుఁగా తమన్
ప్రవేశపెట్టుకొందు రేల? పాప చింత లేదొకో?
భవా! త్వదీయ దివ్య దృష్టిఁ బాపుమిట్టి వో శివా! ?
40. ఉమా ధవా! ప్రమోదమా? సమున్నతిన్ దురాత్మకుల్,
ప్రమాదమందు సజ్జనుల్ ప్రభావమేది యుండెరా!
సమస్త మీవ చూచు చుండి సజ్జనాళిఁ బ్రోవుమా!
ప్రమోద మంద సజ్జనాళి భక్తిఁ గొల్తురో శివా!
41. ప్రశాంత చిత్తమందు నిన్ను భక్తిఁ గొల్వఁ గోరగా
నశాంతి చుట్టి ముట్టు నన్ను నాత్మ తేజ మీవయై
విశేష దివ్య దర్శనంబు ప్రీతి తోడఁ గొల్పుమా!
అశేష భవ్య భక్తకోటి యాశ తీర్చుమా శివా!
42. మనోజ్ఞుఁడా! అశేష సృష్టి మానసంబు నందునే
వినోద మంద తల్చ నీవు విశ్వమే జనించెనా!
అనాధ నాధ! నీదు లీల హాయిఁ గొల్పు నీకు. నీ
వినోదమెల్ల శిక్ష మాకు విశ్వనాథుఁడా! శివా!
43. నమోనమశ్శివాయ యంచు నాల్కపల్కినంతనే
ప్రమోదమంది రక్ష సేయ వచ్చితీరుదీవు. నీ
సమాను లెవ్వరయ్య కావ? సర్వ భూత సంస్థితా!
నమో నమో నమో೭స్తు తే ! ప్రణామ మందుమా! శివా!
44. ప్రమాద సూచి నీవు గాంచి భక్త కోటి కెల్లెడన్
ప్రమేయముండు, లేక పోవు, రక్షఁ గొల్ప చూతువే!
ప్రమాణమౌచు నిల్తువే! శుభంబుఁ గల్గఁ జేతువే!
సమాను లెవ్వరయ్య నీకు? సన్నుతాత్ముఁడా! శివా!
45. పవిత్ర భక్తి భారతీయ భావ జాలమందునన్
ప్రవర్ధిలున్ శివాంశఁ జూచి, భక్తి తోడ నెల్లెడన్
శివా! హరా! యటంచు బిల్చు క్షేమమందఁ జేయగన్!
భవానితోడఁ గావుమయ్య! భారతీయులన్ శివా!
46. చరాచరంబు లందుఁ జిక్కి సంచలించు నామదిన్
నిరాశఁ జిక్కకుండ కావ నీకె సాధ్యమౌనుగా.
దురాశ కల్గ నీక కాచు ధూర్జటీ! ఉపేక్షయా?
పరాచికంబు లేల కావ? భక్త బాంధవా! శివా!
47. మదేభ సర్ప శ్రీ లవేమి మంత్రముల్ పఠించెరా?
ముదావహంబయెన్ మనోజ్ఞ పూజలీవు పొందుటన్.
సదా విశాల భావ పూర్ణ సత్ ప్రశస్త భక్తులన్
మదిన్ గ్రహించి కాతు వీవు. మా మహేశుఁడా! శివా!
48. ధరాతలంబునందు నీ ప్రధాన భక్త బృందముల్
చరించు ధర్మ బద్ధులై ప్రశస్తి నీకుఁ గొల్పుచున్.
పరాత్పరా! గ్రహించరా! స్వభావ సిద్ధ సద్గుణుల్
దురాగతంబు లోర్తురే! గతుల్ మరల్చరా! శివా!
49. అమోఘ భవ్య పాద పద్మమాశ్రయించు వారికిన్
నమస్కరించు వారికిన్, వినమ్రులైన వారికిన్,
శమ క్షమాది సద్గుణ ప్రశస్తి కొల్పు శంకరా!
నమస్కరింతునయ్య నీకు. నన్నుఁ గాంచుమా! శివా!
50. అయోమయాంధకార మీవు హాయిగా సృజించి, యే
ప్రయోజనంబు కోరినావు? బ్రహ్మ సాక్షిగా హరా!
ప్రయాస కాక యేమి దక్కె? ప్రస్ఫుటంబుగా భవ
ద్దయాప్రభావ కాంతి, మార్గ దర్శకంబురా! శివా!
51. విశిష్ట సృష్టి బ్రహ్మచేయ, విష్ణు సంస్థితంబయెన్.
విశాల విశ్వ సంలయంబు వేల్పు వీవ చేయగా?
ప్రశాంతమైన ధ్యానివై ప్రభావ మొందినావుగా!
నశింపఁ జేయు వృత్తి యెట్లు నచ్చెరా? మహా శివా!
52. మహాశివా! మహాశివా! ప్రమాణ మీవ మాకు. నీ
మహోదయంబు సృష్టికే సమస్త సత్ఫలంబయా!
మహాత్ములెన్నినిన్నుఁ గాంచు,మమ్ముఁ గాతువీవనున్.
మహాద్భుతంబుచూపుదీవుమమ్ముఁగావుచున్ శివా!
53. శనీశ్వరుండు లోక మందు సంచరింప వీలుగా
మనుష్యులందు భక్తిఁ గొల్పి మాన్యుడా శనీశ్వరుం
డనంగ దాగినావు కాని, యడ్డగింప నేర్వవే?
యనాధ వోలె తొఱ్ఱలోన నంబుజాక్షుఁడా! శివా!
54. సుధర్మ మాచరింపగా నశుద్ధులన్ వధింపనా?
స్వధర్మ మాచరించుచున్ ప్రభావమేది యుండనా?
సుధర్మమా? స్వధర్మమా? త్రిశూల పాణి తెల్పుమా!
ప్రధాన ధర్మమాచరింతు. భవ్యమేదిరా? శివా!
55. పరాత్పరుండ వీవటంచు భక్తితో భజింపగా
నిరాశఁ గొల్పుదేల నీవు? నీవు గల్గి యుండగా
ధరాతలంబునందు దుష్ట దంభులన్ గణింపనా?
నరాధమాళి యేచుచుండె. నన్నుగావరా! శివా!
56. పరాక్రమాదులెల్ల నీవు పన్ను నట్టి యుక్తులే.
దురంత దుర్దశల్ వరింప, త్రోవ కాన రాదుగా?
పరాక్రమంబదేమి చేయు? భక్తి నిన్ స్మరించినన్
దురంత దుర్దశల్ తొలంచి త్రోవ చూపుదే! శివా!
57. కవిత్వ తత్వ దర్శనంబు కావ్య కర్తఁ జేయునా?
భవాని సత్కృపాబ్ధి మున్గు భక్తుడన్న ప్రీతితో
కవిత్వ శక్తి నిచ్చి, వాణి కావ్య రూప మొందునే!
భవుండ! భాగ్యశాలివే భవాని కల్గుటన్ శివా!
58. సుధార్ణవంబు నందు ముంచు సోమశేఖరా! నినున్.
మదాంధకార మగ్నులైన మానవాళి కాంతురే,
మదోన్మదుల్ మదంబడంచి, మంచి నుంచి గాంచుమా!
వ్యధార్తపాళి బాధ తీర్చి భక్తిఁ గొల్పుమా! శివా!
59. నమస్కరించి నంతలోన నమ్ము చుందువే మమున్!
సమస్త సృష్టిఁ జేయునట్టి శంకరా! యెఱుంగవే?
ప్రమాద మెంచవేలనయ్య? భక్తులన్న మాటలే
ప్రమోద మీకుఁ గొల్పగా స్వభావమెంచవా? శివా!
60. జయంబు నిచ్చు వానిగా, యసాధ్య సాధ్యుగా తమన్
భయంబు వీడి పల్కుచుంద్రు. భక్త వత్సలా సదా
జయంబు నీవు కల్గఁ జేయఁ సత్యమౌను. కానిచో
భయంబు కల్గు నిశ్చయంబు పాపికిన్. సదాశివా!
61. విశాల విశ్వ సృష్టి బ్రహ్మ పేరఁ జేతువా హరా!
ప్రశాంత పోషణంబు విష్ణు భావ మొప్పఁ జేతువా !
నశింపఁ జేయు వాఁడవా! వినాశనంబు నీ పనా?
ప్రశాంత భావ! భక్త పోష ! భావ్యమా! మహా శివా!
62. అపర్ణగా ప్రశస్తి పొంది యాది శక్తి నిన్నుతా
నపేక్షతోడ పొందెనయ్య! హాయి యేమి కొల్పితో!
ప్రపూజలన్ మనోజ్ఞ భావ ప్రాప్తి నీకు గొల్పె నా
యపర్ణ కోరు మాదు రక్ష, హాయి, కూర్చుమా! శివా!
63. గణాధిదేవతాదులున్ ప్రగాఢ భక్తి యుక్తులై
ప్రణామ మాచరించుచున్ సపర్య చేయ వత్తురే!
మునీశ్వరుల్ ముదంబు తోడ పూజ చేయ వత్తురే!
మనంబు నీకు లేదొకో? సమాధి నుంటివా! శివా!
64. సమీప్సితార్థ మొందఁ జేయ చాలు దీవె యందురే!
సమీపమందె యుండి నీవు చక్కఁ జూతు వందురే!
ప్రమోదమీకు కల్గఁ జేయ బాధలం గణింపరే!
ప్రమాదమెంచి కావుమయ్య! భక్తి మూఢులన్. శివా!
65. అపూర్వ దైవ మీవెగా! మహత్ప్రసిద్ధి నీదెగా!
సపర్య లందఁ జేయుచున్న సాధ్వి యా యపర్ణగా?
అపూర్వమైన భక్తి బంధ మందియున్న మిమ్ములన్
తపించి పొందు భక్తులెల్ల తాపసాళియే! శివా!
66. వ్యధార్త జీవ కోటికిన్ సహాయ కారివౌచు నీ
ప్రధాన దైవ ధర్మమున్ స్వభక్తపాళిఁ గాంచగా
విధేయతన్ వహించి చేతువే, ముదావహంబుగా.
స్వధర్మ మాచరింప సత్ స్వభావ మిమ్మురా! శివా!
67. నరేంద్రులున్ సురేంద్రులున్ మనంగ నీవె కారణం
బురా! మహేశ్వరా! నితాంత పుణ్య సత్ఫలంబుగా
స్మరింపఁ గల్గు మాకు నిన్ను. శంకరా! శుభంకరా!
ధరాతలంబునందు మాకు దైవ మీవెరా! శివా!
68. అనంత విశ్వమంతటన్ శివాజ్ఞ లేక ఏదియున్
మనంగ లేదు, కుట్ట లేదు మంట పుట్ట చీమయున్.
వినాశమున్ వివేకమున్ నవీన సద్విభావమున్
మనోజ్ఞుఁడా! త్వదీయ శక్తి. మమ్ముఁ గాచుమా! శివా!
69. ప్రభావ మీవ కొల్పగా నభంబు తాకనౌనుగా!
నభంబు తాక గల్గినన్ వినాశ మొందు మానవుల్
ప్రభావమేది. నీ కృపా ప్రవాహ మేది యున్నచో?
విభో! త్వదీయ శక్తి, యుక్తి, విజ్ఞు లెన్నురా! శివా!
70. మరంద మెంత పుష్పమందు? మాన్య! నీదు సృష్టిలో
మరంద మక్షికం బదెంత? మాధురీ విమోహతన్
మరంద మెంత సేకరించు? మందుకైనఁ దక్కునా?
మరంద మందు మానవాళి. మాయ నీదిరా! శివా!
71. వృథా ప్రయాస నీదిరా! భవిష్య వాణి తెల్పెరా!
సుధీర ! నీ ప్రయత్నతన్ వసుంధర ప్రణాశమున్
బుధాళి తోడనున్న గాని పొందకుండ చేయలే
వు. ధర్మ హీనతన్ గదా భవుండ యిట్లగున్? శివా!
72. ప్రకాశ మార్గ మీవు చూప భాగ్య శాలు రందుగా!
ప్రకోప శత్రు షట్క శక్తి భక్తులన్ మరల్చుగా!
వికారమంది నిన్ను వీడ, వేల్పు వయ్యు కావ సా
వకాశ మేది చూతువయ్య భక్త పాళి నో శివా!
73. ప్రపంచమందు నిండి యుండె పంచబాణు శక్తి. ఓ
సు పూజ్యుఁడా! గ్రహించి, వానిఁ జూచు బూది చేసినన్,
నెపంబె దక్కె నీకుఁ గాని, నేర్పునన్ మనంబులన్
తపింపఁ జేయుచుండె. మారు తాప మార్పరా! శివా!
74. సభాసదుల్ మనంబు పొంగ సన్మనోజ్ఞ బోధనల్
ప్రభావ మంత చూపి పల్కు పండితాళిఁ గంటి నే.
ప్రభావ మెల్ల వారికున్న భక్తి యొక్కటే కదా!
ప్రబోధ శక్తి మాయమౌను భక్తి లేనిచో, శివా!
75. నిరామయా! నిరంజనా! వినీల కంఠుఁడా! శివా!
ధరా తలంబునందు నా స్వధర్మ బద్ధతన్ భవా!
నిరంతరంబు కల్గి యుండ నీక చేయ సాధ్యమౌన్.
పరీక్ష చేయుటాపుమయ్య! భక్తుఁ గావుమా! శివా!
76. ప్రభాత దివ్య భాసమాన భాగ్య మీవె కల్పితే!
నభంబునందు చుక్కలన్ యనంత! నీవె కొల్పితే!
నభోంతరాళ మధ్య శోభ నమ్మి చూడఁ గొల్పితే!
స్వభావ సిద్ధ సృష్టి కర్తవా! పరాత్పరా! శివా!
77. నభంబునందు చుక్కలున్ వినమ్రతన్ నినున్ గనున్
ప్రభో! నమశ్శివాయ యంచు భక్తితో వచించుచున్.
ప్రభాత సూర్య కాంతి నీ ప్రభావమెన్ని వెల్గెడున్.
విభుండ వంచుఁ గాంచు నెల్ల విశ్వమున్ నినున్ శివా!
78. భగీరథుండు స్వర్నదిన్ భవా! శివా! గ్రహింపవా!
ప్రగాఢ భక్తిఁ గొల్తునంచు భక్తితోడ వేడగా
మృగాంక శేఖరా! వహించి మేలుగా శిరంబునన్
బిగించి యుంచి దించితీవు, భీతిఁ బాపుచున్ శివా!
79. జరా రుజల్ ధరా స్థలిన్ ప్రజాత మైన వారికిన్
వరంబుగా కలుంగ, నీదు పావనాంఘ్రి యుగ్మమున్
స్థిరంబుగా భజించినన్ సుచేతనంబుఁ గొల్పుచున్
కరంబు నందఁ జేసి నీవు కాతువే! మహా శివా!
80. సమాజ సేవ చేయు వారు స్వార్థమున్ త్యజింపరే!
నమస్కరింప బూనినన్ మనంబు నిష్కళంకమై
ప్రమోదమందఁ జేయరే! స్వభావ సిద్ధ సద్గుణుల్
సమస్త మీశ్వరార్పణంబు సల్పునెప్పుడున్ శివా!
81. ప్రమాదమైన మంచు కొండ పై తపంబదేమిటో!
ప్రమోదమంది భక్త కోటి భక్తిఁ గొల్చుటేమిటో!
నమో೭స్తుతే మహాశివా! అనాధ నాధుఁడా! హరా!
సమీప మందు నుండ రాదొ? సమ్మతిన్ సదా శివా!
82. జనాను కూలమైన చోట చక్కనుండుమా హరా!
నినుం భువిన్ స్వభక్త పాళి నిండుగా కనంగనౌన్.
ప్రణామ మాచరించనౌన్. కరంబు సేవ చేయనౌన్!
మనో వికారముల్ త్యజించి మంచిఁ గాంచనౌన్. శివా!
83. శ్రమైక జీవనుల్, నినున్ ప్రశాంత చిత్తులై కనున్.
మమేకమై భజించు నెట్టి మర్మమే యెఱుంగరే!
అమోఘమైన భక్తితత్వ మబ్బె వారి కెట్లు? ఓం
నమశ్శివాయ మంత్రమే పునాది భక్తికిన్, శివా!
84. స్మశాన భూములందు నీవు సంచరింతు వందురే!
విశిష్టమా స్మశాన భూతి? ప్రీతిఁ దాల్తువందురే!
నశింప చేయువృత్తి నీవు నచ్చి, చేతువందురే!
ప్రశస్తమేది? కాని దేది? భాగ్యమేదిరా? శివా!
85. త్రిశూలముల్ శరీరమందుఁ బ్రీతిఁ గ్రుచ్చు కొందురే!
విశేష పూజ లంద నిన్నుఁ బ్రీతిఁ వేడు కొందురే!
ఆశేష భక్త కోటి నీకు హారతిచ్చి, కాంతురే.
విశేష మేమి కల్గియున్న వేల్పు వీవురా? శివా!
86. పురాణ గాధలందు నిన్ను పూర్తిగా పఠించితిన్.
వరాల వర్ష మందఁ జేయు భక్త బాంధవా హరా!
నరాధముండె యైన గాని నమ్మి నిన్ను కొల్చినన్
భరింతు వీవు వాని తప్పు భక్త పెన్నిధీ! శివా!
87. నిరంతరంబు నీప్రశస్తి, నీ మహత్యమున్ భవా!
చరాచరంబులందు నీ ప్రచారమున్, స్థితిత్వమున్,
సురాసురాళి కెల్ల నీదు శోభఁ జూపి గాచుటీ
ధరాతలాన కీర్తిఁ గాంచె, దర్శనీయుఁడా! శివా!
88. భరింపరాని బాధ కల్గ భవ్య! నిన్ను తిట్టుదే.
నిరంతరాయ సౌఖ్యమబ్బ నిన్ను నే స్మరింపనే!
వరంబుగా స్థిరంబుగా నివాసముండి నా యెదన్
భరించు నీకు రక్ష సేయ భావ్యమే కదా! శివా!
89. జగజ్జయంబు చేసినట్టి జాణ లేరిరా! హరా!
ప్రగాఢ ప్రేమ జీవు లేరి? భాగ్య శాలు రేరిరా!
జగంబులో సజీవ సత్య సాక్షి లేదు చూడరా!
దిగంత వ్యాప్త! నీవె సత్య తేజ మెన్నగా. శివా!
90. సముద్ధరింతుమంచు దేశ, సంఘ సేవ చేసినన్,
సమున్నతత్వమొందినన్, ప్రశాంతతన్ వహించినన్
నమామి తే మహేశ్వరా! యనంగ లేని జీవులీ
సమాజమందు వ్యర్థ జీవ సన్నిభుల్. మహా శివా!
91. హిమాద్రిపై సమాధి లోన హృన్మనోజ్ఞ మూర్తివై,
ప్రమాణమై రహించుచున్, కృపా కటాక్ష వీక్షణల్
ప్రమోదమంద భక్త పాళిపైనఁ జూపుదే హరా!
నమామి తే మహేశ్వరా! ప్రణామ మందుమా ! శివా!
92. అహంబు చావ లేదురా! మహానుభావ! నా హరా !
ఇహంబునందు దుష్కృతుల్ మహేశ్వరా! గణించినన్
సహాయ మీవు చేయ లేవు. సౌమ్యభావ పూర్ణమౌ
మహామతిన్ ననున్ మరల్చి మాన్యుఁ జేసితే! శివా!
93. నితాంత శాంతిమంతుఁడా! వినీల కంఠ! శంభుఁడా!
కృతాపరాధినైన నన్నుఁ గేలి చేయ బోకురా!
శతాంశమైన నీ ప్రసక్తి సల్పి యుండి యుండనా?
మతిన్ గణించి కావుమయ్య! మాననీయుఁడా! శివా!
94. సభా సదుల్ ప్రశంస చేయ చాల పొంగి పొవుచున్
స్వభావ సిద్ధ దుష్ట షట్క సంగతిన్ జరించితిన్.
విభుండ వీవ గౌరవంబు వెల్లి గొల్పు సంగతిన్
ప్రభో! స్మరింపఁ జాలనైతి. రక్ష సేయరా! శివా!
95. నయాను కూల వర్తినై యనంతమైన బాధలన్
జయించి వచ్చి యుంటినయ్య! సర్వ దు:ఖ హారుఁడా!
ప్రియంబునన్, నినున్ స్మరించి, తృప్తినొందఁ జేయుమా!
జయింతు నా యమున్ భవద్వశంబు నుండి, నే, శివా!
96. ప్రమాణ మంతరాత్మరా! స్వబంధు వెన్న నీవెరా!
నమస్కరించి గొల్తురా! గుణంబు మంచిదీయరా!
ప్రమాద మొందనీకురా! శివా! నశింపనీకురా!
ప్రమోద మొందఁ జేయ రార ! భక్తుఁ గావరా! శివా!
97. భవాని నాకు తల్లిరా! ప్రభావ మొందఁ జేసెరా!
నివాసముండి నాయెదన్ బునీతుఁ జేసెరా హరా!
సవిస్తరంబుగా త్వదీయ సద్గుణాళి చూపెరా!
భవాని పంచ చామరాళి వ్రాయఁ జేసెరా! శివా!
98. గుణంబులుండు, నుండకుండు, ఘోరమైన దోషముల్
గణింప నున్న నుండ వచ్చు, కాంక్ష తోడనిన్నునే
గణించి పంచ చామరాళి కమ్మగా రచించితిన్.
గణించి నన్ను, సత్వమిచ్చి, కాచుమా! సదా శివా!
99. ప్రశస్తి గాంచి పాఠకాళి భక్తితో పఠించినన్,
స్వశక్తి వృద్ధిఁ జేయునంచు వ్రాసి, వాసి గొల్పినన్,
దిశాంతమంద దీని కీర్తి దీక్షతో వచించినన్,
ప్రశాంతి పంచచామరస్థ! పాదుకొల్పరా! శివా!
100. వయస్సు మళ్ళిపోవుచుండ భక్తి సన్నగిల్లురా!
భయంబు బాధ పెట్టుచుండ భ్రాంతు లెట్లు పోవురా!
నయానుకూల వర్తనంబు నాఁ డదెట్లు కల్గురా!
ప్రియంబుతోడఁ గానిపించి ప్రీతి గొల్పరా! శివా!
101. దయార్ద్ర చిత్తుడీశ్వరుండు, తప్పులన్ క్షమించుచున్
నయానుకూల వర్తనంబు నాకుఁ గొల్పు నిత్యమున్.
భయంబు పార ద్రోలి, భక్తి భావ మిచ్చు నంచు నా
శ్రయించి యున్న నన్నుఁ గాంచి, రక్ష సేయరా! శివా!
102. భవాని మాత నీ ప్రశస్త భాగ్య రేఖరా! హరా!
నవీన తేజ మిచ్చు నా వినాయకుండు తోడురా!
భవుండ! షణ్ముఖుండు సత్ ప్రభావ మొందఁ జేసెరా!
నివేశమై హిమాద్రి నీకు నిష్ఠ కొల్పెరా! శివా!
103. మహామునుల్ నిరంతరంబు మౌనదీక్షఁ బూని, నీ
మహోన్నత ప్రబోధఁ గాంచి మాయనే త్యజించిరే.
మహేశ్వరా! దయార్ద్రచిత్త! మమ్ముఁ బ్రోవ నీకృపా
మహత్వ దృష్టిఁ జూడుమా! ప్రమాద మాపుమా! శివా!
104. సుపూజ్యులైన పండితుల్ విశుద్ధ రమ్య చిత్తులై
ప్ర పూజ్యమైన పంచ చామరమ్ములన్ పఠించ, నీ
వపూర్వమైన భక్తిఁ గొల్పి, హాయి నొందఁ జేయుమా!
విపర్యయంబు లేక గాచి, ప్రీతి గొల్పుమా శివా!
105. వినీతులైన కల్వపూడి వీర రాఘవార్యులీ
యనాధనైన నన్ గ్రహించి యాంధ్ర భాష నేర్పి, స
జ్జనానుకూల భక్తి భావజాల మందఁ జేసి రా
మనీషుఁ భక్తి గొల్చెదన్, నమస్కరించుచున్ శివా!
106. కళా విలాస మెన్న లేను. కావ్య దృష్టి లేదుగా!
స్వలాభ కాంక్ష లేదు. నీదు భక్త కోటి మెచ్చగా,
ప్రలోభ దూరులై నినున్ ప్రభావ మొప్పఁ గొల్వగా
తలంచి వ్రాసితిన్ త్వదీయ ధర్మ తేజమున్. శివా!
107. మహన్నకారరూప ! ఓం నమశ్శివాయ ! ఓం హరా !
మహన్మకార రూప ! ఓం నమశ్శివాయ! శంకరా !
మహత్శికార రూప ! ఓం నమశ్శివాయ! ఈశ్వరా !
మహద్వకార రూప ! ఓం నమశ్శివాయ! సుందరా!
మహద్యకార రూప ! ఓం నమశ్శివాయ! మా శివా !
108. సుమంగళీ ప్రపూజ్య పాద శోభితాయ మంగళం.
సమస్త జీవ శక్తి రూప శాశ్వతాయ మంగళం.
అమంగళాంతకాయ సద్గుణాశ్రయాయ మంగళం.
సమస్త మంగళం భవాయ. సర్వ మంగళం శివా !
పూజ్య కాణ్వ శాఖోద్భవ శ్రీ చింతా వంశ సంభవ జానకీ రామ మూర్తి దంపతుల పౌత్రుఁడను, వేంకట రత్నం సన్యాసిరామారావు పుణ్య దంపతుల పుత్రుఁడను అగు రామ కృష్ణా రావు నామధేయుండనైన నాచేత విరచింపఁబడి పురాణ దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు అంకితము గావింపఁబడిన
శ్రీశివాష్టోత్తరశత పంచచామరావళి పేరంబరగు శివ శతకము
సమాప్తము.
స్వస్తి.
జైశ్రీరాం.
జైహింద్.